హృదయాన్ని తాకే అనుభూతుల కవితా సంపుటి ‘నాన్న… పాప…’

0
2

[శ్రీ అవధానుల మణిబాబు రచించిన ‘నాన్న… పాప…’ అనే కవితా సంపుటిని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]

[dropcap]కొ[/dropcap]న్ని పుస్తకాలు ఆలస్యంగా చదువుతాం.. చదవకూడదని కాదు, అవి మన దృష్టికి రావడం ఆలస్యమవుతుందంతే.. ఎవరో మిత్రుల ద్వారా ఆ పుస్తకం గురించి విన్నప్పుడో/సాంఘిక మాధ్యమాలలో చదివినప్పుడో.. ఆ పుస్తకం చదవాలని మనసు గట్టిగా కోరుకుంటుంది.. కొన్ని సార్లు ఆ ఆలస్యం వల్ల పుస్తకం దొరకకపోనూ వచ్చు. అప్పుడు మనం ఆలస్యం చేసినందుకు మనల్ని మనం తిట్టుకుంటాం.

అలా చాలా ఆలస్యంగా నా దృష్టిలో పడ్డ పుస్తకం అవధానుల మణిబాబు గారి ‘నాన్న… పాప…’.

వారి పేరు వినడమే తప్ప నాకు ఆయనతో పరిచయం లేదు. ఫేస్‍బుక్ లోనూ అప్పటి వరకూ మేం ఫ్రెండ్స్ కూడా కాదు. 11 ఫిబ్రవరి 2024 నాడు శ్రీమతి నాదెళ్ళ అనూరాధ గారి వాల్ మీద అవధానుల మణిబాబు గారు ఈ పుస్తకం గురించి ఆవిడ పుస్తకమ్.నెట్‍లో రాసిన వ్యాసం షేర్ చేశారు. ఆ వ్యాసం చదివాకా, అప్పటికప్పుడు మణిబాబు గారికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి, ఆ పుస్తకం కాపీ ఒకటి కావాలని, జీ పే చేస్తే పంపుతారా అని మెసేజ్ పెట్టాను. ఆయన నా ఫ్రెండ్ రిక్వెస్ట్‌ని యాక్సెప్ట్ చేసి, పుస్తకం కాపీలు అయిపోయాయని చెప్పి పిడిఎఫ్ పంపారు.

2018లో వెలువడిన పుస్తకం.. 2024లో చదివాను.. అయితేనేం.. పుస్తకంలోని అంశాలు కాలదోషం పట్టేవి కావు.. ఎప్పటికీ తాజాగా నిలిచి ఉండే అనుభూతులు! మనలోని పిల్లో/పిల్లాడో పెద్దాడయిపోకుండా ఉంటే.. ఈ పుస్తకం అందించే అనుభూతులు మరింత రమ్యంగా తోస్తాయి. బాల్యాన్ని కోల్పోని వ్యక్తులు.. తాము పెద్దయిపోయినా, పిల్లల్లో తమ బాల్యాన్ని చూసుకుంటారు.

ఇంతకీ ఏముందీ పుస్తకంలో అంటే.. గుండెనిండా కూతురిపై ప్రేమని నింపుకున్న ఓ తండ్రి దాచుకున్న భావోద్వేగాల అనుభూతులకు కవితా రూపం! ఆ అనుభూతులు వ్యక్తిగతంగా ఆయనొక్కరివే కావచ్చు.. కానీ పుస్తక రూపంలోకి వచ్చాకా, వాటిని చదివిన ప్రతీ ఆడపిల్ల తండ్రీ.. అరే ఇవి నా అనుభూతులే కదా, ఈయన రాశారేంటీ అని అనుకోకుండా ఉండరు. అందుకే ఈ సమీక్ష కొద్దిగా పర్సనల్‍గా ఉంటుంది.

~

సాధారణంగా పెద పండుగ అంటే సంక్రాంతి. కానీ పాప నవ్విన భోగే ఆ తండ్రికి ‘పెద పండుగ’ అయింది. రేగుపళ్ళూ, చిల్లరతో పాటు పాప రాల్చిన నవ్వులనూ ఇంటికొచ్చిన పిల్లలు ఏరేసుకుంటారేమోనని ఆ తండ్రి హడావిడి పడుతూ ఇంటికొచ్చిన అతిథులని సరిగా పలకరించలేకపోతారు.

కరెంట్ పోయి, ఇన్వర్టర్ కూడా పనిచేయడం ఆగిపోయాకా, అసహనం కలిగి, టార్చ్ వెలుతురులో ‘ఆందోళన చెందకు, ఆనందంగా జీవించు’ అనే పుస్తకం చదువుదామని తీస్తారు. ఉక్కపోతకి నిద్రలేచిన పాప చందమామనీ, నక్షత్రాలనీ చూసి ఆనందపడుతుంది. పాప సంతోషానికి ఆ తండ్రిలోని చిరాకు మాయం! ఆనందం పసిపిల్లల మాటల్లో, చేష్టల్లో దొరుకుతుందని ‘ఆనందమంటే..’ చెబుతుంది. చిన్నారులు తమకి తెలియకుండానే అమ్మానాన్నల బెంగలని తీసేస్తారు కదా.

కూతురిని భయపట్టాలని, కోపం నటిస్తూ ‘అన్నా!’ అని తండ్రి అంటే, ఆయన దగ్గరకొచ్చి, ఓ క్షణం ఎగాదిగా చూసి ‘బూ’ అంటూ ఆయన్నే భయపెట్టి పారిపోతుందా కూతురు. ‘చేతకాని పనులు’ అంటే ఇవే!

కూతురి కోసం కుక్కలా మారి ఆడుకుంటుంటే, అందులో ఎంత వేడుక ఉంటుందో ‘భౌ భౌ’ చెబుతుంది. మనలో చాలామంది జంతువులమై పిల్లల్ని వీపున ఎక్కించుకుని తిప్పినవాళ్ళమే కదా!

పిల్లల్ని ముఖ్యంగా ఆడపిల్లల్ని పెంచడం ఎంత బాగుంటుందో ‘కృతి’ చెబుతుంది. ఆ వేలాది ఆనందాలకు వెల కట్టలేమని అంటారా తండ్రి. మనమూ కాదనలేము.

కూతురు ‘పొదుపు’ ఏమిటే తెలిస్తే మనకి నవ్వాగదు. ఆ సమయంలో ఆ తండ్రి గుంభనంగా నవ్వుకున్నారేమో!

ఆ తండ్రికి చూస్తున్న ప్రతి సినిమా ఎందుకు నచ్చేస్తోందో ‘కారణం’ తెలుసుకుంటే నిజంగా సినిమాలు చూడ్డం ఎంత బావుంటుందో అనిపిస్తుంది.

చిన్నారులు వేసే కొన్ని ప్రశ్నలు అమాయకంగా అనిపించినా, వాటిలోని నిజాయితీ వాళ్ళ మనసులోని స్వచ్ఛతని వెల్లడిస్తుంది. ‘సంఘజీవనం’లో పాప అలాంటి ఓ ప్రశ్ననే నాన్నని అడుగుతుంది.

చిన్నప్పుడు నోరు తిరగక పిల్లలు కొన్ని పదాల్ని సరిగా పలకలేరు. అయినా ఆ మాటలు ముద్దుగానే ఉంటాయి. ఆ భాష కూతురు దగ్గర నేర్చుకుందామనుకున్న తండ్రి – కూతురే తమ భాష నేర్చేసుకుంటోదని గ్రహిస్తారు. అంటే పాప తొందరగా ఎదిగిపోతున్నట్టు మనకి అర్థమవుతుంది.

పాప రెక్కలు కావాలని ఎందుకు కోరుకుందో ‘వీలైతే అవి..’ చెబుతుంది. ఎగిరిపోతే ఎంత బాగుంటుందీ అన్న ఆ కోరికలో అంబరాన్ని తాకాలనే ఆకాంక్ష కనిపిస్తుంది.

కూతురి గది రూఫ్‍కి నక్షత్రాలు, చందమామ అతికిస్తారా తండ్రి. ఎలా వచ్చాయని పాప అడిగితే, ఆకాశం ముక్క కోసి తెచ్చి పెట్టానని సరదాగా చెబితే, ఇప్పుడు వానొస్తే, ఈ గదిలోనూ కురుస్తుందా అని పాప అడుగుతుంది. ‘నాకు తోచేలేదు మరి!’ అనుకుంటారా తండ్రి.

‘బాల’ వ్యాకరణంలో – పాప అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పడం కష్టం! గేదెలు రోడ్లు పాడు చెయ్యకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో ‘ముందు జాగ్రత్త’లో పాప చెప్తుంది. పాప ఆ మాటలు అన్నప్పుడూ, ఆయన ఈ కవిత రాస్తున్నప్పుడూ ఎంతగా నవ్వుకుని ఉంటారో!

పాప పెరిగే కొద్దీ తనలో వస్తున్న క్లారిటీకి ‘స్పష్టత’, ‘చిత్రచ్ఛాయ’ కవితలు అద్దం పడతాయి. పాప వేసే కొన్ని ప్రశ్నలకు మనం జవాబులు చెప్పలేం.

మునిగిపోతున్న వాటిని కాపాడడంలోని ‘తీయని బాధ’ని చెప్తే సరిపోదు, చదువుకుని, ఊహించుకుని ఆస్వాదించాల్సిందే.

నాన్న ఎప్పుడూ తన తోటే ఉండాలంటే నాన్న కూడా పాపాయి అయిపోతే బావుండని అంటుందా కూతురు. అవును, అలా అయిపోతే ‘ఎంత బావుణ్ణు!’ కదా.

లెక్కరాని కాలం’ ఏమిటో తండ్రులందరికీ తెలుసు!

ఇవి కూడానా’ పాప అమాయకత్వాన్ని చెబుతుంది. వరలక్ష్మి వ్రతానికి సెలెవిందుకిచ్చారో కారణం అర్థమైందని పాప ‘అసలు సంగతి’ చెబుతుంది.

పాప కోపం ఎలా ఉంటుందో ‘వీడేమన్నా…’ చెబుతుంది.

వేసవి అమావాస్య అంటే సమ్మర్ హాలీడేస్‌కి చందమామ ఊరెళ్ళిపోవడం అని పాప దృష్టిలో. ఇలా మరి కొన్ని కవితల్లో పాప పలికిన కొన్ని మాటలు – హౌ క్యూట్ – అనిపిస్తాయి. ‘అల.. వల.. బాల..’ లో సముద్రంలో కొంగలు బ్రిడ్జి వేసుకున్నాయని పాప అనడం తన పరిశీలనా శక్తిని చెబుతుంది. పెద్దలకి రాని కొత్త కొత్త ఆలోచనలు పిల్లలకే సాధ్యం మరి!

పాపకి కనబడని, పెద్దలకి మాత్రలకే కనబడే ‘ఓ బూచాడు..’ అందరిళ్ళలోనూ ఉంటాడు కదూ.. ‘అధ్యక్షులవారు..’లో పాప తనదైన అవగాహనా స్థాయిలో నేటి సాహితీ సభల మీద చురకలు వేస్తుంది.

రూరుషి అంటే ఏమిటో పాపం నాన్నకి కూడా తెలియలా! అట్టుకీ, దిబ్బరొట్టెకీ తేడా ఏమిటో పాపకి తెలిసినట్టుగా పెద్దలకి తెలియదు.

నాన్నకు ఇది కూడా తెలియదు..’ అని ఈ పాపే కాదు మా అమ్మాయిలు కూడా ఎన్ని సార్లు అనుకుని ఉంటారో!

చిన్న చిన్న ఆనందాలను ఎలా పొందాలో ‘మూసేస్తే ఎలా’లో పాప చెబుతుంది. పాప ఏ ఉద్దేశంతో అన్నా, ‘తలుపులు ఎపుడూ తెరిచే ఉంచడం’ మంచిదే.

దేవుడు ఒకడే అని ఆ వయసులో పాపకున్న అవగాహనని ‘ఏకం సత్’ చెబుతుంది.

~

దాదాపుగా ఇలాంటి అనుభవాలు నాకూ – నా ఇద్దరి కూతుర్ల బాల్యంలో – ఎదురయ్యాయి. అందుకే ఈ పుస్తకం చదువుతున్నప్పుడు నాకు వాళ్ళమ్మాయి ‘సాలంకృత’తో పాటు మా శుభద, అనన్యలూ కనిపించారు. మణిబాబు గారు తమ ముందుమాటలో “పాప పుట్టినప్పటి నుంచి నాలుగేళ్ళ పాటు మీ జీవితంలో ‘స్వర్ణయుగం’ అని డా. రెంటాల గారు అన్నారు” అని రాశారు. అక్షర సత్యాలు ఆ మాటలు! అలాంటి స్వర్ణయుగాలు రెండు అనుభవించే భాగ్యం మాకు దక్కింది. ఈ పుస్తకం చదువుతుంటే ‘ఆకాశమంత’ సినిమాలోని ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా‘ పాట గుర్తొస్తుంది.

పారవశ్యాన్ని, విస్మయాన్ని ఏక కాలంలో కలిగించగల శక్తి పసివాళ్ళకి మాత్రమే ఉందేమో!’ అనే మణిబాబు గారి అభిప్రాయాన్ని కాదనలేము.

ఈ పుస్తకం చదువుతున్నంత సేపూ నాకు మా శుభద బాల్యం బాగా గుర్తొచ్చింది. తను చిన్నప్పుడు చదివిన పద్యాలు గుర్తొచ్చాయి.. వేసిన ప్రశ్నలు మనసులో మెదిలాయి. ‘ఆకాశమంత’ సినిమా చూస్తూ.. నా భుజం మీద తలపెట్టుకుని వాలిపోవడం నాకింకా గుర్తు! అలాగే అనన్య ఇంటి ముందు వరండాలో కూర్చుని అటుగా వెళ్తున్న వాళ్ళందరినీ పలకరించడం, అక్కతో పాటు తానూ స్కూలుకి వెళ్ళిపోతానని గోల చేయడం.. రాత్రి పూట నా పొట్ట మీద పడుకుని దానికి ఇష్టమైన పాటని పాడమనడం (నేనెంత చెత్తగా పాడినా సరే).. అలా ఏవేవో గుర్తుకొచ్చి కాలంలో వెనక్కి వెళ్ళిపోయాను. ఇప్పుడు వాళ్ళిద్దరూ పెద్దవాళ్ళయిపోయారు. నేను నాన్ననే అయినా వాళ్ళు నాకిప్పుడు అమ్మలు!

ఈ పుస్తకం చదివాకా, నేను అనువదించిన ‘టెడ్డీ బేర్’ అనే కథ గుర్తొచ్చింది. బహుశా ఆ కథ అంత బాగా రావడానికి ఆ కథలోని తండ్రి పాత్రలో నన్ను నేను చూసుకోడమేనని తర్వాత ఎప్పుడో అనిపించింది.

“ప్రతి ఇంటా, ప్రతి తరంలోనూ ప్రతి పాపాయి ఇలా ఆశ్చర్యానందాలకు గురి చేస్తూనే ఉంటుంది. తల్లిదండ్రులో, ఇతర కుటుంబ సభ్యులో వాటిని తలచుకుని, తలచుకుని ఆనందిస్తారు.” అని మణిబాబు గారు అన్న మాటలు వాస్తవం.

ఈ కవితలన్నీ చిన్నవే. చిన్న పదాలలో, అర్థవంతమైన శీర్షికలతో రాసిన ఈ కవితల్లోని భావాలు పాఠకుల హృదయాన్ని తాకుతాయి. మణిబాబు గారన్నట్టు బాల్యంలోని సార్వజనీనమైన, సార్వకాలికమైన గమ్మత్తుని అనుభవంలోకి తెస్తాయి.

మా మనసులోని భావాలకు అక్షర రూపం ఇచ్చినందుకు మణిబాబు గారికి అభినందనలు తెలియజేస్తున్నాను.

***

నాన్న… పాప… (కవిత్వం)
రచన: అవధానుల మణిబాబు
ముద్రణ: కలిమి శ్రీ, విజయవాడ
పేజీలు: 64
వెల: ₹ 100/-
ప్రతులకు:
అవధానుల మణిబాబు: 9948179437
(ప్రింట్ బుక్ అవుట్ ఆఫ్ స్టాక్. ఆసక్తి ఉన్నవారు రచయితని సంప్రదించి పిడిఎఫ్ ప్రతి పొందవచ్చు)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here