నడిచే చెట్లు

1
2

[box type=’note’ fontsize=’16’] పిల్లలన్నా, వారితో సావాసం చేయటమన్నా నాకెంతో ఇష్టం. తరగతి గదిలో, ఆటస్థలంలో, ఇంట్లో, ఎక్కడైనా సరే పిల్లల ఆటపాటలు ఉంటే సందడే సందడి. ఆ సందడి నాకెంతో ఇష్టం. ఉమయవన్ తమిళంలో రాసిన ‘పరక్కుమ్ యానై’ కథలు చదివిన తరువాత అవి బాగా నచ్చి వాటిని మన తెలుగు పిల్లలకు దగ్గరచేయాలనే ఉద్దేశ్యంతో తెలుగులోకి అనువదించాను. అందులోని కథలే మీరిప్పుడు చదువుతున్నది! – రచయిత్రి (అనువాదకురాలు)

~ ~

పన్నెండేళ్ల లోపు పిల్లలకు ఈ పది కథలూ చాలా సరదాగా అనిపిస్తాయి. వీటిలో కల్పన ఉన్నా, పర్యావరణ స్పృహ, సమాజం పట్ల బాధ్యత అంతర్లీనంగా ఉన్నాయి. ఇవి నీతిని బోధించే కథలు కావు. గంభీరంగా ఉండవు. కాని, చిన్న చిన్న అంశాలతోనే ఎంతో పెద్ద విషయాన్ని పిల్లలకు అర్థమయేట్లుగా, వారు పాటించేటట్లుగా బోధపరుస్తాయి. అదే వీటి విలక్షణత. [/box] 

[dropcap]అ[/dropcap]నగనగా ఒక పెద్ద గ్రామం. ఆ పెద్ద గ్రామంలో ఒక చిన్న చెట్టు. ఆ చిన్న చెట్టు గుండెలో ఒక తీవ్రమైన కోరిక. ఆ కోరికను తన తల్లికి చెప్పాలి అనుకునేవాడు కాని పాపం అటువంటి అవకాశం వాడికి ఇంతవరకూ దొరకనే లేదు. నిజానికి ఆ చిన్న చెట్టు ఎప్పుడూ నవ్వుతూ తుళ్ళుతూ హుషారుగా ఉండే స్వభావం కలవాడు. కాని ఈ రోజు వాడు ఎంతో బాధతో, దుఃఖంతో, తేడాగా కనిపించసాగాడు. వాళ్ళ అమ్మ ఈ సంగతి గమనించింది. ఎంతో ప్రేమగా తన బిడ్డను చేరి, “ఎందుకిలా దీనంగా కనిపిస్తున్నావు?” అని అడిగింది. వెంటనే చిన్న చెట్టు “అమ్మా! నా గుండెలో ఒక తీవ్రమైన కోరిక ఉన్నది. అది నీతో పంచుకోవాలి” అన్నది. తన బిడ్డ మనసులో ఉన్న ఆ తీవ్రమైన కోరిక ఏమిటో తెలుసుకోవాలన్న కుతూహలంతో తల్లి చెట్టు ఇలా అన్నది – “చెప్పమ్మా, నీ కోరిక ఏమిటో చెప్పు! అది తీర్చడానికి ఏమి చేయాలన్నా నేను సిద్ధమే!  చెప్పు నాన్నా”.  అప్పుడు చిన్న చెట్టు ఎంతో సంబరంగా, “అమ్మా! నాకు మనుషుల లాగా నడవాలని తీవ్రమైన కోరిక ఉన్నది” అని చెప్పి తల్లి కళ్ళలోకి చూస్తూ, “చెప్పమ్మా! నువ్వు నా కోరిక తీరేందుకు సహాయం చేస్తావా?” అని అడిగాడు ఎంతో అమాయకంగా!

తన బిడ్డ కోరిక విన్న తల్లి చెట్టు నిర్ఘాంతపోయింది. కాని తన తొట్రుపాటును వాడు గమనించకుండా ఉండాలని ఆలోచన చేస్తున్నట్లు అలా ఉండిపోయింది. అసాధ్యమైన కోరిక కోరాడు. ఏదేమైనా తల్లి చెట్టు చిన్న చెట్టు కోరిక తీర్చాలి అని నిర్ణయించుకున్నది. తన బిడ్డను ఆనందంగా ఉంచాలి అన్నదే ఆమె ధ్యేయం, ఇప్పుడు. “చెట్లు నడవడమన్నది అసాధ్యం నాయనా. ఊహకైనా అందని విషయం. చెట్లు అలా ఒక చోటి నుండి కదిలి మరొక చోటికి చేరుకోవటం అన్నది ప్రకృతి విరుద్ధం కూడ!” అని తల్లి చెట్టు నచ్చజెప్ప జూసింది.

కాని చిన్న చెట్టు ఎంత మాత్రం ఆమె మాటలను వినిపించుకోలేదు. ఎలాగైనా తాను నడవాలని, నడిస్తే ఎలా ఉంటుందో తనకు తెలియాల్సిందేనని పట్టుబట్టాడు. తల్లి చెట్టు కొంతసేపు మౌనంగా ఉండిపోయింది. తరువాత ఆమె ఇలా అన్నది- “చూడు నాయనా! మనుషులకు  పాదాలు ఉన్నట్లే మనకు వ్రేళ్లు ఉంటాయి. మానవుల పాదాలేమో నేలకు అంటుకొని ఉండవు కాని మనం అలా కాదు, నేల నుండి విడిపడి కదలలేము! అయితే, మన వ్రేళ్ళు నేలలో గట్టిగా పాదుకొని లోపలకి, చుట్టుపక్కలకు విస్తరించి ఉంటాయి కదా. అదే మన నడక అనమాట.”

తల్లి ఇంత చెప్పినా చిన్న చెట్టుకు తృప్తి కలగలేదు. మనుషులలాగా నడవాలనే తన ఒకే ఒక కోరిక అసాధ్యం అనేటప్పటికి తనను ఎవరూ సముదాయించలేనంత గట్టిగా ఏడవసాగాడు. ఇంతలో హఠాత్తుగా వాడి దగ్గరకి ఒక వనదేవత వచ్చింది. “ఎందుకేడుస్తున్నావు చిన్న చెట్టూ” అని అడిగింది. వాడు తన కోరిక చెప్పాడు. వనదేవత నవ్వుతూ “ఓస్ ఇంతేనా? ఏడవకు…ఏడవకు… నేను నీ కోరిక తీరేలా చేస్తాను. నువ్వు ఒక్కడివే కాదు, నీ తోటి చెట్లన్నీ కూడ ఈ గ్రామం నుండి ఎక్కడికైనా వెళ్ళవచ్చు, మళ్లీ రావచ్చు” అంటూ ఆశీర్వదించింది. వనదేవత ఇచ్చిన ఆ వరంతో గ్రామంలోని చెట్లన్నీ చెప్పలేని ఆనందాన్ని పొందాయి.

చిన్న చెట్టు ఆపుకోలేని ఆశ్చర్యంతో అటూ ఇటూ, ఇటూ అటూ పరుగెత్తడం మొదలుపెట్టాడు. ఎన్నాళ్లనుంచో తీరని తన తీవ్రమైన కోరిక, కల ఇలా నిజం కావడంతో వాడి ఆనందానికి అవధులు లేవు. అలా కొంతసేపు పరుగులు పెట్టాక చిన్న చెట్టు గ్రామంలోని చెట్లన్నిటినీ పిలిచి ఒక సమావేశం జరపాలనుకున్నాడు. కొద్దిసేపటిలోనే గ్రామంలోని చెట్లన్నీ అక్కడకు చేరుకున్నాయి. ఆ చెట్లన్నీ అలా గుమిగూడగానే చిన్న చెట్టు ఇలా చెప్పింది – “మనమందరం వెంటనే ఈ గ్రామం వదిలిపెట్టి అడవికి వెళ్లిపోయి అక్కడ స్థిర నివాసం చేద్దాం సరేనా?” ఆ మాటలు వింటూనే చెట్లన్నీ తమ అంగీకారాన్ని తెలియజేశాయి. వెంటనే అవన్నీ ఆ గ్రామాన్ని వదిలి అడవికి చేరుకోవాలని నిర్ణయించుకున్నాయి.

గ్రామంలోని చెట్ల మీద నివాసముంటున్న మధురమైన పాటలు పాడే పక్షులన్నీ సాయంకాలం గూళ్ళకు చేరుకుందామని వస్తూ ఉన్నాయి. అయితే తమ గూళ్ళు కాని, తాము పెట్టిన గ్రుడ్లు కాని, పొదిగిన పిట్టలు కాని ఏవీ కనబడక పోవడంతో ఆ పక్షులన్నీ ఎంతో ఆదుర్దాతో, గాభరా పడుతూ చెట్ల కోసం వెతకసాగాయి! మరునాడు తెల్లవారుతూనే గ్రామస్థులు తమ గ్రామంలో ఒక్క చెట్టు కూడా లేకపోవడంతో దిగ్భ్రాంతి చెందారు. కలప, కట్టెల కోసం చెట్లు నరికేవాళ్లు కూడా ఖాళీగా ఉన్న గ్రామాన్ని చూసి నోట మాట లేకుండా నిలబడిపోయారు. చెట్లు లేని ఆ ప్రదేశంలో గాలి వీచడం కాని, నీడ గాని లేవు. విపరీతమైన వేడితో ఆ ప్రాంతమంతా మాడిపోతూ ఉంది. అసలు చెట్లు లేని జీవితం ఊహకైనా అందుతుందా? వాళ్ళు తమ శ్వాసక్రియను ఎలా చేయాలో అంతుపట్టక అల్లాడుతున్నారు.

గ్రామస్థులంతా మాయమైపోయిన చెట్ల కోసం వెదుకుతూ ఉన్న సమయంలోనే అటుగా ఒక చిలుకమ్మ ఎగురుతూ వచ్చింది. అక్కడ ఉన్న ఒక చిన్న పిల్లవాడి చెవిలో ఏదో గుసగుసగా చెప్పి చిలకమ్మ వేగంగా వెళ్ళిపోయింది. ఆ పిల్లవాడు తన స్నేహితులందరినీ పిలిచి ఆ చిలుకమ్మని వాళ్ళందరితో కలసి పరుగుతీస్తూ వవెంబడించాడు. పరుగెత్తుతున్న పిల్లల వెనుకనే పెద్దలందరూ కూడా పరుగు తీస్తూ తీస్తూ తమకు తెలియకుండానే కొద్దిసేపటిలోనే తాము వెతుకుతున్న మాయమైపోయిన చెట్ల మధ్యకు చేరారు.

‘అసలు ఈ చెట్లు తమ గ్రామాన్ని వదిలి ఈ అడవికి ఎలా వచ్చాయి?’ – అందరు పిల్లల మనస్సులలో మెదలుతున్న ప్రశ్న ఇదే! వారికి ఏమీ అంతుబట్టడం లేదు. ఒక చిన్న బాలిక తన కుతూహలాన్ని దాచుకోలేక ఒక చెట్టుని సమీపించి “మీరందరూ మా గ్రామం వదిలి ఎందుకిలా వచ్చేశారు?” అని అడిగేసింది. “మీరు లేకపోతే మాకు గాలి లేదు, ఆడుకునేందుకు చల్లని నీడ ఉన్న చోటు లేదు. అసలు మీరు లేకపోతే మాకు ఎంత మాత్రం బాగా లేదు; మీరు మళ్ళా మా గ్రామానికి వచ్చేయండి” అని ఎంతో ఆర్తిగా అడిగింది ఆ పాప.

చెట్లు ఒక్క క్షణం ఏమీ జవాబు ఇవ్వకుండా మౌనంగా ఉండిపోయాయి. అప్పుడు మన చిన్న చెట్టు ఇలా చెప్పసాగాడు – “మేము మీ గ్రామంలో మా జీవితం కొనసాగించడానికి సరైన కారణం ఒక్కటి కూడా కనిపించడం లేదు. మీరంతా మా చెట్లన్నిటినీ ఎంతో ద్రోహబుద్ధితో వాడుకున్నారు. మా ముందు తరాల చెట్లు ఇక్కడ ఒక్కటి కూడా లేవు, అవునా? అందుకే మేమందరము మీ గ్రామం వదిలి ఇలా అడవికి వచ్చి వేరుగా జీవించాలని నిర్ణయించుకున్నాము. ఇక మళ్ళీ మీ గ్రామానికి తిరిగి వచ్చే ఆలోచన మాకు లేదు గాక లేదు. మీరంతా మూర్ఖులు. మీకసలు బుద్ధి లేదు. ఎందుకో చెబుతాను వినండి. మేము ఎప్పుడూ మీకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతూనే  ఉన్నాము. మీకు మేము చల్లని నీడను ఇచ్చాము. పిల్లలు ఆటలు ఆడుకునేందుకు మా నీడన ఎంతో స్థలాన్ని ఇచ్చాము. ఎందరో తల్లులు మా కొమ్మలకు తమ చీరలతో పసిపాపలకు ఉయ్యాలలు ఏర్పాటు చేసి చక్కగా చల్లని గాలిలో తమ బిడ్డలను ఉయ్యాలలూపుకుంటూ ఆనందిస్తున్నారు. మా వలన మీకు వర్షాలు విరివిగా కురుస్తున్నాయి. మా శరీరంలోని అన్ని భాగాలూ మీకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి కదా! మా ఆకులు, పండ్లు, పూలు, వ్రేళ్ళు, కాండం – ఏది కాదో చెప్పండి!? మరిన్ని చెట్లు నాటి పెంచవలసిన మీరు ఎప్పుడూ మమ్మల్ని నరికి నాశనం చేయడమే మీ ధ్యేయంగా జీవిస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే ఒక రోజున చెట్టు అన్నదే లేకుండా మా జాతి అంతరించి పోతుంది. ఇక చెట్టు అంటే ఏమిటో మీరు పుస్తకాలలో చదివి తెలుసుకోవడమే గాని మమ్మల్ని  చూడలేరు సుమా. మాపై గూళ్లు కట్టుకుని నివసించే పక్షులు చూడండి – ఎంతో కృతజ్ఞతా భావంతో మా పండ్లలోని విత్తనాలను అందినంత దూరం తీసుకు వెళ్లి మా జాతి వ్యాపించి విస్తరించడానికి ఎంతగానో తోడ్పడుతున్నాయి. మీ స్వార్థం కోసం, మీ అవసరాల కోసం మమ్మల్ని గొడ్డలితో నరికి నాశనం చేయడం తప్ప మీరు మాకు ఏమి చేస్తున్నారు? ఇప్పుడైనా అర్థమైందా! ప్రపంచంలో చాలా కొద్ది చెట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి.  ఎక్కడ చూసినా కరవులు, కాటకాలు! కనుక మీకందరికీ ఒక విషయం మనవి చేస్తున్నాను. మా నిర్ణయాన్ని గౌరవించండి. మమ్మల్ని మళ్ళీ వెనుకకు రమ్మని బలవంతపెట్టకండి”.

చిన్న చెట్టు మాటలు విన్న గ్రామస్థులంతా నోటి వెంట మాట లేకుండా నిశ్చేష్ఠులై ఉండిపోయారు. అలా కొంతసేపు అక్కడంతా మౌనమే అలముకున్నది. కాసేపటికి ఆ చిన్నపాప చెట్లతో గ్రామస్థులందరూ తమ తప్పును గ్రహించారని చెప్పింది. తన స్నేహితులందరి తరఫున ఆమె చెట్లతో ఇలా చెప్పింది – “ఇక నుండి మా పిల్లలమందరమూ చెట్లను ఎంతో శ్రద్ధగా చూసుకుంటాము. మీ బాగోగుల బాధ్యత మేము నూటికి నూరుశాతం వహిస్తాము.” అది విని గ్రామంలోని పెద్దలందరూ తమ తప్పును గ్రహించామన్నట్లు తలలూపారు. వారి చిన్నతనంలో కూడా తమ గ్రామంలో ప్రతి ఇంటి చుట్టూ ఎన్నెన్ని చెట్లు ఉండేవో, ఎంత మైదానం ఉండేదో! ఈ రోజు అవన్నీ ఇలా ఒక్కసారిగా ఎందుకు మాయమైనాయో వాళ్ళు పూర్తిగా అర్థం చేసుకున్నారు. తమ పొరపాటును సరిచేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

గ్రామంలోని పెద్దలందరూ ఒక్కొక్కరుగా ముందుకు వచ్చి మనస్ఫూర్తిగా చెట్లను క్షమాపణలు కోరుకున్నారు. తమ పెద్దలంతా ఇంత విచారంగా ఉండడం పిల్లలందరికీ ఎంతో దిగ్భ్రమ కలిగించింది. అయితే చెట్లను వాళ్ళు  క్షమించమని అడగడం, తమ తప్పు తాము గ్రహించడం చూసి ఎంతో సంతోషంగా కూడా అనిపించింది. అంతే! ఒక్కసారిగా పిల్లలంతా కూడా పెద్దవాళ్లతో కలిసి చెట్లకు క్షమాపణలు చెప్పారు. అంతే కాదు! గ్రామానికి తిరిగి వెళ్ళగానే ‘మేమందరం ఒక్కొక్కరం ఒక్కొక్క మొక్కను నాటుతాం’ అంటూ చెట్లకు వాగ్దానం చేశారు.

వాళ్ళందరూ అలా తమ తప్పు తెలుసుకొని క్షమాభిక్ష కోరడంతో చెట్లు కూడా తమ మనసులకు సర్దిచెప్పుకొని  గ్రామస్థులతో, వారి పిల్లలతో కలిసి గ్రామానికి తిరిగి వెళ్లేందుకు ఒప్పుకున్నాయి. పక్షులు కూడా చెట్లు గ్రామానికి తిరిగి రావడం చూసి ఎంతగానో సంతోషం ప్రదర్శించాయి. ఈ సమస్యను చిన్న చెట్టు ఎంత ధైర్యంగా, తెలివిగా, సమర్థవంతంగా పరిష్కరించిందో గమనించి పెద్ద పెద్ద చెట్లన్నీ తమ తిరుగు ప్రయాణ సమయంలో వాడిని ప్రశంసలతో ముంచెత్తాయి.

మూలం: ఉమయవన్ రామసామి

తెలుగు: వల్లూరు లీలావతి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here