Site icon Sanchika

నడక నేర్చిన కాలం

బండి కదిలింది
కాలాన్ని వెంటేసుకుని

ముందడుగు వేస్తూ
మనిషి బతికే
గతుకుల బాటలో

ఆట కాలంతోనే ఆడేది
ఎండ వానలో చలిలో గాలిలా

బతుకు తెరచాప
ఎగిరింది చెలి కొంగు రంగులుగా
వాన వొదిగిన పైటలో తడిసింది దేహమై
అమ్మ ఆరేసింది పసిడి అంచు చీరె
ఊగిందీ కొమ్మ ఊయలై ప్రకృతి

చలన శీల బతుకంటే మనిషిదే
తల నిమిరిన చేతి చెలిమి
అమ్మ ధైర్యం ఆనవాలు

బాధల్లో సుఖం నేర్పిన
లిట్మస్ కమ్మలే
నడక నేర్చిన కాలం

నిన్నటి ఆకాశం కురిసింది
ఉరుముల మెరుపుల వాన

మట్టి తడిసింది
పొక్కిలి వాకిలి బాధ తీరింది

కొత్త ఊపిరి ఊదింది
జీవన సారమైన కాలం

ఒకప్పుడూ
చల్లగాలి నడిచింది
నీలి మేఘాల తాకుతూ

ముడి విప్పుకొన్న నీటి సంచి
జారింది జలపాతంలా
నేల నవ్వింది వాన దారుల

ప్రకృతి పులకించింది సుమ గంధమై
నడుస్తున్న ప్రవాహమైన
కాలం నడకలో దాగున్నది సుందర కావ్యం

Exit mobile version