Site icon Sanchika

నాన్నా! అందుకోవూ నా లేఖ!

[ఫాదర్స్ డే సందర్భంగా జె. శ్యామల గారు రచించిన ‘నాన్నా! అందుకోవూ నా లేఖ!’ అనే రచనని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]ప్రి[/dropcap]యాతి ప్రియమైన నాన్నా!

నేను జీవితం మొత్తంలో నీకు ఒకే ఒకసారి ఉత్తరం రాసాను. అది కూడా నీకు వేరే ఊరికి బదిలీ అయితే, ముందు వెళ్లి, చార్జి తీసుకుని, అద్దె ఇల్లు చూసుకుని వచ్చి మమ్మల్ని తీసుకువెళతానని వెళ్లావు.. ఆ సందర్భంలో ఒకసారి అమ్మ చెప్పినట్లుగా నీకు, ఒక ఉత్తరం రాసాను. ఆ తర్వాత ఎప్పుడూ ఉత్తరం రాసే అవసరమే రాలేదు. నాకు పెళ్లయినా, ఉన్న ఊరే కావడంతో ఉత్తరంతో పని లేకపోయింది. దగ్గరగానే ఉన్నా, నీతో నేను చెప్పదలచుకున్నవి చెప్పనేలేదు.. అంతలోనే నువ్వు, ఒక్క మాటైనా చెప్పకుండా ఈ లోకం నుంచే వెళ్ళిపోయావు. విధి ఎంత క్రూరమైంది! నాదెంతటి దురదృష్టం.. అయినా నా మనసులో.. ఆలోచనల్లో నువ్వు ఈ క్షణం వరకూ సజీవంగానే ఉన్నావు.. నా ఊపిరి ఉన్నంతవరకు అలాగే ఉంటావు కూడా. ఎందుకో ఈ మధ్య నా బాల్యం రీళ్లు కళ్ల ముందు పదేపదే కదలాడుతున్నాయి. వాటి నిండా నవ్వే నువ్వే. నీ పెదాలపై నవ్వు ముద్ర చెరిగేదే కాదు. నువ్వు కోపంగా ఉండడం చాలా అరుదుగా చూశాను.

నేను ఈరోజు సమాజంలో ఓ గౌరవ స్థానంలో నిలబడ్డానంటే కారణం నువ్వే. నిజానికి నువ్వేనాడూ నాకు నీతి బోధలు చేయలేదు. ఏ విషయంలోనూ కనీసం గట్టిగా కోప్పడిందీ లేదు. తిట్టడం నీకు అలవాటే లేదు. అదే నీ ప్రత్యేకత. నీ మాట తీరు, చేతల ప్రత్యేకత, క్రమశిక్షణ, నిజాయితీ, మన సంస్కృతి పట్ల నీకున్న మక్కువ.. ఇవన్నీ కూడా నా మీద చెరగని ముద్ర వేశాయి. నీ నడవడే నాకు మార్గదర్శనం అయింది.

ఉన్నదాంట్లో సంతృప్తిగా ఉండడం నీ నుంచే నేర్చుకున్నా. ఈ రోజున నా పిల్లలను పెంచే దశలో నువ్వు పదేపదే గుర్తుకొస్తున్నావు. నువ్వు నేర్పిన పోతన భాగవత పద్యాలు నా పిల్లలకి నేర్పాను. ‘ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపలనుండు..’ పద్యం ఎంత బాగా పాడేవాడివి. ఎంత గొప్ప పద్యం! నీ మాట ఎంత సౌమ్యంగా ఉండేదని! మన మాటలు ములుకుల్లా ఉండకూడదని, ఆత్మీయంగా ఉండాలని నువ్వు వేరుగా చెప్పలేదు, కాని నీ మాట తీరే, నాకు ఆ విషయం తెలియజేసింది.

నా చదువులో నీ తోడ్పాటు నేనెప్పటికీ మరిచిపోలేను. ఏ సందేహం అడిగినా విసుక్కోకుండా వివరించేవాడివి. అయితే నువెప్పుడూ నన్ను మెచ్చుకున్న సందర్భం లేదని నాకేమూలో చిన్న అసంతృప్తి. నా మంచి కోరే అలాంటివి పైకి ప్రదర్శించకుండా మనసులోనే దాచుకున్నావనుకుంటా. నువ్వు న్యాయంగా, ధర్మబద్ధంగా ఉండడం, తోటి వారి పట్ల ప్రేమ.. కరుణ కలిగి ఉండడం అన్నీ నాకు తెలుస్తూనే ఉండేవి.. అర్థమవుతూనే ఉండేవి. నాకు ఓ సంఘటన బాగా గుర్తుంది.. ఒకసారి నీకు వేరే ఊరు బదిలీ అయితే, నన్ను స్కూలు నుంచి టి.సి. తెచ్చుకోమని, అందుకు దరఖాస్తు రాసి ఇచ్చావు. నేను బడికెళ్లి నువ్వు రాసిచ్చిన దరఖాస్తు చూపించాను. అయితే డబ్బులిస్తే కానీ టి.సి. ఇవ్వమన్నారు. ఇప్పటి లెక్కలో అది చిన్న మొత్తమే. కానీ ఎంత మొత్తమైనా అక్రమం అక్రమమే కదా. నేను ఇంటికి తిరిగి వచ్చి నీతో, అదే విషయం చెప్పాను. నీకు చాలా కోపం వచ్చింది. నీ సహోద్యోగులను కూడా వెంటబెట్టుకుని బడికి వెళ్లి, ఆ హెడ్ మాస్టర్‌ను నిలదీశావు. అంతమందిని చూసేసరికి ఆ హెడ్ మాస్టర్ భయపడిపోయి వెంటనే టి.సి. ఇచ్చేశాడు.

డబ్బు ఖర్చు విషయంలో కూడా నాకు, నువ్వే ఆదర్శం. ఏది అవసరం.. ఏది విలాసం నీకు తెలిసినంత బాగా ఎవరికీ తెలియదేమో. ఏ దురలవాట్లు లేని నాన్న ఉండడం నా అదృష్టం. అప్పు చేయకుండా బతకడం ఎంత గొప్ప సంగతి! కాలం మారిపోయి, ఇప్పుడు ఉన్నవాడు, లేని వాడు కూడా క్రెడిట్ కార్డుల పైన, లోన్ల పైన బతికేస్తున్నాడు. పైగా ఎన్ని క్రెడిట్ కార్డులు ఉంటే అంత గొప్పగా ఫీలవుతున్నారు. క్రెడిట్ కార్డులు రాకముందే నువ్వెళ్లిపోయావుగా.

నా పిల్లలకి ఎప్పుడూ నీ గురించి చెపుతూనే ఉంటాను. ప్రేమ వ్యక్తీకరణకు వాచక భేదం ఉండదు. అందుకేనేమో ఇప్పుడు నా కూతుర్ని ‘నాన్నా’ అంటుంటాను. నీ మీద నాకున్న గాఢమైన ప్రేమే ఇందుకు కారణమనుకుంటా. ఇంతటి ప్రేమని మదిలోనే దాచుకున్నా. నువ్వున్నప్పుడు సరిగ్గా వ్యక్తం చేయనేలేదు. ఆ లోటు తీరేదికాదు. ఇక ఇప్పుడు అక్షరాలు తప్ప మరో దారి లేదు. నాకెన్నో నేర్పకనే నేర్పి, ఇప్పటికీ అదృశ్యంగా మార్గదర్శనం చేస్తున్న నువ్వు నాకెంతో గర్వకారణం. నిత్యం నీ స్ఫూర్తి తోనే నా గమనం. అయినా, ‘ఫాదర్స్ డే’ అని ప్రపంచం అంతా సందడి చేస్తున్న ఈ రోజున మరింత గాఢంగా నిన్ను స్మరించుకుంటూ, నువ్వు ఎక్కడున్నా, నా వెనుకే ఉన్నావని నమ్ముతూ, నీ ఆశీస్సులే నాకు సర్వదా రక్ష అని భావిస్తూ.. నీకివే నా కైమోడ్పులు!

నీ తనయ

Exit mobile version