నడకలు నవ్వాలి

0
2

[dropcap]ర[/dropcap]హదారి మీద రక్తపు ముద్రలు
పురుగు పంజాకు భయపడు పాదాలవి
కాలే పేగు కోసం పేగు బంధాన్ని వదలి
ఊరు దాటిన వలసలు తిరోగమనంలో

నలిగిన రెక్కల బలహీనంలో
నలగని ఆశయపు ఉత్తేజం
అక్కడక్కడ మానవత్వపు గుండెలు
గుండిగలతో అందిస్తున్న ఆహారం

అలుపు లేని పయనంలో ఆకలిచావులెన్నో
రాలిన తల్లి కొంగులాగే పసికూన
ఎండకు వాలిన మొగ్గకోసం కన్నప్రేగులు
కష్టాన్ని భరిస్తూ సాగుతున్న కాళ్ళు

పట్టు వదలని విక్రమార్కులలా
నేల పగుళ్ళకు తలవంచని నేలబిడ్డలలా
లక్ష్య ఛేదనలో ఆదర్శంగా
రహదారిన నడచిపోతున్నాయి

పుట్టిన గడ్డకు చేరి పులకించి
పుడమిని దున్ని పంట పండిస్తే
వలసలెందుకిక తల్లి ఒడి ఉండగ
పల్లె బంధాన బ్రతుకంతా పండుగ

దూరపు కొండల బండల మాడక
కన్న నేలన కలుపు తీసి దుక్కి దున్ని
నవరత్నాలను పండించండి
పల్లె నవ్వులలో నడకల నవ్వుల జతచేయండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here