[dropcap]“టీ[/dropcap]చర్! నేనెప్పుడు పెద్దమనిషినౌతాను..?” వెన్నెల హఠాత్తుగా అడిగిన ప్రశ్నకు ఉలిక్కిపడింది మృదుల. ఇంటర్వెల్‍లో పిల్లలందరూ వెళ్లిపోయాక నోట్స్ సర్దుకుంటున్న మృదుల వెన్నెల ప్రశ్నకు విస్తుపోయింది. “ఎందుకు?” అడిగింది. ఏదో ఆ పిల్ల దాస్తున్నట్లనిపించింది ఆమెకు.
“ఏం లేదు టీచర్, నాకు అందరితో కల్సి ఆడుకోవాలని ఉంటుంది. కానీ నన్నెవరూ జట్టులో చేర్చుకోరు. నాతో ఆడితే నా జబ్బు అందరికీ వస్తుందట. నేనెప్పుడు అదోలా ఉంటానట. నీళ్ళ దగ్గరకి వెళ్లొద్దు. చాక్‍లెట్స్, స్వీట్స్ తినొద్దు. పెద్దమనిషి ఐతే ఈ జబ్బు పోతుందని మా నానమ్మ చెప్పింది. అంతే కాదు టీచర్. మా పెద్దనాన్న కొడుకు మల్లేశ్ దుబాయ్ నుండి పంపించిన మేకప్ బాక్స్ నా ఫంక్షన్ జరిగినపుడే ఇస్తానని చిన్నన్న సతీష్ చెప్పిండు. నాకూ అందిరలా షానిగా, మంచిగ ఉండాలనిపిస్తుంది. కాని ఇలా లావైపోతున్నాను. ఈ బెల్ట్ కూడా పొట్టకు పడతలేదు. నన్నందరూ డుంబూ.. నల్లపిల్ల అంటూ ఏడిపిస్తున్నారు. అట్ల అంటే ఎవరైనా బాధపడతరు గదా టీచర్. నన్ను నెట్టేస్తారు. పడిపోతానని భయం వేస్తుంది. రోజూ టాబ్లెట్స్ వేసుకుంటున్నా.. ఒక్కొసారి మీరు రాసిన పాఠం రెండుగా కన్పడుతుంది” అంది వెన్నెల ఆవేదనతో.
సిరివెన్నెల ఏడో తరగతి, రూల్ నెంబర్ పదకొండు. మిగిలిన పది మంది అమ్మాయిల్లో కెల్లా ఈ పిల్ల విభిన్నం, నల్లగా, బొద్దుగా, ఎపుడూ స్తబ్దుగా, స్పందన లేకుండా తరగతి గదిలో ఓ మూలన.. కూర్చుంటుంది. ఆ పిల్ల పక్కన కూర్చోవడానికి ఇష్టపడక ఆడపిల్లలందరూ ‘మాకొద్దూ..!’ అంటూ నిషేధించబడిన బాలిక. ఈ రోజు వెన్నెల మాట్లాడిన మాటలు మృదులను ఆలోచనల్లో పడేశాయి. మూర్ఛ వ్యాధితో పోరాటం చేస్తూ, తనకూ ఓ మనసుందని, ఆలోచన, ఆవేశం, ఆవేదన అన్నీ ఉన్న మనిషిని, స్పందన లేని రాతి బొమ్మను కాదని, ఆ పిల్ల మనసు విప్పి చెప్పిన మాటలు విని మృదుల ఆశ్చర్యపోయింది.
ఎవరికి వారే రావటం, తమ నిర్ణీత సబ్జక్ట్ ఏంటో ఎవరో తరుముతున్నట్లుగా హడావుడిగా చెప్పుకొని వెళ్లటం రోజు వారీ టైం టేబుల్‍లో పొసగబడిన దినచర్యగా ఊపిరాడని బిజీ లైఫ్‍లో తమ ఉద్వేగాలను, భావాలను స్వేచ్ఛగా పంచుకొని యాంత్రికతా సంకెళ్ళను వేసుకుంటూ అదే అభివృద్ధి అనుకుంటూ అధఃపాతాళానికి పడిపోతున్నామేమో..? మృదులకు హఠాత్తుగా తన చిన్నప్పుడు ఇంటి పక్కన ఉండే పెద్దాయి జ్ఞాపకం వచ్చింది.
పెద్దాయి పేరుకు తగ్గట్టే అందరినీ ఆత్మీయంగా పలకరించేది. ఎర్రగా, ఎత్తుగా, బలంగా ఉండేది. ఎప్పుడూ తెల్ల జాకెట్టు, ఆకుపచ్చ గోచీ చీరలో కన్పడేది. బండ పచ్చడి ఏదైనా సరే చేయటంలో స్పెషలిస్ట్. ఘుమఘుమలాడే పోపు పెడితే చుట్టు పక్కల పదిండ్లు వ్యాపించేవి. ఎప్పుడైనా అమ్మకు జ్వరం వస్తే, నోరు వికారంగా అన్పిస్తే పెద్దాయి ఇచ్చిన బండ పచ్చడి, వేడి అన్నం కలుపుకు తినేది. తానెప్పుడు వెళ్లినా కమ్మని బేసిన్ లడ్డూలు ఇచ్చేది. “మృదులా, నీవు పేరుకు తగ్గట్టే నాజుకు మనిషివే” అంటూ మెటికెలు విరిచి అక్కున చేర్చుకొనేది. తాను ఇంటర్లో ఉన్నప్పుడు అనుకుంటూ..! పెద్దాయి నూతిలో నీళ్ళు చేదుతూ బావిలో పడి మరణించింది అన్న వార్త తెలిసింది. ఆ తర్వాత తెల్సిన చేదు నిజం ఏంటంటే ఆమెకు మూర్ఛ వ్యాధి ఉందని.
తర్వాత క్లాసుకు బెల్ మెగడంతో వెన్నెల ప్రశ్నకు బదులిస్తూ “ఏం కాదు వెన్నెలా! నీవు బాగవుతావు. ఇదివరుకులా ఎక్కువ పడిపోవటం లేదుగా. నీకు బొమ్మలు వేయటం అంటే ఇష్టంగా. రేపు నీకు ఒక మంచి డ్రాయింగ్ బుక్ బహుమతిగా ఇస్తాను. రంగులు వేసి చూపిద్దువుగాని. ఓ.కె.నా!” అంటూ ఆ పిల్లను సంతోషపరుస్తూ తరగతి గదిలో నుండి బయటకు నడిచింది మృదుల.
***
సాయంత్రం బస్ స్టాపు కొచ్చే సరికి ఏడున్నర దాటింది. వాతావరణమంతా మబ్బు పట్టి దుఃఖిత మనస్కగా శీతాకాలం మునిమాపు చీకట్లు తొందరగా అలుముకోసాగాయి. తాను వెళ్ళే రూటు బస్సు రావటంతో బస్సు ఎక్కి కిటికీ పక్కగా కూర్చుంది. చల్లగాలి ముఖంపై రంపపు గాట్లు పెడుతున్నట్లుగా ఉంది. పుండు లాంటి మనసు గోస ముందు ఈ బాధను భరించ వచ్చునేమో! అనుకుంది. కళ్ళు మూసుకుంటే పీలగా, జీవచ్ఛవంలా బతుకుతున్న లీల గుర్తొచ్చింది. తాను వెళ్ళే కాలనీలోనే.. రోజూ తాను నడిచే తోవలోనే ఉంటుంది లీలా వాళ్ళిల్లు. కోటేరు ముక్కు, నవ్వుతున్న పెదాలు, ఛామన ఛాయతో కళగల మొఖం లీలది. ఆ రోజు వాళ్ళ పెళ్ళి రిసెప్షన్‍కు కూడా వెళ్ళింది. నీలంరుంగు పట్టు చీరలో మెడలో లిల్లీ పూలదండలతో సిగ్గుల మొగ్గలాగా నవవధువు లీల మెరిసిపోసాగింది. రోజూ వాళ్ళింటి ముందు నుండి వస్తుంటే అప్పుడప్పుడు దిగాలుగా గేటు వద్ద నిలబడి కన్పించేది. కదులుతున్న కళ్ళతో నిస్సహాయంగా చూసేది. ఏదో చెప్పాలన్నట్లుగా ప్రవర్తించేది. హడావుడిగా.. పని తొందరలో వాళ్ళ యిల్లు దాటేసి వెళ్ళేది మృదుల.
మొదట్లో ఆమె ఎందుకలా ఉంటుందో! అర్థం కాలేదు. లీలకు ముత్యాల్లాంటి ఇద్దరు పిల్లలు. పిల్లలు పుట్టిన తర్వాత ఆమె ప్రవర్తనలో మరీ మితి మీరిన ప్రవర్తన చోటు చేసుకుంది. అప్పుడప్పుడు ఇల్లు వదిలి రోడ్ల వెంబడి గొణుక్కుంటూ నడుచుకుంటూ వెళ్ళేది. రోడ్డు వారగా ఓ పక్కన అలానే కూచునేది. స్కిజోప్రీనిక్ ప్రవర్తన. తనకు తానే అపరిచితంగా, అపరిమితమైన అదుపు తప్పిన ప్రవర్తన. ఇప్పుడు ఆ యింట్లో లీల స్థానం జంతువు కంటే హీనం. ఇంట్లో వాళ్ళ గొడవలు తారా స్థాయిలో విన్పించేవి. ఈ పిల్లకు ఈ వ్యాధి ముందే ఉంది, చెప్పకుండా మాకు అంటగట్టారని అత్తింటి ఆరళ్ళు. భావోద్వేగాలను అణుచుకోలేక సతమతమవుతూ.. బిడియంగా అలాగే గంటలు గంటలు నిలబడి వచ్చిపోయేవారిని నిశ్శబ్దంగా చూస్తూ రాతి బొమ్మలా తయారైంది లీల. కొన్ని ప్రశ్నలకు జవాబులుండవేమో..! అవి ఎప్పటికి ప్రశ్నలే, చక్కగా పిల్లలను చూసుకుంటూ, హాయిగా, సంతోషంగా కాపురం చేసుకుంటున్న లీల కుటుంబంలోకి చీకటి పాము పడగ విప్పినట్లుగా అదృశ్య మానసిక జబ్బు ఏదో ఆమెను మెల్లి మెల్లిగా తినేయసాగింది.
బస్ స్టాపులో బస్సు దిగి నడుచుకుంటూ ఇంటికి చేరసాగింది మృదుల. కొత్తగా నిర్మించిన కాలనీలోని అపార్టుమెంట్లు.. హాస్పిటాలిటీ తగ్గిపోతూ, మనిషితనానికి, ఒంటరితనం ముసుగేసి ఎవరికి వారు, సుఖంగా భద్రంగా, తమకు తాము కేటాయించుకున్న గదుల్లో బతుకు బందీలుగా సమరం సాగిస్తున్న ఇరుకు గదులు. వచ్చేటపుడు ఆమె ప్రతీ రోజూ కాలనీలో అక్కడక్కడ ఉన్న తుమ్మ చెట్లు, వాటికి వేలాడుతున్న పక్షి గూళ్ళను పరిశీలిస్తూ నడుస్తుంది. రోజూ ఆడుకుంటూ ఎదురొచ్చే రెండేళ్ళ బుజ్జాయి నవ్వును స్వీకరిస్తూ, మందహాసంతో ముందుకు నడిచేది. పెద్దాయి లాంటి వృద్ధురాలు ఎవరన్నా రొప్పుతూ ఆగితే పలకరిచేది. ఊదారంగు కెంజాయ వర్ణంతో శోభిల్లుతున్న మబ్బుతునకల ప్రకృతి చిత్రాన్ని గమనిస్తూ దారి వెంబడి నడవడమంటే మృదులకు చెప్పలేనంత హాయి. ఏ పనైనా మది తీరా అస్వాదిస్తూ, జీవనమంటేనే ఒక కళ, ఒక ఉత్సవం, ఒక పరిపూర్ణత అని నమ్మేది. ప్రతీ రోజుని కొత్తగా ఉత్సాహంగా గడపాలని ఉవ్విళ్ళూరేది. ఎందుకో ఆ రోజు మృదుల మనసు మనసులో లేదు. దిగాలుగా ఒకింత భారంగా ఆమె అడుగులు ఇంటి వైపు సాగాయి.
దూరంగా పక్షి గూళ్ళలో రోద తగ్గింది. గూడు ఖాళీ చేసి వెళ్ళిన వలస పక్షులు. ఖాళీ గూళ్ళు వెక్కిరిస్తున్నట్లుగా చెట్ల కొమ్మలకు వేలాడతూ మనిషి అంటేనే హాలో మ్యాన్ అని చెప్పకనే చెప్పినట్లుగా అన్పించింది. చీకటి చిక్కగా, మరింత దట్టంగా పరుచుకోసాగింది. ఆకాశంలో చివరి పక్షుల గుంపొకటి చటుక్కున ఎగురుతూ వెలుగు కొరకు వెళ్ళిపోయాయి. తాళం తీసి ఇంట్లో ప్రవేశించింది మృదుల.
పక్షులు గూళ్ళను ఖాళీ చేస్తుంటే మనుషులు ఇళ్ళను ఖాళీ చేస్తున్నారు. వలస బతుకులు. ఉన్నత ఉద్యోగాలు, చదువుల పేరిట ఎక్కడెక్కడో నివాసం, విశాలమైన ఇంట్లో ఒక పక్క పల్చని వెలుతురు. మరో పక్క మసక చీకటి. ఎవరో కాలింగ్ బెల్ నొక్కారు. లైటు వేసి లేచి వెళ్లి తలుపు తీసింది. ఎదురుగా ఆరేళ్ల పాప స్వీటీ. “ఆంటీ! మా అమ్మ మిమ్మల్ని పిల్చుకు రమ్మన్నది. వాంతులు, జ్వరం, నాకు భయంగా ఉందాంటీ” అంది బిక్క మొహంతో. “సరే పద” అంటూ తలుపు గడియ పెట్టి పక్క ప్లాట్‍లో కెళ్లింది మృదుల.
ఇల్లంతా చల్లగా ఉంది. వాళ్ళమ్మ ఉంటున్న గదిలోకి తీసికెళ్ళింది స్వీటీ. “ఆంటీ! అమ్మ ఇప్పుడే అటు వైపు తిరిగి పడుకుంది. లేపుతాను” అందా పిల్ల భయంగా. “ఏం కాదు ఇలా కూచో” అంటూ తన పక్కన కూర్చోబెట్టుకుంది మృదుల. శీతాకాలం ఆ గదిలో రూం హీటర్ వెచ్చదనాన్ని పంచసాగింది. ఎదుట నేమ్ ప్లేట్ చూసింది పల్లవి శర్మ అని ఉంది. వీళ్లు కొత్తగా ఈ ప్లాట్ లోకి వచ్చారు. తనకూ పెద్దగా పరిచయం లేదు. కానీ స్వీటీ అప్పుడప్పుడు కింద సైకిల్ తిప్పుకుంటూ తనకు ఎదురుపడేది. ఒకసారి బ్యాలెన్స్ తప్పి కిందపడితే తనే సహాయం చేసింది. అప్పటి నుండి స్వీటీకి మృదుల అంటే ఇష్టం ఏర్పడింది. వాళ్ల స్కూల్ గురించి, తానూ ఇటివలే వెళ్లి వచ్చిన పిక్నిక్ గురించి విషయాలు ఎంతో ఉత్సాహంగా చెప్పేది. అప్పుడప్పుడు సడన్‍గా సైలెంట్ అయిపోయేది. ఎందుకని? అడిగితే “మా అమ్మ కొడుతుంది. ఈ మధ్యనే ఇలా అయ్యింది. ఎంతో అందంగా ఉండే మా అమ్మ ఇప్పుడు అసహ్యంగా తయారైంది. నన్ను ప్రేమగా చూసుకోవట్లేదు. అందరి అమ్మల్లాగా నన్ను అక్కున చేర్చుకోదు” అంది షికాయతుగా. ఏమిటో! ఈ పిల్లకు తల్లి గురించి పూర్తిగా తెలియదు అనుకున్నది. ఎప్పుడన్నా మాట్లాడదామంటే మూసిన తలుపులు వెనక ఎవరి ప్రపంచం వాళ్లది. టైం చిక్కడం లేదు. ఇదిగో! ఇప్పుడిలా వాళ్ళింట్లో నిశ్శబ్దంగా గోడలకు వేలాడుతున్న పెయింటింగ్స్‌ను గమనిస్తూ కూర్చుంది మృదుల. పల్లవి వాళ్ళ పెళ్ళి ఫోటో కాబోలు! నిండుగా అందమైన నవ్వుతో.. జీవితం పట్ల గొప్ప విశ్వాసంతో ఉన్నరా దంపతులు. తల్లీ కూతుళ్ళ ఫోటోలు అన్యోన్యానురాగాల్లా ఒక ప్రేమమయమైన నిర్వచనానికి గుర్తుగా.. తల్లి మెడ చుట్టూ చేతులు వేసిన స్వీటీ!
పల్లవి నెమ్మదిగా కదలసాగింది. దగ్గుతూ లేవడానికి ప్రయత్నం చేయసాగింది.
“నెమ్మదిగా లేవండి! ఇలా కూర్చుంటారా!” అంది మృదుల మొహమాటంగా.
పల్లవి నెమ్మదిగా లేచి సర్దుకొని కూర్చుంది. “మీరు పక్క ఫ్లాట్ మృదుల కదూ” అందామె.
అవునన్నట్లుగా తలాడించింది మృదుల.
“మీరు ఇక్కడా..!” అంది.
“స్వీటీ పిల్చుకొని వచ్చింది” అంటూ పల్లవిని గమనించసాగింది మృదుల. ముఖం కళ తప్పి పీక్కుపోయింది. కళ్ళ కింద నల్లని వలయాలు. నెత్తిన టోపీ. లొట్టలు పడిన చెక్కిళ్ళతో జీవితేచ్ఛ కోల్పోయిన బతుకు చిత్రం ఆమెది. కారణమేమిటో! అనుకునే లోపు పల్లవి నెమ్మదిగా చెప్పసాగింది.
“మృదులగారు మీరు రావటం నాకెంతో ఆనందంగా ఉంది. ఈ మధ్యే తెలిసింది.. నాకు.. జీర్ణాశయ క్యాన్సర్ ప్రాథమిక దశలో ఉందని! చాల అరుదుగా సోకే క్యాన్సర్. నాకే ఎందుకిలా ఈ ప్రశ్నను ఏ వెయ్యిసార్లో అనుకున్నాను. ఎంతో నిస్పృహకు గురయ్యాను. మరణం అంచుల దాకా వెళ్ళిన విషమ పరిస్థితి. చూడబోతే ఒక్కగొనొక్క బిడ్డ, దాని ఆలనా పాలనా, ఎలా? అన్నదే గుండెలు పిండేసే ప్రశ్న! ఇంతకు ముందు మా ఆయనా, నేను ఎంతో అన్యోన్యంగా జంటగా కలసిమెలసి ఉండేవాళ్ళం. కానీ ఎప్పుడైతే ఈ జబ్బు దేహాన్ని సోకిందో, నా ఆత్మను, మనస్సును చిద్రం చేయడం ప్రారంభించింది. ఆయన నాతో ముభావంగా ఉంటారు. ఈ మధ్యే వెళ్ళి, కీమో, రేడియేషన్‍లు చేయించుకున్నాను, దాని పర్యవసానమే ఇది. చాలా నీరసంగా ఉంటోంది. అంత కంటే ఎక్కువ బాధించేది ఆయన నిర్లిప్తత. కనీసం నా దగ్గర కూర్చొని నాలుగు మంచి మాటలు చెప్పి భరోసా ఇవ్వరు. ఎప్పుడూ కంప్యూటర్ ముందు కూర్చొని ఏదో వర్క్ చేసుకుంటారు. ప్రేమ అంటే కేవలం దైహికమైనదేనా? మానసిక సాన్నిహిత్యం, అనునయత ఉండనక్కర్లేదా? అభిప్రాయాల సారూప్యత ఉన్నప్పుడు మాటలు ఎంతో ఆనందాన్నిస్తాయి. అదే కరువవుతూ.. కేవలం ఉద్యోగం, కెరీర్ అంటూ ముడుచుకపోవటమేనా? సృష్టిలో దేనినీ ఆస్వాదించే తీరుబడిలేనపుడు, తనతో తాన ఆనందంగా, కంఫర్ట్‌గా లేనప్పుడు, అతడు ఇతరులతో ఎలా మమేకం కాగల్గుతాడు మృదులా? మరీ శిలాసదృశ్యమైన ఈ అవిటి బతుకు మీద నానాటికి రోత పుడుతుంది. రోజూ ఈ నిశ్శబ్ద యుద్ధ వాతావరణాన్ని భరించలేకపోతున్నాను. మృదులగారూ! మీరైనా ఈ రోజు నాకీ మాటలు మనసు విప్పి చెప్పే అవకాశాన్ని కల్గించారు” అందామె అభిమానంగా చూస్తూ. మాటల మధ్యలో తనలో ఒక గాయని ఉందని, పాత హిందీపాటలు బాగా గుర్తున్నాయని, అవి వింటే మనస్సంతా రిలాక్స్ అవుతుందని చెప్పిందామె. “కొంచెం పాలు కలిపి తీసుకొస్తాను” అంది పల్లవి ప్రేమగా.
“అబ్బే! వద్దండీ, మరోసారి ఎప్పుడైనా..” అంటూ లేచింది మృదుల.
పల్లవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. వాళ్లది ఎక్కడో ఉత్తరాది గ్రామమట. అక్కడి కంటే ఇక్కడ వైద్య సదుపాయం మెరుగ్గా ఉందని ఉండిపోయామని చెప్పింది. ఏమైనా పల్లవి మళ్ళీ అనుపల్లవిగా జీవనరాగాల్ని ఆలాపించాలి అనుకుంటూ, చీకటి పడుతుండగా ఇల్లు చేరింది మృదుల. గడియారం ముళ్ళ పైన ఆరేసుకున్న బతుకు వస్త్రం నిశ్శబ్దంగా.. అతికించలేని చిరుగుల్ని చూపేడుతూ తన పని తాను చేసుకుపోసాగింది. మన మనసే మనకు పూర్తిగా అర్థం గానప్పుడు.. ఎదుటి వారిని అర్థం చేసుకోవడంలో ఎన్నో.. ఎన్నో క్షమార్పణలు, అపార్థాలు, అపనిందలు.. పల్లవి అన్నట్లుగా ముందు నన్ను నేను అర్థం చేసుకున్నానా? నా ఆలోచనలతో నేను కంఫర్ట్‌గా ఉండగలుగుతున్నానా? మనసులో సుళ్ళు తిరుగుతున్న ఆలోచనలకు అడ్డుకట్ట వేయలేక పోసోగింది మృదుల. ఎన్నో పనుల్ని తప్పించుకోలేక తప్పదన్నట్లుగా చేస్తున్నామో..! ఒక యాంత్రికత.. మొనాటనీ లైఫ్.. బతుకు సుడిలో కొట్టుమిట్టాడుతూ మృదుల.. ఆ రాత్రి బరువైన మనస్సుతో నిద్రకుపక్రమించింది. పక్క టేబిల్‍పై తాను సగం చదివి పెట్టిన కథ ‘ది యెల్లో వాల్ పేపర్’ పేజీలు రెపరెపలాడుతూ..
***
సమయంతో పాటే ముందడుగు వేస్తూ.. పనులన్నీ పూర్తి చేసుకొని బస్ స్టాపు కేసి పరుగులాంటి నడకతో చేరుకుంది. ఉదయం ఎనిమిదిన్నర.. తాను బస్ కొరకు ఎదురు చూస్తూండగానే అక్కడికి చేరుకుంది రజని. ఎరుపురంగు చుడీదార్‍లో ఉత్తేజవంతంగా కన్పడింది. నవ్వుతూ విష్ చేసింది.
“ఏమిటి రజని కనపడటం లేదు.. ఇన్ని రోజులుగా లీవా?” అడిగింది మృదుల.
“అవును. ఈ మధ్యే నేను ఆశ్రయ్ ఫౌండేషన్ వాళ్ళు ఇస్తున్న శిక్షణకు వెళ్లాను. జీవితంలో ఎదురు దెబ్బలు తిన్నవారు, ప్రతిబంధకాల్ని అధిగమించలేక ఒత్తిడితో నలిగిపోయేవారు, ఊహించని షాక్‍కు గురై మానసిక ప్రవర్తన ఛిద్రమైన వారిని నేను కలుసుకున్నాను.. ఇలాంటి వారిని మనం అదిలించి కాక అనునయంగా చూసుకోవాలని.. తెల్సింది మృదులగారు! మనిషి ఎంతైనా ప్రేమను కోరుకుంటాడు. సృష్టిలో మనకంటూ తోడు దొరికిన వ్యక్తిచే ప్రేమించబడాలని ఎవరైనా అనుకుంటారు. అదే దూరం అవుతుంటే.. మనిషిలో గూడుకట్టుకున్న నిరాశ.. ఒత్తిడిగా మారి మనసును చంపేస్తుంది. లేదా అతి సున్నితంగా తయారయి చీటికి మాటికి ఏడుస్తుంటారు, చిన్న పిల్లల ప్రవర్తనను తలపించేలా ఉంటుంది వీరి ప్రవృత్తి.” అంది రజని.
మృదుల అందుకొని అంది “మొన్న గుడికి వెళ్ళినప్పుడు ఒకావిడ కొంగుకు ముళ్ళు వేసుకొని వచ్చింది. ఎందకని ప్రశ్నిస్తే, ఆమెకు పూనకం వస్తందని, ఇలా గుడికి వెళ్ళినప్పుడు కొంగుకు ముళ్ళు వేసుకుంటుందని తెల్సింది. నాకూ ఆశ్చర్యమేసింది సుమా!”.
“అలాగా, ఇంకో విషయం మీ ఆసక్తి చూస్తే ముచ్చటేస్తుంది మృదులగారూ! ఏ బంధమైనా మిగలాలంటే ట్రస్ట్ అనేది పునాది. వారి మధ్య ఒకరికొకరు మనసు విప్పి మాట్లాడుకునే సాన్నిహిత్యం టచ్ అండ్ టాక్ తప్పనిసరి. తమకంటూ సమయం కేటాయించుకోవాలని చెప్పారు. నిజంగానే మనం ఉద్యోగినులం, పిల్లల్ని ఏదో ఎడా పెడాగా పుట్టుకొస్తున్న డే కేర్ సెంటర్లో కుక్కేసి, ఉద్యోగాలకంటూ వెళ్తున్నాం. చిన్నారులకు సరియైన ప్రేమను, సమయాన్ని ఇవ్వలేకపోతున్నాం. కనుకనే చిన్నారులకు మాటలు రావడం ఆలశ్యం అవుతూ మిగతా పిల్లలకంటే మెండిగా తయారవుతున్నారు” అంది రజని.
“నిజమే రజని! ఇది అన్న కుటుంబాల్లోనూ నిత్యం మనం చూస్తున్నదే సుమా, అటు చూడు కూరగాయలు అమ్ముకుంటున్న రంగమ్మ బిడ్డ! దూరంగా విసుర్రాయిలను తయారు చేసే వలస కూలీల పిల్లలు ఎలా పెరుగుతున్నారో! వాళ్ళే నయం. తల్లి చెంత బిడ్డ. మనమూ ఉన్నామూ! ఎటూ న్యాయం చేయలేక, ఇదిగో ఇలా చీలిన మనసుతో.. సందిగ్ధ దైహులమై సంచరిస్తున్నాం. ఏమంటావు? రజని” అంది మృదుల, ఒకింత ఆవేదనగా, అవునన్నట్లుగా చిన్నగా నిట్టూరుస్తూ తలాడించింది రజని. బస్ పెద్ద పెట్టున హారన్ చేస్తూ స్టాపులో ఆగింది.
ఉదయపు గాలికి బంగారు వర్ణంలో కాంతి కిరణాలు తోడై వెలుగుమయంలో ప్రపంచం.. కాని ఎవరి అంతర్గత చిత్ర వలయాల్లో వాళ్లు. లోలోన క్రష్ అవుతున్న నిశ్శబ్దం. కిటికీ పక్కన కూర్చుంది మృదుల, పల్లె వెలుగు బస్సు కదిలింది భారంగా. దూరంగా వరి చేల మధ్యలో ఓడిన అమరుడి శిల్పంలా ఒక అవిటి మొద్దు. దానిపై కూర్చున్న నీలం రంగు పక్షల జంట. దూరంగా ఉన్న చెరువు ఒడ్డుపై వరుసకట్టిన తుమ్మ చెట్లు. వంపులు తిరిగిన బాటలో బస్సుతో పాటే మృదుల మనస్సు పరుగులు తీసింది.
***
“రూల్ నెంబర్ టెన్” అంటుండగానే ఆ అమ్మాయి బెరుకు బెరుకుగా నిలబడింది.
“షాహీన్! ఏమైంది? ఇన్ని రోజులు ఆబ్సెంట్” అంటూ ప్రశ్నిస్తూ, ఆ పిల్ల చేతుల్లో ఎర్రగా మెరసిపోతున్న మెహందీ డిజైన్స్‌ను గమనించి విషయం అర్థమై కూర్చోమంది మృదుల.
ఇంటర్వెల్ ఎవరూ చూడకుండా మెల్లిగా నోట్స్ తీసికొని వచ్చింది వెన్నెల. “టీచర్! మా క్లాసులో అందరికంటే పెద్ద షాహీన్.. ఫంక్షన్ అయ్యిందట గదా టీచర్. ఇదిగో నేను బంగారు కమ్మలు పెట్టుకొన్నాను. నిన్న మా ఇంట్లో పూజ ఉంటే అన్ని నగలు, పాపిటబిళ్ళ, వడ్డాణం, గజ్జెలు వేసుకొని తయారయ్యాను. మంచిగన్పించింది టీచర్! నాకీ జబ్బు తప్పి మంచిగవుతానా టీచర్? అందరితో కల్సి ఆడుకుంటానా? నన్నందరూ జట్టులో కలుపుకుంటారా..?” అంది వెన్నెల బేలగా చూస్తూ.
మెల్లిగా వెన్నెల చేతిని తన చేతిలో తీసుకుంది మృదుల “చూడు వెన్నెలా! నీ విప్పుడు చిన్న పిల్లవి. నీకింకా బోలెడు భవిష్యత్తు ఉంది. నీవు తప్పకుండా అందిరి లాగే కల్సి ఆడుకుంటావు. ఎగిరి గంతులేస్తావు. ఆనందంగా ఉంటావు. మందులు సక్రమంగా వాడు. వయసుతో బాటు నీ మన్ససు, బుద్ధి పెరుగుతాయి. అపుడు భయం పోయి అందరితో మమేకమవుతావు. నిన్నందరూ ప్రేమిస్తారు. మా మంచి సిరివెన్నెల” అంది మృదుల ప్రేమగా. ఆ అమ్మాయి కళ్ళలో హర్షాతిరేకాలు. నెమ్మదిగా తన క్లాసుకు వెళ్లిపోయింది రంగుల పెన్సిళ్లూ, బొమ్మల బుక్కూ తీసికొని..
***
సాయంత్రం అవుతుండగా తిరుగు ముఖం పట్టింది మృదుల. ఇంటికి చేరుకొని ప్రెష్ అయి మిగతా పనులన్నీ పక్కన పెట్టి తనకున్న సమయాన్ని వినియోగించుకోవాలని సగం చదివిన ‘ది యెల్లో వాల్ పేపర్’ కథను ఆసక్తిగా పూర్తి చేసింది. అణగారిన మహిళల జీవిత ఇతివృత్తం. యెల్లో రేస్ చైనీయులు కాగా, భ్రమ విభ్రమల నడుమ బతుకునీడుస్తున్న ఒక చైనా యువతి సంఘర్షణ..! తన భర్తతో కలసి దూరంగా, ప్రశాంతంగా జీవనాన్ని గడుపుదామని అనుకుంటంది. డాక్టర్ సలహతో ఆమె భర్త దూరంగా ఒక ఇల్లు తీసుకొని అందులో నివసిస్తారు. అక్కడా ఆమె జీవనం విభ్రమలోనే గడుస్తుంది. చుట్టూ గోడలకు అతికించిన యెల్లో వాల్ పేపర్ నిండా ఆమెకు రకరకాల ఆకారాలు, అందులో నుండి మీదకు దూసుకొస్తున్నట్లుగా విచిత్ర రూపాల్ని తాను చూస్తున్నాని చెబుతూ.. హాహాకారాలు.. అణగారిన ఆర్తనాదాలు.. ఎవరివో ఏవో చెవిలో వినబడుతున్నాయంటా.. రోజూ ఉలికిపాట్లు నడుమ కలత నిద్ర ఉంటుందని ఆమె భర్తతో చెప్తుంది. రోజూ యెల్లో వాల్ పేపర్‍లో ఆమె ఎంతో మందిని చూస్తున్నానని చెప్పినప్పుడు ఆమె భర్త ఆశ్చర్యపోతాడు.
కథ చదివిన పిమ్మట మనస్సుంతా ఆశాంతిగా అన్పించింది మృదులకు. ఎక్కడో తానూ అలాంటి సందర్భం చివర్లో నిలబడ్డట్టుగా.. తెలియని బతుకు దఃఖమేదో.. ఆకారం లేని నీడల్లా.. అలా అలా వచ్చిపోతూ, అర్థం కాని ఆవేదన.. ఏదో గూడుపట్లను కుదుపేస్తున్న బాధ.. బరువుగా.. మగతగా మృదుల కళ్ళు మూతలు పడుతున్నాయి. నిస్సహాయంగా ఉన్న ఎందరో లీలలు.. ఓడిపోతున్న ప్రతీ సారీ అంతు లేని మానసిక దౌర్బల్యాన్ని లోలోన అనుభవిస్తూ.. గెలిచి తీరాలన్న తపనను నరనరాన నింపుకుంటూ జీవన గమనాన్ని కొనసాగిస్తున్న మరెందరో పల్లవి లాంటి వాళ్ల రూపాలేవో.. గోడలలో బంధించినట్లుగా, వేల ఏండ్లగా వముక్తికై పోరాడే శాపగ్రస్థులుగా.. తమలో తామే దహించుకుపోతూ.. అనుకున్నదానికంటే భిన్నంగా ప్రవర్తించక లేక ద్విముఖాలుగా చీలిపోతూ.. ఎవరూ తొంగి చూడటానికి ఇష్టపడని అంతరంగం మాటున.. విషాద విషణ్ణ వదనాలతో నిరీక్షిస్తున్న.. నైరూప్యచ్ఛాయలేవో మృదుల అంతరంగంలో అల్లుకుపోసాగాయి!