నది దోచుకుపోతున్న పడవ

0
2

[dropcap]అం[/dropcap]తవరకు నేలమీద నడచిన మనిషి
నీటిమీద అడుగు పెట్టగానే
మనసులో ఏదో ఆనందం
గాలిలో తేలుతున్నట్టు ఏదో అనుభూతి
నీటి బుడగల్లాంటి అలలమీద
నీరెండ కిరణాలు పడగానే
జలతారు తివాచీ పరచినట్టు
పగలే వెన్నెల కురిసినట్టు
పచ్చని ప్రకృతి మనతో నడిచినట్టు
నది మధ్య పడవ ప్రయాణం
పడవలు తిరిగితేనే నది జలకాలాడేది
ఒక్కొక్క పడవ నది ఒడ్డున ఒరుసుకుపోయి
జనం కోసం ఎదురుచూస్తుంది
మనుషుల జాడలో పడవ పయనిస్తుంది
పడవను తోసుకుంటూ నది పారుతుందో
నదిని చీల్చుకుంటూ పడవ సాగుతుందో
పక్కనున్న నీడల్లాంటి చెట్లనడగాలి
ఒకసారి తీరం దాటిందంటే పడవకు పట్టపగ్గాలుండవు
దూరాలు దాటుకుంటూ నది ముందుకు సాగుతుంది
చుట్టు నీళ్ళుతప్ప మరేదీ కనబడని చోట
మనిషి అవ్యక్తానందంలోకి వెళ్ళిపోతాడు
నీళ్ళను తాగి తాగి అలసిపోయిన పడవ
లంగరేసి నదీముఖద్వారంలో ఆగుతుంది
సముద్రాన పొంచిఉన్న రాకాసి అలలను చూసి
పడవ మౌనంగా ఉండిపోతుంది
ఎన్ని నదులు కలిస్తే సముద్రమయ్యిందో
అనంత బాహువులు చాపి సముద్రం నదిని ఆహ్వానిస్తుంది
పడవ నదిని మోసుకుంటూ సముద్రంలోకి దూకింది
నది సముద్రం ఇప్పుడు పడవమీద స్వారీ చేస్తున్నాయి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here