[శ్రీ మరింగంటి శ్రీకాంత్ రచించిన ‘నగరీకరణ..’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]నా[/dropcap]గరికత నగారా మ్రోగిస్తున్న నగరంలో
శివార్లింకా దూరంగా విసిరేసినట్లు
యాచిస్తూనే ఉన్నాయి, యాతన పడుతూనే ఉన్నాయి
చిదిమేసిన బాల్యం బేల చూపులతోనే
ప్రపంచమే ఓ కుగ్రామంగా మారే తరుణంలో
పలకా బలపం పట్టని బాల్యం ఆటల్లోనే ఉంది
కుటుంబాలకే పెద్ద దిక్కుగా ఆ పసితనం వాడిపోతుంది
బాల్యం నుంచే బాధ్యతలు, రోజులు గడపాలి
పొట్ట గడిచే పనిలో చిట్టి చేతులు మట్టి పిసుకుతున్నాయి
మరో లోకం చూడని రేపటి సూరీళ్ళు
మరో భాషా తెలియదు, మరో మనిషీ తెలియదు
తెలియని ఆనందంలో కొట్టుమిట్టాడుతున్నారు
తెలిసిన భాషలో బడి లేదు, భవిష్యత్ ఆలోచనా లేదు
చిగురించే బాల్యం యాడి(అమ్మ) వెంటనో, బా(నాన్న) తోనో
చేతిలో పనిముట్లతోనే పయనం
చిన్నపిల్లలుంటే ఇంటి పట్టునే ఆడిపించడం
తరిగి పోతున్న బాల్యపు చేష్టలు
బాధ్యతలతో బరువును మోస్తున్న బాల యజమానులు..