[dropcap]తె[/dropcap]ల్లవారింది. రంగురంగుల పూలు వికసించి సుగంధాన్ని వెదజల్లుతున్నాయి. అడవి పూల పరిమళంతో, దానిని మోసుకొని వచ్చే గాలితో నిండిపోయింది. కొండవాగు నిండుగా ప్రవహిస్తోంది. తల్లి పక్కనే పచ్చిక మేస్తున్న లేడిపిల్ల గంతులు వేసుకుంటూ తెలియకుండానే దూరంగా వెళ్ళిపోయింది. దారి తెలియక కనుపించిన దారిలోనే నడుస్తూ మెల్లగా ఒక పట్టణం చివరనున్న ఉద్యానవనానికి చేరింది. చెట్ల వెనుక నుండి చూస్తూ విస్తుపోయింది. తానెన్నడూ చూడని వింత మృగాలు! తామంతా నాలుగు కాళ్లతో నడుస్తుంటే ఇవి రెండు కాళ్ళతో నడుస్తున్నాయి. అడవిలో పెరిగిన తనకు లేడి భాషతోపాటు కొన్ని జంతువుల భాషలు కూడా తెలుసు. కానీ ఇదేమిటి!? వీళ్ళేదో అనుకుంటున్నారు గాని అసలు అర్థం కావటం లేదు. లేడిపిల్ల ఆశ్చర్యపడుతూ, ఆలోచిస్తూ కొంచెం ముందుకు వచ్చి రోడ్డు మీదకు వెళ్ళబోయింది. అంతలో ఒక కారు వేగంగా దూసుకొస్తోంది. అసలే లేడి. బెదిరిపోయి మళ్ళీ చెట్ల వెనక్కి వెళ్ళిపోయింది. కొంత సద్దుమణిగాక కుతూహలంతో మరోసారి కొంచెం ముందుకు వచ్చింది.
తోటలో కూడా అడవిలో లాగానే ఎన్నో చెట్లున్నాయి. పూల మొక్కలున్నాయి. ఇవన్నీ కొత్త కాదు గాని ఒక మందార పూల చెట్టు నిండుగా పూలతో ఎంతో అందంగా కనుపించింది. లేడిపిల్ల దానినే చూస్తూ ఉండిపోయింది. ఇంతలో అడుగుల చప్పుడు. బెదిరిపోయి మరింత వెనక్కి ఒక పొద చాటుకి వెళ్ళింది. ఎవరో ఒక మనిషి వచ్చి గబగబా నాలుగు పూలను కోసుకొని వెళ్ళాడు. మొక్క దిగాలుపడిపోయింది. లేడి పిల్లకు మొక్క భాష తెలియదు కానీ బాధపడుతోందని మాత్రం అర్థమయింది.
‘మా అడవిలో పులులు, సింహాలు వచ్చినప్పుడు మేము కూడా ఇలాగే భయపడిపోతాం కదా! మా గుంపులోని ఒక లేడి వాటికి ఆహారం అయినప్పుడు బాధ కలుగుతుంది. అయితే పులి వస్తున్న జాడ తెలియగానే మేమంతా పరుగెత్తి పారిపోతాం. కొన్నిసార్లు తప్పించుకుంటాం కూడా. కానీ పాపం ఈ మొక్క కదలలేదుగా!’ ఇలా ఆలోచించుకుంటూ, బాధపడుతూ మందారచెట్టు వంక చూసింది లేడిపిల్ల. సాయంత్రమవుతోంది. ఆ చెట్టు పూలన్నీ మెల్ల మెల్లగా ముడుచుకుపోతున్నాయి. ఉండబట్టలేక ఆ మొక్కతో మాట్లాడటానికి ప్రయత్నించింది. చిత్రంగా మొక్కకి లేడి భాష అర్థమయింది. క్రమంగా లేడికి కూడా మొక్క భాష అర్థమవుతోంది.
“అయ్యో! రోజూ ఇలాగే నీ పూలని ఎవరైనా కోసేస్తారా?” అడిగింది లేడి.
“అవును. ఎవరైనా చూస్తే అంతే.” బదులిచ్చింది మొక్క.
“ఏం చేస్తారు ఈ పూలని?” అడిగింది లేడి మళ్లీ.
“కొంతమంది తీసుకుని వెళ్లి దేవుని పూజిస్తారు. మరికొంతమంది తామే అలంకరించుకుంటారు. లేదా అలంకరణ కోసం వాడతారు.” సమాధానమిచ్చింది మొక్క.
“అయ్యో! బాధే కదా?” జాలిగా అంది లేడి.
“పువ్వు నా నుండి విడిపోతుంటే బాధే. కానీ తీసుకుని వెళ్ళేవారు ఏదో విధంగా ఉపయోగించుకుంటారని తృప్తి. కానీ కొంతమంది కోసి నా ముందే విసిరేసి వెళ్ళిపోతారు. అప్పుడు నిజంగా ఏడుపొస్తుంది. తమకు ఏ ఉపయోగమూ లేకపోయినా ఎందుకు కోసినట్లు? ఎందుకు విసిరేసినట్లు?” చెపుతూనే బాధతో తలవాల్చింది మొక్క.
“ఇంతకూ నువ్వెవరు?” అడిగింది లేడిని.
“నేనా? ఇక్కడకు దగ్గరలో ఉన్న అడవిలో ఉంటాం మేమంతా. పొద్దున దారి తప్పి ఇలా వచ్చాను. మా అడవిలో ఏదైనా జంతువు ఆకలి వేసినప్పుడే వేటాడుతుంది. కానీ ఇలా అక్కర లేకపోయినా చంపదు. అవును కానీ వీళ్ళంతా ఎవరు? ఏమంటారు వీళ్ళని? నీ భాష నాకు అర్థమవుతోంది కానీ పొద్దుటి నుండి చూస్తున్నా వీళ్ళ భాష నాకు అర్థం కావటం లేదు.” తన గురించి చెపుతూనే ప్రశ్నించింది లేడిపిల్ల.
“అలాగా! వీళ్ళని మనుషులంటారులే. వీళ్ళకి తెలివితేటలు ఎక్కువ. అందుకే మిమ్మల్ని, మమ్మల్ని, అన్నిటినీ కూడా తమ అదుపులో ఉంచుకుంటారు. వీళ్ళకి ఎప్పుడు ఏ ఆలోచన వస్తుందో కూడా తెలియదు”. మరోసారి నిట్టూర్చింది మొక్క.
“సరేలే. నేను కదలలేను కాబట్టి ఆయువున్నంతవరకు ఇక్కడే ఉండక తప్పదు. వీళ్ళ ప్రవర్తన కూడా కొంచెం అలవాటయిందిలే. కానీ నువ్వు ఇక్కడ ఉండవద్దు. వీళ్ళ కంట పడ్డావా అంటే పట్టుకొని పెంపకం పేరుతో నిన్ను తమ ఇంట బంధిస్తారు. లేదంటే తమ వినోదం కోసం జంతుప్రదర్శనశాలలో పెడతారు. ఇంకా క్రూరులయితే చంపి నిన్ను తినేస్తారు కూడా. వెళ్ళిపో. నీ వాళ్ళ దగ్గరికి, నీ అడవికి.” హితబోధ చేసింది మొక్క.
“అలాగే నేస్తం. మరి వెళతాను” మృదువుగా మొక్కకు తన చెక్కిలినానించి అడవిలోకి పరుగు తీసింది లేడిపిల్ల. ఆత్రుతగా వెదుకుతూ వస్తున్న తల్లి లేడి తన పిల్లను అక్కున చేర్చుకుంది.