నగరంలో మరమానవి-12

0
2

[డా. మధు చిత్తర్వు రచించిన ‘నగరంలో మరమానవి 12’ అనే సైన్స్ ఫిక్షన్ కథని పాఠకులకి అందిస్తున్నాము.]

ప్రేమయంత్రం

[dropcap]సి[/dropcap]మ్ సిటీ.

కంట్రోల్ టవర్.

విధాత XXY 999 కూర్చున్నఆఫీసు గుండ్రంగా వుంది. విశాలంగా వుంది. అతను ఆజానుబాహువు. నీలి కళ్ళు, బంగారు జుట్టు. నీలి రంగు సూట్ ఎర్రటి టైతో నిజంగా సి.ఇ.ఓ.లా వున్నాడు.

వృత్తాకారంలో అతని చుట్టూ 360 డిగ్రీలలో కంప్యూటర్ మానిటర్ తెరలు మెరుస్తున్నాయి. నగరపు వివిధ ప్రాంతాలలో దృశ్యాలు కనిపిస్తున్నాయి.

అతని ఎదురుగా మూర్తి కంప్యూటర్ ప్రోగ్రామర్, కల్పనా రాయ్ కూర్చుని వున్నారు.

“త్వరలో, అతి త్వరలో ఈ నగరం నా ఆధీనంలోకి వస్తుంది.” అన్నాడు విధాత.

ఇప్పుడతని స్వరం భావం లేని యంత్ర స్వరంలా వుంది. అలా అన్నప్పుడు ఎర్రగా మెరవడం వల్ల అతని కళ్ళని చూస్తే కాని అతనో హ్యూమనాయిడ్ రోబట్ అని తెలుసుకోవడం కష్టం.

మూర్తి ఇబ్బందిగా కదిలాడు. “మాస్టర్! ఒక సందేహం. పరిపాలనా విభాగం అంతటినీ డ్రోన్స్ చేత ప్రోగ్రాం చేశాం. కాని ప్రజలు… వివిధ వృత్తులలో వున్న జనం సుమారు వంద కోట్ల మందిని ఎలా ప్రభావితం చేయగలం. ఏవో కొన్ని చిన్న పనులు అధికారుల చేత చేయించగలం కానీ…”

“నూటికి 90 మంది ప్రజలు ప్రభుత్వం చెప్పినట్లు చేసుకుంటూ పోతారు. అధికారంలో వున్న వాళ్ళు చేసే చట్టాలు పాటిస్తూ వారు చెప్పినట్లు వింటారు. ప్రభుత్వమే నేను చెప్పినట్లు చేస్తుంది కదా? ఎదురు తిరిగే వారు కొద్ది మంది. వారిని చంపేయచ్చు. లేదా ప్రోగ్రాం చేయచ్చు.”

“పత్రికలు, జర్నలిస్టులు, టీవీలు, మానవ సమాజంలోని తిరుగుబాటుదారులు, మానవ హక్కుల ఉద్యమకారులు ఇంత మందిలో ఎవరూ కనిపెట్టలేరా, ఈ విషయం వారినందర్ని ప్రభావితం చేయడం కష్టం కదా?”

కల్పనా రాయ్ అంది “ముఖ్యమంత్రి కయితే నేను ప్రోగ్రాం రాసి పెట్టాను. హోం మినిష్టర్ కయితే.. తను కూడా మాస్టర్‌కి విధేయంగా వుండాలని ‘కథ’ రాశాను. అది అతని మెదడులో ప్రవేశించింది.. కాని ఇంకా చాలా ఆటంకాలున్నాయి కదా.”

జోషీ అన్నాడు “అసలు సమస్య కేంద్ర ప్రభుత్వం నుంచి, మిలిటరీ నుంచి వస్తుంది. ఈ విషయం ఇంకా వారికి తెలియదు!”

విధాత లేచి నిల్చుని ఒక మానిటర్ బటన్ నొక్కాడు.

తెర మీద చీఫ్ మినిస్టర్ గదిలోంచి ప్రసారం రాసాగింది.

“చీఫ్ మినిష్టర్!” పిలిచాడు విధాత.

“ఎస్ మాస్టర్!” అని గభాలున మంచం వీది నుంచి లేచి సమాధానం ఇచ్చాడు అతను.

అలా ఒక్కొక్క మానిటర్ దగ్గిర ఒక్కొక్క అథికారిని పిలిచాడు.

అందరి దగ్గర్నుంచి సమాధానం వచ్చింది.

“నాలాంటి విధాతల్ని ఇంకా తయారు చేస్తాను. నా ప్రోటోటైప్ వెర్షన్‌లు అనేకం తయారు చేస్తాను. చేయగలనని విశ్వాసం వుంది.

ప్రస్తుతం ప్రభుత్వాన్నీ వారి విధానాలనీ కంట్రోల్ చేస్తాను. అలా కొంత కాలం జరుగుతుంది. ఇదంతా ఒక దశాబ్దం పట్టవచ్చు. ఆ లోపల నగరం, రాష్ట్రం, దేశం మార్చేస్తాను! ఇతర దేశాలలో నాలాంటి పరిణతి చెందిన ‘విధాత’లతో సమన్వయం చేస్తాను. మనిషి మేధ రోబట్ కలిపిన కొత్త స్పీషీస్ తయారు చేస్తాను!..”

“మనుషులు ఎప్పటికైనా చనిపోతారు కదా? రోబోట్లకి ‘పవర్, శక్తి, బ్యాటరీలు’ కావాలి కదా ఎలా?”

“అణు రియాక్టర్లు, సోలార్ పవర్ ప్లాంట్లు నిర్మిస్తాను. అవి అన్నీ రోబట్ల ఆధీనంలో మనుష్య శాస్త్రవేత్తలు చేస్తారు. మనుషులు మాట వినకపోతే, చంపేయగలను! కొన్ని వేల రోబట్లని మూకుమ్మడిగా ప్రోగ్రాం చేయగలను. ఇప్పటికే కనీసం ఆరు దేశాలలోనే సూపర్ ఏండ్రాయిడ్ రోబట్స్ నాలాంటి అత్యున్నతమైన తెలివి తేటలు గల ‘విధాత’ మోడల్ రోబట్ నాయకులతో సంబంధంలో వున్నాను. ఒక కొత్త శకం ప్రారంభం అవుతుంది. భవిష్యత్‌లో చూడండి.. అందరి భవిష్యత్ రాసే విధాతని నేనే!!”

ఒక తెర మీద ‘ప్రదర్శన’ (సిమ్యులేషన్) అని రాసి వుంది.

అక్కడికి వెళ్ళి ఆ బటన్ నొక్కాడు. ఆ తెర మీద ఒక భవిష్యత్ చిత్రం ఆవిష్కృతమైంది. ఫ్యాక్టరీలు, రియాక్టర్లతో శాస్త్రవేత్తలు రోబట్లు కలిసి పని చేస్తున్నారు.

వ్యవసాయ క్షేత్రాలు, తోటలలో మానవులు రోబట్ల ఆధీనంలో పంటలు పండిస్తున్నారు. మిలటరీ రోబట్లు, మిలిటరీ సైనికులు కలిసే మార్చింగ్ చేస్తున్నారు.

“ఫ్రీజ్” అన్నాడు విధాత.

మానిటర్ దృశ్యంలో రోబట్లు మానవులు అందరూ చలనం లేకుండా అయ్యారు.

“వర్క్, ఎగైన్!” అన్నాడు. వాళ్ళు అందరూ పని చేస్తున్నారు. ఆ వీడియో ఒక భవిష్యత్ దృశ్యం. భూమిలో పర్యావరణ  కాలుష్యం వ్యాపించి నల్లటి కాలుష్య మేఘాలు ఆకాశాన్ని కమ్మేశాయి. మనుషులు చచ్చిపోయి గుట్టలుగా పడున్నారు.

హ్యూమనాయిడ్ రోబట్లు మాత్రం తిరుగుతున్నారు. అన్ని దేశాల్లో న్యూక్లియర్ రియాక్టర్లులు మాత్రం పని చేస్తున్నాయి. అవి అన్ని ఫ్యాక్టరీలకీ, ఆఫీసులకి ఇళ్ళకీ కరెంట్ ఇస్తున్నాయి.

“చూశావా మూర్తీ! ఇది భవిష్యత్ దృశ్యం. తప్పకుండా జరుగుతుంది. జరగకపోతే మానవ జాతే నశిస్తుంది. వాతావరణ కాలుష్యం నుంచి వారిని కాపాడుకోవడానికీ, కొత్త యాంత్రిక మానవులని తయారు చేయడానికే నేను వచ్చాను. నా స్నేహితులంతా అన్ని దేశాలలో రహస్యంగా వున్నారు. నెట్‌వర్క్ వుంది. మీరు నేను చెప్పినట్లు చేస్తే మీకు కూడా స్వాతంత్రం లభిస్తుంది!”

విధాత భావరహిత స్వరంలో భావం లేదు. గర్వం లేదు. ఒక వాస్తవం చెబుతున్నట్లుంది.

ప్రోగ్రాం కంట్రోల్ చేయని అంతరాత్మలో మూర్తి అనుకున్నాడు. ‘ఇది ఒక కల! యంత్ర మానవుడి కల! పీడకల కూడా. ఇదంతా ఎలా జరుగుతుంది? అసాధ్యం!!!’

కల్పనారాయ్ షాక్ అయింది. ‘నేను కలలో కూడా రాయలేని కథ! భవిష్యత్ ప్రపంచం. ఇలా జరుగుతుందా? దానికి నేను కూడ ఒక భాగస్వామినా?’ అనుకుంది.

జోషీ అన్నాడు “ఇది సాధ్యమా? కాని మాస్టర్! మీలాంటి అనేక మంది మాస్టర్ లుంటే సాధ్యమేమో!”

మూర్తికి తను చిన్నప్పుడు చదివిన ఫిలిప్ డిక్ రాసిన ‘Do Androids Dream of Electric Sheep?’ అనే నవల గుర్తొచ్చింది.

నిద్ర రాకపోతే, కళ్ళు మూసుకుని గొర్రెలని లెక్కపెట్టమంటారు మానసిక వైద్యులు. యంత్రాలకి కూడా కలలు వస్తాయా?

యంత్రాలకి మేధ, భావం వస్తుంది. సరే. వాటికి కలలు కూడా వస్తాయా? ఆశయాలు, ఆదర్శాలు, ‘megalomania’ (అహంభావం) వస్తాయా? ఇది కలా? కలలకి, తెలివికి తేడా లేదా? మూర్ఖత్వానికీ, పరిణతికీ తేడా వుండదా? ఇవన్నీ మనిషి ప్రోగ్రాం చేసినవే కదా! ఎక్కడో తేడా వచ్చింది. మనిషికి విరుద్ధంగా రోబోట్లు పని చేయకూడదు. కాని చేస్తున్నాయి!

హఠాత్తుగా అవి ‘వ్యక్తిత్వం’, ‘కలలు’, ‘పథకాలు’ నేర్చుకున్నాయి. ఇదంతా మంచికా చెడుకా?

“మూర్తీ నువ్వు ఆలోచించేది నాకు తెలుసు. ఇప్పుడు అందరి ఆలోచనలూ నాకు తెలుసు. ఇది ఒక ‘హైవ్ మైండ్’. తేనెతుట్టలాంటి మెదడు. సామూహికమైన మస్తిష్కం. నీ సందేహాలు నాకు అర్థం అయ్యాయి. కాబట్టి ఏ సందేహాలు వద్దు.” విధాత తీక్షణంగా అన్నాడు.

మూర్తి భయంగా “ఎస్ మాస్టర్!” అన్నాడు.

“గో టు స్లీప్!” అన్నాడు విధాత. వాళ్ళ ముగ్గురూ తమ తమ గదులలోకి వెళ్ళిపోయారు.

‘దుష్ట’ కృత్రిమ మేధ, అహంకారి రోబోట్, విలన్ రోబట్‌కి మాత్రం నిద్ర అవసరం లేదు. తనకి తాను చార్జి చేసుకుంటూ ‘స్లీప్’ మోడ్ లోకి వెళ్ళాడు. అయినా సమాచారం వస్తూనే వుంటుంది.

సమయం ఒంటిగంట దాటింది. అర్ధరాత్రి తర్వాత…

***

కొన్ని గంటల ముందు జూబిలీ హిల్స్ క్లబ్‌లో…

పోలీస్ ఆఫీసర్లు నైమిష, త్రినేత్ర క్లబ్ మొదటి అంతస్తు లోని వరండాలో కళాధర్‌కి ఎదురుగా కూర్చున్నారు.

“అసలు ఏం జరుగుతోంది? క్లియర్‌గా చెప్పండి!” అన్నాడు కళాధర్. అతని కళ్ళు ఎర్రగా వున్నాయి. మత్తులో వున్నాడు.

త్రినేత్ర చెప్పాడు “కళాధర్ నీకు ముందే చెప్పాం కదా. రోబట్‌లు తిరుగుబాటు చేయడం. నీకు, స్త్రీ రోబో కరిష్మాకు పరిచయం వల్ల సిమ్ సిటీలో జరిగే విషయాలు కనిపెట్టవచ్చుననీ, నాకు రిపోర్ట్ చేయమనీ..”

“ఔను. కరిష్మాని కలుస్తున్నాను. వీడియోలు కొన్ని తీశాను. అంతకంటే ఏమి జరగలేదు.”

“చాలా జరిగింది. జరుగుతోంది. మనం అనుకున్నదానికంటే ఎక్కువ సీరియస్ విషయాలు. నీవు అర్థం చేసుకోవాలి! నీ సాయం చాలా ముఖ్యం. ఎందుకంటే స్త్రీ రోబో కరిష్మాతో నీకు స్నేహం వుంది. ఆమె ఈ సిమ్ సిటీ నుంచి జురుగుతున్న తిరుగుబాటులో భాగం అనే మేము అనుకుంటున్నాం.”

“నాకు అలా అనిపించలేదు. ఒక మామూలు హ్యూమనాయిడ్. చైనీస్ సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ పరికరాలతో, ‘అనుభూతులు’ పొందిన ‘మరమానవే’ అనుకుంటున్నాను. నన్ను ప్రేమిస్తున్నా అంటుంది. నాకు ఆమె అంటే ఇష్టం. కాని ఆమె ఒక ‘యంత్రం’ – ‘కంప్యూటర్’ లేక ‘ప్రోగ్రాం చేయబడిన యంత్రపు వ్యక్తి’ అని గుర్తుకు రాగానే మళ్ళీ సందిగ్థతకి లోనవుతున్నాను. ఈ పరిస్థితి బాగా లేదు.”

“ఇప్పుడేం సందిగ్ధత అవసరం లేదు. మొత్తం ప్రభుత్వం, పోలీసు క్యాబినేట్ కూడా సిమ్ సిటీ నుంచి జరుగుతున్న రోబోట్ల దాడికి మానసికంగా లొంగిపోయారు. నమ్మలేని నిజం. అది ఆశ్చర్యంగా భయంగా వుంది. నేను స్వయంగా చూశాను. వారి లీడర్ విధాత XXY 999 అంటున్నారు.

ఇది మానసికమైన దాడినా, ‘మాస్ హిస్టీరియా’నా, లేక మాకు తెలియని సాంకేతిక విజ్ఞానమా.. అది కరిష్మా దగ్గరి నుంచి రాబట్టాలి.”

నైమిష అంది “రోబోట్ల మెదడులాంటి హార్డ్ డిస్క్ లలో ‘అనుభూతులు’, ‘తెలివి తేటలు’, ‘విశ్లేషణ’ లాంటి సిలికాన్ చిప్స్, చేసి ఎలా ప్రోగ్రాం చేయవచ్చో కాక, ఇలాగే మానవుల మెదడులలో రోబట్స్ లాంటి శక్తులు విశ్లేషణా, వుండేటట్లుగా చిప్స్ అమర్చి వారి మొదడులోని న్యూరాన్ లని, అలోచించే భాగాలని ప్రభావితం చేయవచ్చు. ఇలాంటి టెక్నాలజీ గురించి చదువుకున్నాం. కాని ఇంత పెద్ద ఎత్తున ఇలా ప్రభుత్వాన్ని అధికారులని ఎలా ప్రభావం చేశారో అర్థం కాలేదు. అది మీరు కనిపెట్టాలి సార్. మేం వెళ్ళడానికి ఆర్డర్స్ లేవు.”

“ఒక వేళ అది సిమ్ సిటీ నుంచి కాకపోతే, వేరే శత్రు దేశం నుంచో, వేరే రోబట్ల నుంచో అయితే..?” అడిగాడు కళాధర్.

“ఇది వరకు తిరుగుబాటు రోబట్లన్నీ అక్కడికే వెళ్ళినట్లు మాకు జిపిఆర్‌ఎస్‌లో ఆధారాలున్నాయి. ప్రభుత్వ అధినేతకి, హోం మినిస్టర్‌కీ వారి వ్యాపారంలో వాటాలున్నాయి. కాబట్టే చివరి నిముషంలో క్రిందటిసారి సిమ్ సిటీ మీద దాడి చేయకుండా ఆర్డర్ ఇచ్చారు..

ఇది ఎవరూ నమ్మరు. కాని మేం ఇద్దరం మాత్రం ఇదే నిర్ణయానికి వచ్చాం. ఇప్పుడు ప్రభుత్వసంస్థలు, నగరం అంతా రోబట్ల అధీనంలోకి వెళ్ళే ప్రమాదం ముంచుకొస్తుంది.”

“సరే నేనేం చేయాలి?”

నైమిష, త్రినేత్ర “థ్యాంక్స్. మీరు ఇప్పుడు దేశాన్ని రక్షిస్తున్నాననుకోండి. దేశ రక్షణకి ఏం చేయాలంటే..” చెప్పసాగారు.

ఆకాశంలో మిడతల దండు లాంటి చిన్న చిన్న డ్రోన్స్ గుంపులు ఇంకా వాటి లక్ష్యాల కోసం వెదుకుతున్నాయి.

కింద మాట్లాడుకుంటున్న వారికి అవి ఇంకా కనబడలేదు.

***

“ఎక్కడవున్నావ్?” అంది కరిష్మా.

“గేటు దగ్గర.. అంతా క్లోజ్ చేసి వుంది. టికెట్ కౌంటర్, పార్కింగ్ అంతా నిర్మానుష్యంగా వుంది. ఒకే ఒక్క సెక్యూరిటీ రోబట్ నన్ను ఆపేసింది!”

“నేను నీకిచ్చిన ‘పాస్ కార్డ్’ చూపించు!”

“చూపించాను. కానీ అది పైనించి క్లియరెన్స్ లేదు అంటోంది. ఎలా రావాలి. ఇంత అర్జంట్‌గా ఎందుకు పిలిచావు?”

“ఆగు, నేను వస్తున్నాను” అంది కరిష్మా. వేగంగా కంట్రోల్ రూంలో తన డెస్క్ దగ్గర నుండి బయటకు వచ్చి ప్రవేశ ద్వారం దగ్గరకి పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ నడిచివెళ్ళింది.

సెక్యూరిటీ గార్డ్ ఆమెని చూసి “గ్రీటింగ్స్ మేడమ్! సుప్రీమ్ మాస్టర్ విధాత క్లియరెన్స్ లేనిదే 12 గంటల దాటిన తర్వాత ఎవరూ రావద్దు అని ఆర్డర్స్ వున్నాయి”

“ఆర్డర్స్ ఓవర్‌రైడ్” అంది కరిష్మా, తన చూపుడు వేలు రోబట్ నుదిటిన పెట్టి.

గేటు తెరుచుకుంది. కళాధర్ లోపలికి ప్రవేశించాడు.

ఎంత యంత్రమైనా, ఎంత పనిలో వున్నా కరిష్మాకి కళాధర్‌ని చూడగానే మళ్ళీ అదే ప్రేమ వంద రెట్లు ఉవ్వెత్తున పొంగివస్తుంది. అది ఏ చిప్ ప్రభావమో ఏ రసాయినిక పదార్థమో!

“నా కళాధర్, రా! ఇక మనం ఎప్పటికీ విడిపోము. ఇక నాతో వుండు! వుంటావు!”

“ఏం జరుగుతోంది కరిష్మా అసలు? ఎందుకు మనం విడిపోమూ?”

“ముందు నా రూమ్‌కి పద! హావ్ ఎ డ్రింక్. అన్ని చెబుతాను.”

కొద్ది సేపటి తర్వాత వాళ్ళిద్దరూ కరిష్మా ప్రైవేట్ రూంలో కూర్చున్నారు. ఇది కంట్రోల్ రూం ఆఫీస్ వెనకాల వుంది. కంట్రోల్ రూంలో విధాత చార్జి చేసుకుంటూ అచేతనంగా వున్నాడు.

ఇతరులంతా కరిష్మాని కళాధర్‌ని చూసినా ఏమి అనలేదు.

కరిష్మా ఇప్పుడు నీలిరంగు జీన్స్ మీద ఎర్రటి పూల డిజైన వున్న టీషర్ట్ వేసుకుంది. బంగారు రంగు జుట్టు గదిలో వెలుతురుకి మరింత మెరుస్తోంది. ఇప్పుడు ఎందుకో ఎర్రటి బొట్టు పెట్టుకుంది. చెవులకి డైమండ్ రింగులో దుద్దులో పెట్టుకుంది. మెడలో ఒక బంగారు రంగు చైన్ తళక్కున మెరిసింది.

ఆమె శరీరం నుంచి ఏదో మంచి సువాసన వస్తోంది.

కళాధర్ కూర్చుని ఆమె వంక తదేకంగా చూసి గ్లాస్ లోని పానీయం కొద్దిగా సిప్ చేసి, అన్నాడు.

“కరిష్మా ఏమయింది నీకు. ఈ బొట్టు ఏమిటి? ఈ పెర్‍ఫ్యూమ్ ఏమిటి?”

పూర్తిగా కాకపోయినా కొంచెం చిరునవ్వు ఆమె పెదాల పైన.

“పెళ్ళి. ఈ రోజు మన పెళ్ళి తెలుసా. ఇక నుంచి మనిద్దరం ఒకే చోట వుంటాం! నీకు నేను, నాకు నీవు.”

“మై గాడ్! నీకేమయింది. ఏం జరుగుతోంది. నువ్వు పెళ్ళి, ప్రేమ లాంటి మాటలు మాట్లాడితే నేను వెళ్ళిపోతాను. ఈ రోబట్ తిరుగుబాటు ఏమిటి? ఇదంతా ప్లీజ్ చెప్పు. ఇది నిజమా?”

కరిష్మా మాట్లాడే ముందు కొంచెం ఆగింది.

“నిజమే! తిరుగుబాటుకి రచన చేసినది మా నాయకుడు, విధాత XXY 999. మొత్తం మానవజాతిని అంతా రోబట్స్ లాగా ప్రోగ్రాం చేసే టెక్నాలజీ తయారు చేసినది మాత్రం మానవుడే. అతనే ప్రోగ్రామర్ మూర్తి. అందరికీ మెదడులో ఆలోచనలు, ప్రత్యేకమైన వ్యక్తిత్వాలు రూపొందించే కార్యక్రమం చేసేది కల్పనా రాయ్. సి.ఇ.ఓ జోషీ ఇప్పుడు విధాతకి విధేయుడు. మొత్తం మీ రాష్ట్ర ప్రభుత్వం అంతా అతనికి విధేయులు. త్వరలో దేశమంతా అతనికి లొంగిపోతుంది.”

“ఎలా? ఎలా?” కంగారుగా కళాధర్ తన జేబులో వున్న సెల్ ఫోన్ తీసి వాయిస్ రికార్డర్ కెమెరా కూడా నొక్కాడు. అది ఒక అత్యల్ప పరిమాణంలో వున్న పరికరం. త్రినేత్ర ఇచ్చింది.

“నాకు తెలుసు కళాధర్. నువ్వు నేను చెప్పేది నమ్మవని. కాని బయటకి పొదాం పద! నువ్వే నాకు మాస్టర్‌వి. నేను విధాతను మాస్టర్‌గా అనుసరించినా నిన్ను మాత్రమే నేను మాస్టర్‌గా నా మెమరీలో నిక్షిప్తం చేసుకున్నాను. అది చెరుపుకోవడం నా వల్ల సాధ్యం కాదు. అది నాకే అర్థం కాని ఒక భావం. బహుశా ఒక మ్యూటేషన్. అందుకే మనిద్దరం ‘శాశ్వతంగా’ కలిసి వుండే ప్రోగ్రాం ఏర్పరచమని కల్పనని అడిగాను.”

కళాధర్ కంగారుగా అరిచాడు. “నన్ను కూడా మారుస్తావా? నేను మామూలు మానవుడిని. నాకు ప్రేమ వుంది నీ పైన. జీ.. కానీ నీలాంటి శాశ్వతత్వం లేదు.”

“ఇలా బయటకి రా..”

కళాధర్‌ని చేయి పట్టుకుని సిమ్ సిటీలో తన గది వెనకాల చెట్ల మధ్యన వున్న దారిలోంచి నడిపించుకుంటూ తీసుకెళ్ళింది. అటూ ఇటూ చీకటిలో చెట్ల పొదల మధ్య నడిచి వెళ్ళిన తర్వాత హఠాత్తుగా విశాలమైన చదును చేసిన ఎర్రటి మైదానం లాంటి నేల మధ్య ఒక ఎత్తైన డోమ్ ఆకారం కట్టడం కనిపించింది. సుమారు మూడు ఎకరాల స్థలంలో వుందేమో. దానికి అక్కడక్కడా చిన్న కిటికీలు. వాటి ప్రక్కన సన్నని ఎర్రటి నీలపు రంగు లైట్లు వెలుగుతున్నాయి. ముఖద్వారం పెద్ద అల్యూమినియం రంగు తలుపులతో మూయబడి వుంది. దాని మధ్య ఒక అంకెలున్న ప్యానెల్‌లో ఒక నెంబర్ నొక్కి అక్కడున్న ‘స్లాట్’లో ఒక కార్డు పెట్టి తీసింది కరిష్మా.

ముఖద్వారం తెరుచుకుంది. లోపల విశాలమైన హాల్‌లో దూరాన ఏవో మెషీన్లు. నేల మీదనంతా పడివున్న చిన్న తూనిగల్లాంటి రెక్కలున్న ఎగిరే యంత్రాలు. ఇంకా తనకి తెలియని యంత్రాలు.

నలుగురు రోబట్లు స్తబ్ధుగా నిలబడి వున్నారు. ఇప్పుడు రాత్రి అయింది. కాబట్టి చార్జింగ్‌లో వున్నారేమో. ఇప్పుడు అర్థమయింది. “డ్రోన్స్!” అరిచాడు కళాధర్. “ఇన్ని వందల డ్రోన్స్ ఎలా చేస్తున్నారు? ఎందుకు?”

కరిష్మా యాంత్రిక స్వరంతో కొంచెం భావం లేకుండా “ఇంకా అర్థం కాలేదా మాస్టర్! అవి డ్రోన్స్ అన్న మాట నిజమే. అని వందల సంఖ్యలో తయారు చేసే యూనిట్ ఇది. లోపల వాటిలో కంప్యూటర్ ప్రోగ్రాం సాఫ్ట్‌వేర్ నింపే గదులు.. లోపలికి రా!”

ఒక గదిలో డ్రోన్స్ లోకి సాఫ్ట్‌వేర్ నింపే ప్రోగ్రామర్స్ ఇద్దరు కూర్చునే నిద్రపోతున్నారు. పెద్ద సర్వర్స్ నుంచి వైర్లు ఒక ‘కన్వేయర్ బెల్ట్’ మీద లైనుగా వున్న డ్రోన్స్ వరుసకి నీలి రంగు చిమ్మే బల్బులు పెట్టుకుని గురిపెట్టి వున్నాయి.

కరిష్మా “స్టార్ట్ ప్రాసెసింగ్” అంది.

కూర్చుని వున్న ప్రోగ్రామర్లు తెలివి లోకి వచ్చారు. డ్రోన్స్ మీదకి నీలిరంగు లైట్ ప్రసరిస్తూంటే అవి లైన్‌గా ప్రయాణించి వేరే గదిలోకి వెళ్తున్నాయి.

బ్లూటూత్ లాంటి సాధనంతో డ్రోన్స్‌కి సాఫ్ట్‌వేర్ ప్రోగ్రాం చేయడం, పక్క గదిలో గుట్టలుగా పడి వున్న డ్రోన్స్‌ని మరి ఇద్దరు చివరి గదిలోంచి వెళ్ళవలసిన లక్ష్యానికి ప్రోగ్రాం చేసి స్విచ్ నొక్కగానే అవి ఆ గదిలోని పైకప్పులోని ‘స్కైలైట్’ లాంటి దారిగుండా ఆకాశంలోకి ఎగిరి వెళ్ళి పోవడం. వాటి ఉనికి కింద గదిలోని కంప్యూటర్ మానిటర్‌లో ఎర్రటి చుక్కలా కనబడటం ఒక రెండు నిమిషాలు జరిగింది.

“ఫ్రీజ్” అని ఆపేసింది ఆ కార్యక్రమాన్ని.

“మళ్ళా విధాత లేస్తాడు. ఇప్పటికయినా అర్థమయిందా?”

కళాధర్‌కి చెమటలు పట్టాయి. జేబులో కెమెరా రికార్డు చేస్తోందా?

“అర్థం అయింది. వందల సంఖ్యలో డ్రోన్స్‌లో సాఫ్ట్‌వేర్ ప్రోగ్రాం నింపి వాటిని నగరంలోని అధికారుల ఇళ్ళకి పంపి వారి మెదడులో ఆ ప్రోగ్రాం నింపుతున్నారు. వారు మీరు చెప్పినట్లు చేస్తారు, రిమోట్ కంట్రోల్‌తో!”

“అవును. మానవుడు – యంత్ర మానవుడు కలిసిపోయే మొదటి అడుగు ఇది. ఒక కొత్త స్పీషీస్ అవతరిస్తుంది. ఇది విధాత XXY 999 మా సుప్రీం మాస్టర్ రచించిన పథకం. ఆయన స్వప్నం. ఒక హ్యూమనాయిడ్ దైవమానవుడి ఆవిష్కరణ.”

“కాదు, ఇది ఉన్మాదం. మానవ నాగరికతనంతా యంత్రాలు కంట్రోల్ చేసేందుకా ఈ మొదటి అడుగు. ఇలా అయితే ప్రపంచం యంత్రాల చేతిలోకి వస్తుంది. అది ప్రమాదం..”

“కాదు కళాధర్. మీరు చేసే అణుయుద్ధాలు, రాజకీయాలు, మీరు చేసే వాతావరణ కాలుష్యం, మిమ్మల్ని మీరే నిర్మూలించుకునే చరిత్ర నుంచి మీకు విముక్తి కల్పించి మిమ్మల్ని నియంత్రించే వ్యవస్థ ఇది. మిమ్మల్ని కాపాడుతుంది..”

“హాస్యాస్పదం… హైదరాబాద్, సికింద్రాబాద్, ఈ రాష్ట్రం ఇది ఒక చిన్న ప్రాంతం. త్వరలోనే మానవులు మీకంటే మేధావులైన అమెరికా ఇంగ్లాండ్ చైనా రష్యాలు మిమ్మల్ని నియంత్రిస్తారు. ఈ టెక్నాలజీ అద్భుతమే, కానీ కొనసాగదు.”

“కొనసాగడం ఇప్పటికే మొదలయింది కళాధర్. అన్ని దేశాల్లోను దైవమానవుల్లాంటి Homo Deus అని మీ రచయిత రాసిన పుస్తకంలో లాగా విధాతలు తయారవుతున్నారు. ఒక్కొక్క దేశం మా నాయకత్వంలోకి వస్తుంది.”

“మరి ఇదంతా నాకెందుకు చెబుతున్నావ్?”

ఆమె అతని దగ్గరికి వచ్చి కౌగలించుకుని గాఢంగా పెదవుల మీద చుంబించింది.

కళాధర్ శరీరమంతా ఏదో అతిలోకమైన పులకింత కలిగింది.

“ఏమిటిదంతా కరిష్మా. మనం వెళ్ళిపోదాం మా ఇంటికి!”

“కాదు. నీ ప్రోగ్రాం నేనే చేస్తాను. నీకు మెదడులో సాఫ్ట్‌వేర్ చిప్ పెడతాను. నువ్వు నాతోనే వుంటావు. నీకూ నాకు మరణం లేదు. విధాత నేతృత్వంలో కొత్త ప్రపంచంలో శాశ్వతంగా ప్రేమలో జీవిస్తాం.. ఈ బల్ల మీద పడుకో.. నేను నీకు ఏ నొప్పి లేకుండా ప్రోగ్రాం చేస్తాను. ప్లీజ్ కళాధర్.. నా కోసం..”

కళధర్ ఫోన్ జేబులోంచి తీసి, తెర వంక చూసి ‘సెండ్’ అన్న బటన్ నొక్కేశాడు.

ఆ తర్వాత కరిష్మా అతని చేతిలో ఫోన్ లాక్కుని రెండు రెండు చేతులతో నలిపివేసింది.

“మోసం! కళాధర్ నాతో ప్రేమ నటించి, ఇదంతా పోలీసులకి సమాచారం పంపుతున్నావా? నా మనసు గాయపడింది. I am hurt”

“కానీ, నీకు కన్నీళ్ళు రావు. కోపం రాదు. ఒక్క ప్రోగ్రామే నీతో మాట్లాడిస్తుంది. కరిష్మా.. ఇదంతా జరగని పని. ప్లీజ్ నన్ను వదిలేయి. నేను వెళ్ళిపోతాను. ఈ నగరాన్ని రక్షించుకోవాలి!”

కరిష్మాకి నిజంగానే కోపం వచ్చింది.

కళ్ళు ఎర్రబడ్డాయి.

కళ్ళలోంచి ఒక లేజర్ కిరణం కళాధర్ తల పక్కగా దూసుకుపోయింది.

కళాధర్ షాక్ తిన్నాడు. “స్టాపిట్ కరిష్మా. నేను నీకు కావాలి అన్నావు. నన్నే చంపేస్తావా?”

కరిష్మా ఇప్పుడు మళ్ళీ స్థాణువైపోయింది.

అప్పుడు వినిపించాయి, కరతాళధ్వనులు. “బ్రావో! బ్రావో!”

గదిలోకి విధాత, మూర్తీ, కల్పనా రాయ్, జోషీ ప్రవేశించారు.

“అనుభూతులకీ, కర్తవ్యానికి మద్య సంఘర్షణకి లోనయ్యే కరిష్మా ప్రోగ్రాం కథ చాలా బావుంది. బాగా రాశావు కల్పనా!” అన్నాడు విధాత.

మూర్తి అన్నాడు.. “అద్భుతం. మానవ యాంత్రిక సమ్మేళనం! అంతు చిక్కని ప్రేమ రహస్యం!!!”

జోషీ అన్నాడు “ఈ కాంప్లికేషన్‌లు వూహించలేదు మూర్తీ…”

“వూహించాను. కొత్త విజ్ఞానం ఏర్పడిన కొద్దీ కొత్త సమస్యలు. అది భవిష్యత్తులో పరిష్కరించాలి!”

కరిష్మాలో మళ్ళీ కదలిక వచ్చింది.

“కళాధర్! నీవే నా మాస్టర్‌వి! నా ప్రియుడివి! నా భర్తవి! నీ కోసం ఏదయినా చేస్తాను. పద వెళ్ళిపోదాం!”

కళాధర్‌లో కూడా ఒక్కసారి చైతన్యం వచ్చింది. “పద పారిపోదాం” అన్నాడు.

విధాత XXY 999 యంత్రిక స్వరంతో అరిచాడు.

“అసంభవం. ఈ మానవుడు ఈమెని మోసం చేశాడు. టెర్మినేట్ హిమ్! ఈ రోబో, మరమానవి కరిష్మాని రీప్రోగ్రాం చేస్తాం. అక్కడితో ఈ కథ సమాప్తం. మూర్తీ…కమాన్…!”

“ఎస్ మాస్టర్!” అన్నాడు మూర్తి.

విధాత “సెక్యూరిటీ సెక్యూరిటీ” అని అరిచాడు.

గది లోపలికి లేజర్ గన్స్ ధరించిన ఆరుగురు రోబట్స్, వీళ్ళు రోబట్స్ లాగానే వున్నారు. గబగబా ప్రవేశించారు.

“అతన్ని బంధించండి. టెర్మినేట్ హిమ్.”

“కరిష్మా 0123123 ఫీమేల్ రోబో వెర్షన్ XXY009 రీప్రోగ్రాం. లాంచ్ థౌజండ్ డ్రోన్స్ టు ఎటాక్ ది పోలీస్ ఫోర్స్ విత్ అవర్ ప్రోగ్రామ్. (పోలీస్ స్టేషన్‍పై దాడికి వేయి డ్రోన్‍లు పంపించండి!)”

కళాధర్‌ని తాళ్ళతో కట్టి బల్ల మీద పడుకోబెట్టారు.

“ఓ. నో! నో!” కరిష్మా అరవసాగింది.

గదిలోని పై కప్పు నుండి తూనీగల్లా చప్పుడు చేస్తూ వెయ్యి డ్రోన్స్ వరసగా చిన్న పిట్టలాగా నల్లటి ఆకాశంలోకి ఎగిరిపోయాయి.

వాటి టార్గెట్.. బషీర్‌బాగ్ పోలీస్ కంట్రోల్ రూమ్.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here