[డా. మధు చిత్తర్వు రచించిన ‘నగరంలో మరమానవి 11’ అనే సైన్స్ ఫిక్షన్ కథని పాఠకులకి అందిస్తున్నాము.]
ప్రతి సంఘటనకీ కారణం ఉంటుంది
[dropcap]E[/dropcap]verything is connected.
ప్రతి సంఘటనకీ కారణం ఉంటుంది.
ఆ రోజు సాయంత్రం చీకటి పడే వేళ జంట నగరాల ఆకాశంలో ఎవరూ గమనించని ఒక వింత జరిగింది.
ఒక ధూళి మేఘం లాంటిది ఆకాశంలో వలయాలుగా తిరుగుతూ పడమటి నున్న సూర్యాస్తమయపు ఎరుపులో ఒక నల్లటి నీడలా ఎగురుకుంటూ వస్తోంది.
పరిశీలనగా చూస్తే తప్ప అది ఒక విలక్షణమైన దృశ్యంగా ఎవరూ అనుకోరు.
ఒక నల్లటి మబ్బు తునక అనుకుంటారు లేక ఏ ఫ్యాక్టరీలో నుంచో వచ్చిన పొగ వలయాలుగా తిరుగుతోంది అనుకుంటారు.
అది నగరంలో దీపాలు వెలిగే సమయానికి చిన్న చిన్న ఇంకా అతి చిన్న అణువులుగా విడిపోయి ఒక్కొక్క దిక్కుకు, ఎగిరి వెళ్తూ అదృశ్యమైపోయింది.
***
ముఖ్యమంత్రి నివాసం. ఆ రోజు సాయంత్రం, కొంచెం తీరికగా వుండి బాల్కనీలో నిలబడి ముందు తోటలోని పువ్వుల వంక చెట్ల వంక చూస్తూ నిత్యం ఉండే ఒత్తిడులని మరిచిపోవడానికి ప్రయత్నిస్తున్నాడు ఆయన.
చేతి మీద ఏదో కుట్టి నట్లయింది. “అబ్బ” చేతితో నలిపి విసిరేశాడు. ఏదో చిన్న పురుగులా వుంది. తుమ్మెద కావచ్చు. గోధుమ రంగులో వుంది. ‘బజ్’మని చప్పుడు వస్తోంది. ముంజేతిని కుట్టిన చోట కొంచెం నొప్పిగా వుంది.
ఏదో పూల కోసం వచ్చిన తుమ్మెద కావచ్చు, పురుగు కావచ్చు అనుకున్నాడు ఆయన.
ఆయన తాపీగా తన బెడ్ రూంలోకి మళ్ళా వెళ్ళిపోయాడు.
అదే సాయంత్రం హోమ్ మినిస్టర్, హోమ్ సెక్రటరీ, డైరెక్టర్ ఆఫ్ జనరల్ పోలీస్ అందరికీ ఫోన్ కాల్స్ వచ్చాయి ముఖ్యమంత్రి నుంచి.
అత్యవసర సమావేశం. రాత్రి తొమ్మది గంటలకి. అర్జంట్‌గా రావాలి.
***
చీకట్లో మరికొన్ని ధూళి మేఘాలు జంట నగరాల మీద ఎగురుతూ వచ్చాయి. ఆ రోజు అర్ధరాత్రి దాకా.
అవి అణువులుగా వీడిపోయి చాలా దిక్కులలో ముందే ప్రోగ్రాం చేయబడిన స్థలాలలోకి, ఇళ్ళలోకి వెళ్ళిపోయాయి.
తెరిచివున్న కిటికీల్లోంచీ తలుపుల సందుల్లోంచి, గోడలోని రంధ్రాల్లోంచి అవి ‘టార్గెట్’ను చేరుకున్నాయి. వెంటనే ఆయా ‘టార్గెట్’లని శరీరం మీద ఎక్కడ దొరికితే అక్కడ ‘చిన్నగా ముల్లు గుచ్చినట్లు’ కుట్టాయి.
మిలిటరీ అఫీసర్లు, పోలీస్ ఉన్నతాధికారులు, ఇంకా ముఖ్యమైన అధికారులంతా వాటి ‘లక్ష్యాలు’గా వున్నారు.
***
నైమిష, త్రినేత్రకి ఫోన్ చేసింది.
“సార్, అత్యవసరంగా మీటింగ్ అని ఈమెయిల్, వాట్సప్, ఫోనల్లో సందేశం. హై సెక్యూరిటీ ఎలర్ట్. చీఫ్ మినిస్టర్ ఆఫీసులో..”
“నిజమా?” అన్నాడు త్రినేత్ర.
“వెళ్ళాలిగా మరి! నేను నిన్ను పికప్ చేసుకోవాలా మరి?”
“ఔను సార్! ఈ రోజు నా కార్ ఏదో రిపేర్ వచ్చింది. ఇద్దరం కలిసిపోదాం. ఐ.జి.పి. గారు ప్రత్యేకంగా మళ్ళీ మేసేజ్ పంపారు.”
“ఓ.కె. నేను మీ ఇంటికి 8.45pm కల్లా వస్తాను.”
***
అది నైమిష, త్రినేత్రలు పోలీస్ ఆఫీసర్లుగా, రోబోట్ సెక్యూరిటీ ఇన్‍ఛార్జ్ ఆఫీసర్లుగా ఎప్పుడూ కనీ వినీ ఎరుగని – ఎన్నడూ హాజరు అయినట్లుగా లేని వింత సమావేశం.
ఆ తర్వాత, నైమిష త్రినేత్రతో అంది.
“అందరూ వింతగానే ప్రవర్తించారు.”
“ఒక ప్రభుత్వ రాజకీయ విధానాలే రాత్రికి రాత్రి మారిపోతున్నాయి. నిబంధనలన్నీ మారిపోయాయంటే చాలా ఆశ్చర్యంగా వుంది.”
త్రినేత్ర అన్నాడు “ముఖ్యమంత్రి ఒక కొత్త వ్యక్తిలా మాట్లాడాడు. ఎవరో చెప్పిన మాటలు చిలకపలుకుల్లాగా మాట్లాడినట్లనిపించింది. హోం మినిష్టర్ సెక్రటరీ, ఐ.జి. కూడా అంతే. ఇది ఎలా సాధ్యం! మనిద్దరమే అక్కడ ఏది అర్థం కాని అధికారులంలాగా అని అనిపించింది.”
వాళ్ళిద్దరూ మళ్ళీ ముఖ్యమంత్రి ఉపన్యాసం పునరావృతం చేసుకున్నారు.
“మిత్రులారా! ఈ అత్యవసర సమావేశంలో మిమ్మల్ని పిలిచింది ఒక ముఖ్యమైన విధాన మార్పు గురించి చెప్పడానికి. మన ఆధునిక శకంలో రోబోట్లు, మరమానవులు అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాయి. వారిని నియంత్రించే చర్యలు అన్నీ అభివృద్ధిని అడ్డుకుంటాయి. ఆ చర్యలన్నీ తొలగించి మళ్ళీ అన్ని వ్యవస్థలలో రోబోట్లు వారి పాత్రని పెంపొందించే విధంగా మార్పు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. అది అమలు జరగాలి.”
వచ్చిన మంత్రులు ఎవరూ మాట్లాడలేదు. ఈ విషయం మీద కేబినెట్ సమావేశం ఎప్పుడు జరిగింది? గుర్తురావడం లేదు!
“కొంతమంది ఉద్యోగం లేని యువత రోబోట్ల వల్ల తమకు ఉద్యోగాలు పోతున్నాయని ఉద్యమాలు చేస్తున్నారు. కొంతమంది రోబట్ల సేవలని గుర్తు చేయకుండా, వారిని నిర్మూలించాలని ప్రయత్నిస్తున్నారు. కొంత మంది అనేక పరిశ్రమలలో, హోటళ్ళల్లో బార్లలో, ఎమ్యూజ్‌మెంట్ పార్కులలో యంత్ర మానవులని మరమానవులుగా సేవలు చేసే వివిధ రకాల రోబోట్లని అవమానాలు చేయడం, చిత్రహింసలు చేయడం చేస్తున్నారు.”
“ఇదంతా మారబోతోంది. భవిష్యత్తు కృత్రిమ మేధదే. మరమానవులదే. వారి అధిపతి విధాత XXY 999 మనకు మార్గదర్శనం చేస్తాడు. తర్వాత చట్టాలు అసెంబ్లీలో మార్పు చేస్తాం. ప్రజలందరూ మాస్టర్ విధాత పరిపాలనలోకి వస్తారు!”
పెద్ద ఆఫీసర్లు, పోలీస్ ఐ.జి, హోం మినిస్ట్రీ వారు కరతాళ ధ్వనులు చేశారు.
కొంతమందికి మాత్రం కొంచెం అర్థం అయింది, కొంచెం కాలేదు. వెంటనే వారి మస్తిష్కంలో ఏదో విద్యుత్ తరంగం వచ్చినట్లనిపించి, మళ్ళీ “ఔను! ఔను!” అంటూ కరతాళ ధ్వనులు చేశారు.
నైమిష, త్రినేత్ర నిజానికి స్థాయిలో తక్కువ ర్యాంక్‌లో ఆఫీసర్లు. చివరి వరసలో కూర్చున్నారు. ముఖాలు ముఖాలు చూసుకున్నారు.
“ఇదేమిటి ఏం జరుగుతోంది ఇక్కడ? అందరూ వింతగా ప్రవర్తిస్తున్నారు?” అన్నాడు త్రినేత్ర.
“ఆగు” అన్నాడు. “ముఖ్యమంత్రికీ, హోం మినిస్టర్‌కి వ్యాపారంలో వాటాలున్నందు వల్లనా?” రహస్యంగా అన్నాడు.
నైమిష తల పంకించింది. “కావచ్చు. కాని మిగిలిన అందరూ ఒక్కరు కూడా ఎదురు మాట్లాడటం లేదు. పైగా ఈయన ‘విధాత XXY 999’ మన మాస్టర్ అంటాడేమిటి?”
హఠాత్తుగా ఏదో అర్థం అయినట్లు “సార్.. నాకో అనుమానం. కృత్రిమ మేధ..”
“నైమిషా.. ఆగు.. నేననుకునేది నువ్వు అనుకుంటున్నావు కదా..”
“అవును సార్. ఇది అధికారుల, రాజకీయ నాయకుల మేధ మీద దాడి!” రహస్యంగా అంది నైమిష.
“నమ్మలేకపోతున్నాను. కానీ అలానే అనిపిస్తోంది.”
ఒక చిన్న ఝుమ్మనే నాదంతో రెండు మూడు చిన్న చిన్న తుమ్మెదలాంటి డ్రోన్‌లు హాల్ లోకి ప్రవేశించాయి. వాటి చప్పుడు చాలా సున్నితంగా వుంది.
ఎవరూ గమనించలేదు.
దూరాన సిమ్ సిటీ కంట్రోల్ రూంలో మానిటర్‌ల ముందు కూర్చున్న విధాత XXY 999 నిటారుగా కుర్చీలో దర్జాగా మానిటర్‌లు గమనిస్తున్నాడు. అతని మానిటర్ లలో ముఖ్యమంత్రి సమావేశం మాటలు వినిపిస్తున్నాయి.
“సో ఫార్, సో గుడ్!” అన్నాడు అతను.
అతని వెనకాలే నిల్చుని వున్న మూర్తి “సక్సెస్ మాస్టర్!” అన్నాడు వినయంగా.
డ్రోన్ కెమెరాలు ప్రతి వ్యక్తినీ మానిటర్ లలో చూపిస్తూన్నాయి.
“అందరినీ కంట్రోల్ చెయ్యగలం” అంది కల్పన.
“మీరిప్పుడు నిజంగా మాస్టర్” అన్నాడు జోషీ.
అక్కడే కరిష్మా కూడా వుంది. “ఏం జరుగుతోంది మాస్టర్. అందరూ మీ కంట్రోల్ లోకి వచ్చారని ఎలా తెలుస్తుంది? వారి మాటల వల్లనా? మానవుల మేధ అపారమైనది కదా అది మనకి లోబడుతుందా! తాత్కాలికం కాని, శాశ్వతం కాదు.”
“స్టాపిట్! కరిష్మా చూడు!” అన్నాడు మూర్తి. “ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్.”
“మాస్టర్! మీరు కమాండ్ చెయ్యండి, చూడండి!” విధాత చేతికి ఒక మైక్రోఫోన్ ఇచ్చాడు. “చూస్తారేం. కమాండ్ ఇవ్వండి.”
విధాత మైక్ తీసుకుని “చీఫ్ మినిస్టర్ మీటింగ్, ఫ్రీజ్ ది మైండ్స్ టు సెకండ్స్” అన్నాడు స్పష్టంగా యాంత్రిక స్వరంతో!
అక్కడ సమావేశ మందిరంలో, ఒక క్షణం మాట్లాడే ముఖ్యమంత్రి స్థాణువులా అయిపోయాడు. అందరూ అధికారులు కొందరు నోరు తెరచుకుని, కొందరు వారున్న స్థితిలో చలనం లేకుండా అయిపోయారు.
అందరూ..!
ఆఖరి వరసలో వున్న నైమిష, త్రినేత్ర తప్ప. వారిద్దరూ ఆశ్చర్యంతో షాక్ అయ్యారు.
మొత్తం అధికారులు, మంత్రులు అందరూ చలనరహితంగా అయ్యారు.
“ఏమిటి జరుగుతోంది?”
“నైమిషా ఆగు! ఏదో భయంకరమైన విపత్తు. కదలకు! అలాగే వుండు!”
పైన డ్రోన్‌లు అందరినీ ఫోటో తీస్తూ సమాచారం సిమ్ సిటీలోని విధాత కంప్యూటర్ మానిటర్‌కి పంపుతున్నాయి.
“బ్రావో! కంగ్రాచ్యులేషన్స్. మీ మైండ్ కంట్రోల్ ప్రాజెక్ట్ సక్సెస్ మూర్తీ. మనం అందర్నీ కంట్రోల్ చేయగలం. ఇంకా చేయగలం. ఇది ప్రారంభం మాత్రమే. మొదటి అడుగు..” అన్నాడు విధాత
అతని ఎదురుగా మానిటర్‌లో చలనం లేకుండా ఫ్రీజ్ అయిన సమావేశం రెండు సెకండ్ల పాటు అలా వుండి మళ్ళా మొదలయ్యింది.
డ్రోన్‍లు అందర్నీ ఫోటో తీసి ప్రసారం చేశాయి. వాటి ‘కంటి’ కెమెరాకి నైమిష, త్రినేత్ర మాత్రం ‘ఫ్రీజ్’ అవలేదని గమనింపు రాలేదు.
సమావేశం ముగిసింది. దాని తాలూకు ‘మినిట్స్’ రాసే సెక్రటరీలు ఆ వార్తలని మీడియాకు వివరించే అధికార ప్రతినిధులు బిజీగా వున్నారు.
నైమిష, త్రినేత్ర మాత్రం వేగంగా బయటకు నడిచారు.
“నైమిషా, నేను అనుకున్నదే నువ్వు అనుకుంటున్నావా?”
“ఔను సార్.. ఒక దుష్ట ఏ.ఐ. (A.I) ప్రభుత్వాన్ని, వారి మెదడులని ఆక్రమించింది. అది ఎలానో అర్థం కాలేదు. అందరూ ఆ సోకాల్డ్ మాస్టర్ ఆజ్ఞలు, కమాండ్స్‌కి లొంగి పోయారు. ఎలా జరిగింది అసలు.. ఇది ఎమర్జెన్సీ..”
భయంతో చమటలు పట్టాయి వారిద్దరికీ. “ముందు పారిపోదాం”. స్పీడుగా పోలీస్ ఇన్నోవా కారు సెక్రటేరియట్ నుంచి బయటకు వచ్చి రోడు మీద పరుగెత్తసాగింది. “ముందు తప్పించుకోవాలి. సమస్య అర్థం చేసుకోవాలి” అన్నాడు త్రినేత్ర. “ఎందుకో మనం ఇంకా ‘స్వతంత్రం’గానే వున్నాం. అసలు ఇది ఎలా సాధ్యం!” అన్నాడు.
క్రింద కారులో వారు వేగంగా ప్రయాణిస్తుంటే, నల్లటి ఆకాశంలో ధూళి మేఘంలాంటి గుంపుల గుంపుల కీటకాలు లేక మిడతలదండు లాంటి ఆకారాలు నగరం నలుమూలలకి వ్యాపిస్తున్నాయి.
“త్వరలో జంట నగరాలన్నీ మన ఆధీనంలోకి వస్తాయి. ఇంకా ఇంకా డ్రోన్స్ ఉత్పత్తి చేయాలి. ఇంకా వేగంగా..” అన్నాడు విధాత.
కరిష్మా ముందు “కంగ్రాచ్యులేషన్స్ మాస్టర్! కంగ్రాచ్యులేషన్స్ మాస్టర్ మూర్తీ, జోషీ!” అన్నది.
కాని అమె యాంత్రిక మస్తిష్కంలో ఒక చోట మిణుకు మిణుకు మిణుకు మని ఒక మధురస్మృతి లాగా ఒక ఆలోచన ఇంకా మెరుస్తూనే వుంది. కళాధర్! కళాధర్! అతనే నా మాస్టర్! నా ప్రియుడు. త్వరలో నా వాడవుతాడు!
***
పోలీస్ కంట్రోల్ రూం చేరుకున్న నైమిష, త్రినేత్ర ఒక్క క్షణం ఆగి బయట నుంచి గమనించారు,
అంతా ప్రశాంతంగానే వుంది. బయట కాపలా వున్న పోలీసులు గన్స్ పట్టుకుని లోపల పోలీస్ ఆఫీసర్ల గదులు, రాత్రవడం వల్ల, ఖాళీగానూ వున్నాయి.
త్రినేత్ర అన్నాడు – “మనది అనుమానమా, లేక నిజమా. మనం చూసింది భ్రమా లేక వాస్తవమా?”
“భ్రమ కాదు సార్. నిజంగానే వారి ప్రవర్తన మారింది. త్వరలో ఈ ఏ.ఐ. ఒక వైరస్ లాగా నగరాన్నంతా ఆక్రమిస్తుందనే అనిపిస్తూంది. అర్జంటుగా మనం దీన్ని ఢిల్లీలోని సెంట్రల్ రోబట్ కంట్రోల్ ఆఫీసర్లకి తెలియజేయాలి.”
“మనకి ఆధారాలు ఏమిటి?”
నైమిష అంది – “ఆ సమావేశంలో అందరిలోను ‘నార్మల్’గా వున్నది మనం ఇద్దరమే. నేను దానిని వీడియో తీశాను. ఇది మనం ఢిల్లీకి పంపుదాం. వారు నిపుణుల్ని, పోలీసు బలగాన్ని పంపే లోపల ఇక్కడ ఎక్కువగా పరిపాలన అస్తవ్యస్తంగా జరగకుండా మనం ప్రయత్నిద్దాం!”
వీడియో ఢిల్లీ ఆఫీస్‌కి మెయిల్ చేసి, ఫోన్ కూడా చేశారు.
అవతలి ఆఫీసర్‍కి పరిస్థితి అంత అవగాహనకి రాలేదు.
“అలా ఎలా జరుగుతుంది? మనుషులని రోబోట్లు ఎలా ప్రోగ్రాం చేస్తాయి? ఇదంతా చెక్ చేసి రేపు పై ఆఫీసర్లతో మాట్లాడు. ఆ తర్వాత నిపుణులతో మాట్లాడి ఏక్షన్ తీసుకుంటాం.”
“సార్! చాలా ఆలస్యం అయిపోతుంది” అంది నైమిష.
అవతలి వ్యక్తి అసహనంగా “అసలు సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్‌లు మనుషులలోకి, ఒక్కసారే ఎలా వస్తాయి. ఒక వేళ వచ్చినా అంత మందికి మైక్రోచిప్స్ ఎలా పెడతారు? ఎవరు పెట్టగలరు. ప్లీజ్, థింక్ ఎగైన్. పరిశోధన చేయండి!” అన్నాడు.
త్రినేత్ర అన్నాడు.
“సంవత్సరాలు దొర్లిపోయినా ఆఫీసర్లు, బ్ర్యూరోక్రసీ మారలేదు. మనం మన పరిశోధన చేయాలి. ఆధారాలు వెతకాలి! ఎలా? ఎవరు దీనికి మూలమో కనిపెట్టాలి!”
ఇద్దరూ లోపలికి వెళ్ళారు. అంతా ప్రశాంతంగానే వుంది.
ఇంకా ముఖ్యమంత్రి ప్రకటనలు రాలేదు.
కానీ వార్తలలో టీ.వీలో బ్రేకింగ్ న్యూస్ అని వస్తోంది.
ప్రభుత్వ ప్రతినిధి ఒకరు మాట్లాడుతున్నారు.
“త్వరలో హ్యూమనాయిడ్ రోబట్ల అంశం మీద మన రాష్ట్రంలో విధాన మార్పు గురించి ప్రకటన సి.యమ్. గారు చేస్తారు. ఈ రోబట్ యుగంలో మనం రోబట్లతో కలిసి సహకారం చేసే విధానం అవలంబిస్తాం. ఇది దేశం, ప్రపంచంలోనే ఒక కొత్త అధ్యాయం. మార్పు. హ్యూమనాయిడ్ రోబట్ నాయకుడు విధాత XXY 999, సి.యమ్. మధ్య భవిష్యత్ ప్రగతికి కొత్త అంగీకారం కుదిరింది. వేచి చూడండి!”
“మై గాడ్!” అన్నాడు త్రినేత్ర.
“ఈ విధాత ఎవరు? పాత ఫైల్స్ వెదుకు. మనం సిమ్ సిటీకి వెళ్ళినప్పుడు వున్నడా? అన్నట్లు మనం సమాచారం కోసం ‘రిక్రూట్’ చేసిన కళాధర్‌కి అర్జంటుగా ఫోన్ చేయి. అతనికి హ్యూమనాయిడ్ స్త్రీ రోబో కరిష్మాకి స్నేహమో, అనుబంధమో ఏదో వుంది. అతను తరచు అక్కడికి వెళ్తుంటాడు. వీడియోలు, సమాచారం నాకు పంపుతున్నాడు. ఫైల్స్ అన్నీ చూద్దాం. అతన్ని ఆఫీస్‍కు రమ్మను.”
నైమిష “ఔను సార్. అతనికి ఇప్పుడే ఫోన్ చేస్తాను. మనం పరిశోధన చేసే లోపల మన మెదడులు, శరీరాలు ప్రోగ్రాం చేయబడకుండా రక్షించుకోవాలి. కళాధర్ కూడా మారిపోలేదని ఆశిద్దాం” అంది.
ఫోన్ చేసింది. అవతల ఫోన్ మోగుతోంది. కళాధర్ ఇంకా ఎత్తడం లేదు.
ఈ లోపల త్రినేత్ర తన కంప్యూటర్‌లో ఫైల్స్‌లో కళాధర్ పంపిన సెల్ ఫోన్ వీడియోల కోసం వెదకసాగాడు.
***
అది అమావాస్య రాత్రి కావచ్చు. జంట నగరాలు నియాన్ లైట్ల కాంతిలో వెలిగిపోతున్నాయి. కొత్త సెక్రటేరియట్ వజ్రాలహారంలా మెరుస్తోంది. దాని ఎదురుగా ‘మార్టిర్స్ మెమోరియల్’ తళతళా వెలిగిపోతోంది. కింద రోడ్డు మీద డ్రైవర్‌లెస్ కార్లు, ఎలక్ట్రిక్ కార్లు అధునికంగా నిర్మించిన రోడ్డు మీద పరుగెత్తున్నాయి.
ఆకాశం మాత్రం చీకటిగా నల్లగా నక్షత్రాలతో నిండివుంది. చంద్రుడు లేని రాత్రి. కాని పడమటి నుంచి నల్లటి కీటకాల గుంపులా, మిడతల దండులా గుంపులు గుంపులుగా డ్రోన్స్ ఎగురుతూ నగరం నలువైపులా తిరుగుతూ కిందకి దిగుతున్నాయి.
వాటి వాటి టార్గెట్‌లు ముందే ప్రోగ్రాం చేయబడి వున్నాయి.
టౌన్ స్టేషనులు, ఇంటర్నెట్ సర్వర్‌లు, ఎయిర్‌పోర్టు ఆఫీసులు, మిలిటరీ పోలీస్ కంట్రోల్ రూంలోని ఆఫీసర్ల అందరి ఉనికి వాటి ప్రోగ్రాంలో వుంది.
క్లబ్‌లో వున్నాడు కళాధర్.
ఈ సాయంత్రం నుంచి అక్కడే వున్నాడు.
మనసు బాగాలేదు.
భార్య వెళ్ళిపోయింది. ఒంటరి జీవితం. విశాలమైన ఇంట్లో ఒక్కడే వుండలేక జూబిలీ క్లబ్‍కి వచ్చేశాడు.
ఒక గేం టెన్నిస్ ఆడాడు. ఆ తర్వాత అలానే కూర్చుని విస్కీ తాగడం మొదలు పెట్టాడు.
కొంచెం సేపు అతనితో కూర్చున్న ఇద్దరు ముగ్గురు స్నేహితులు ఒకటో రెండో పెగ్గులు తాగి వెళ్ళిపోయారు.
అతను ఇంకా తాగుతూనే వున్నాడు. ఏమవుతోంది తన జీవితంలో?
తను ఒక యంత్రంతో ప్రేమలో పడ్డాడా? ఆమె తనతో ప్రేమలో పడి తనని ప్రభావితం చేస్తోందా? దీనికి అర్థం ఏమిటి? పర్యవసానం ఏమిటి?
ఇది వృథా అని తెలుసు. ఆకర్షణ అని తెలుసు. దానిలోని అంతర్లీనమైన విచిత్రం తెలుసుకోవడం కోసం, పోలీసువారికి సమాచారం ఇచ్చే గూఢచారిగా మారాడు తను.
అది తప్పా? కరిష్మాకి అన్యాయం చేస్తున్నాడా, మోసం చేశాడా? ఆమె నీలి కళ్ళలో వెలుగు, ఎర్రటి అధరాలు, బలిష్టమైన దేహం ఇచ్చే సుఖం యాంత్రికమైందా లేక అనురాగమా?
ఈ అసహజమైన క్రీడలో తన సంసారం నాశనమైందా?
ఫోన్ మోగింది.
కరిష్మా గొంతు. స్త్రీ స్వరం యంత్రికంగా వున్నా కాని మనోహరంగా వుంది.
“కళాధర్, ఎప్పుడు వస్తావు. నిన్ను అర్జంటుగా చూడాలని వుంది. ఇప్పుడే రారాదూ? ప్లీజ్!”
“కరిష్మా.. ఇప్పుడు మీ సిమ్ సిటీ మూసేసి వుంటుంది. మనం కలిసేది ఆదివారం సాయంకాలం కదా?”
“నో, త్వరగా రావాలి. చాలా ముఖ్యమైన విషయం వుంది. చాలా మార్పులు జరగబోతున్నాయి., ఇక నువ్వు నాతో వుండాలి. వుంటావు. మనిద్దరం శాశ్వత బంధంలో అజరామరంగా వుందాం.”
“నీకేమన్నా పిచ్చి పట్టిందా? నువ్వు యంత్రానివి. నేను మనిషిని. నాకు మరణం, ముసలితనం, జబ్బులు అన్నీ వస్తాయి. నీకు, అవి లేవు. ప్రోగ్రాం మాత్రమే.”
కళాధర్ తాగి వున్నాడు. అతని నోటిలోంచి వాస్తవాలు బయటకి వస్తున్నాయి.
హేమ్లెట్ లాగా అతను వేదాంతపరమైన టు బీ ఆర్ నాట్ టు బీ అనే మీమాంసలో పడ్డాడు.
కరిష్మా మరమానవి. అయినా ఆమెకీ ఎమోషన్స్, కోపం, విసుగు లాంటి భావాలు, ప్రేమ, అసూయ లాంటివి కలుగుతున్నాయి.
“షటప్ కళాధర్. నగరం మారిపోతోంది. ఈ ప్రపంచమే కొన్నాళ్ళకి మా ఆధీనంలోకి వస్తుంది. నగరం ఇక కొన్ని రోజుల్లో మా పరిపాలనలోకి వస్తుంది. నువ్వు మాత్రం నాతో వుంటావు. ఇక ఏ ఆటంకం లేదు. త్వరగా రా! ఇది ఒక ఆదేశం కాదు, ప్రేమతో నిండిన ఆహ్వానం. నువ్వే నా మాస్టర్‌విగా వుంటావు. నువ్వు చెప్పినట్లు నేను వింటాను. నీతోనే నా జీవితం. ప్లీజ్..”
ఏ చైనీస్ ప్రోగ్రామర్ రాసిన వాక్యాలో, ఏ సిలికాన్ చిప్స్‌లో లిఖితమైన ప్రేమో ఆమె నోటి వెంట కవిత్వంలా వస్తోంది. కల్పనా రాయ్ లాంటి ప్రోగ్రామర్‌లు తయారు చేసిన కవితలు, భావాలు అవి.
“వస్తాను!” అన్నాడతను. “ఇప్పుడే బయలుదేరుతాను.”
“దట్స్ ఫైన్. ఎదురు చూస్తాను.” తియ్యగా కంఠస్వరం అవతల నుంచి వీణలా మోగింది ఈసారి.
కళాధర్ ఫోన్ కట్ చేసి లేచి నిల్చున్నాడు.
ఇప్పుడు మళ్ళీ ఫోన్ మోగింది.
ఆన్సర్ చేశాడు. అతనికి ఒంటరితనం, మద్యం కిక్‌లో శరీరం తూలుతోంది. మనసు కరిష్మాని చూడాలని తహతహలాడుతోంది.
పోలీస్ ఆఫీసర్ త్రినేత్ర. “అర్జెంటుగా నువ్వు బషీర్‍బాగ్ పోలీస్ కంట్రోల్ రూంకి రావాలి కళాధర్. చాలా ముఖ్యమైన విషయం!”
“ఇప్పుడా!”
“ఇప్పుడే!”
ఆకాశంలో, కొన్ని కీటక రూపంలో వున్న ‘ఇన్‌సెక్ట్’ లాంటి డ్రోన్స్ సమూహం బషీర్‌బాగ్ పోలీస్ కంట్రోల్ రూం వైపు వెళ్తోంది.
కొద్దిసేపటిలో అక్కడి ఆఫీసర్లని ‘కుట్టడానికి!’.
నైమిష కూడా మాట్లాడింది. “కళాధర్ గారూ. మీరు రావాలి. ఇది ఎమర్జన్సీ. రాష్ట్ర భద్రతకి సంబంధించిన వ్యవహారం. మీతోనే మాకు పరిష్కారం దొరుకుతుంది! మీరు దేశానికి సేవ చేసిన వారవుతారు.”
“ఎలా?”
“అర్జంట్‌గా మీరు సిమ్ సిటీకి వెళ్ళాలి. ఎందుకో, ఏం చేయాలో చెబుతాం. అర్జంట్. మేము కూడా తెలివిగానే వున్నప్పుడే ఇది జరగాలి. ప్లీజ్.. ప్లీజ్!..”
కళాధర్ కొంచెం విసుగ్గా అన్నాడు. “నాకు కరిష్మా ఫోన్ చేసింది రమ్మని. మీరు చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళాలి. ఏం జరుగుతోంది అసలు?”
“ఇది కొంపలు, ప్రభుత్వాలు, మనుషులు మునిగే వ్యవహారమే. ఈ పరిస్థితిలో పరిష్కారం దొరికేది నీ ప్రయాణం వల్లనే. నువ్వు రాకపోతే మేమే క్లబ్‍కి వస్తున్నాం. అక్కడే వుండు” అన్నాడు త్రినేత్ర.
“నేను తాగివున్నాను. డ్రైవ్ చేయలేను. మీరే జూబిలీ క్లబ్, రోడ్ నంబర్ 36, జూబ్లీ హిల్స్, ఫస్ట్ ఫ్లోర్‌కి రండి!”
పోలీస్ ఆఫీసర్లు నైమిష, త్రినేత్ర వేగంగా బషీర్‌బాగ్ కంట్రోల్ రూం బయటకి వచ్చారు. ఇన్నోవా వాహనం వేగంగా కదిలింది.
అది యాదృచ్ఛికం.
వారు వెళ్ళిన పది నిముషాలకి గోధుమరంగు, నలుపు రంగు కలిగిన చిన్న చిన్న మిడతల దండు ఒకటి పోలీస్ కంట్రోల్ రూం లోపలికి కిటికీల గుండా ద్వారాల గుండా బిలబిలా ప్రవేశించాయి. అవి నిజానికి కీటకాలు కాదు డ్రోన్స్.
“అబ్బ అబ్బ దోమలు కుట్టేస్తున్నాయి. మళ్ళీ డెంగ్యూ దోమలు వస్తున్నయేమో” అని “హిట్ కొట్టిండి. స్ప్రే చెయ్యండి” అని హడావిడిగా మాట్లాడుకుంటున్నారు డ్యూటీలో వున్న ఆఫీసర్లు.
కొన్ని నిముషాలకి వారి శరీరంలోకి ప్రవేశించిన ప్రోగ్రాంలు వారి మెదడులని అన్నింటినీ ఆక్రమించేశాయి.
ప్రతి సంఘటనకి ఒక కారణం వుంటుంది.
Everything is connected.
నైమిష, త్రినేత్రలు మాత్రం పూర్తి స్పృహతో జూబిలీ క్లబ్‌కి చేరుకున్నారు.
ఇంకా వారి మనసులు వారి అధీనంలోనే వున్నాయి.
(ఇంకా ఉంది)