Site icon Sanchika

నడకలూ – నడతలూ

[box type=’note’ fontsize=’16’] “పొద్దున్నా సాయంత్రం నడుస్తూ ఇంతమంది జనాలని చూడడం… కొందరి ముఖాలలో నవ్వు, కొందరి మొహాలలో ధైర్యం, కొందరి పట్టుదల, కొందరి ఆశ చూస్తుంటే జీవితం పట్ల కొత్త ఉత్సాహం కలుగుతుంది” అంటున్నారు కొల్లూరి సోమ శంకర్నడకలూ – నడతలూ“లో. [/box]

[dropcap]గ[/dropcap]త కొన్ని నెలలుగా నేను బరువు పెరగడం, నా శరీరం స్థూలకాయంగా మారడం తెలుస్తూనే ఉంది. మొదట్లో పట్టించుకోకపోయినా… ఒక దశలో తప్పనిసరై డైట్‌లో మార్పులు, నడక మొదలుపెట్టాను. మొదట్లో ఉదయం పూట రోజూ అయిదు కిలోమీటర్లు నడిచేవాడిని. కుకట్‌పల్లి – ఐడిఎల్ చెరువు పక్కగా ఉండే రోడ్‌పై వాకింగ్ చేసేవాడిని. కొన్ని రోజుల తర్వాత మిత్రులొకరు అన్నారు, ‘బాలాజీనగర్‌లోనే చక్కని పార్క్ ఉంది, దానిలో వాకింగ్ ట్రాక్ కూడా ఉంది. అక్కడ నడవచ్చు కదా’ అని! పార్కులో చాలామంది జనాలుంటారు, నాకు ఇబ్బందిగా ఉంటుంది నడవడానికి అని ఆ సూచనని పాటించలేదు.

కాని ఒకరోజు ఎందుకో నేను రోజూ నడిచే ఆ రోడ్‌లో నడవబుద్ధి కాక, మా మిత్రుడు చెప్పిన పార్క్‌కి వెళ్ళాను. జనాలు బాగానే ఉన్నారు, కానీ చుట్టూ పచ్చని చెట్లతో చల్లని గాలి బాగా వీస్తుంటే ట్రాక్ పై బ్రిస్క్ వాకింగ్ చేయడానికి బావుంది. అప్పట్నించి ఉదయం సాయంత్రం రెండు పూటలా వాకింగ్‌కి అక్కడికే వెళ్తున్నాను.  రోజూ పొద్దున్న ఐదు, సాయంత్రం ఐదు కిలోమీటర్లు నడుస్తాను. ఇంటి నుంచి పార్కుకి, పార్కు నుంచి ఇంటికి సుమారు రెండు కిలోమీటర్లు ఉంటుంది, పార్కులో మూడు కిలోమీటర్ల దూరం 25-26 రౌండ్లు తిరుగుతాను.

మొదట్లో పార్కులో జనాలుంటారని సంకోచించిన నాకు – నడుస్తూ, వాళ్ళందరిని పరిశీలించడం ఒక అలవాటుగా మారింది. పిల్లలు, యువతీ యువకులు, నడివయస్సు స్త్రీ పురుషులు, వృద్ధులు… ఇలా ఎందరెందరో తటస్థపడుతూంటారు. కొంతమంది పొద్దున్న పూట మాత్రమే వస్తారు, కొందరు పొద్దున్నా సాయంత్రమూ వస్తారు. కొందరు సాయంత్రం మాత్రమే వస్తారు.

ఉదయాలు:

ఉదయం పూట చాలా ప్రశాంతంగా ఉంటుంది. సాయంత్రంతో పోలిస్తే ఉదయం తక్కువ మంది వస్తారు. ఆకాశం లేత నీలం నుంచి అరుణవర్ణంలోకి రంగులు మార్చుకుంటుండగా చల్లగాలిలో నడవడం బావుంటుంది.

ఉదయం పూట ఒకావిడ వస్తారు. ఫోన్‌లోంచి వేంకటేశ్వర సుప్రభాతం పైకి వినబడేట్టుగా పెట్టుకుని నడుస్తూ ట్రాక్ చుట్టూ ఓ అయిదు రౌండ్లు తిరిగి వెళ్ళిపోతారు. ఆవిడ వెళ్ళే సమాయానికి కాస్త అటూ ఇటూగా ఓ పెద్దాయన వస్తారు. ఈయన ప్రతీ రోజూ విష్ణు సహస్రనామం వింటూ/వినిపిస్తూ మెల్లిగా నడుస్తారు. ఇంకొక మధ్యవయసావిడ ఓ క్యాన్‌లో పాలు పోయించుకుని వచ్చి, పార్క్ బయట ఉన్న చెట్లనుంచి పూలు కోసుకుని వాటిని ఓ కవర్‌లో పెట్టుకుని ట్రాక్ చుట్టూ ఆరేడు సార్లు నడిచి వెళ్ళిపోతుంది. ఇంకో ముసలావిడ వస్తారు, బహుశా అరవై – అరవై ఐదేళ్ళు ఉంటాయేమో… వస్తూనే చెప్పులు ఓ పక్కగా విడిచి నెమ్మదిగా రెండు లేదా మూడు సార్లు ట్రాక్ చుట్టూ నడిచి ఓ రాతి బల్ల మీద కూర్చుంటారు. ఎవరైనా పరిచయస్థులు కనబడితే వాళ్ళు కొన్ని రౌండ్లు నడిచి వచ్చి, ఆమె పక్కన కూర్చున్నాక కబుర్లు చెప్పుకుంటారు.

ఓ ముసలాయన మంకీ క్యాప్ ధరించి వస్తారు. అతి నెమ్మదిగా ట్రాక్ చుట్టూ ఒకటి లేదా రెండు సార్లు తిరిగి, ఓ చెట్టు కింద స్థలంలోకి వెళ్ళి వ్యాయామం చేస్తారు… ఆయన వ్యాయామం చేసే తీరు భలే గమ్మత్తుగా ఉంటుంది. తలని అతి నెమ్మదిగా పైకీ, కిందకీ ఆడిస్తారు, అంతే నెమ్మదిగా పొట్టని ముందుకు తెస్తారు, ఇంకా నెమ్మదిగా కాళ్ళని కదిలిస్తారు. దూరం నుంచి చూస్తే ఆయనేం చేస్తున్నారో కూడా తెలియదు, చెట్టుకింద నిలబడ్డారేమోననిపిస్తుంది. వాకింగ్ చేస్తూ ఆయనకు దగ్గరగా వచ్చినప్పుడు మాత్రం ఆయన చేసే వ్యాయామం కనబడుతుంది. ఇంకో ఆయన వస్తారు, ఆయన నడవరు కానీ యోగా చేస్తారు. పార్క్‌లో షేడ్ ఉన్న చోట కూర్చుని భ్రామరి ప్రాణాయామం చేస్తుంటే… మొదట్లో నాకర్థమయ్యేది కాదు… ఆ సౌండ్ ఎక్కడి నుంచి వస్తోందో…. ఓ చిన్నపాటి సైరన్‌లా ఉంటుంది ఆయన చేసే ఆ ధ్వని! ఇంకో యువకుడు ఎక్కువగా కసరత్తులు చేస్తాడు. ఒక భంగిమ మాత్రం నవ్వు తెప్పిస్తుంది. చంద్రముఖి సినిమాలో ఓ ఫైట్‍లో రజనీకాంత్ తన కాలుని గుండ్రంగా తిప్పుతాడు… ఇతడు కూడా అదే మాదిరి తన కాలుని తిప్పుతాడు.

పార్క్ రెండు రోడ్లకి మధ్యన ఉండడంతోనూ, రెండు గేట్లు ఉండడంతోనూ ఈ గేట్ నుంచి ఆ గేట్‌ ద్వారా రెండో రోడ్డుకి వెళ్ళడానికి చాలామంది షార్ట్‌కట్‍లా ఉపయోగిస్తారు. ముఖ్యంగా పొద్దున్నే స్కూల్ బస్సు ఎక్కే కాన్వెంటు పిల్లలు, వాళ్ళని బస్సు ఎక్కించడానికొచ్చే తల్లులు…

ఇంకో ఆయన నడవరు, కూర్చుని వ్యాయామం చేస్తారు… చిన్నప్పుడు స్కూల్లో మా డ్రిల్ మాస్టారు చేయించినట్లుగా చేతులని వన్ టు అంటూ పైకి, క్రిందకి పక్కకి కదిలిస్తూంటారు. అయితే, చేతులని ఏటవాలుగా పెట్టి చేస్తుంటే ఆయన ‘బల్లే బల్లే’ అని పంజాబీ నృత్యం చేస్తున్నారేమోననిపిస్తుంది. ఈ కసరత్తులు పూర్తయ్యాక, కుడి చేతి చూపుడు వేలిని పైకెత్తి కాసేపు ఉంచుతారు, కూడళ్ళలోని ప్రముఖుల విగ్రహాల భంగిమలో!

రెండు మూడు రోజులు ఓ తండ్రీ కూతురు వచ్చారు. పాపం ఆ అమ్మాయి చిన్నదే కానీ బాగా లావుగా ఉంటుంది. ఆయన రెండు రౌండ్లు నడిచొచ్చేసరికి ఆ అమ్మాయి ఒక రౌండ్ పూర్తి చేస్తుంది. తండ్రి బలవంతం మీద వస్తున్నట్టు, తనకి ఏ మాత్రం ఆసక్తి లేనట్టు అనిపిస్తుంది ఆ అమ్మాయిని చూస్తే. తర్వాత వీళ్ళు రావడం మానేశారు.

ఒకావిడ రెండు పూటలా వస్తారు. ముఖంలో తీవ్రమైన మనో నిశ్చయం కనబడుతుంది – దేన్నో అధిగమించాలానో, లేక ఎవరికైనా సమాధానం చెప్పి తీరాలనో! దాదాపు ఇరవై రౌండ్లు నడుస్తారు. ఇంకొక ఆవిడ వస్తారు, ఎప్పుడు చూసినా మొహంలో ఏదో దిగులు… బహుశా పార్క్‌లో కూర్చున్న కాసేపయినా తన సమస్యలని బుర్రలోంచి పక్కకి నెట్టాలని ప్రయత్నిస్తుంటారేమోననిపిస్తుంది. కాని అంతగా విజయవంతమయినట్లు అనిపించదు.

నేను అందర్నీ గమనిస్తున్నట్టే నన్నూ కొందరు గమనిస్తారు. ఒకాయన సీమ జిల్లాలోని గ్రామీణ ప్రాంతం నుంచి ఇక్కడ కొడుకు దగ్గరకి వచ్చారట. చొక్కా లుంగీతో వస్తారు… నడవరు, రాతిబల్ల మీద కూర్చుని వాళ్ళ ఊరి వాళ్ళతో ఫోన్‌లో మాట్లాడుతూ ఉంటారు. వ్యవసాయ పనులు ఎలా ఉన్నాయో వాకబు చేస్తూంటారు. ఒకరోజు నేను తొందరగా వెళ్ళిపోతుంటే… ఆయన పలకరించారు, “ఈరోజు 25 రౌండ్లు నడవలేదు..” అంటూ. ఆరోజు నేను 20 రౌండ్లే తిరిగాను. వెళ్ళబోతున్నవాడిని ఆగి కాసేపు ఆయనతో మాట్లాడాను. ఆయనకీ నగరంలో ఉండడం ఇష్టం లేదు, ఆ పల్లెటూరు పట్ల మమకారం ఎక్కువ… అందుకే రోజూ ఉదయం ఆరింటి నుంచే అక్కడి వాళ్ళకి ఫోన్లు చేయడం మొదలుపెడతారు.

ఇంకో ఆయన ఉంటాడు… ఆయన సరిగ్గా ట్రాక్ మధ్యలో నడుస్తూ చేతులని అటూ ఇటూ బాగా ఊపుతూంటాడు. ఆయన ముందు నడుస్తుంటే… ఆయన్ని ఓవర్‌టేక్ చేయడం సాధ్యం కాదు. ఎవరైనా ప్రయత్నిస్తే ఆయన చేతులు తగిలే ప్రమాదం ఉంటుంది.

ఒకరోజు పొద్దున్నే ఒకతను చిన్న చిన్న కవర్లలో మొలకెత్తిన పెసలు, ఉడికించిన వేరుశనగలు, కీరా ముక్కలు అమ్మకానికి తెచ్చాడు. పెద్దగా ఏమీ అమ్ముడుపోలేదనుకుంటా… మళ్ళీ కనబడలేదు.

ఇక పార్కు చుట్టుపక్కలే నివాసం ఉండే నాలుగు కుక్కలు… వాటికి తోచినప్పుడు అవీ కూడా కొన్ని రౌండ్లు నడుస్తాయి… ఒకరోజు ఉదయం పూట ఓ కుక్కకి బాగా ఆకలేసినట్టుంది… పెద్ద పెద్ద ఆకులున్న ఓ మొక్క నుంచి మంచుకి తడిసిన ఓ రెండు ఆకులను కొరికి నమిలింది… రుచి నచ్చలేదేమో… కక్కేసింది!

ఆదివారాలు ఉదయం మరీ సందడిగా ఉంటుంది. చాలామంది తల్లిదండ్రులు చిన్నపిల్లల్ని తీసుకుని వస్తారు. పిల్లలు ఆటల్లో పడితే… ఒక పట్టాన కదలరు.. ఇంటికి వెళ్దామని అమ్మానాన్నలు బ్రతిమాలుకోవాల్సి వస్తుంది. ఓ చిన్నపాప… నాలుగేళ్ళుంటాయేమో… వాళ్ళ నాన్న ఇంటికి వెళ్దాం రామ్మా అంటే రానని, కాసేపు ఆడుకుంటానని మారాం చేసింది. ఆయనెక్కడికో బయటకు వెళ్ళాలనుకుంటా… వాచ్ చూసుకుంటూ తొందరపడుతున్నాడు. పాప మాత్రం ఇసుకలోంచి కదలదు. ఎత్తుకుని బలవంతంగా తీసుకువెళదామని ప్రయత్నిస్తే… ఆరున్నొక్క రాగం అందుకుంది… ఎంతకీ ఆపదు. వాళ్ళమ్మతో ఫోన్‌లో చెప్పించాడాయన… అయినా ఏడుపు మానలేదు, చేసేదేంలేక కిందికి దింపితే, ఆ పాప మళ్ళీ ఇసుకలోకి తుర్రుమంది. పిల్లలు ఎక్కువగా ఉండే ఈ సమయాల్లోనే బూరలమ్మేవాళ్ళూ, ఐస్‌క్రీమ్ అమ్మేవాళ్ళూ అక్కడే తచ్చాడుతారు.

సాయంత్రాలు:

సాయంత్రం అయిదు గంటల నుంచే పార్కులో హడావిడి మొదలవుతుంది. సాయంత్రం వాకింగ్‍కి వచ్చేవారు ఎక్కువగా ఆడవాళ్ళే ఉంటారు. కాలనీలో పార్కు చుట్టు పక్కన ఇళ్ళున్న వాళ్ళంతా వచ్చి పార్క్ మధ్యలో ఉన్న సిమెంట్ దిమ్మ మీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటారు, పిల్లలని ఆడిస్తారు. కొందరు ఫోన్‍లో పాటలు పెట్టుకుని వింటూ నడుస్తారు. మధ్యవయసు స్త్రీలు స్నేహితురాళ్ళతో ముగ్గురు ముగ్గురుగా కబుర్లు చెప్పుకుంటూ నడుస్తారు. ఇంటి సమస్యలు, ఆస్తులు, బంధువులు… పిల్లల చదువులు… అన్నీ చర్చనీయాంశాలే!

పిల్లలు ఇసుకలో ఆడతారు, గూళ్ళు కడతారు. దగ్గర్లోని మొక్కల పువ్వులు, ఆకులు కోసుకొచ్చి తమ గూళ్లకి అలంకారం చేస్తారు. కొంచెం పెద్ద పిల్లలు ఆ ఇసుకలో బాహుబలి, బల్లాలదేవ ఆట ఆడుతారు. కుస్తీలు పడతారు. కొంత మంది పిల్లలు వాకింగ్ ట్రాక్ మీదే సైకిళ్ళు తొక్కుతూ మా స్పీడ్‌కి బ్రేకులు వేస్తారు.

ఓ తండ్రి తన కొడుక్కి స్కేటింగ్ షూస్ కొన్నాడు. వాటితో స్కేటింగ్ ప్రాక్టీసు చేయిస్తాడు… పిల్లాడు ఎక్కడ పడిపోతాడో అని పాపం… ఆ అబ్బాయితో పాటు ఈయనా పరిగెడుతుంటారు. ఇద్దరు ముగ్గురు తండ్రులు తమ పిల్లలతో షటిల్ ఆడతారు.

గేటు దాటి పార్కులోకి ప్రవేశించాకా చాలామంది సవ్యదిశలో నడిస్తే, కొందరు అపసవ్యదిశలో నడుస్తారు… లోకోభిన్న రుచి!

ఓ యువతి తన చిన్నారి కూతురితో వస్తుంది… పాప ఆడుకుంటుంటే… ఆమె నాలుగైదుసార్లు ట్రాక్ చుట్టూ నడిచి, వెళ్ళి పిల్ల దగ్గర కూర్చుంటుంది. ఇద్దరు యువతులు చెవుల్లో యియర్ ఫోన్ పెట్టుకుని ఫోన్లో పాటలు పెట్టుకుని నడుస్తారు. వాళ్ళలో ఒక అమ్మాయి… తను వింటున్న పాటని పైకి పాడుతూ నడుస్తుంది. ఆమెని దాటి వెళ్తున్నప్పుడు ఆ పాటని ఆమె స్వరంలో మనమూ వినచ్చు.

ఇలా నడుస్తున్నప్పుడు ఒక్కోసారి నవ్వొచ్చే సంభాషణలు వినబడతాయి. ఒకతను నడుస్తూ ఫోన్ మాట్లాడుతూ, “అది కాదు బామ్మర్దీ, మీ అక్కకి అసలే షార్ట్ టెంపరేచర్, ఠక్కున కోపం వస్తుంది” అన్నాడు. నాలో నేను నవ్వుకుంటూ ఆయన్ని దాటాను.

ఒకరోజు ఒకతను వీయింగ్ మెషిన్ పట్టుకుని వచ్చాడు. “Lose weight now, ask me how” అన్న బాడ్జ్ పెట్టుకున్నాడు. ఆసక్తి ఉన్నవాళ్ళు ఉచితంగా తమ బరువు చూసుకోవచ్చని చెప్పి… తాను పని చేసే ఫిట్‍నెస్ సెంటర్ విజిటింగ్ కార్డులు పంచాడు. బరువు చూసుకోడానికి చాలా మందే ఉత్సాహం చూపించారు, ఇతను కూడా తర్వాత మళ్ళీ కనబడలేదు.

ఇంకో కుర్రాడు అప్పుడప్పుడు వస్తాడు, కొన్ని పాంప్లెట్లు పట్టుకుని – భువనగిరి దగ్గర ఓపెన్ ప్లాట్లు ఉన్నాయి, కొనుక్కోండి అని చెబుతుంటాడు.

ఓ యువకుడు అల్ట్రా మోడ్రన్‌గా తయారై వచ్చి జాగింగ్ చేస్తాడు. అన్నీ బ్రాండెడ్…వి ధరిస్తాడు. మణికట్టు దగ్గర ఏదో మిషన్ లాంటిది పెట్టుకుంటాడు. ప్రతీ ఐదు రౌండ్లకి ఒకసారి ఎంత క్యాలరీలు కరిగించాడో చెక్ చేసుకుంటూంటాడు, fitness freak లా అనిపిస్తాడు. బ్లూటూత్ ద్వారా మాట్లాడుతూ ఎవరికో చెప్తూంటాడు… ఇప్పటికి ఇన్ని క్యాలరీస్ కరిగాయని! అతని వేగానికి వాకర్స్ అడ్డొస్తున్నారని అనుకున్నాడో ఏమో, తర్వాత పార్క్‌కి రావడం మానేసి, కాలనీ ఇన్నర్ రోడ్లలో జాగింగ్ చేయసాగాడు.

ఓ ముసలావిడ చాలా జోవియల్‌గా ఉంటుంది. తమ కోడల్నీ, వియ్యపురాలిని అనుకరిస్తూ మాట్లాడి తనతో పాటు ఉన్నవాళ్లని నవ్విస్తుంది. ఓ నడివయసు జంట వస్తుంది. ఇద్దరూ కాసేపు నడిచి ఓ మూలగా కూర్చుని తమ కుటుంబ విషయాలు మాట్లాడుకుంటారు. ఆయన కొంచెం డల్‍గా అనిపిస్తూంటాడు, ఆవిడ కాన్ఫిడెంట్‍గా ఉంటుంది. వీళ్ళ మాటలేవీ నేను చాటుగా వినను… వాళ్ళు కాస్త బిగ్గరగానే మాట్లాడుకుంటారు.

ఇద్దరు యువకులు వస్తారు… నడవరు. బల్ల మీద కూర్చుని ఐటి రంగంలో అవకాశాలు, వస్తున్న మార్పుల గురించి మాట్లాడుకుంటారు. ఏదో కంప్యూటర్ కోర్సు చేస్తున్నట్టున్నారు.

నలుగురు రిటైర్డ్ ఉద్యోగులు ఉదయమూ సాయంత్రమూ వస్తారు. త్వరత్వరగా కొన్ని రౌండ్లు నడిచి ఓ రాతిబల్ల మీద కూర్చుంటారు… ఇంక చూడాలి… వాళ్ళ కబుర్లకి… మాట్లాడుకునే అంశాలకి కొదవే వుండదు… రాజకీయాలు, యుద్ధాలు, లంచాలు, ఉద్యమాలు, కులాంతర వివాహాలు, పరువు హత్యలు… ఎన్నో దొర్లుతాయి వాళ్ల మాటల్లో. వాళ్ళల్లో ఒకాయన యుట్యూబ్ నాలెజ్డ్‌ని, ఇంటర్‌నెట్ విజ్ఞానాన్ని అందరికీ పంచుతాడు. ఇంకో ఆయన శాస్త్రాలు, ఉపనిషత్తుల గురించి ఉపన్యసిస్తాడు.

ఒకావిడ రోజు సాయంత్రం చక్కగా ఇస్త్రీ చేసిన కాటన్ చీర కట్టుకుని వచ్చి వాకింగ్ చేస్తుంది. చాలా డిగ్నిఫైడ్‍గా ఉంటుంది. పార్కుని ఆనుకుని ఉన్న ఓ ఇంట్లో మొదటి అంతస్తులో ఉండే కుటుంబంలోని ఒకావిడ సాయంత్రం బాల్కనీలో కుర్చీ వేసుకుని కూర్చుని నడిచేవాళ్ళని చూస్తూ ‘విండో వాకింగ్’ చేస్తుంది.

పగటి ప్రకృతిది ఒక అందమైతే, సాయంత్రం ప్రకృతిది మరో రకం సౌందర్యం! అరుణవర్ణంలోని ఆకాశం క్రమంగా నలుపుదేఱుతుంటే అందరూ ఇళ్ళకి చేరుతారు.

ఇలా రెండు పూటలా పార్క్‌కి వచ్చి పొద్దున్న ఓ గంట, సాయంత్రం ఓ గంట నడవడం నాకు వ్యసనంగా మారిపోయింది. బరువు ఎంత తగ్గుతానో ఏమో తెలియదు గానీ… పొద్దున్నా సాయంత్రం నడుస్తూ ఇంతమంది జనాలని చూడడం… కొందరి ముఖాలలో నవ్వు, కొందరి మొహాలలో ధైర్యం, కొందరి పట్టుదల, కొందరి ఆశ చూస్తుంటే జీవితం పట్ల కొత్త ఉత్సాహం కలుగుతుంది. Viva la zindagee!

Exit mobile version