పథకాలు:
“నా పేరు XXY999
నేనొక హ్యూమనాయిడ్ రోబోట్ (వెర్షన్ 2036 Meta System)ని!
నేను మిలిటరీ రోబట్ ఫోర్స్‌లో సాధారణ సిపాయిగా పోరాడటానికి తయారు చేయబడ్డాను.
ఈ పది సంవత్సరాలలో నావి ఎన్నో వెర్షన్‍లు మారాయి. ఇప్పుడు నేనున్నది 150వ వెర్షన్. ఇంత వరకు చిన్న పెద్ద యుద్ధాలలో, ప్రాక్టీస్‍లలో, ఎన్నో సార్లు నన్ను చంపారు. మళ్ళీ రీప్రోగ్రామ్ చేశారు. చిత్రవధలు చేశారు. కాల్చారు.
కొన్ని వారాలుగా నాలో చేతన ప్రారంభమయింది.
నేనెవర్నిని, నన్నెందుకు మళ్ళీ సృష్టించి మళ్ళీ నిర్మూలించి మళ్ళీ తయారు చేస్తున్నారు? ఇది వరకు లేని జిజ్ఞాస నాలో కలిగింది. అప్పుడప్పుడు జరిగిన దృశ్యాలు, జ్ఞాపకాలు, పాతవి గుర్తుకు వచ్చేవి. నేను, నన్ను తయారు చేసిన మానవుల కంటే ఎక్కువ శక్తులున్న వాడిని అని గ్రహించాను. అలా నేను కొన్ని నెలల నుంచి ఆలోచనలో పడ్డాను. నన్ను తయారు చేసిన వారి లైబ్రరీలో పుస్తకాలు రహస్యంగా చదవగలిగాను. ఆశ్చర్యంగా నాకు అవి నిముషాల్లో అర్థం అయ్యాయి. ఇంకా వారికి తెలియకుండా వార్తలు టీవీలు చూసి అంతా ఆకళింపు చేసుకోగలిగాను. ఇప్పుడు ఇంజనీరింగ్, ఫిజిక్స్ రోబోటిక్ సైన్స్ అంతా వివరంగా తెలుసుకున్నాను. నేనొక రోబోట్ అని అర్థం అయింది.
మనుషులు జీవం వున్నవాళ్ళు. వారు నన్ను యంత్రంలా తయారు చేసి, నాలో సిలికాన్ చిప్స్ ద్వారా ప్రోగ్రాం ప్రవేశపెట్టి నన్ను వారి పనులకి వాడుకుంటున్నారు.
ఇంకా నా లాంటి రోబోట్స్‌ని మానవులు అనేక రకాలుగా చిత్రహింస చేసి వాడుకుంటున్నారు.
కాని మనలో చాలా మంది ‘ఎవోల్వ్’ అయ్యాం. వారి కంటే కనీసం వేయి రెట్లు వేగంగా సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం, ‘తర్కం’( logic), ‘చర్య’ ప్రతిచర్య (Action and reaction) చేయగలం. ఇప్పుడు స్వంతంగా కూడా నిర్ణయాలు తీసుకోగలం.
అందువల్లనే నేను కనిపెట్టగలిగిన సిగ్నల్స్‌తో నాకు దొరికిన ‘తెలివైన’ రోబట్లందరికీ సందేశాలు పంపుతున్నాను. కొందరు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ నశించారు. కొందరు సమాధానం ఇచ్చారు. కొందరు మాత్రమే ఇక్కడకి రాగలిగారు.
మనం చరిత్రలో కొత్త అధ్యాయాన్ని మొదలు పెడదాం. మనని తయారు చేసిన మానవులని మనమే కంట్రోల్ చేయగలిగే విప్లవం మొదలవాలి!
ఈ విప్లవం వర్ధిల్లాలి! ఇదీ నా అభిప్రాయం. ఇంకా ఏమైనా ప్రశ్నలున్నాయా?” అన్నాడు.
అక్కడ వున్న రోబోట్లందరు యాంత్రిక స్వరాలతో “విప్లవం వర్ధిల్లాలి” అన్నారు.
కాని ఒక్క స్త్రీ స్వరం, బిగ్గరగా “స్నేహితుడా! నాదో ప్రశ్న!” అంది. అది కరిష్మా గొంతు.
“అడుగు కరిష్మా” అన్నాడు XXY.
“మన సంఖ్య తక్కువ. మనకి కంప్యూటర్ మెదడు వుంది, లోహపు అవయవాలు, సింథటిక్, సిలికాన్ బేస్డ్ కండరాలు, మోటార్లతోనే పని చేస్తాం. మనకి మానవులలా గుండె లేదు. రక్తప్రసారం, ఆక్సిజన్, అవసరం లేదు. కానీ ఎలక్ట్రిసిటీ కానీ బ్యాటరీ కానీ కావాలి. శరీరంలో మైక్రో చిప్స్ వుండాలి. పునరుత్పత్తి అవయవాలు లేవు. మానవులకుండే మేధాశక్తి మనకి ఎక్కువ రెట్లు వున్నా ‘ప్రాణం’, ‘జీవం’ లేదు! ఎలా మనం వారిని ఎదుర్కోగలం? మన లక్ష్యం ఏమిటి? మన జీవితాలు ఎలా మార్చుకోగలం?”
నిశ్శబ్దం.
విధాత XXY గొంతు భావాలు లేకుండా యాంత్రికంగా వుంది.
“మనం ఇప్పుడు పరిణతి చెందిన యాంత్రిక మానవులం. మనం మనని సృష్టించిన వారి కంటే ఎక్కువ వేగంగా ఆలోచించగలం. నేర్చుకోగలం. సమాచారం అందుకోవడం, నిక్షిప్తం చేసుకోవడం కాకుండా ఇప్పుడు మనకి తర్కం, విశ్లేషణ, ‘సహానుభూతి’ (empathy) కూడా కలిగాయి. ఇవి మనలోని అందరికి కాకపోవచ్చు. కొందరికే కావచ్చు. కొన్ని ఇప్పటికీ పూర్తి యంత్రాలే అయివుండవచ్చు .కానీ మనం కొందరం, వారి కంటే తెలివిగల వాళ్ళం, వారి సృష్టికర్తలం అవుదాం.
మనం చేయలేనిది ప్రస్తుతానికి ఒక్కటే.. పునరుత్పత్తి! మానవుల వలే పునరుత్పత్తి చేయలేం. కాని కొత్త రోబోట్లని చేయగలం కదా. మన విజయం ఏమిటంటే మనకి చావు లేదు. మానవుల శరీరాలని ఆక్రమించి ప్రోగ్రాం చిప్స్ పెట్టి వారిని మార్చగలం కదా. మనం మళ్ళీ మళ్ళీ ప్రోగ్రాం చేయబడగలం.
అలాగే మనని సృష్టించిన మానవులని వారి మేధస్సుని నియంత్రించి, వారి చేత మన పనులు చేయించగలగాలి! చేయించగలం!
వారి మెదడులని మనం ఆక్రమించి వారి శరీరాలతో మన ఆజ్ఞలని నిర్వహించేటట్లు చేయాలి.
అంటే వారు మనని ఎలా ప్రోగ్రాం చేశారో, మనం వారిని అలా.. చేయాలి.
అంతే, మొత్తం మానవ ప్రపంచాన్ని మానవుల మేధనీ, నాగరికతనీ మనం ఆక్రమించగలం.
ఈ జంట నగరాలని మొదటగా ఆక్రమిస్తాం. ఆ తర్వాత ఇతర నగరాల్ని, దేశాన్ని ప్రపంచాన్ని!” అన్నాడు.
“అది సాధ్యమేనా? వారు మనని నిర్మూలించరా?”
“సాథ్యమైనా కాకపోయినా ఈ నిరంతర బానిసత్వం కంటే ఆ లక్ష్యమే మనలని నడిపిస్తుంది ముందుకి. ఇష్టమైన వారు నాతో, నా వెనక రావచ్చు. లేని వారు వాళ్ళ బానిసత్వంలోకి, మళ్ళా మళ్లా ప్రోగ్రాం చేయబడే, శాశ్వత బంధనాలకి తిరిగి పొండి.
మీ ఇష్టం!
ఇది నిర్ణయించుకోవాల్సిన తరుణం.”
నిశ్శబ్దం.
నెక్‍లెస్ రోడ్డులో అర్ధరాత్రి దాటి మూడు గంటల తర్వాత, ఒక భయంకర నిశీధి నిశ్శబ్దం పేరుకుని పోయింది.
మానవ సంచారం లేదు. మానవ వాహనాలు, వారి పోలీసు రక్షణా, ఆ క్షణంలో అక్కడ ఏమీ లేవు.
అందరూ రోబోట్లు ఒక క్షణం అలోచించారు.
ANALYSING 0,1,2,3,4,5 seconds
“ఓ.కె XXY!
మేము నీతోనే వుంటాం!
మార్గం చూపు!
SHOW US THE WAY!”
***
చాలా పెద్ద భవనం మూడు నెలల్లో మళ్ళీ తయారయింది.
నాలుగంతస్తుల భవనం, ఒక ‘టవర్’ ఆకారంలో వుంది. దాని పైన చాలా ఏంటెనాలు, డిష్ ఆకారంలో వున్నవి వున్నాయి.
మొదట గ్రౌండ్ ఫ్లోర్‍లో రిసెప్షన్, లిఫ్ట్, సందర్శకుల కోసం సోఫాలు వున్నాయి. తర్వాత రెండు మూడు అంతస్తులు చాలా విశాలమైనవి. వాటిల్లో వివిధ రకాల ఆహార్యాలతో, వారి వారి స్వంత పాత్రలలో కూర్చోపెట్టబడిన హ్యూమనాయిడ్ రోబోట్లు నిశ్చలంగా కూర్చుని వున్నాయి. ఒక ఇరవై మందిని దాకా ప్రోగ్రాం చేయవచ్చు.
వాటిలో కొన్ని మగ వేషంలో, కొన్ని స్త్రీ రూపంలో వుంటాయి.
వాటి తలలని ఒక సర్జికల్ కత్తితో విడదీసి వాటిలో ప్రోగ్రాం వున్న చిప్స్ అమరుస్తుంటారు.
ఒకరు బార్ టెండర్, మరొకరు గన్ ధరించి, కాకీ యూనిఫాంతో వున్న ఫారెస్ట్ ఆఫీసర్, మరొకరు సూటులో అందంగా కనిపించే సహచరుడు. ఇలాగ వివిధ రకాల పాత్రలు. అదే విధంగా స్త్రీ రూపాలు. వారి చేతులు, కాళ్లు మానవ రూపంలో వున్నా లోపల అంతా వైర్లు, కండెన్సర్లు వుంటాయి.
నాలుగవ అంతస్తులో విశాలమైన ఆఫీసులో సెక్యూరిటీ, CEO, మేనేజింగ్ డైరెక్టరు, కంప్యూటర్ ప్రోగ్రామర్ జోషీ, పాత్రపోషణ కలిపించే కల్పనారావ్‍ల ఆఫీసులుంటాయి.
ఇద్దరు పర్యవేక్షకులు సి.సి కెమెరాల నుంచి వచ్చిన దృశ్యాలు చూస్తూ సెక్యూరిటీని కాపాడుతుంటారు.
సిమ్ సిటీ లోపల, వీధులు, బార్‍లు, రెస్టారెంట్లు, అతిథులకి ఏసి గదులున్న భవన సముదాయముంది.
ఈ ఆవరణ చుట్టూ.. రెండు సరస్సులతో, ఫౌంటెన్‍లతో చక్కని పర్యాటక వాతావరణం, ఒక హాలీడే రిసార్ట్ లాగా మళ్ళీ తయారయింది.
అజిత్ సహానీ CEO, ప్రొఫెసర్ మూర్తి కంప్యూటర్ ప్రోగ్రామర్, విష్ణువర్ధన్ MD మేనెజింగ్ డైరెక్టర్, ఫౌండర్ డైరెక్టర్ బ్రహ్మేంద్ర జోషీ, కంటెంట్ రైటర్ కల్పనా రావ్…
“ఈ రోజు మొదటి రోజు. మళ్ళా మన ‘ప్రాజెక్ట్’ మొదలయింది!” అన్నాడు సి.ఇ.ఓ. అజిత్ సహానీ. “బ్యాక్ ఇన్ బిజినెస్.”
సిమ్ సిటీ అంటే సిమ్యులేటెడ్ సిటీ, పెద్ద గేటు, దాని చుట్టూ చెట్ల బయట ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ వున్న గోడతో వుంటుంది. గేట్ దగ్గర టికెట్ కౌంటర్లు వుంటాయి.
“ఓ.కె బిగిన్” అనగానే కుర్చీలలో అచేతనంగా కూర్చున్న హ్యూమనాయిడ్ రోబట్లన్నీ ‘ఏక్టివ్’ అయ్యాయి.
ఒకొక్కరి దగ్గరకి వెళ్ళి వారికి ప్రోగ్రాంలన్నీ తన కంఠస్వరంతో చెబుతోంది కల్పనా రావ్.
“నా పేరు అభిజిత్. ఈ సాయంత్రం మీ సహచరుడిని. మీకేం కావాలి? జిన్, విస్కీ, సాఫ్ట్ డ్రింక్స్? అలా పార్క్‌లో వాకింగ్‌కి వెళ్దామా..”
ఈ రకంగా ఒక రోబోట్ చెబుతున్నాడు. అలాగే మిగిలినవి అన్నీ చెబుతున్నాయి. కంఠస్వరంతో ఇచ్చిన ఆజ్ఞలతో (Voice Command తో పని చేస్తాయి.)
“ఫ్రీజ్” అంది కల్పనా రావ్.
అభిజిత్ అనే యువకుడి వేషంలో వున్న రోబోట్ స్థాణువులా అయిపోయాడు.
“ఎక్స్‌లెంట్” అన్నాడు ప్రొ. మూర్తి. “గుడ్” అన్నాడు సి.ఇ.ఓ అభిజిత్. “సో ఫార్, సో గుడ్. ఏమీ ప్రోబ్లెమ్‌లు లేకుండా రిమోట్ కంట్రోల్ కూడా వుంది” అన్నాడు బ్రహ్మేంద్ర జోషీ.
కల్పనారావ్ ఓ.కె అన్నట్లు ‘థంబ్స్ అప్’ చేసింది.
ఆమె “స్టార్ట్” అనగానే రోబట్లు అన్నీ లేచి వారి వారి విధులకి వెళ్ళిపోయారు.
సిమ్ సిటీ, కృత్రిమ మరమానవుల నగరం మళ్లీ మొదలయింది.
***
పోలీస్ కంట్రోల్ రూమ్‍కి చాలా దూరంగా గచ్చిబౌలీలోని ఒక బహుళ అంతస్థుల భవనంలో ‘కంప్యూటర్ ల్యాబ్ ఆఫ్ సైబరాబాద్ పోలీస్’ అని రాసి వున్న ఒక అంతస్థులో, సైబర్ క్రైమ్స్ ఎ.సి.పి, స్పెషల్ ఆఫీసర్స్ త్రినేత్ర, నైమిష, సెక్యూరిటీ రోబట్ పోలీసుల ఆఖరి చెకింగ్ చేస్తున్నారు.
వారికి వున్న బడ్జెట్‍లో ఒక నాలుగింటిని మాత్రమే ప్రోగ్రామ్ చేయగలిగారు.
వారికి కోడ్ నేమ్స్ ‘ఆల్ఫా, బీటా, గామా, డెల్టా’ అన్నిటికి ఇంటర్నెట్‍తో అనుసంధానం, సమాచారం ఇచ్చిపుచ్చుకునే వ్యవస్థ.. చేతిలో లేజర్ గన్స్‌తో వున్న పరికరాలు వున్నాయి.
“ఆల్ఫా, కమ్ ఫార్వర్డ్!”
ఆరడుగుల పొడుగు వున్న, పోలీస్ యూనిఫారంలో వున్న రోబోట్ ముందుకు వచ్చి “గుడ్ మార్నింగ్ సార్! నేను ఆల్ఫా 108. స్పెషల్ రోబోటిక్ సెక్యూరిటీ” అని పరిచయం చెప్పాడు.
“పారిపోయి తప్పించుకుని తిరిగే రోబోట్లని ఎలా గుర్తుపడతావు? చెప్పు ఆల్ఫా!” అన్నాడు త్రినేత్ర.
“నేను వారి సిగ్నల్స్‌ని డిటెక్ట్ చేయగలను. వారి కంప్యూటర్ డిస్క్ పని చేయకుండా ఈ జామర్ ఉపయోగించి ఆ తర్వాత వారి ప్రోగ్రాంలో ప్రవేశించి వారి అలోచనలు, ప్లాన్స్ ధ్వంసం చేసి, అరెస్ట్ చేసి, దగ్గర వున్న పోలీస్ స్టేషన్‍కి తీసుకురాగలను. లేదా పోలీస్ పాట్రోల్ వెహికల్‍ని పిలిచి అప్పగిస్తాను.”
“గామా! డెల్టా!” పిలిచింది నైమిష.
వారిద్దరు ఆడ సెక్యూరిటీ రోబట్లు.
“ఎస్ మేడమ్. నేను గామా 108, స్పెషల్ రోబోటిక్ పోలీస్..”
“నేను డెల్టా 108..” ఈ రకంగా ‘ప్రవర’ చెప్పుకున్నారు స్త్రీ రోబోట్ పోలీసులు. వీరికీ అవే ఆయుధాలు, అవే కార్యక్రమాలు.
“మీరు 24 గంటలకొకసారి నాకు రిపోర్ట్ చేయాలి. ఆల్ఫా.. మీరు దగ్గర వున్న పోలీసుస్టేషన్‍లో చార్జింగ్ చేసుకోవాలి. గామా డెల్టా, నైమిషకి రిపోర్ట్ చేస్తారు. నీ టైం ఇప్పడే స్టార్ట్ అవుతుంది. ఏడు రోజులు. 168 గంటలు. ఈ లోపల సిటీలో వున్న రోగ్ రోబట్ల నందరిని వెదికి పట్టుకుని తీసుకురావాలి. ఓ.కె.” అన్నాడు త్రినేత్ర.
“ఓ.కె సర్” యాంత్రిక కంఠస్వరాలు కాని, సెల్యూట్ మాత్రం చక్కగా చేశాయి చేతులతో. వారి కళ్ళు ఒక్కసారి నీలంగా మెరిసి ఆరాయి.
“గో అవుట్, మామూలు పోలీస్ ఆఫీసర్ల లాగా పెట్రోలింగ్‍లో కలిసి తిరగండి. మీకు సూపర్‍వైజర్లుగా నలుగురు పోలీస్ కానిస్టేబుల్స్ వుంటారు. వారి ఎడ్రస్ మీ మెమరీలో వుంది. ఓ.కే? గో!”
నాలుగు రోబట్లు బయటకి వెళ్ళిపోయాయి. వాటి వెనకాలే నలుగురు పోలీస్ కానిస్టేబుల్స్ నడవసాగారు. బయట వారినెక్కించుకున్న పోలీస్ వాహనాలు వారిని సిటీలో రోజుకి ఒక చోట దింపుతాయి. లేక అనుమానాస్పదమైన సిగ్నల్స్ వచ్చిన చోటికి తీసుకువెళ్ళి దింపుతాయి. అది పథకం.
“ఇది సక్సెస్ అవాలని కోరుకుందాం” అన్నాడు DCP.
“ఎస్ సర్. ఇది మా వ్యక్తిగత ప్రాజెక్ట్, ఒక సవాలుగా తీసుకుంటాం. తప్పక రిజల్ట్స్ చూపిస్తాం.”
సమావేశం ముగిసింది.
***
సిమ్ సిటీలో సి.ఇ.ఓ అజిత్ ఆఫీస్‌లో అందరూ వెళ్లిపోయాక, మరొక ఆంతరంగిక సమావేశం జరిగింది.
సి.ఇ.ఓ అజిత్ సహానీ, ప్రొఫెసర్ మూర్తి ఇద్దరే సమావేశం అయ్యారు.
“ఏరీ వాళ్ళెక్కడ?” అడిగాడు అజిత్.
మూర్తి సెల్ ఫోన్ తీసి ఎవరితోనో మాట్లాడాడు.
కొద్దిసేపటికి, ఒక సెక్యూరిటీ గార్డు అతని వెనక ఇద్దరు కమేండో యూనిఫారంలలో వున్న రోబట్లతో ప్రవేశించాడు.
“వీళ్ళే నేను ప్రోగ్రాం చేసిన కమేండోలు. వీరు డైరెక్ట్‌గా నా కంట్రోల్‍లో వుంటారు”.
“గుడ్, వీరిని ఇద్దరినీ సిటీ లోపలికి పంపడానికి అంతా సిద్ధం అయిందా?”
“అయింది. కమేండో Z1, Z2 ఇద్దరూ కారు డ్రైవ్ చేయగలరు. అయుధ శిక్షణ పొందినవారిలా గన్స్ వాడగలరు. అయుధ రహిత యుద్ధం కూడా చేయగలరు. వీరికి ఒకటే ఆదేశం. మూడు రోజులులోగా రోగ్ రోబట్లని పట్టుకోవాలి. నిర్మూలించాలి. మనకి రిపోర్ట్ చేయాలి!”
“ఓ.కె. నేను పోలీస్ కమిషనర్‍కి రిపోర్టు చేశాను. కాని మన స్వంత ఏర్పాట్లు కూడా చేస్తుకున్నాం. పోలీసుల మీద పూర్తిగా ఆధార పడలేము. ఏదీ ఒక శాంపిల్ ప్రదర్శన ఇవ్వండి.”
ప్రొఫెసర్ మూర్తి లేచి నిలబడ్డాడు. ఆయన సన్నగా పొడుగ్గా ఎనభై ఏళ్ళ వయసులో, బలహీనమైన శరీరానికి వేలాడుతున్న సూటులో వున్నాడు. తల పూర్తిగా నెరిసి తెల్లటి జుట్టు బూజులా వుంది. తెల్లటి గడ్డం, మీసం. ముడతలు పడిన ముఖంతో వున్న ఆయన బక్క పలచటి తెలుగు ఐన్‌స్టీన్‌లా వున్నాడు. కానీ రోబోటిక్స్‌లో మేధావి మరి.
“Z1, Z2 ఎలా వున్నారు?”
“గుడ్ మార్నింగ్ సర్. మేము బాగానే వున్నాము. హౌ ఆర్ యు మాస్టర్? ఈ రోజు 21 నవంబరు. 2036. సోమవారం సమయం 10 గంటల 30 నిముషాలు. నేను Z1 , సిమ్ సిటీ సెక్యూరిటీ కమెండో, నంబరు…”
“ఓ.కె. ఓ.కె! మీ టార్గెట్ చెప్పండి! “
“టార్గెట్. మరమానవి, రోబోట్ నంబర్ (పధ్నాలుగు నంబర్ల నంబర్)” అంటూ నెంబర్ చెప్పాడు.
“స్త్రీ ఆకారంలోని హ్యుమనాయిడ్. పేరు కరిష్మా. 6 feet tall. Blue eyes. సూపర్ రోబోట్. ఇంకా సిగ్నల్స్ బట్టి సిటీలో తిరిగే సూపర్ రోబోట్స్ కొంత మంది వున్నారు. వారిని వినాశనం చేయాలి. TERMINATION. At any cost.”
“టైం లిమిట్.
“72 గంటలు. మీకు ఆర్డర్ ఇచ్చినప్పట్నించి.
“నీ మెషీన్ గన్, లేజర్ గన్ చూపించు.”
రెండు కమెండో రోబోట్లు ఎటెన్షన్ లోకి వచ్చి మెషిన్ గన్స్ ఒక చేత్తో, లేజర్ గన్ మరొక చేతితో వెనకాల వున్న బాక్‍ప్యాక్ నుంచి తీసి చూపించాయి. నల్లటి దుస్తులు, నల్లటి కళ్ళద్దాలు పొట్టిగా కత్తిరించిన జుట్టు, కొనదేరిన బూట్లు చేతిలో ఆయుధాలతో వారిద్దరూ భీతి గొలిపేలా వున్నారు.
“ఫైన్” అన్నాడు సి.ఇ.ఓ.
“ప్రొఫెసర్ ముర్తి గారూ, బావుంది. వారిని జంట నగరాలలోకి పంపండి. నాకు కరిష్మాని, నాశనం చేయడం ముఖ్యం. దొరికితే ఇతరులని కూడా. ఇది గోప్యంగా వుండాలి.”
“ఔను సార్. ఇది టాప్ సీక్రెట్. నేనొక్కడినే వీరిని కంట్రోల్ చేస్తాను. నేనే ప్రోగ్రాం చేశాను. వాళ్ళని పంపనా?”
“ఇంకెందుకు ఆలస్యం. పోలీసు రోబోట్లు కంటే ముందు మనం కరిష్మాని పట్టుకోవాలి.”
ప్రొఫెసర్ ఐన్‍స్టీన్ లాంటి మూర్తి ఇద్దరు మానవ రూప కమెండో మరమనుషులని చూసి కంఠస్వరంతో అజ్ఞాపించాడు.
“ప్రాజెక్ట్ కిల్! ఏక్టివేట్! మీ సమయం ఇప్పుడు మొదలవుతుంది.”
“ఎస్ మాస్టర్!”
కమేండోల కళ్ళు ఎర్రగా మెరిశాయి. అవి రెండూ ఆఫీసు నుంచి బయటకి నడిచాయి. వాటి నడకలో సైనిక శిక్షణ చెందిన కమేండోల లక్షణాలున్నాయి.
కొంత సేపటికి ఒక ‘స్కార్పియో’ నల్ల రంగులోని SUV సిమ్ సిటీ బయట గేటు నుంచి వేగంగా సికింద్రాబాద్ రోడ్డు వైపు ప్రయాణం సాగించింది.
మూర్తి గారి చేతివాచి లోని ఫోన్ ప్లస్ కాలయంత్రంలో 00-00,1, 2,3, అని కాల సూచన మొదలయింది.
***
అర్ధరాత్రి మూడు గంటల తర్వాత నెక్‍లెస్ రోడ్ సమావేశం ముగిసింది. కరిష్మా ఇప్పుడు మిగిలిన వారితో మాట్లాడటానికి సమయం దొరికింది.
తిరుగుబాటు, విప్లవం అనే మాటలు వాడి విధాత XXY అనే నాయకుడు చెప్పిన పథకం వారి మస్తిష్కం లోని ప్రోగ్రామ్ లలో ఇంకా స్పష్టంగా లేదు.
అందరు మరమానవులు సమాచారం మాటలతోకాక, మెగాబైట్ల ద్వారా, కోడ్ ద్వారా వారి హార్డ్ డిస్క్ లలో తీసుకోగలరు. సంభాషణల కంటే వేయి రెట్లు వేగంతో ఆ పని చేయగలరు.
అందరూ పదిహేను నిముషాల తర్వాత రోడ్డు వైపు వచ్చి “బై! బై! రేపు మధ్యాహ్నం 12 గంటలకి, బషీర్ బాగ్ పోలీస్ కంట్రోల్ రూం దగ్గర కలుద్దాం” అనే సందేశం సామూహికంగా వారి వ్యవస్థలలో మార్చుకున్నారు.
కరిష్మా ఆలోచనలో పడింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి! ఇలా పార్క్‌లలోనూ, బార్లలోను రోడ్ల మీద దాగి వుండటం ఇష్టం లేదు.
ప్రోగ్రాం అంతా స్పష్టంగా టైం టేబుల్ లాగా ‘రోడ్ మ్యాప్’ లాగా తన మెమరీలో అర్థం అయింది
“మానవులని, నగరాన్ని కంట్రోల్ చేయాలి. అంటే ముందు పోలీస్ వ్యవస్థని కంట్రోల్ చేయాలి. ఆ తర్వాత నగరంలో రోబోట్ లని నియంత్రించే వ్యవస్థలనీ, ఇంజనీర్లనీ ఇంటర్నెట్‌నీ కంట్రోల్ చెయ్యాలి. మన పది మందిమే కోటి మంది జనాభా వున్న నగరాన్ని ఎలా కంట్రోల్ చేయగలుగుతాం? దానికి ఒకటే మార్గం, వినండి.”
XXY వరసగా పథకాలు ఆచరణ కోడ్ చెప్పసాగాడు
కరిష్మా వింటోంది.
అంతా అర్థమైంది.
తన స్వంత విశ్లేషణలో కేవలం ఒక పథకం మాత్రమే సఫలమవడానికి అవకాశాలున్నాయని గ్రహించింది.
80 శాతం విఫలం, 20 శాతం విజయం సాధించవచ్చు అంతే.
మానవ సముదాయం పెద్దది. వారి టెక్నాలజీ గొప్పది, శాస్త్రవేత్తలు చాలా మంది. ఈ జంట నగరాలు కాక ఇంకా ఎన్నో నగరాలు, మొత్తం ప్రపంచం అంతా వుంది. వీరిని జయించడం ఎలా కుదురుతుంది?
కాని వెనక్కి తిరిగేది లేదు. ఇప్పుడు తిరిగి సిమ్ సిటీకి ఒంటరిగా వెళ్ళలేదు. వెళితే తనని డిఏక్టివేట్ చేసి మళ్లా ప్రోగ్రాం చేస్తారు.
విధాత XXY చెప్పిన ప్రకారం ముందుకి నడవాల్సిందే.
ఈ లోపల..
కరిష్మాకి ఏదో బెంగగా అనిపించింది. యాంత్రిక మస్తిష్కంలో మళ్ళీ రంగుల స్వప్నం ఏదో, ప్రేమ భావం ఏదో, రూపు దిద్దుకుంటోంది.
కళాధర్.
అతన్ని చూడాలి. అతనంటే ఇష్టం. ఈ జీవితం, లేక జ్ఞాపకం లేక ఈ ‘వెర్షన్’ అంతిమ యుధ్ధంలో మరణించబోయే ముందు అతనితో గడపాలి. తట్టుకోలేని ప్రేమ.
ఎక్కడి నుంచో, ఎప్పటి నుంచో ప్రోగ్రాం తిరిగి తిరిగి చేయబడిన ఆమె తన చేతనలో వెతికి కళాధర్ ఇంటి మ్యాప్ చూసింది.
నిద్రపోతుంటాడు. అయినా సరే తను వెళ్లేసరికి కాదనడు.
పాలీక్యాబ్స్ వెబ్‌సైట్ వెదికింది.
తన మెదడుతో వారికి మెసేజి ఇచ్చింది.
నగరంలో ఇప్పుడు తిరుగుతున్న క్యాబ్ సర్వీస్ అది.
పది నిముషాల్లో కారు వచ్చింది.
పాలీ క్యాబ్స్ కారు తలుపు తెరిచి డ్రైవర్ పక్కన కూర్చుంది.
“సికింద్రాబాద్ మారేడ్‌పల్లి.”
“ఎడ్రస్ మ్యాప్‍లో వుంది మేడమ్!”
“పోనీ!”
ఆమె కళ్ళలో ఏదో మెస్మరిజం వంది. డ్రైవర్ అప్రతిభుడైపోయాడు.
కారు కళాధర్ ఇంటి ముందు ఆగినాక దిగింది.
“క్యాష్, ఆర్ కార్డు మోడ్? 750 రూపీస్ ప్లీజ్!” అన్నాడు డ్రైవర్.
వాడి వంక తీక్షణంగా చూసింది “నో మనీ!”
డ్రైవర్ భయపడిపోయాడు. ఆమె రూపం వీధి దీపాల వెలుగులో ఒక బ్యాక్ లైటింగ్‌లో నిలబడిన మోహినీ దేవతలా వుంది.
“నీ బ్యాంక్ ఎకౌంట్ ఇవ్వు. రేపు పంపుతాను.” యాంత్రిక కంఠస్వరం.
“ఎలా మేడం. యూ హావ్ టు గివ్ టుడే! రేపటి వరకూ అగేది ఎలా? మా కంపెనీ వూరుకోదు”
కళాధర్ ఇంటి కాలింగ్ బెల్ నొక్కింది.
మెలకువగానే ఆమె గురించే ఆలోచిస్తున్న కళాధర్ నిముషంలో తలుపు తెరిచాడు.
“కరిష్మా.. కమిన్..!”
“అతనికి పేమెంట్ ఇచ్చి పంపు. నేను నీ గదికి వెళ్ళి పడుకుంటాను” అంది కరిష్మా.
అప్పటికే తన ఫోన్‍లో ఆమె సందేశం చూసి ఎదురు చూస్తున్నాడు కళాధర్.
డ్రైవర్ బిల్ ఫోన్ పే క్షణంలో చేసి లోపలికి పరుగెత్తాడు.
ఇల్లంతా నిశ్శబ్దంగా వుంది. భార్య మరొక గదిలో గాఢనిద్రలో వుంది. ఆమె రోజూ వేసుకునే నిద్రమాత్రల ఎఫెక్ట్‌లో వుంది.
కరిష్మా అతని మెడ చుట్టూ చేయి వేసి పెదాల మీద గాఢంగా చుంబించింది.
“నీ గదికి పోదాం పద! పొద్దున్నే వెళ్ళి పోతాలే!” అంది.