మంచి బాటలో నడిపే చైతన్య గీతిక ‘నడిచొచ్చిన దారంతా..’

0
3

[డా. పాతూరి అన్నపూర్ణ రచించిన ‘నడిచొచ్చిన దారంతా..’ అనే పుస్తకాన్ని సమీక్షిస్తున్నారు శ్రీ చలపాక ప్రకాష్‌.]

[dropcap]డా. [/dropcap]పాతూరి అన్నపూర్ణ గారు గతంలో మూడు కవిత సంపుటాలు, రెండు నాని సంపుటాలు, ఒక కథ సంపుటి వెలువరిచారు. ఇప్పుడు తాజాగా ‘నడిచొచ్చిన దారంతా’ పేరుతో కవితా సంపుటి విలువరించి, నడిచొచ్చిన కాలం నాటి దారి గుర్తులు వెనక్కి తిరిగి చూపిస్తున్నారు.

ముఖచిత్రమే పాఠకుడ్ని ఆకర్షణీయంగా ఆకట్టుకుంటే.. గతంలోని కవితా సంపుటుల కంటే పరిణతి చెందిన కవిత్వం ఇందులో కనిపిస్తోంది. కొన్నిచోట్ల కవిత్వం ఏరులై పారితే.. కొన్నిచోట్ల పాత పాదముద్రల్ని ముద్దముద్దగా  గుర్తు చేస్తాయి.

80 కవితలు ఉన్న ఈ సంపుటిలో.. కరోనాంశంగా కొన్ని కవితలు.. ఆ కాలంలోనే పరిస్థితుల్ని కళ్ళకు కట్టాయి. అందులో ‘కొత్త విత్తులు నాటుకుంటూ’ శీర్షికలో “టీవీలో ఏ ఛానల్ చూస్తున్నా/అవే మరణ మృదంగ ధ్వనులు/ ఏ దినపత్రిక చదివినా/అవే వార్తల మారణ హోమాలు/అందరి కోసం ప్రార్థిస్తూ/వారందరూ బాగుండాలని కోరుకోవడం తప్ప/ఏం చేయలేని నిస్సహాయత/.. ఎంత కఠినమైన కాలాన్ని మోస్తున్నాము/పదిమందిని కలిసి మనసారా మాట్లాడుకుని/ఎన్నాళ్ళయ్యింది’’ అని ఆ కాలంలో ప్రతి మనిషి అనుభవించిన పరిస్థితుల్ని కవిత్వీకరించారు.

‘బతకడం అంటే’ శీర్షికలో “నాకేం కాదు! నన్నెవరూ ఏం చేయలేరు!/అంటూ విర్రవీగావు/పర్యావరణాన్ని కాలుష్యంతో నింపావు/ప్రకృతి నీపై కన్నెర్ర చేసింది/మహమ్మారిగా మారి నిన్ను మట్టు పెడుతున్నది/పీల్చేందుకు గాలి కూడా దొరకని స్థితిలో/ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని/పరుగులు తీస్తున్నావు../గతం నేర్పిన పాఠాలను/మళ్లీ మళ్లీ చదువుకోవాలి..’’ అంటూ కరోనా కాలంలో నడిచొచ్చిన దారిని.. గుర్తు చేస్తూ మనిషి ఎలా బతకాలో దిశా నిర్దేశం చేశారు కవయిత్రి.

‘ఓ ఇంటి కథ’ కవితలో – ఒకప్పుడు ఇంటి వాతావరణం ఎలా ఉండేదో తెలియజేస్తూ.. ఇప్పుడు ఎలా ఉందో చెప్పే తీరు హృదయాన్ని ద్రవిస్తోంది. “పండుగలకు గుమ్మాలన్నీ ముస్తాబయి/పెళ్లి కళతో పరిమళభరితమయ్యేవి/విందు భోజనాల సందడితో/ఇల్లంతా సరదాల దసరాలా ఉండేది/ఇంటి పెద్దల కళ్ళలో ఆనంద చెమరింపులు/దీపాల కాంతుల వెలుగులయ్యేవి/కాలం పరుగులలో ఇల్లు మారిపోయింది/అమ్మానాన్నలను ఇంటికి అంకితం చేసి/పిల్లలు తలా ఒక దిక్కుకు పక్షుల్లా ఎగిరిపోయారు/ఏటికేడు పెరిగిన వయోభారంతో/ఇంటి మూల స్తంభాలు విరిగిపోయాయి/ఖాళీ అయిన ఇంటి లోపల/జ్ఞాపకాలు నింపుకున్న గదులు మాత్రం మిగిలాయి” ఇది ప్రపంచీకరణ వ్యామోహంలో.. నాలుగు డబ్బులు వెనకేసుకునేందుకు పడుతున్న వెంపర్లాటలో.. తెలుగు నేలపై కుటుంబాలు ఎలా ఒంటరి అయిపోతున్నాయో అద్భుతంగా చెప్పారు ఓ ఇంటి కథగా.

దృశ్యం చేసే అద్భుతాలను ‘దృశ్యం’ శీర్షికన వలవేసి పట్టి చూపారు- “బాల్యం నుండి వృద్ధాప్యం వరకు/అనుభవించిన సమయాన్నీ దృశ్యాలుగా మారి/జ్ఞాపకాలుగా చర్విత చర్వనం అవుతాయి/..దృశ్యం కావ్యం లాంటిది/బతికినంతకాలం కళ్ళ వేదికపై/ఎన్నో ఆవిష్కరం జరుగుతుంటాయి/అంతం లేని ఈ దృశ్యాల ఆగమనం/జీవితాంతం మనిషికి అనుభూతిని ఇస్తుందని/రెప్పల వెనుక స్వప్న ఎన్నో చెప్తాయి”.

ఇలా అనేక శీర్షికలలో స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలపై, కాలుతున్న మానవ సంబంధాలపై.. మనిషి మనిషిని స్పర్శించేందుకు రాని చేతుల దుర్భర సమయాలపై.. అనేక అనేక కవితలు ఇందులో చదివి ఆలోచింపచేస్తాయి. నడిచి వచ్చిన దారంతా అనేక జ్ఞాపకాల.. ఆనందాల.. విషాద భరిత పాదముద్రల కలయికే పెనవేసుకొని ఉంటాయి. మంచిని పెంపొందించేవి కొన్నైతే.. చెడు ఏ విధంగా ఎక్కువ శాతంలో ఉండి వినాశనాలకు దారితీస్తుందో తెలుసుకొని.. భవిష్యత్ కాలంలో మంచి బాటలో నడిచేందుకు.. ఏర్పరచుకునేందుకు ఈ కవితా సంపుటి ఒక చైతన్య కవితా గీతికగా ని(పి)లుస్తుంది.

***

నడిచొచ్చిన దారంతా.. (కవితా సంపుటి)
రచన: డాక్టర్ పాతూరి అన్నపూర్ణ,
పుటలు: 142,
వెల: ₹ 200/-,
కాపీలకు: డాక్టర్ పాతూరి అన్నపూర్ణ,
1156-28-1, ప్రశాంతి నగర్, నవలాకుల గార్డెన్,
నెల్లూరు-524002
మొబైల్: 9490230939
ఈమెయిల్: annapurnapaturi2014@gmail.com

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here