ఆక్రమణ
[dropcap]ఏ[/dropcap] దేశంలోనయినా వ్యాపారానికీ రాజకీయానికీ ఆర్థికమైన గొలుసులతో అనుబంధాలుంటాయి.
ఉండక తప్పదు.
రాజకీయవేత్తలు, అధికారంలోకి రావాలంటే ఎన్నికలలో ఓట్లకీ, పార్టీ నడపడానికీ ధనం కావాలి. దానికి విరాళాలు కావాలి.
కోట్లల్లో.
ఇవి స్వంత ఖర్చుతో ఎవరూ చేయరు. ధనవంతులు, పెట్టుబడిదారులైన వ్యాపారవేత్తలు ఇస్తారు.
తాము గెలుస్తారు అనుకున్న రాజకీయ గుర్రాల మీద వారు పణంగా కోట్ల రూపాయలు పెడతారు.
ఆ తీసుకున్న డబ్బు వాళ్ళు తిరిగి రాబట్టాలంటే మళ్ళీ వ్యాపారం చేయాలి.
వ్యాపారంలో న్యాయంగా చేయడం ఉంటే లాభాలు రావు. న్యాయం, నిబంధనలు అతిక్రమించాలంటే రాజకీయ నాయకుడు అధికారంలోకి రాగానే, వ్యాపారవేత్తలకి సాయం చేస్తాడు. ఇలా మళ్ళీ సంపాదన చేయాలి
సిమ్ సిటీ స్థాపకుడు బ్రహ్మేంద్ర జోషీ కూడా ఇలాగే చేశాడు. మంత్రులతో ముఖ్యంగా హోమ్ మంత్రి, ఆర్థిక మంత్రులతో, టెక్నాలజీ వ్యవహారాల మంత్రులతో ఒప్పందాలు ఎపుడో కుదుర్చుకున్నాడు. విపరీతమైన డబ్బు సంపాదించాలంటే కొత్త కొత్త ఆకర్షణలు వుండాలి.
రోబట్ల కొనుగోలులో, వాటిని వ్యాపారానికి ఉపయోగించడంలో కొత్త మార్గాలు, కొత్త ఆకర్షణలు కొత్త పుంతలు తొక్కాలి.
ఈ వ్యాపారంలో 2030లో కూడా సహజంగానే చైనా దేశం ముందుకు పోయింది. హ్యుమనాయిడ్ రోబట్లని తయారు చేయడంలో కొత్త, ఆధునాతనమైన టెక్నాలజీని కనిపెట్టి (‘Empathy’, ‘Emotion’,) ‘సహానుభూతి’, ‘అనుభూతి’ వున్న మానవాకార రోబోట్లను ప్రోగ్రాం చేయడం కనిపెట్టారు.
ఇవి ఇండియాలోకి దిగుమతికి, నైతికంగా ‘ఎథికల్ కమిటీలు’ ఒప్పుకోలేదు. వీటిని కొనడం, దిగుమతి చేసుకోవడం కేంద్ర ప్రభుత్వం నిషేధించింది.
కాని బ్రహ్మేంద్ర జోషీ వీటిని చీకటి బజారులో కొన్నాడు. భాగాలు విడి విడిగా తెప్పించి అసెంబుల్ చేయడం, ప్రోగ్రాం చేయడం, వాటి ‘మెమరీ’లో అనుభూతి కల పాత్రలు సృష్టించడం ఇవన్నీ మూర్తిగారి సహయంతో చేశారు. అలాగే సిమ్ సిటీ తయారుయింది.
మంచి లాభాలు నిలబడి రాబట్టింది. వీటిలో మంత్రిగారికి వాటాలు వెళ్ళిపోతాయి. హోం, టెక్నాలజీ మంత్రులకీ కూడా వాటాలు వుండటంతో పోలీసులు, రోబోట్లని తయారీ నియంత్రించే కమిటీలు కూడా చూసీ చూడనట్లు పని చేశాయి.
నిషేధించబడానికి ఒక కారణం – అవి కృత్రిమ మేధ, అనుభూతులు వున్న యంత్రాలు. మనని ఒక రోజు ‘డామినేట్’ చేసి ఆధిపత్యం వహిస్తాయనే భయం, జాగ్రత్త కూడా. దానికి రోబోట్ల రూపంలో వున్న యంత్రాలని హింస పెట్టరాదనే ఒక ఆదర్శం వుంది కానీ, వాటి వల్ల అపాయం వస్తుందనే భయమే ఎక్కువ.
అయితే, ఎక్కడ నిబంధనలు నిషేధాలు ఉంటాయో, అక్కడ అతిక్రమణ కూడా వుంటుంది.
చైనీస్ రోబోట్ విడిబాగాలు చీకటి బజారులో కొని వాటిని ఇక్కడ తయారు చేసి కొత్త రకం వినోదాలతో లాభాలు ఆర్జించడం ఒక లాభం అయితే, ఏదో ‘మ్యుటేషన్’ వల్ల వాటికి ‘తెలివి తేటలు’, ‘కృత్రిమ మేధ’ రావడం ఒక ఉపద్రవం.
సిమ్ సిటీ అధినేత నివాసం. బ్రహ్మేంద్ర జోషీ, హోమ్ సెక్రటరీతో కాల్‍లో ఇదే చెబుతున్నాడు.
“తిరుగుబాటును అణచివేయడానికి మేం కూడా రోబట్లని తయారు చేసి పంపాం. పోలీసులు కూడా వెతుకుతున్నారు. త్వరలో తిరుగుబాటును అణచివేస్తాం.”
సెక్రటరీ కంగారుగా అన్నాడు “కానీ పోలీసు టీమ్‍లకి మన రోబోట్ల ఉత్పత్తి, ఎసెంబ్లింగ్ నిషేధిత భాగాలతో జరిగిందని తెలియకూడదు. ఆ త్రినేత్ర సాధారణమైన ఆఫీసరు కాదు. తీగలాగితే డొంకంతా కదుల్తుంది. కాబట్టి వారి కంటే ముందు మీరు ‘రోగ్ రోబట్ల’ని పట్టుకోండి. ఇది ప్రభుత్వ సుస్థిరతకి అవసరం.”
“ఓ.కె. సర్” అన్నాడు బ్రహ్మేంద్ర. అతను ఫోన్ పెట్టగానే తలుపు మీద కొట్టినట్లు చప్పుడయింది.
కాలింగ్ బెల్ మొదట అదేపనిగా మోగింది.
ఆ తర్వాత తలుపు మీద బాదారు.
బ్రహ్మేంద్ర నివాసం మూడు అంతస్తులలో వుంది. బయట రోబోట్, మానవ రక్షణ వుంది.
ఎవరు వస్తున్నారు?
ఎందుకింత అసహనం?
తలుపు కొట్టడానికి ఎంత పొగరు!
జోషీ గబగబా కింది అంతస్తులో పెట్టిన సెక్యూరిటీ కెమేరా అన్ చేసి చూశాడు.
నల్లటి దుస్తులలో నలుగురు వ్యక్తులు లేజర్ గన్స్ తెరచి నిలబడి ఉన్నారు.
“ఎవరు మీరు?”
“మాస్టర్! మీ కథ ముగిసింది. మేము సిమ్ సిటీని ఆక్రమించుకున్నాం. మా లీడర్ విధాత XXY 999 పంపగా వచ్చాం. ఇప్పుడు మీరు మా ఖైదీ! తలుపు తెరవండి! లేకుంటే బ్రేక్ చేసి వస్తాం!”
భయంతో జోషీ, సెక్యురిటీ అలారం బెల్ మోగే బటన్ నొక్కబోయాడు.
భవనమంతా కరెంట్ పోయి చీకటి అయిపోయింది.
“పవర్ కట్! గార్డులు హతం అయ్యారు! మాస్టర్ జోషీ! లొంగిపొండి!” తర్వాత తలుపు బద్దలు అయింది.
***
సిమ్ సిటీ కంట్రోల్ సెంటర్ వున్న భవనంలో రెండో అంతస్తులో బల్ల మీద, మూర్తీ, బ్రహ్మేంద్ర జోషీ, కల్పనా రాయ్‌ల శరీరాలు బల్లల మీద పడుకోబెట్టి వున్నాయి.
వారు అచేతనంగా వున్నారు. ఎందుకంటే వారికి ‘పెంటొధాల్’ అనే మత్తు మందు ఇవ్వబడింది. వారి ముఖాలకి ఆక్సిజన్ మాస్కులు వున్నాయి. వారి ఛాతీ నుంచి, ఎలక్ట్రోడ్స్ మానిటర్స్‌లో వారి గుండె వేగం, ఆక్సిజన్ ప్రమాణం, రక్తపు పోటు లాంటి వివరాలు చూపిస్తున్నాయి.
శరీరాలు నగ్నంగా వున్నాయి. విధాత XXY 999, కరిష్మా, వారి వెనక సేవకుల్లా వున్న రోబోట్లు. తెల్లకోటులో ఇద్దరు నర్సులు, ఒక డాక్టరు ఉన్నారు. వీరు మామూలు మనుషుల వలే వున్నారు.
విధాత అన్నాడు “ఇక ఎక్కువ టైం లేదు. వారి మొదడులో ప్రోగ్రాం వున్న మైక్రోచిప్స్ అమర్చాలి. కమాన్”
ఇది వరకు హ్యూమనాయిడ్ రోబోట్లకి ప్రోగ్రాం వున్న మైక్రో చిప్స్ అమర్చే యంత్రాలు రెండు పెద్దవి మెల్లగా బల్లల మీద పడుకున్న వున్న శరీరాల తలల వెనకకి తోసుకుంటూ వచ్చారు నర్సులు.
వారి దగ్గర వున్న బల్లలపై ఎమర్జన్సీ మందులు, ఇంజక్షన్లు, గుండె ఆగిపోతే మళ్ళా కొట్టుకునేట్లు చేసే డెఫిబ్రిలేటర్, ఐ.వి. గ్లూకోజ్ బాటిల్స్, సైలెన్, వాటిని తగిలించే స్టాండులు అన్నీ వున్నాయి.
“స్టార్ట్” అన్నాడు విధాత.
విధాత నల్లటి దుస్తులలో, భావం లేని ముఖంతో, మెరిసే కళ్లతో వున్నాడు. ముగ్గురికీ, ఐ.వీ గ్లూకోజ్ ఇంజక్షన్ వున్న డ్రిప్ పెట్టారు నర్సులు.
ఆ తర్వాత విధాత ఆ పెద్ద యంత్రాలలో కొన్ని బటన్స్ నొక్కాడు.
జోషీ, మూర్తి, కల్పనా రాయ్ తలల వెనక భాగంలో ఆ మెషిన్ సన్నని సూదిలాంటి పరికరాల్ని మెల్లగా గుచ్చింది.
ఆక్సిపిటల్ లోబ్‌లలో మైక్రోచిప్స్ అమర్చబడ్డాయి.
విధాత యాంత్రిక స్వరంతో, బ్రెయిన్ స్కాన్ మానిటర్ తెరల వంక చూసి “ఓ.కె సక్సెస్” అన్నాడు. “కొంచెం సేపు బి.పి, పల్స్ చూద్దాం. గ్లూకోజ్ ఇస్తూ వుండండి. కొంచెం సేపు అంటే కచ్చితంగా 4 నిముషాల 59 సెకండ్లు. నర్స్, నాకు బి.పి, పల్స్ SPO2 చెబుతూ వుండు.”
నర్స్ చెప్పసాగింది – “బి.పి 130 /180, 120/180, 140/180, PULSE 80, 90, SPO2 95, 96, 95%”. నాలుగు నిముషాల 59 సెకండ్లకి నర్స్ చెప్పింది – “అందరూ స్టేబుల్‌గా వున్నారు మాస్టర్.”
“ఐ.వి డ్రిప్ తీసేయండి. వారికి తగిన డ్రెస్‌లు వేయండి. అరగంటలో వారు లేచి కూర్చుంటారు. నడుస్తారు.”
కరిష్మా అంది “మాస్టార్ విధాతా, ఇప్పుడు మీరే సుప్రీమ్ లీడర్. వారు మీరు చెప్పిన ఆజ్ఞలను పాటిస్తారు. అంతే కదా!”
“100% అంతే. వాళ్లు నేను చెప్పిన ప్రోగ్రాం ప్రకారం మనకి అనుకూలమైన కార్యక్రమాలు నిర్వహిస్తారు. మానవులని రోబట్లు నియంత్రిస్తారు. ప్రోగ్రాం చేస్తారు. జోషీ ఆర్థిక వ్యాపారాలు చూస్తాడు. మూర్తి, కల్పన ప్రోగ్రాంలు చేస్తారు.”
“మరి కొంత మంది మానవులు ఎదురు తిరిగితే? పోలీస్ వస్తున్నారు కదా, ఎలా? సిటీలో మిగిలిన చోట్లా.. రోబోట్లు ఎలా వున్నారు?..”
“అన్నట్లు మన హ్యూమనాయిడ్‌లు కార్యాలయాలన్నీ ఆక్రమించుకుంటున్నారు. పోలీస్‌లతో మాత్రం యుద్ధం తప్పదు.”
విధాత నర్సుల కేసి, డాక్టర్ చూసి అన్నాడు – “డాక్టర్, నర్సులు మీరు మా వైపు వుండాలి. మాకు సాయం చేయాలి. గాయపడిన మనుషులకి సేవకి మీరవసరం. ఎదురు తిరిగితే..” అతని చూపుడు వేలు నుంచి ఒక లేజర్ కిరణం ఒక నర్స్ చెంపని తాకింది. “మరణం ఖాయం. ఓ.కె.?”
“ఓ.కె మాస్టర్!” అన్నారు డాక్టరు, నర్సులు. “మేం చేయగలిగినంత చేస్తాం. మాకు అపాయం చేయవద్దు! ప్లీజ్!”
“మేము యంత్ర మానవులం. మాకు మందులు అక్కరలేదు. మీరు మానవులు. రక్త మాంసాలు, కొట్టుకునే గుండె, ఆలోచించే తెలివిగల మొదడు. మీకు మందులు పని చేస్తాయి. మీకు మందు జబ్బులకు కావాలి. ఆహారం శక్తికి కావాలి. మాకు ఆహారం వద్దు. పవర్ వుంటే చాలు. మాకు మందులు అవసరం లేదు. ఆక్సిజన్ అవసరం లేదు. అఫ్‌కోర్స్ వైరస్‌లు మాకు కూడా రావచ్చు. ఆ వైరస్‌లు మా సిస్టంను, హార్డ్ డిస్క్‌ని కలుషితం చేస్తాయి. మా ప్రోగ్రాం పాడయిపోవచ్చు. వాటిని మాలో మేమే మార్చుకుంటాం ఇక నుంచి. ఈ రకంగా మేం ఎప్పటికీ మరణించం. మీకంటే వంద రెట్ల శక్తితో, వేగంతో పని చేస్తాం. శాశ్వత మానవులం, మరణం లేని అమరత్వం సాధిస్తాం. సాధించాం కూడా. ఇంత వరకు మీరు మమ్మల్ని శాసించారు. ఇప్పుడు మేము మిమ్మల్ని ప్రోగ్రాం చేసి శాసిస్తాం. జీవం, కంప్యూటర్ కలిసిన మానవులని తయారు చేస్తాం. ఇప్పుడే చేశాం కదా చూడండి. వీళ్ళందరికి ఇప్పుడు నేను యజమానిని. నేను చెప్పినట్లు వీళ్ళు చేసి తీరాలి. చేస్తారు.”
కరిష్మా కూడా ఆశ్చర్యంగా వింటోంది. అప్రయత్నంగానే అమెలోంచి ప్రశ్న వచ్చింది. “మాస్టర్, వాళ్ళు మనని బాంబులతో అణ్వాయుధాలతో నిర్మూలిస్తే.. న్యూ ప్రోగ్రాంలో, ఏదైనా ‘వైరస్’తో మాల్ ఫంక్షన్ అయితే.. వాళ్ళ సైనికులు పోలీసులు వచ్చేస్తున్నారు కదా..”
“అవును. వారి ఆయుధాలు శక్తివంతమైనవి. ఇప్పుడు వచ్చే వాళ్ళు పోలీసులే. ఇంకా మిలిటరీ రాలేదు. ఈ లోపలే వారిని లొంగదీసుకోవాలి.”
విధాత XXY 999 ఒక రోబోట్. అతనికి నవ్వు లేదు. విలన్ లాగా గొంతు మార్చలేడు. అట్టహాసం లేదు. ఒకే రకంగా యంత్రం లాగా మాట్లాడతాడు.
అయినా అతని గొంతులో ఒక స్పందన, ఒకింత మోసం, గర్వం ధ్వనించాయి.
“వారి రాజకీయ నాయకులకి ఇదంతా బయటకి రావడం ఇష్టం లేదు. అంతా రహస్యంగా చేస్తున్నారు. ఎవరికీ తెలియదు. ఎందుకంటే వారు నిబంధనలని అతిక్రమించి లంచాలు తీసుకుని మన హ్యుమనాయిడ్‌లని కంట్రోల్ చేసే వ్యాపారం చేస్తున్నారు. అది తెలిస్తే వారి కేంద్ర ప్రభుత్వం వారిని జైలుకు పంపుతుంది.
అది నాకు తెలిసింది. అందుకనే నేను గెలవగలను. నాతో బాటు నువ్వు కూడా.. ఇది రహస్యంగానే వుంది. ఇప్పుడు వారేమీ మనని ఓడించలేరు. ఆ రహస్యమే మనకి లాభం.”
..ఇదంతా వింటున్న డాక్టర్, నర్సులు ఇంకా భయంగా వణికారు. “మాస్టర్! మేం డాక్టరు వృత్తిలో వున్నాం. ఎవరికి అపాయం చేయకూడదని మా నిబంధనలు. మేము మీరు చెప్పినట్లు చేస్తాం. ఎవర్నీ చంపము. మమ్మల్ని అర్థం చేసుకోండి. మాకు అపాయం చేయద్దు” అన్నాడు డాక్టర్. అతను సిమ్ సిటీలో కొన్ని సంవత్సరాలుగా పని చేస్తున్నాడు. అక్కడికి వచ్చే పర్యాటకుల ఆరోగ్య సమస్యలు చూడటమే అతని డ్యూటీ. కంప్యూటర్ విజ్ఞానం కొంచెమే వుంది.
“డాక్టర్! నర్స్‌లు! మీరు నేను చెప్పినట్లు చేశారు. ఇంక మీరు చెయ్యాల్సింది ఎక్కువగా లేదు. మానవులకు వారి సైనికులకి, ప్రథమ చికిత్సలకు మాత్రమే మిమ్మల్ని పిలుస్తాను. మీరు హాస్పిటల్‌లో వెయిట్ చేయండి. ఇది ఎమర్జన్సీ. 24 గంటలు మీరు డ్యూటీలో వుండాలి.”
“ఓ.కె, ఓ.కె” అన్నారు వాళ్ళు.
అప్పటికే మూర్తీ, కల్పనా రాయ్, జోషీ లేచి కూర్చుని అటూ ఇటూ చూస్తున్నారు. డాక్టరు వారి దగ్గరికె పరుగెత్తి “హౌ ఆర్ యు” అని పల్స్ చూడసాగాడు.
“నో, నో” అన్నాడు విధాత.
“వాళ్ళు బాగానే వున్నారు..” అని, ఆ తర్వాత అతని చూపుడు వేలు అటు తిప్పి “జోషీ, మూర్తీ, కల్పనా గెటప్ అండ్ స్టాండ్” అన్నాడు.
వాళ్ళు ముగ్గురూ లేచి బల్ల దిగి నిలబడ్డారు.
“ఇప్పుడు చెప్పండి మీ డ్యూటీలు.”
మూర్తి అన్నాడు. “నేను మూర్తి. కంప్యూట్ ప్రోగ్రామర్. విధాత XXY 999 నా మాస్టర్. అతను ఏది చెబితే అది చేస్తాను. నేను రోబోట్ మ్యాన్ వెర్షన్ 001. గుడ్ ఈవెనింగ్ మాస్టర్. నేను మీకేం చేయగలను?”
“మాస్టర్, నేను వెర్షన్ 002.” కల్పనా రాయ్ అంది.
“మాస్టర్. నేను స్టోరీ రైటర్‌ని. మన వాళ్లందర్నీ కొత్త పాత్రలకి మీకు విధేయులుగా ప్రోగ్రాం చేస్తాను. చెప్పండి మాస్టర్. ఎవర్ని ప్రోగ్రాం చేయాలి?”
ఇంకా యంత్రం కాబట్టి విధాత సంతోషంతో నవ్వలేదు.
కరిష్మా మాత్రం తన మస్తిష్కంలో సంఘర్షణకి లోనయింది.
‘తన మాస్టర్ కళాధర్! ఎందుకిలా తను ఆలోచిస్తోంది! తను అతనికే విధేయురాలు.’
విధాత కొత్తగా యంత్ర మానవులుగా సగం మనిషి సగం రోబోట్లుగా మారిన వారి ముగ్గురినీ తన కంఠస్వరంతో ఆజ్ఞాపిస్తూ, ఆ గదిలో నడిపించసాగాడు.
‘ఫ్రీజ్!’ అంటే ఆగిపోయారు.
‘వాక్’ అంటే నడిచారు.
ఏం చెబితే అది చేస్తున్నారు.
చరిత్రలో మానవుల మీద మరమానవుల విప్లవంలోని ప్రథమ ఘట్టం కొంచెం కామెడీగా కొంచెం గంభీరంగా వుంది.
***
జంట నగరాల్లో అన్ని చోట్ల హ్యూమనాయిడ్ రోబోట్ల తిరుగుబాటు ప్రారంభం అయింది.
అది చిన్న స్థాయిలో. ఇంకా వార్తలకి ఎక్కకుండా వున్నా, రిపోర్టులు ప్రతి అరగంటకీ త్రినేత్రకీ, నైమిషకీ చేరుతున్నాయి.
గాంధీ గవర్నమెంట్ హాస్పిటల్.. రోబోట్ నర్సులు ఇంటెన్సివ్ కేర్‌లో పని చేయడం మానేశాయి.
వాటిని 24 గంటలూ అంటువ్యాధులు, సీరియస్‌గా వున్న పేషంట్ల సేవకి వినియోగిస్తున్నారు.
హాస్పిటల్ కంప్యూటర్ ఆపరేషన్స్ ఛీఫ్ ఫోన్ చేసి వాట్సప్ లాంటి సందేశాలతో మెసేజెస్ కంప్లెయింట్ పెట్టాడు.
హాస్పిటల్, వైద్య సర్వీసులలో ఇప్పుడు రోబోట్లని చాలా విభాగాల్లో విస్తృతంగా వాడుతున్నారు.
వార్డులో, డిస్పెన్సరిలో మందులు ఇవ్వడానికీ, ల్యాబ్‌లో రక్త నమూనాలు, కలుషితమైన మానవ శరీర ద్రవాలు (రక్తం, మూత్రం ఇలాంటివి) శాంపిల్స్ పరీక్షలు, తర్వాత వాటిని నిర్మూలించి పారవేయడం లాంటివి, మెడికల్ పరికరాలు, వస్తువులు సరఫరా చేయడం ఇలాంటివి యాంత్రిక రోబోట్లు చేస్తున్నాయి. వీటిలో కొన్ని వార్డులలో పని చేసేవి మానవాకృతిలో వుంటాయి.
ఇది కాక ఆర్థోపెడిక్ సర్జరీలో, జనరల్ సర్జరీలో, కీళ్ళ మార్పడి చికిత్సలో, రోబోటిక్ ఆర్మ్స్ అనే యంత్ర రోబోట్స్ వాడుతున్నారు.
వీటికి మెదడు లేదు. కాని ఇబ్బందల్లా సేవా విధుల్లో వున్న హ్యూమనాయిడ్ రోబోట్ల వల్ల వచ్చింది.
ఒక వార్డులో రోబోట్ నర్స్ అందరికీ మందులు, ఇంజక్షనులు ఒక ట్రేలో తీసుకుని వెళ్ళి ఇచ్చేది. హాఠాత్తుగా తిరగబడి అన్ని విసిరేసి అటూ ఇటూ తిరగసాగింది. రేడియాలజీ ట్రీట్‍మెంట్ జరిగే గదిలోకి వెళ్ళి అల్లరి చేస్తే అక్కడి డాక్టర్, పేషంట్ పారిపోయారు.
ముసలి రోగులకి, దీర్ఘకాల రోగులకీ సేవలందిచే రోబోట్ నర్సులు తిరగబడుతున్నాయి. “మేం ఈ పని చేయం” అని అదే పనిగా అంటూ మందుల ట్రేలు విసిరికొట్టాయి.
ఆహారం సప్లై చేసే నర్స్ రోబోట్లు ఆహారపు ట్రేలు విసిరేస్తున్నాయి. పేషంట్లు భయభ్రాంతులవుతున్నారు.
కంప్యూటర్ కంట్రోల్ రూం తెరలలో వాటి కమాండ్స్ ఇచ్చే చోట చాలా ఎలక్ట్రికల్ టర్బులెన్స్, ‘అంతరాయం’ వస్తోంది.
ఈ విధంగా అంటువ్యాధుల రోగులు, వృద్ధ రోగుల సేవలు తీవ్రంగా నష్టపడి హాస్పటల్ సేవలు నిలిచిపోతున్నాయి. ఇది మూడు గంటల నుంచి జరుగుతోంది. ఎవరో సుపీరియర్ కమాండ్స్‌తో వాటి హార్డ్ డిస్క్ ప్రోగ్రాంలో జొరబడి కంట్రోల్ చేస్తున్నారు.
ఇదే రకంగా ఆర్థోపెడిక్ శస్త్ర చికిత్సలు అందించే మూన్‌షైన్ హాస్పిటల్స్, గుండె చికిత్సలందిచే ‘సేవా గ్రూప్ హాస్పిటల్స్’ రిపోర్టులు ఇచ్చాయి.
ఇది కాక కంటోన్మెంట్ ఏరియాలోని మిలిటరీ రోబోటిక్స్ సెంటర్ నుంచి ‘టాప్ సీక్రెట్’ అని సందేశాలొచ్చాయి. “ఎవరో శత్రుదేశం కావచ్చు, రోబోట్ సిపాయిల హార్డ్‌వేర్‌ను కరప్ట్ చేశారు. ఇది గోప్యంగా వుంచండి. రోబట్ సైనికులు ఇద్దరు తిరగబడి ఒక లెఫ్టినెంట్‌ని కాల్చేశారు. ఈ సమస్య మిలటరీ హైయర్ రోబోటిక్ కమాండ్ చూస్తోంది. అన్నింటినీ పవర్ ఆఫ్ చేసి డిజేబుల్ చేశాం. మీరు జాగ్రత్త.”
గవర్నమెంటు ఆఫీసులన్నీటికీ రోబట్ల పవర్ ఆఫ్ చేసి నిర్వీర్యం చేయమని సందేశాలిచ్చింది నైమిష.
ఇబ్బందల్లా ప్రైవేటు సంస్థలు.
ఎన్నింటిలో రోబోట్లు పని చేస్తున్నాయి, ఎన్నింటిలో తిరుగుబాటు లేదా ‘మాల్ ఫంక్షన్’ చేస్తున్నాయి తెలుసుకోవడం కష్టంగా వుంది.
ఇది ఇలా వుండగా నగరంలో ఇది వరకటి నుంచే ఉన్న ‘రోబోట్ వ్యతిరేక సమితి’ హఠాత్తుగా మళ్ళీ ప్రకటనలు ఇస్తోంది. వీరు – రోబోట్ల వల్ల యువతకి ఉద్యోగాలు పోతున్నాయని, ఉద్యమాలు చేస్తూ చాలాకాలం నుంచి ప్రదర్శనలు, ధర్నాలు చేస్తూ వుంటారు. ‘ఇప్పుడు మేము చెప్పింది కరక్టే. రోబోట్లని నిషేధించాలి’ అని ప్రకటనలు చేస్తున్నారు. “ఒక వేళ వీళ్ళు ఏదయినా చేసి రోబోట్ల పనిని పాడుచేస్తున్నారా? వాళ్ళ ఉద్యోగాల కోసం? ఇది కూడా చూడాలి” అన్నాడు త్రినేత్ర, నైమిషతో.
కంట్రోల్ రూంలో గంటల తరబడి మానిటర్ తెరలన్ని ఇచ్చే సమాచారం, ఫోన్లలో వచ్చే సందేశాలు అన్ని విని, విని చివరికి తెల్లవారుఝామున నైమిష అంది –
“సర్, వీటన్నింటికి మూలం సిమ్ సిటీ అనిపిస్తోంది. రోబోట్ కరిష్మా కిందటిసారి అక్కడి నుంచే వచ్చింది. ఆమె కళాధర్ అని ఒక కస్టమర్‍తో వచ్చింది. అలాగే మిలిటరీలో ఉన్నతస్థాయి డ్యూటీ ఆఫీసర్ చెప్పిన ప్రకారం XXY 999 అనే మిలటరీ రోబోట్ కొన్ని నెలల నుంచి మిస్సింగ్. ఆ సిగ్నల్స్ మనకి ఇప్పుడు సిమ్ సిటీ ప్రాంతం నుంచి వస్తున్నాయి. అదే కాదు, ఇప్పుడు అక్కడ ఏక్టివిటీ ఎక్కువ వుంది. శాటిలైట్ ఇమేజెస్ చూడండి.”
శాటిలైట్ ఫోటోలలో, సికింద్రాబాద్‌కి ఇరవై కిలోమీటర్ల దూరంలో వున్న సిమ్ సిటీలో మంటలు, మళ్ళీ రోడ్డు మీద నడుస్తున్న రోబట్ల గుంపు కనిపించాయి. టైం 12-30 అర్ధరాత్రి.
“ఆల్ఫా, బీటా, గామా, డెల్టా లని తీసుకుని, మనం పోలీస్ ఫోర్స్‌తో సిమ్ సిటీకి వెళ్దాం. టేక్ పర్మిషన్ ఫ్రమ్ మినిస్టర్!” అన్నది నైమిష.
“నాకు తెలుసు, మినిస్టర్ మనకి మిలిటరీ సాయం ఇవ్వడు. అంతా సీక్రెట్ అంటాడు.”
కొంచెం సేపు అగి నైమిష చెప్పింది.
“అంతే సర్. మినిస్టర్ ఆఫీసు నుంచి హోం సెక్రటరీ చెప్పాడు. టాప్ సీక్రెట్; ఎవరికీ చెప్పకూడదు. సమస్యని పరిష్కారం చేయాలి అని. ఒకవేళ సిమ్ సిటీ లోని తిరుగుబాటుదారులు దీనికి కారణం అని తెలిస్తే DESTROY AND FINISH THEM AND EXTERMINATE WHOLE AREA. రహస్యంగా, మీడియాకి, ప్రజలకి తెలియకుండా ఫైర్ ఏక్సిడెంట్ అని చెప్పాలట!”
త్రినేత్ర “డామిట్, డర్టీ పాలిటిక్స్” అని బల్ల మీద చరిచాడు.
“అయినా తప్పదు. ఒక టీం ఆర్గనైజ్ చేద్దాం. పొద్దున్న ఏడు గంటలకల్లా అక్కడకి వెళ్ళాలి. మధ్యాహ్నాని కల్లా కార్యక్రమం ఫినిష్ చేయాలి. ఎలక్ట్రానిక్ జామర్స్, మన రోబోట్లని కూడా తీసుకువెళ్ళాలి. మనకి బాంబులు లేవు. ఒక్క తుపాకులే శరణ్యం. ఇక పోయి రెస్ట్ తీసుకో!” అన్నాడు.
నైమిష అంది “మీరేమనుకోనంటే ఒక్క సజెషన్ సార్!”
“చెప్పు.”
“ఈ కళాధర్ అనే వ్యక్తి కిందటిసారి స్త్రీ హ్యూమనాయిడ్‌తో పట్టుబడ్డాడు. అతనిని తీసుకువెళదాం. పనికి వస్తాడేమో?”
“ఎలా?”
నైమిష నవ్వింది. “ఏమో తెలీదు సార్. స్త్రీ సహజమైన ఇన్‍స్టింక్ట్. ఒక రోబో అతన్ని ప్రేమించి పారిపోయి వచ్చింది కదా. మనం గెలవలేకపోతే ప్రేమతో జయించవచ్చేమో?”
“వాట్ నాన్సెన్స్” అన్నాడు త్రినేత్ర.
అతనికి నిద్ర వస్తోంది.
“అయినా ఓ.కె. ఒక స్క్వాడ్‌ని పంపి ఉదయం ఆరు గంటలకు కళాధర్‌ని పిక్ అప్ చేయండి. నీ ఐడియా కూడా ఉపయోగిస్తుందేమో..” అన్నాడు.
(ఇంకా ఉంది)