Site icon Sanchika

నాన్నగారూ… నాన్నగారూ…

[box type=’note’ fontsize=’16’]2019 దీపావళికి సంచిక ప్రచురించదలచిన ‘కులం కథలు’ సంకలనంలో ప్రచురణకై అందిన కథ ఇది. ‘కులం కథ’ పుస్తకంలో ఎంపిక కాలేదు, సంచిక వెబ్ పత్రికలో ప్రచురితమవుతోంది.[/box]

[dropcap]”హ[/dropcap]లో…. హలో…. పెద్దోడా…. హలో….”

మా ఆవిడ సెల్‌ఫోన్‌తో కుస్తీ పడుతోంది… సమాధానం రావడం లేదు.

“హలో… హలో… చిన్నోడా… హలో….”

మా రెండవ వాడితోనైనా మాట్లాడాలని తాపత్రయ పడుతోంది.

పేపర్ చదువుతున్న వాడినల్లా… తల ఎత్తి చూచా!

“ఇద్దరి ఫోన్లూ ఎంగేజ్‌లో ఉన్నాయి గదూ!”

“అవునండి! ఇద్దరి ఫోన్లు పలకడం లేదు…” దిగులుగా అంది.

“ఇద్దరూ బిజీగా ఉండి ఉంటార్లే… అమ్మ మిస్సింగ్ కాల్స్ చూచి వాళ్ళే ఫోన్ చేస్తారులే! స్పీకర్ ఆన్ చేసి వుంచు.”

“ఇద్దరితో మాట్లాడి రెండు రోజులైంది. ఆదివారం గదా!” ఆశగా అంది.

“ఆదివారం నాడయినా… యిద్దరికి తీరిక దొరకాలిగా… భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్థులే! ఆదివారం నాడే ఆటవిడుపు… వాళ్ళ ఫోన్ చేస్తారులే! దిగులు పడకు…..” సముదాయించాను.

“నాన్నగారూ….” స్పీకర్ లోంచి వాయిస్ వినిపించింది.

“పెద్దవాడి గొంతులా ఉందండి…” ఆలోచనగా అంది.

“వాడు ఎప్పుడైనా… ‘నాన్నగారూ’ అని పిలిచాడా! ‘డాడీ’ అనడం తప్ప…”

“నేను నాన్నగారూ! సతీష్‌ను, ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్నా”

“బాగున్నావురా!” ఆప్యాయంగా అడిగాను. సతీష్ క్షణంలో జ్ఞాపకమొచ్చాడు.

“జ్యోతి కూడా యిక్కడే వుంది నాన్నగారూ!”

“నాన్నగారూ! బాగున్నారా! ” జ్యోతి కంఠం వెంటనే వినిపించింది.

“ఇక్కడ నేను, అమ్మగారూ బాగున్నాంరా! మీరెలా ఉన్నారు? అన్నట్లు… కరుణ, విమల, రాజేష్, నవీన్, మహేష్ వగైరా… మన వారంతా….” ఉత్సాహం వచ్చేసింది.

“అంతా బాగానే ఉన్నాం… నాన్నగారూ…మీ చలువ వల్లే…” ఆనందం వాళ్ళ గొంతుల్లో తాండవమాడుతోంది.

“నాదేముందర్రా! మేమంతా కలిసి ప్రయత్నించాం. మీరు సహకరించారు… ఓ ఆధారం చూపించాం. అది అందుకొని మల్లె తీగలా అల్లుకొని, ఎగబ్రాకి యింత వారయ్యారు…” నేను నిమిత్తమాత్రుడననే చెబుతున్నాను.

“మీ వల్లనే కదా… నాన్నగారూ! బాల కార్మిక వ్యవస్థ నుండి మేం విడుదలైంది. నిర్బంధ విద్యాపథకంలో విద్యావంతులమైంది…”

వాళ్ళు ఫోన్లో ఒకరి తరువాత ఒకరు చెప్పుకు పోతూనే ఉన్నారు.

“నిజమేనండి…. మీరు మమేకమై నిజాయితీగా ఆ యజ్ఞాన్ని నిర్వహించబట్టే గదండీ…. యిన్ని మంచి ఫలితాలు వచ్చాయి…” నా భార్య ఆరాధనా పూర్వకంగా అంటోంది.

‘మా ఊళ్ళో బాల కార్మికులు లేరు’ అనే బోర్డు ఆ ఊరు ముందు స్థాపించడంతో మా మూడు నెలల బృహత్తర కార్యక్రమం ప్రారంభమైంది.

“మాస్టారూ! మేం తల పెట్టిన యీ మహాయజ్ఞంలో మీరు పాల్గొనాలి. మూడు నెలల పాటు మీరు మాతో ఉండాలి! మీ సహాయ సహకారాలు కావాలి. ఇందుకు మేడమ్ గారు అంగీకరించాలి” కమ్యూనిటీ మొబిలైజేషన్ ఆఫీసర్ మాధవరావు రిక్వెస్ట్ చేశాడు.

“తప్పకుండా పాల్గొంటా! రిటైర్‌మెంట్‌కు ఆరు నెలల టైమ్ ఉంది. ఈ సమయంలో యిటువంటి సామాజిక కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టమనుకుంటా” నా భార్య వైపు చూచాను.

“మా పిల్లలంతా సెటిలయ్యారు. మాస్టారికి యీ ముప్పై అయిదేళ్ళ సర్వీసులో ఎందరో ఆఫీసర్లు పరిచయమున్నారు. వారి సేవలను వినియోగించుకో మాధవ్!”

మాధవరావ్‍తో మా పరిచయం ఈ నాటిది కాదు. మా పెద్ద అబ్బాయి క్లాస్‌మేట్.

“ఏమిటి కార్యక్రమం?” శ్రీమతి అంగీకారం లభించిన తరువాత అడిగాను.

“మనం ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవాలి. బాల కార్మిక వ్యవస్థ నుండి గ్రామానికి విముక్తి కలిగించాలి. విద్యాహక్కు చట్టాన్ని విజయవంతం చేయాలి. ఆరు నుండి పధ్నాలుగేళ్ళ లోపు బాల కార్మికుల్ని బడిబాట పట్టించాలి. వాళ్ళను విద్యావంతుల్ని చేయాలి” మాధవరావ్ వివరించాడు.

ఇంటికి కావలసిన మూడు నెలల సరంజామా అంతా సమకూర్చి మాధవరావ్ వెంట సూట్‌కేస్‌తో బయలుదేరాను.

మాతో మరో ముగ్గురు ఔత్సాహికులు కలిసిపోయారు. ఒకరు తరువాత వచ్చారు.

“మీ పిల్లల్ని బడిలో చేర్పించండి….” అర్థించాం.

“మాకు తిండి ఎవరు పెడతారు?” ప్రశ్న ఎదురైంది.

“మీ పిల్లల్ని బాల కార్మికులుగా మార్చకండి” ప్రార్థించాం.

“ఈ అవిటోళ్ళకి అన్నం ఎవరు యిస్తారు?”

“మీ పిల్లల్ని విద్యావంతుల్ని చేస్తాం” హామీ యిచ్చాం.

“మాకు గంజినీళ్ళు ఎవరు పోస్తారు?”

అన్ని సమస్యలే! సమాధానం యివ్వలేని ప్రశ్నలే!

అక్షరాస్యత గురించి ప్రచారం చేశాం. వయోజన విద్య అవసరం వివరించాం.

పిల్లల్ని పనిలో పెట్టుకొంటే ఎంత పెద్ద తప్పో… చట్టరీత్యా ఎటువంటి శిక్ష వేయవచ్చునో పోస్టర్ల ద్వారా ప్రచారం చేయించాం. దండోరాలు వేయించాం. గ్రామ సభలు పెట్టించాం. హరికథలు, బుఱ్ఱకథలు, ఒగ్గు కథలు మొదలైన కళారూపాల ద్వారా, సాంస్కృతిక కార్యక్రమాలతో వారి దృష్టిని ఆకర్షించాం. చెప్పాల్సిన విషయాలను గుండెలకు హత్తుకునేలా ప్రదర్శించాం.

అయినా మా ప్రచారం బూడిదలో పోసిన పన్నీరైంది.

“అమ్మా! మమ్మల్ని చదివించరూ! అయ్యా! మమ్మల్ని చదివించరు.”

కొందరు బాల కార్మికుల చేత వీధి వీధినా ప్రదర్శనలు యిప్పించాం. మా కష్టానికి తగిన స్పందన రాలేదు.. మమ్మల్ని చూడగానే జనం పారిపోయేవారు. ఎదురుపడి నోటికొచ్చినట్లు తిట్టేవారు. పిల్లల్ని పని మానిపించమంటే కొట్టడానికి వచ్చేవారు.

“కిం కర్తవ్యమ్?” మాధవరావు తల పట్టుకున్నాడు.

“మాధవ్! ఈ సమస్యల కన్నింటికి మూలం ఆర్థిక స్థితిగతులు. రెక్కాడితేగాని డొక్కాడని జనం. పిల్లల్ని బడికి పంపించే స్థిమితం లేదు. తలకు మించిన అప్పులు. వాళ్ళను ఆర్థికంగా ఆదుకోగలిగితే… మనం అనుకున్న పని సాధించగలుగుతాం” సాలోచనగా అన్నాను.

“కానీ… సమస్యలు చాలా ఉన్నాయి మాస్టారు” బ్యాంక్ ఉద్యోగి రాజేష్ అంటే…..

“అన్ని సమస్యలను మనం పరిష్కరించగలుగుతామా?” పంచాయితీ ఉద్యోగి పరమేశం అన్నాడు.

“కొన్నయినా పరిష్కరిస్తేనే….” యూత్ కో ఆర్డినేటర్‌ యుగంధర్ అంటుంటే…

“ఇది ఒక బహుముఖ వ్యూహం” నా ఆలోచనలు ఓ రూపుదిద్దుకున్నాయి.

“ఎలా మాస్టారూ?” టీచర్ పురుషోత్తమ్ అడిగాడు.

“ఎక్కువ మంది బాల కార్మికులను బడికి పంపిన వాళ్ళకు ఉచితంగా కుళాయి కనెక్షన్‌ యిప్పిస్తామందాం”

“బావుంది మాస్టారు” మాధవ్ సంతోషం వ్యక్తం చేశాడు.

“ఇంకా చెబుతాను. వృద్ధాప్యపు పెన్షన్లు యిప్పించుదాం. బడికి వెళ్ళే పిల్లలకు ప్రోత్సాహకాలు యిప్పిద్దాం. ఉచితంగా పాఠ్య పుస్తకాలు పంచుదాం. గ్రామ సభలలో ప్రతిజ్ఞలు చేయించుదాం” చేయవలసిన కార్యక్రమాలు వివరించా.

మరునాడే త్రికరణ శుద్ధిగా ఆరుగురం కార్యాచరణ ప్రారంభించాం.

రాళ్ళను కొట్టే వడ్డెర కుటుంబాలలో వయసుకు మించిన పనిచేసే పిల్లలు నష్టాలు వివరించాం. బడిలో చేర్పిస్తే వాళ్ళ బ్రతుకులు ఎలా మారుతాయో గ్రామాభివృద్ధి కమిటీ సమావేశాల్లో వివరించాం. బడికి పంపిన వాళ్ళకు పావలా వడ్డికి ఋణం ఇప్పిస్తామని ప్రతిపాదన పెట్టాం.

శుక్రవారం మత ప్రార్థనల తరువాత మత పెద్దలనందరికీ సమావేశ పరచి వాళ్ళతో చర్చించి పిల్లలను బడికి పంపుతామని ‘అల్లా’ సాక్షిగా ప్రమాణం చేయించాం.

బీడీ ఫ్యాక్టరీలో పనిచేసే అమ్మాయిలను పంపమని ప్రమాణం చేయించాం.

నేలతల్లి సాక్షిగా రైతుల చేత ప్రమాణం చేయించారు.

“ఇంతటితో సరిపోదు. పిల్లలు బడికి పంపించే వాళ్ళను రచ్చబండ సాక్షిగా సన్మానం చేద్దాం” ప్రపోజల్ పెట్టాను.

మరునాడే గ్రామసభలో సైకిల్ షాప్ యజమాని తన కొడుకును పని మానిపిస్తానని ప్రకటించాడు. వెంటనే పూలమాలతో సన్మానం చేశాం.

ఆ పాజిటివ్ దృక్పథం పని చేసింది. దినదిన ప్రవర్ధమానంగా సన్మానం అందుకున్న వారి సంఖ్య పెరిగిపోయింది. అనాథలంతా నివాసముంటున్న ఓ గుడిసె ముందు మా కార్యక్రమం ఆగిపోయింది.

“వీరిని దత్తత తీసుకొని ఎవరైనా చదినిస్తే బావుంటుంది” ప్రపోజల్ పెట్టా.

“మేం వీళ్ళకు అన్నం పెట్టి ఆశ్రయం కల్పిస్తాం. వీళ్ళకు కావలసిన పుస్తకాలు యిచ్చి మీరు చదివిస్తారా!” గ్రామసభలో గ్రామ పెద్దలు ప్రతిపాదించారు.

వాళ్ళు పదిహేనుమంది అనాథలు… సతీష్, జ్యోతి, కరుణ, విమల, రాజేష్, నవీన్, మహేష్ వగైరా… వగైరా… పుట్టుకతోనే తల్లి వదలి వేసిన కొందరు….. ఏక్సిడెంట్స్ అయిన వాళ్ళంతా పోగా… మిగిలిన వాళ్ళు కొందరు…. తల్లిని తండ్రి చంపి జైలుకెళ్లే మిగిలిన వాళ్ళు మరి కొందరు….. అక్రమ సంబంధం కలిగిన తండ్రిని చంపించి తల్లి జైలుకెళ్ళగా అనాథలైన వాళ్ళు కొందరు….. తుఫాను భీభత్సానికి మిగిలిన వాళ్ళు.. మరి కొందరు…

అందరూ… అందంగా… ఆరోగ్యంగా… చింపిరి చింపిరి గుడ్డల్లో ముత్యాల వంటి బిడ్డల్లా… గంధర్వ లోకం నుండి భూలోకానికి శాపవశాత్తు విసరి వేయబడిన దేవదూతల్లా ఉన్నారు…. పరిశీలిస్తుంటే…!

“వీళ్ళను ఎన్‌రోల్ చేసుకోవాలంటే… ఒక ప్రాబ్లెమ్ వస్తుంది మాస్టారూ!” మాధవరావ్ సాలోచనగా అన్నాడు. ఏమిటన్నట్లుగా ప్రశ్నార్ధకంగా చూచా.

“వీళ్ళ దరఖాస్తు ఫారాలను పూర్తి చేస్తాము. వీళ్ళకు తండ్రిగా, సంరక్షకుడిగా ఒకరి పేరు వ్రాయాలి.. వారు సంతకం పెట్టాలి.. అడ్రస్ వివరాలు యివ్వాలి.”

“ఎవరి పేరయినా వ్రాయవచ్చునా?” నేను అడిగాను.

“వ్రాయవచ్చునుకోండి.. వాళ్ళు సంతకం పెట్టాలిగా…” అందరి వైపూ పరిశీలనగా చూచా! నిశ్శబ్దంగా ఉన్నారు. భావరహితంగా చూస్తున్నారు.

“అందరికీ తండ్రిగా నా పేరు, అడ్రస్ వ్రాయి. నేనే సంతకాలు చేస్తాను..” నిశ్చయంగా అన్నాను.

“మాస్టారూ!” మాధవరావ్ ఆశ్చర్యపోయాడు.

“నిజమే మాధవరావ్! నా పిల్లలు ముగ్గురు కాదు. వీళ్ళతో కలిపి పద్దెనిమిది మంది!” సంతోషంగా అన్నాను.

అక్కడితో నా బాధ్యత పెంచుకున్నాను. తెలిసిన అధికారులందరి సహాయ సహకారాలతో బాలకార్మిక వ్యవస్థ రూపు మాపగలిగాం. పిల్లల్ని బడిలో చేర్పించి, బడిబాట పట్టించాం.

మా మూడు నెలల ప్రాజెక్ట్ పూర్తయింది.

విజయోత్సవ సభ ప్రారంభమైంది. ప్రాజెక్ట్ డైరక్టర్ అధ్యక్షతన జిల్లా గ్రామస్థాయి అధికారులు పాల్గొన్నారు.

“ఇది ప్రభుత్వ పథకం కాదు. ఇది ప్రజల పథకం. ఈ పథకంలో డ్వాక్రా గ్రూపులు సభ్యులు, అంగన్‌వాడి కార్యకర్తలు చురుకుగా పాల్గొన్నారు. యువజన సంఘాలు, యూత్ సర్వీస్ సభ్యులు, అనేక స్వచ్ఛంద సంస్థలు తోడ్పడబట్టి యీ పథకం విజయవంతమైంది. ఇది మా గొప్పతనం కాదు.” ఒక్కొక్కరు అనుభవాలు వివరించాం.

“ప్రజలే ఇన్ఫార్మర్ వ్యవస్థ ఏర్పరుచుకున్నారు. బాల కార్మికులు ఎవరైనా కనిపిస్తే అదికారులకు క్షణాల్లో సమాచారం అందించేవారు. అవసరమైతే పోలీసు వ్యవస్థ ఎంతో ఉపయోగపడింది.”

“రైతులకు పొలాల్లో సేద్యం చేసుకోవడానికి, బోరుబావులు వేయించుకోవడాని బ్యాంకుల నుండి ఋణాలు యిప్పించాం.”

“చిన్న గూడు కట్టుకోవడానికి ఇంటిల్లిపాది లెక్కలు ముక్కలు చేసుకునే తరుణంలో కొందరికి గృహనిర్మాణ పథకం క్రింద యిళ్లు కట్టించి యిప్పించాం.”

“పి.హెచ్.సి కేంద్రాన్ని నెలకొల్పి అనారోగ్యం బారిన పడిన గ్రామస్తులందరికి ‘బీమా’ పథకంలో ఆరోగ్య ప్రదానం చేయించాం.”

“వడ్డీ వ్యాపారస్తులను నయన్నో భయాన్నో నచ్చచెప్పి, అధిక వడ్డీ తగ్గించి అప్పులను తగ్గించి, రద్దు చేయించి, అప్పులపాలైన కుటుంబాలకు ధైర్యం కల్పించాం. ఇవన్నీ యీ ప్రాజెక్ట్ విజయసాధనలో ఉయోగపడ్డాయని మనవి చేస్తున్నాము.” మాధవరావ్ ప్రాజెక్ట్ సఫలమైనందులకు సంతోషం ప్రకటించాడు.

“ఇదొక మహాయజ్ఞం. ఈ మహాయజ్ఞంలో పాల్గొన్న మానవులంతా మహానీయులే! ఈ మహాయజ్ఞంలోని ఋత్విజులందరికీ అభినందనలు చెబుతున్నారు” అధ్యక్షులవారు అనందం వ్యక్తపరచారు.

“ఇందులో వడ్డీ వ్యాపారస్తుల పైనగానే, భూస్వాముల పైన గానీ ఒక కేసు పెట్టలేదు. ఒక్క పైసా జరిమానా విధించలేదు….” జీపీడీవో అంటే…

“రవాణా లేని యీ ప్రాంతానికి దారులు వేయించాం. మంచినీటి సదుపాయం కల్పించాం” తహసిల్దార్ అన్నారు.

“ప్రాథమిక పాఠశాల స్థాయి నుండి హైస్కూలు స్థాయి వరకు విద్యావ్యవస్థను ఈ ఊరికి రప్పించాం” యం.ఇ.వో. అన్నారు.

“వ్యాపారుల యిళ్ళ ముందు ధర్నాలు చేశాం. సామాజికంగా బహిష్కరించాం! యజమానులకు – విముక్తి చెందిన బాలకార్మికుల చేత దండలు వేయించాం.”

జ్ఞాపకాల సుడులు తిరుగుతూనే ఉన్నాయి,

“అన్నీ ఒక ఎత్తైతే.. మనం వచ్చే ముందు ఆ అనాథ పిల్లలంతా మీ కాళ్ళను చుట్టి “నాన్నగారూ.. నాన్నగారూ…” అంటూ బావురుమనడం నా జీవితంలో మరిచిపోలేని కలచివేసే సంఘటన…” శ్రీమతి మాటల్తో యిహంలోకి వచ్చేశాను…

“డాడీ… డాడీ… డాడీ…” ఫోన్ లోంచి మావాడి గొంతు వినిపించింది.

“డాడీ కంటే.. నాన్నగారూ! బాగుంది. గదండీ!!”

శ్రీమతి ఆత్మీయంగా అంటుంటే తన్మయంగా తలూపాను.

Exit mobile version