Site icon Sanchika

నాగశైలజ మినీ కవితలు

  1. కరవు

నిండు తటాకాన్ని తలపిస్తూ
జీవనదిలా
నిత్యం ప్రవహించే
‘ఆమె’ కళ్ళకు
ఎప్పుడూ కరవు రాదేమో!

  1. వెయిట్ లిఫ్టర్

భార్య
గొప్ప వెయిట్ లిఫ్టర్
మగాడు
మెడలో
‘పోగుముడి’తో
టన్నుల కొద్దీ
సంసారభారాన్ని
క్షణం కూడా తీరికలేకుండా
అవలీలగా మోసేస్తూ…..

  1. ఆవిడకూ…

నెత్తిమీద
గంగ
శివుడికే కాదు
‘ఆవిడ’ కూ…..

  1. ఏడు(పు) నదులు

ఏ మేధావి శెలవిచ్చాడో గానీ
దేశంలో
జీవనదులు ఏడేనని
గుర్తించలేదు కాబోలు
ఎన్నటికీ తడి ఆరక
ఎప్పటికీ పొడిబారక
నిరంతరం(క) నీళ్ళూరే
కోట్లాది ఆడవాళ్ళ కళ్ళని

  1. బంధం

ఆమె
మెడలో
పోగుబంధంతో
‘ఆలి’గా
ఒడిలో
పేగుబంధంతో
తల్లిగా.

  1. నిజం గ్రహిస్తే

అతడు
‘ఆమె’ ను
అవనిలో కాక
ఏకంగా ఆకాశంలోనే సగం అంటే
అమాయకురాలు కాబట్టి
అంబరాన్నంటిన సంబరంతో
ఊప్పొంగిపోతోంది కానీ…
ఆకాశం అంటే
అంతా ‘శూన్యమే ‘ ననే అసలు నిజం
మగాడి దగా నైజం తెలిస్తే
అడుగు మట్టానికి
కృంగిపోతుందేమో!

  1. కో(రి)క

కట్టు ‘కోక’ ముందు
చీర బరువు
కేవలం అరకేజీ మాత్రమే
అదేం చిత్రమో!
ఒంటికి చుట్టుకుని
బజార్లో పట్టుమని పదడుగులేసిన ప్రతి సా(శా)రీ
దాని బరువు
అమాంతంగా పెరిగి
అరభై కేజీలవుతుంటుంది,
పదేళ్ళ పిల్లాడినుండీ
పండు ముసలాడిదాకా
ఆశగా.. ఆబగా… చూసే
అందరి కో(రి) క చూపులూ
దానికే అతుక్కుంటాయ్ మరి
ఒళ్ళు దాచే  చీరనంటుకునే
పరాయి కళ్ళ గబ్బునీ
మృగాళ్ళ కుళ్ళు జబ్బునీ
ఏ సబ్బుతో ఉతికి
నురగలో అద్ది
అరగదీయాలో?

  1. రంగు మారితే

మూరన్నర పొడవు వుండే
నూలు దారం ఖరీదు
కేవలం పావలా మాత్రమే
కానీ, రంగు మారి
పసు(లు)పు తాడుగా
పడతి మెడలో పడాలంటే మాత్రం
దాని ఖరీదు లక్షలకు పెరిగి
ఒక్కసారిగా ఒరిగి
కన్యాదాత వెన్నుపై విరిగిపడుతుంది

Exit mobile version