నాన్న లేని కొడుకు-9

1
3

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి సంచిక పాఠకుల కోసం రచించిన ‘నాన్న లేని కొడుకు’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము. [/box]

[dropcap]“ఒ[/dropcap]క తండ్రిగా అలాంటి వాడిని చూస్తూ, చూస్తూ నా కూతురి భర్తగా అంగీకరించ గలననే అనుకున్నారా ఇన్‌స్పెక్టర్..”

సూర్యనారాయణ మాటకి ఇన్‌స్పెక్టర్ వివేక్ అభినందనగా చూస్తూ నవ్వాడు.

హరిత పేపర్ తీసుకుని కంప్లైంట్ రాసి సంతకం చేసింది.

“తప్పకుండా అతనికి కఠినమైన శిక్ష పడాలని కోరుకుందాం.” అన్నాడు ఇన్‌స్పెక్టర్.

గోడ పక్క కుర్చీలో కూర్చున్న శంకర్ అనబడే ఆ నేరస్థుడి తల్లి బావురుమంది ఒక్కసారిగా.

అందరూ ఆమె వైపు తిరిగారు.. ఆమె కుర్చీ లో నుంచి లేచి హరిత దగ్గరకు వచ్చి గభాల్న ఆమె పాదాల మీద పడి “నన్ను క్షమించు తల్లి. ఇట్లాంటి కొడుకుని కన్నాను.. కానీ నా కొడుకుకి ఉరేయద్దమ్మా.. వాడు జైల్లో బతికినా చాలు.. అప్పుడప్పుడు వచ్చి చూసుకుంటాను” అంది కన్నీళ్ళతో.

నివ్వెరపోయిన హరిత ఆవిడని లేపి “ మీరు పెద్దవాళ్ళు అలా నా కాళ్ళు పట్టుకోకూడదు” అంది.

ఇన్‌స్పెక్టర్ ఆమెని ఓదార్చే స్వరంతో “నువ్వు టెన్షన్ పడకమ్మా.. కేసు కోర్టుకి తీసికెళ్ళడం వరకే మా బాధ్యత.. అతనికి ఏ శిక్ష వేయాలో జడ్జి గారు చూసుకుంటారు. అతను చేసిన నేరం తీవ్రతని బట్టి శిక్ష వేస్తారు.. కంగారు పడకు” అన్నాడు.

“నీ కడుపు చల్లగా బతుకు బాబూ” అంది ఆవిడ.

“కూర్చోమ్మా” అన్నాడు కుర్చీ చూపిస్తూ.

ఆమె వెళ్లి తన స్థానంలో కూర్చుంది.

“మీరు నిశ్చింతగా ఉండండి..ఇంక ఈ విషయంలో ఏ మాత్రం భయపడాల్సిన అవసరం లేదు..” అన్నాడు ఇన్‌స్పెక్టర్ వివేక్.

సూర్యనారాయణ ఇన్‌స్పెక్టర్ మురళీకృష్ణకి షేక్ హ్యాండ్ ఇస్తూ “మీలో మీ వృత్తి పట్ల అంకితభావం ఉంది. ఆదర్శం ఉంది. మీలాంటి యువకులు ఈ సమాజానికి చాలా అవసరం.. నా కూతురు కిడ్నాప్ అయినప్పుడు నేను తిరగని పోలీస్ స్టేషన్ లేదు, కలవని పొలిటీషియన్ లేడు… చేయని ప్రయత్నం లేదు.. అదంతా తలచుకుంటే ఇప్పుడు వణికిపోతాను. అప్పుడు నా భార్య దాదాపు మరణం అంచు వరకూ వెళ్లి తిరిగి వచ్చింది. మీరు ఈ కేసుని జ్యురిస్‌డిక్షన్ నాది కాదు అనకుండా ఎంతో కష్టపడి నేరస్థుడిని పట్టుకున్నారు. నా కూతురిని నాకు అప్పగించారు. ఇదంతా ఆ భగవంతుడు చేసిన ఉపకారం.. ఆయన దయ అని నమ్ముతాను. ఆల్ ద బెస్ట్ ఇన్‌స్పెక్టర్ మురళీ.. ఐ విష్ యు ఏ బ్రైట్ ఫ్యూచర్.. త్వరలో మీకు ఐ.పి.ఎస్ కాడర్ రావాలని కోరుకుంతున్నాను..” అన్నాడు.

“ప్రిపేర్ అవుతున్నాను సార్.. మీలాంటి పెద్దల ఆశీర్వాదం ఉంటె సెలెక్ట్ అవుతాను” అన్నాడు ఎంతో వినయంగా.

“గుడ్, గుడ్ లక్” అన్నాడు ఆయన కుర్చీలోంచి లేస్తూ.

వివేక్ భుజం తడుతూ “ఒక పోలీస్ ఆఫీసర్‌కి ఉండాల్సిన పర్సనాలిటీనే కాదు.. దాదాపు అన్ని లక్షణాలు ఉన్నాయి మీకు. మీకు ఎలాంటి సహకారం కావాలన్నా అన్ని వేళలా మేము అందుబాటులో ఉంటాము. గో ఎ హెడ్ మై డియర్” అన్నాడు.

హరిత కూడా లేచి చేతులు జోడించింది.

“మీరు స్టడీస్ కంటిన్యూ చేయండి. ఏ సహాయం కావాలన్నా నేనున్నాను.. జరిగింది అంతా ఒక పీడకల అనుకోండి” అన్నాడు ఇన్‌స్పెక్టర్ మురళీకృష్ణ.

“థాంక్ యూ” అంది హరిత.

శంకర్ తల్లి లేచి నిలబడి కన్నీళ్ళతో హరితకీ, సూర్యనారాయణ కి నమస్కరించింది.

ఇన్‌స్పెక్టర్ కానిస్టేబుల్‌ని పిలిచి ఆవిడని ఇంటి దగ్గర డ్రాప్ చేయమని చెప్పాడు.

ఆమె లేచి ఇన్‌స్పెక్టర్‌కి చేతులు జోడించింది. “నా కొడుకుని బాగా కొడతావా బాబూ” అడిగింది.

కర్కశంగా తననే చంపడానికి సిద్ధపడిన దుర్మార్గుడిని కూడా ప్రేమిస్తున్న ఆ తల్లికి మనసులోనే వందనాలు అర్పిస్తూ “నువ్వేం బాధపదకమ్మా.. అతని ప్రవర్తన మార్చడానికి ప్రయత్నం చేస్తాం.. మంచి డాక్టర్‌కి చూపిస్తాం .. సరేనా!” అన్నాడు.

ఆవిడ మరోసారి నమస్కరించి కానిస్టేబుల్‌తో వెళ్ళిపోయింది.

కారులో కూర్చున్న హరిత ముందు వెళుతున్న పోలీస్ జీపు చూస్తూ.. “అలాంటి కొడుకుని కూడా ఆవిడ ప్రేమిస్తోంది ఎందుకు నాన్నా!” అంది.

“అదేనమ్మా తల్లి మనసు అంటే…” అన్నాడు.

హరిత విండోలోంచి బయటకు చూస్తూ “వాడికి ఉరిశిక్ష పడాలి.. పడుతుందా నాన్నా” అంది.

“మన చట్టంలో ఉరిశిక్ష వేయాలంటే చాలా పెద్ద నేరం చేసి ఉండాలి.. వీడు చేసింది భయంకరమైన నేరమే.. శారీరకంగా నిన్ను హత్య చేయకున్నా, నీ ఆశలు, నీ భవిష్యత్తుని హత్య చేసాడు. ఈ నేరానికి న్యాయశాస్త్రంలో ఏ శిక్ష ఉందో నాకు తెలియదు.. కానీ జైలు శిక్ష మాత్రం తప్పదు” అన్నాడు.

హరిత ఆయన భుజం మీద తలవాల్చింది. సూర్యనారాయణ కూతురి చెంప మీద ఆప్యాయంగా రాస్తూ “బాధపడకు.. భయపడకు.. జీవితాన్ని సవాల్‌గా తీసుకుని ముందుకు నడువు.. ఉన్నతమైన స్థితికి వస్తావు.. లైఫ్ ఈజ్ ఎ చాలెంజ్ ” అన్నాడు.

ఏడుస్తూ అంది “ఆ పశువుకి నేను భార్యను కాలేను… కానీ ఆ పసివాడికి తల్లిని కదా నాన్నా.. వాడి తండ్రి ఎవరు అని రేపు అందరూ నన్ను ప్రశ్నార్ధకంగా చూస్తుంటే ఏమని సమాధానం చెప్పను నాన్నా.. ఏ అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ అప్ చేయాలన్నా ముందుగా కనిపించే ఫాదర్ నేమ్ అనే కాలం లో ఏ పేరు రాయను? అలాగని ఒక క్రిమినల్ నీ తండ్రి అని వాడికి ఎలా చెప్పను?”

ఆయన గుండె చెరువైంది. అవును ఎల్.కె.జి దగ్గర నుంచి ప్రతి అప్లికేషన్ ఫారంలో తండ్రి పేరు రాయాలి.. తెల్లవారి లేస్తే కనిపించే ప్రతి మనిషికి వాడి తండ్రి ఎవరో చెప్పాలి. ఎంత దౌర్భాగ్యం! ఇలాంటివాడు తన పిల్లలకి తండ్రి అని ఏ ఆడపిల్ల చెప్పుకుంటుంది! పశువుల్లా, మానవ మృగాల్లా ఆడపిల్లలని చేరిచి తల్లులను చేసే కామంధులు, ప్రేమ పేరుతో రాక్షసంగా ప్రవర్తించే మృగాలు, ఆడపిల్లల ఇష్టాఇష్టాలతో సంబంధం లేకుండా బలవంతంగా ఎత్తుకెళ్ళి పెళ్లి అని చెప్పి ఒక తాడు మెడలో వేసి జంతువుల్లా ప్రవర్తించే నీచులు వీళ్ళంతా తండ్రి అనే హోదాకి అర్హులు ఎలా అవుతారు? అలాంటి తండ్రికి పుట్టిన పిల్లలు అని వాళ్ళని అనాథలను చేయలేరు.. అలాగని పశువులని భర్తలుగా, తన పిల్లలకు తండ్రులుగా సమాజానికి చెప్పలేరు.

ఆయన దృఢంగా అన్నాడు “ఈ విషయాలు ఆలోచించకు.. వాడి అమ్మ శ్రీమతి జ్యోతి, నాన్న డాక్టర్ సూర్యనారాయణ.. మన కుటుంబంలోకి నాలుగో వ్యక్తి వచ్చాడు.. ఇంతకాలం మనం ముగ్గురమే.. ఆ నాలుగో వ్యక్తి సంపూర్ణమైన బాధ్యత నాది.. నువ్వు నిశ్చింతగా ఉండు.”

హరిత తండ్రి మాటలకి పులకించిపోయింది..

“నీలాంటి విశాల హృదయం ఉన్న తండ్రిని పొందిన నేను ధన్యురాలిని నాన్నా..”

కారు ఇల్లు సమీపించింది.. బాబుని ఎత్తుకుని గేటు ముందు ఆందోళనగా నిలబడిన జ్యోతి వెలిగిపోతున్న మొహంతో కారు దిగిన కూతురుని చూసి ఆశ్చర్యంగా భర్త వైపు చూసింది. ఆయన మెత్తగా, ప్రశాంతంగా చిరునవ్వు నవ్వాడు.

ఆవిడ నిశ్చింతగా చేయి చాచిన హరితకీ బాబుని అందించి ఆమె చేయి పట్టుకుని లోపలికి నడిచింది.

కాలం చాలా శక్తివంతమైనది. ఎంతటి విషాదాన్నైనా మరపించ గలుగుతుంది. అతి తక్కువ కాలంలో అత్యంత గణనీయమైన మార్పులు సంభవం అంటే అది కాల మహిమ. హరిత జీవితంలో త్వర,త్వరగా మార్పులు వచ్చేసాయి.

కూతురు ఆ జ్ఞాపకాలతో బాధపడుతూ కూర్చోకుండా జ్యోతి ఆమెకి నీడలా ఉంటూ ఆ కబురు, ఈ కబుర్లు చెబుతూ పూర్తిగా ఎంగేజ్ చేసింది.

“అమ్మా! షీలాకాని, అపర్ణ కానీ, నీలు కానీ మీకు చెప్పలేదా వాడి గురించి. మీరు నా కోసం పోలీస్ రిపోర్ట్ ఇచ్చినపుడు వాళ్ళు వాడి గురించి చెప్పి ఉండాలే” అడిగింది హరిత.

“ఎందుకు చెప్పలేదు… ముగ్గురూ ఇంటికి వచ్చారు. వాడు చేసిన అల్లరి మొత్తం చెప్పారు. వాడే హరితని ఏదో చేసి ఉంటాడు ఆంటీ.. మాకు భయంగా ఉందాంటీ” అంటూ కుళ్ళి, కుళ్ళి ఏడ్చారు. చుట్టూ పక్కల వాళ్ళు ప్రతిరోజూ -ఏవండి.. జ్యోతి గారూ మీ అమ్మాయి ఎక్కడికి వెళ్లిందో తెలిసిందా – అని పరామర్శించే వాళ్ళు. ప్రతిరోజూ పేపర్లలో వస్తున్న అత్యాచారాల వార్తలు చదివి భయంతో వణికిపోయే దాన్ని. పోలీస్‌లు ఎక్కడా ఎలాంటి ఆధారాలు లేవని తేల్చారు. కొంత మంది అత్యాచారానికి గురై చనిపోతే మమ్మల్ని హాస్పిటల్‌కి పిలిపించి డెడ్ బాడీలు చూపించి వీరిలో మీ అమ్మాయి ఉందా చూడండి అని చూపిస్తుంటే గుండె పగిలిపోయింది. అపర్ణ వాళ్ళ నాన్నగారు కూడా ఎంతో ప్రయత్నించారు. కానీ …. కానీ” జ్యోతి బావురుమంది.

హరిత వస్తున్న దుఃఖం పెదాలు బిగపట్టి అదిమిపెట్టి “ఊరుకోమ్మా … వచ్చేసాగా” అంది.

జ్యోతి కన్నీళ్లు తుడుచుకుంటూ తల ఊపింది.

“వాళ్ళు ఎక్కడ ఉన్నారో, ఏం చేస్తున్నారో తెలుసా ఇప్పుడు” అడిగింది హరిత.

“అపర్ణ వాళ్ళ నాన్నగారికి ప్రమోషన్ వచ్చి వేరే ఎక్కడికో బదిలీ అయింది. తను కూడా పూనాలోనో ఎక్కడో ఇంజనీరింగ్ సీట్ వచ్చిందని వెళ్ళిపోయింది. షీలా ఎం.బి.ఎ. చేసి, వాళ్ళ నాన్న బిజినెస్ చూసుకుంటోంది.. నీలు ఐఐటి పాండిచేరిలో సీటు వస్తే వెళ్ళిపోయింది. నాన్నగారు ఇంక అక్కడ ఉండలేక ఈ ఇల్లు అమ్మకానికి వస్తే కొన్నారు. ఆ తరవాత ఎవరూ ఫోన్స్ చేయలేదు.. ఎవరి జీవితాలు వారివి కదమ్మా.. అందరూ ఇంక నువ్వు లేవనే నిర్ణయానికి వచ్చి ఉంటారు..”

హరిత నిట్టూర్చింది. ఎలాగోలా వాళ్ళ ఫోన్ నంబర్స్ సంపాదించాలి.. వాళ్ళని కలిసి నేను బతికే ఉన్నాను అని చెప్పాలి స్థిరంగా అనుకుంది.

మరి కొన్ని రోజులు గడిచాయి. హరిత వేరే కాలేజ్‌లో డిగ్రీలో చేరింది.

కూతురి కోసం కొత్త కారు కొన్నాడు సూర్యనారాయణ.

“ఒద్దు నాన్నా! నేను కొంతకాలం బస్ లో వెళ్తాను.. నేనేదన్నా తప్పు చేసానేమో అని నాలో ఉన్న కాంప్లెక్స్ పోవాలి. కారులో వెళ్తే నాకా ఫీలింగ్ పోదు. నన్ను అందరూ చూడాలి. ఇంతకాలం ఎక్కడికో వెళ్ళిన ఈ అమ్మాయి ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది అని వాళ్ళల్లో వాళ్ళు అనుకోకూడదు.. నన్ను అడగాలి.. అప్పుడే నాలో ఉన్న ఈ గిల్టీ కాన్షస్ పోతుంది” అంది. ఆయన శభాష్ అంటూ భుజం తట్టాడు.

మొదటి రోజు ఒక్కతీ బయటకు వెళ్తున్నప్పుడు భయం, సిగ్గు, అవమానభారంతో కృంగిపోయింది. ఎవరన్నా కనిపించి ఏమన్నా అడుగుతారా అనుకుంది. ఒక్కసారి అప్పుడు చదువుకున్న కాలేజ్‌కి వెళ్లి, ఆ పరిసరాల్లో తిరిగితే కోల్పోయిన మనో ధైర్యం వస్తుందా? ఎవరన్నా అడుగుతారా…. అడుగుతారా, ఏం చెప్పాలి అని మథన పడేకన్నా ఆ అడిగేదేదో అడిగేస్తే, తెలియాల్సిన విషయాలు చెప్పేస్తే ఈ మానసిక సంఘర్షణ నుంచి, ఈ భయం నుంచి బయటపడచ్చేమో కదా అనిపించింది. కానీ అలా జరగలేదు. ఎందుకంటే ఇప్పుడు తను ఉంటున్నది అప్పటి ఇల్లు కాదు.. చదువుతున్నది ఆ కాలేజ్‌లో కాదు. ఇక్కడ అంతా వెస్ట్రన్ కల్చర్ అడాప్ట్ చేసుకుని బతికే గొప్పవాళ్ళు ఉన్నారు. ఎవరూ ఇంకొకరి గురించి ఆలోచించరు …. పట్టించుకోరు. కాకపోతే రేపు పేపర్ లోనో, టి.వి. లోనో వస్తే అప్పుడు అడుగుతారేమో.. నవ్వుకుంది. మొదటిరోజు అంతా కొత్తగా, వింతగా ఉన్నా, నెమ్మదిగా ఒక వారం రోజులు అవగానే అలవాటు అయింది హరితకు. కొత్తగా ఏర్పడిన స్నేహితులు, కొత్త వాతావరణం…

ఇప్పుడు ఆ కాన్షస్ లేదు.. ఆ పిరికితనం లేదు.

ఎప్పుడైతే నరరూప రాక్షసుడి సుదీర్ఘకాల చెరసాల జీవితం నుంచి సాహసంతో బయటపడిందో అప్పుడే ఆమెలో తెగింపు వచ్చింది. తల్లి, తండ్రుల సపోర్ట్‌తో ఇప్పుడు మరింత మనో ధైర్యం కూడా వచ్చింది. మొదటిరోజులా బయటకు వెళ్తూ ఎవరన్నా వెంటపడతారా! ఏదన్నా కామెంట్ చేస్తారా అంటూ బిక్కు, బిక్కుమంటూ తనలో తను కుంచించుకు పోవడం లేదు. ఆత్మవిశ్వాసంతో, తలెత్తుకుని వెళ్తోంది. తెలిసిన వాళ్ళు కనిపించి ఇంత కాలం ఎక్కడున్నావు అని అడిగితే సమాధానం ఏమని చెప్పాలి అనే భయం లేదు..

జరిగింది చెప్తాను…నేను వాడి వెంట పడి వెళ్ళలేదు.. వాడు నన్ను కిడ్నాప్ చేసాడు. నా నిస్సహాయతని అలుసుగా తీసుకున్నాడు. నా మీద ఇన్నేళ్ళు రాక్షస దాడి జరిపాడు. నేనెలా నేరస్తురాలిని అవుతాను? అని సూటిగా అడుగుతాను. ప్రేమంటే బలవంతంగా పొందేదా… ఎవడో అనామకుడు వచ్చి నిన్ను ప్రేమిస్తున్నా అనగానే సరే అనాలా అని ప్రశ్నిస్తాను అని నిశ్చయించుకుంది.

ఇన్‌స్పెక్టర్ ఒకరోజు ఇంటికి వచ్చాడు.

“ఈ కేసుకి సంబంధించి మీరు కొంతకాలం కోర్ట్‌కి రావాల్సి ఉంటుంది వస్తారుగా” అన్నాడు. మీ అమ్మాయిని కిడ్నాప్ చేసి ఇంత కాలంగా ఆమె మీద శారీరక దాడి జరిపినందుకు అతని మీద సీరియల్ రేపిస్ట్‌గా కేసు పెట్టాము. సాధారణంగా ఒక వ్యక్తి అనేక సార్లు, అనేక మంది అమ్మాయిల మీద అత్యాచారం జరిపినా, ఒక వ్యక్తి ఒకే అమ్మాయిని బంధించి కొంత కాలం పాటు అత్యాచారం జరిపినా దాన్ని సీరియల్ రేప్‌గా పరిగణిస్తారు. సీరియల్ రేపిస్ట్‌లు సాధారణంగా కిడ్నాప్ కొన్నిసార్లు దాడి జరిపి చంపేయడమో, వదిలేయడమో చేస్తారు. ఇతను మీ అమ్మాయిని కిడ్నాప్ చేసి, ఒక పసుపుతాడు కట్టి, బలవంతంగా భార్యని చేసుకుని, లైంగిక దాడి జరుపుతూ వచ్చాడు. దీన్ని ప్రేమ అనాలో, ఉన్మాదం అనాలో అర్థం కావడం లేదు. తమాషా ఏంటంటే అతని మీద ఇతరత్రా వేరే కేసులు లేవు. ఈ కేసు చాలా విచిత్రంగా, అసాధారణంగా ఉంది. ఇలాంటివి ఇటీవల కొన్ని విన్నాము కానీ, ఇంత పకడ్బందీగా ప్లాన్ చేసుకుని ఆమెతో బలవంతపు కాపురం చేయడం.. రియల్లీ… నమ్మలేకపోతున్నాం….”

ముందు ఆ మాట వినగానే ఆమె మొహం పాలిపోయింది. ఆమె కాళ్ళ ముందు మైకులతో ఏం జరిగింది? ఎప్పుడు జరిగింది? ఎలా జరిగింది? అతను మిమ్మల్ని కిడ్నాప్ చేసినప్పుడు మీ మనోభావాలేంటి.. రేప్ చేసినప్పుడు ఎలా ఫీల్ అయారు అంటూ అత్యంత హేయమైన ప్రశ్నలతో దాడి చేసే ఎలక్ట్రానిక్ మీడియా మనుషులు కదిలారు. ఒక్క క్షణం భయంతో ఒళ్ళు జలదరించింది.

“వస్తుంది … తప్పకుండా నేను దగ్గర ఉండి తీసుకువస్తాను. వాడికి శిక్ష పడేవరకూ పోరాడతాను” అని నిశ్చయంగా అంటున్న తండ్రి మొహం వైపు విస్మయంగా చూసిన ఆమెలో నెమ్మదిగా ధైర్యం అనే గాలి వీస్తున్నట్టు అనిపించింది. ఆమె కూడా “వస్తాను” అంది.

“గుడ్ … ఈ ధైర్యంతోటే ఉండండి” అన్నాడు అతను.

సూర్యనారాయణ బాబుని స్పెషలిస్ట్‌కి చూపించాడు. “అనారోగ్య లక్షణాలు ఏమి లేవు స్పీచ్ థెరపీ ద్వారా తప్పకుండా మాటలు వస్తాయి. ఇక్కడికి దగ్గరలోనే ఇలాంటి పిల్లలకోసం చైల్డ్ సైకాలజిస్ట్ ఒక స్కూల్ రన్ చేస్తున్నారు.. అక్కడ జాయిన్ చేయండి.. మీరు కూడా ఇంట్లో చిన్న, చిన్న పదాలు నేర్పిస్తూ, వీలైనంత ఎక్కువగా మాట్లాడుతూ ఉండండి.. త్వరలోనే రికవర్ అవుతాడు” అన్నాడు డాక్టర్.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here