Site icon Sanchika

తల్లి అస్తిత్వానికి పట్టం కట్టిన నవల ‘నాన్నలేని కొడుకు’

[శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మిగారి ‘నాన్నలేని కొడుకు’ నవలని సమీక్షిస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్]

[dropcap]వా[/dropcap]ర్తా పత్రికలూ రకరకాల ప్రసార/ప్రచార మాధ్యమాలు మనిషికి అందుబాటులోనికి వచ్చాక, ప్రపంచాన్ని గుప్పిట లోనికి తెచ్చుకున్నంత ఆధునికత మనకు అందుబాటులోనికి వచ్చింది. ఇది మంచి కోసమా? చెడు కోసమా? అని ఆలోచిస్తే, వచ్చే సమాధానం పెద్ద క్లిష్టతరమైనదేమీ కాదు!

మొబైల్ ఫోన్ ఉపయోగించుకుంటూనే, దానిని నానారకాలుగా తిట్టిపోసే జనం మన మధ్య వున్నారు. ఏదైనా అతి అనేది లాభంకంటే నష్టాలవైపే దారి తీయిస్తుంది. మంచికి ఉపయోగించుకుంటే ‘మంచి’; దుర్వినియోగం చేసుకుంటే ‘చెడ్డ’. ఇంతకుమించి విపులంగా చెప్పవలసిన అవసరం లేదు. అయితే ఈ ఆధునిక మాధ్యమాల వల్ల ప్రపంచంలో, ఏ దేశంలో ఎక్కడ ఏమి జరిగినా క్షణాల్లో ప్రపంచంలోని ప్రతి వ్యక్తి తెలుసుకునే వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో నిత్యం వినిపిస్తున్న మాట మహిళలపై రకరకాల దాడులు. బాలికల/మహిళల అపహరణలు (కిడ్నాపింగ్), మానభంగాలు, చిత్రహింసలు, హత్యలు, ఇలా ప్రతి రోజూ, ప్రతిక్షణం వార్తలు వింటూనే వున్నాము. అయితే గతంలో ఇలాంటి దాడులు, మహిళలపై జరగలేదా? అంటే, ఎందుకు జరగలేదు, జరిగాయి. అప్పట్లో ఇన్ని ప్రచార మాధ్యమాలు లేవు. ఉన్నవాటికి ప్రాధాన్యతలు వేరు. అందుకే అప్పట్లో ఇలాంటి వార్తలు తక్కువ విన్నాం. ప్రస్తుత పరిస్థితిలో ఆడపిల్లకు బాల్యదశ నుండి, వృద్దాప్యం వరకు, ఇంట్లో బయట, గుడిలో, బడిలో, ఆఫీసులో – ఎక్కడా రక్షణ లేదు. కామానికి ప్రేమ కిరీటం తొడిగి, ప్రేమించమంటూ, పెళ్ళాడమంటూ ఆడపిల్లల వెంటపడుతూ, ఒప్పుకోకుంటే, ఆమ్ల దాడులు, మానభంగాలు చేయడం, చంపేయడాలు, లేదా ఎక్కడో అజ్ఞాతప్రదేశంలో ఉంచి హింసించడాలు మామూలు విషయాలయిపోయాయి. ఆడది అంటే మగాడి చేతిలో ఆటబొమ్మగా మారిపోయింది.

అదిగో అలాంటి అంశాన్ని ఇతివృత్తంగా తీసుకుని ప్రముఖ రచయిత్రి శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారు నవలా రూపంలో ఒక కొత్త పుస్తకాన్ని వెలువరించారు. గతంలో వీరు అనేక కథలతో పాటు, 20 నవలలు కూడా రాసి తెలుగు సాహితీ రంగంలో తనదైన ముద్ర వేసుకోగలిగారు. తొలుత ఈ నవలను ‘నాన్నలేని కొడుకు’ పేరుతో, వారం, వారం సంచికలో సీరియల్‌గా ప్రచురించడం, పాఠకుల మన్ననలు పొందడం కూడా జరిగింది. నవల పేరుతో పాటు, పుస్తకం మీది ముఖ చిత్రం పాఠకుడిని అమితంగా ఆకర్షించి, త్వరగా చదవాలన్న ఆరాటానికి గురి అవుతాడు. తక్షణం చదివి తీరుతారు కూడా.

సమీక్ష పేరుతో ఇక్కడ మొత్తం నవలను మీకు అప్పజెప్పే ప్రయత్నం నేను చేయబోవడం లేదు. కథావస్తువు ఏమిటంటే, చదువుకుంటున్న ఒక అమాయకపు బాలికను, ఒక రోడ్ సైడ్ రోమియో అపహరించుకుపోయి ఒక అజ్ఞాత స్థలంలో ఒంటరిగా బంధించడం, రోజూ బలవంతంగా మానభంగం చేయడం, ఆమెకు ఇష్టం లేకపోయినా అతని వల్ల కొడుకుకు జన్మనివ్వడం, ఆ.. అపరిచితుడు లేనప్పుడు బయటికి పారిపోయే ప్రయత్నం చేయడం, చిమ్మ చీకటిగదిలో బయట తాళం వేయబడి పగలంతా ఇంట్లో గడపడం, ప్రతి రాత్రి అతని మృగత్వానికి బలి అయిపోవడం అలా కన్నకొడుక్కి మూడు సంవత్సరాలు వయసు వచ్చేవరకూ అంటే సుమారు నాలుగు సంవత్సరాలు గాలీ, వెలుతురూ చొరబడని చీకటి గదిలో గడిపింది. రచయిత్రి ఆ చీకటి గదిని వర్ణించిన తీరు చదూతుంటే భయంతో ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఇంతకీ అపహరణకు గురియైన ఆ బాలిక పేరుమోసిన ఒక వైద్యుడి ముద్దుల కూతురు.

ఆమె సాహసంతో అతడిని గాయపరచి కొడుకుతో పారిపోవడం, పోలీసు కేసు కావడం, తర్వాత కోర్టు, పిల్లాడికి తండ్రి ఎవరనే విషయం వచ్చినప్పుడు, అతని పేరు వాడడం తల్లికి ఇష్టంలేకపోవడం, తర్వాత ఒంటరి తల్లి పేరు ఉపయోగించుకోవచ్చనే సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా నిర్ణయం తీసుకోవడం, పిల్లాడిని బడిలో చేర్చడం తల్లి తిరిగి చదువు కొనసాగించడం, మధ్యలో ఎన్నో మలుపులు పాఠకుడిని టెన్షన్‍కు గురిచేసే సన్నివేశాలు అనుభవం వున్న రచయిత్రి ముద్ర కనిపిస్తుంది.

ఈ నవల చదవడం పూర్తి అయిన తర్వాత నాకు మాదిరిగానే కొంతమంది పాఠకులలో కొన్ని ప్రశ్నలు ఉదయించే అవకాశం వుంది. అవి ఏమిటంటే-

  1. రచయిత్రి వర్ణించిన దానిని బట్టి, ఆ ఒకే గదిలో బంధింపబడిన, తల్లి కొడుకు, నాలుగు సంవత్సరాల పాటు బ్రతికి బట్టకట్టే అవకాశం లేదు. అపహరించడం, బంధించడం కరెక్ట్ గాని, సన్నివేశం సహజత్వానికి కాస్త దూరంగా ఉన్నట్టు అనిపించింది.
  2. అమ్మాయి పారిపోవడానికి చేసే ప్రయత్నంలో, గోడ సుత్తితో పగలగొట్టడం, ఊడిన ఇటుకలు రాత్రి ఆతను వచ్చే సమయానికి కనపడకుండా అమర్చింది అన్నారు. ఇక్కడ గోడను సుత్తితో కొట్టినప్పుడు, ఇటుక రూపంలో దేనికది ఊడిపడే అవకాశం లేదు. ముక్కలు ముక్కలుగా విరిగి ఊడిపోతుంది. తిరిగి కనపడకుండా అమర్చే అవకాశం లేదు. గోడ ఇటుకను ఒక్కటి పడగొట్టగలిగినా, మిగతా గోడ రంద్రం చేయడం అంత కష్టం కాదు. ఇది కూడా కొంత అసహజత్వానికి తావిచ్చింది.
  3. తప్పించుకుని పారిపోయే అమ్మాయి కొడుకుతో సహా అడవిలో ఒక కాంట్రాక్టర్ కారు క్రింద ప్రమాదవశాత్తు పడి స్పృహ కోల్పోతుంది. అప్పుడు, ఆ కాంట్రాక్టర్ తల్లీకొడుకులను పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళతారు. ఇంతవరకూ బాగానే వుంది. ఆసుపత్రి డాక్టర్లు, వీళ్ళని గాంధీ ఆసుపత్రికి తీసుకువెళ్ళమని సలహా ఇచ్చినా, పలుకుబడి కలిగిన కాంట్రాక్టర్ ఒత్తిడితో చికిత్స చేస్తారు. ఇలాంటి కేసులు ఎం.ఎల్.సి. (మెడికో లీగల్ కేసు) రికార్డు చేయకుండా, పేషేంట్‌ను అసలు ముట్టుకోరు. కోర్టుకు ఇది చాలా అవసరం. పైగా పేషంట్‌ను తీసుకు వచ్చిన కాంట్రాక్టర్ కూడా కోర్టుకు హాజరు కావలసి ఉంటుంది. ఇవన్నీ నవలలో రికార్డు చేయబడలేదు. నవల కానీ, కథ గాని రాయడంలో రచయిత్రి గానీ రచయిత గానే ఏదో ఒక కోణంలో రాయవచ్చు, పాఠకుడు మరో కోణంలో అర్థం చేసుకోవచ్చు. అందుచేత రచయిత్రి సమయం వచ్చినప్పుడు, ఈ సందేహాలకు సముచితమైన సమాధానం ఇవ్వగలిగితే, పాఠకులు కూడా తృప్తిపడతారు.

ఇక నవల మాత్రం మంచి సస్పెన్స్‌తో, ఆతృతగా చదివింపజేస్తుంది.

ఈ నవలకు ముందుమాట రాస్తూ ఒకచోట ప్రొఫెసర్ సి.హెచ్. సుశీలమ్మ గారు ‘సీనియర్ రచయిత్రి అత్తలూరి విజయలక్ష్మి స్త్రీవాదులు జాబితాలో లేని స్త్రీవాద రచయిత్రి’ అన్నారు. వాదం ఏదైనా ఈ నవల స్త్రీ పురుషులు, యువతీ యువకులు తప్పక చదవదగ్గది. ఈ పుస్తకం కావలసిన వారు హైదరాబాద్ లోని నవోదయ బుక్ హౌస్ నుండి గానీ, స్వయంగా రచయిత్రిని (9676881080) సంప్రదించిగాని పొందవచ్చు.

‘నాన్నలేని కొడుకు’లు ఎలా వుంటారో ఈ నవల చదివితే తెలుస్తుంది.

***

నాన్న లేని కొడుకు (నవల)
రచన: అత్తలూరి విజయలక్ష్మి
ప్రచురణ: జె.వి. పబ్లికేషన్స్,
పేజీలు: 88
వెల: ₹ 100
ప్రతులకు:
అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
అచ్చంగా తెలుగు
8558899478 (WhatsApp only)
ఆన్‍లైన్‍లో ఆర్డర్ చేసేందుకు:
https://books.acchamgatelugu.com/product/nanna-leni-koduku/

 

Exit mobile version