నక్షత్రాలు దాక్కునే గర్భసంచి

0
2

[box type=’note’ fontsize=’16’] తమిళంలో బవా చెల్లదురై రచించిన కథను తెలుగులో ‘నక్షత్రాలు దాక్కునే గర్భసంచి’ పేరిట అందిస్తున్నారు జిల్లేళ్ల బాలాజీ. [/box]

[dropcap]న[/dropcap]డి నిశీధిని దాటిన మూడవ జామున, నిశ్చలంగా పొదలో దాక్కొని వుండి, ఉన్నట్టుండి ఎదురయ్యే ఒక క్రూరమృగంలా, ‘ఊమయన్’ ఎక్కణ్ణిండో ఆ వీథిలోకి ప్రవేశించాడు. నిశ్చలంగా పడున్న ఆ వీథి గాఢనిద్రను అతను వూహించిందే. ఆ వీథిలోని ఇండ్లు ఒక్కొక్కటీ ఎప్పుడో అతనిలో ముద్రింపబడ్డాయి. వీథిలోని మనుషుల ముఖాలు, వయస్సు, రంగు, బిడ్డలు గురించిన వివరాలు పదీ పదిహేనేళ్ల నుండి కొనసాగుతూ అతనిలో లీనమై వుంది.

ఎక్కణ్ణిండి ప్రారంభించాలి?

ఆలోచనలు తెగేటట్టుగా… వున్నట్టుండి ఆరేడు కుక్కల మొరిగే శబ్దం కారణమయ్యాయి. నిదానించి, మొరుగుతున్న కుక్కలను సమీపించి చూపులతోనే వాటిని తరిమాడు. అలవాటైన మనిషి వాసనకు కట్టుబడి కుక్కలు తమ తమ గొంతులను తగ్గించి పక్కకు మరిలాయి. స్పష్టత కోసం వెనక్కు తిరిగి అతను నిలబడ్డ మొదటి ఇల్లు… నెలలు నిండిన గర్భిణి అయిన మేరీ విలియమ్స్ యొక్క మల్లె పందిరి పెంకుటిల్లు వాకిలి.

ఒక వినోదమైన శబ్దం చేసి అతను మాట్లాడాడు. భయంగొలిపే, మ్… మ్… మ్… అన్న శబ్దం, ఒక అపస్వరంలా ఆ నిశ్వబ్దాన్ని చెదరగొట్టి ప్రతిధ్వనించింది.

దిక్కున లేచిన మేరీ ఆ శబ్దం యొక్క పూర్తి అర్థాన్ని గ్రహించింది. గురక పెట్టి నిద్రపోతున్న తన భర్తకు దగ్గరగా జరిగింది. అతనిలో దాక్కుని, అతని వేడిని గ్రహించి తనమీద ప్రాకే ఆ విసుగు పామును విదిలించి పడేయాలని ఓడిపోయింది. అతడిని చరిచి, లేచి పడకమీద కూర్చుంది. లేచి లైట్ వేయటానికీ భయం అనుమతిని నిరాకరించింది.

మ్… మ్మ్… మ్… శబ్దంతో ఊమయన్ ఆడుకుంటున్నాడు.

మాటలులేని తన శబ్దం, లోపల ఒక స్త్రీ శరీరాన్ని వణుకు పుట్టిస్తున్నట్టుగా గ్రహించిన వాడిగానో… గ్రహించని వాడిగానో… శబ్దంలో దాక్కొని వున్న మాటలు మేరీ విలియమ్స్‌కు ఒక రహస్యంలా పదునుగా చేరింది.

“ఈ బిడ్డా నీకు దక్కడు.”

సీతాకోకచిలుకల్లా ఎగురుతూ తిరిగిన ఆమె కలలమీద ఊమయన్, మండే కొరివికట్టను విసిరాడు. మంట ఎక్కడ నుంచైనా అంటుకోవచ్చు.

చీకటికి అలవాటుపడ్డ కళ్లతో, మేకపిల్లను హృదయానికి ఆనించుకొని నిలబడున్న యేసుక్రీస్తు చిత్రపటాన్ని సహాయంగా చూసింది. కొంత తెలిసీ తెలియనట్టుగా, యేసుక్రీస్తూ మేకపిల్లా దర్శనమిచ్చారు.

వీథి చివరి నుండి ఊమయన్ శబ్దం ఇంకా వినిపిస్తూనే వుంది. భయాన్ని వినటానికి ఇష్టం లేని దానిలా కూర్చున్నట్టుగానే తన రెండు మోకాళ్లమధ్యన ముఖం దాచుకుంది. ఆ నిగ్రహం ఆమె దుఃఖాన్ని నియంత్రించలేకపోయింది.

బెత్లహామ్‌లో జన్మించిన ఆయనను
రక్షించమని స్తుతించు మనసా –
నువ్వు బెత్లహామ్‌లో జన్మించిన ఆయనను
రక్షించమని స్తుతించు మనసా…

అన్న కీర్తన పాట డ్రమ్స్ శబ్దంలో పదునుదేలి, ఆ రాత్రి ఏకాంతాన్నీ, చలినీ దూరంగా తరిమికొట్టింది. మార్గశిరంలో పదిహేను రోజులు కొనసాగే ఈ భజన పాటలు వీథిని క్రిస్మస్ వేడుకలకు తయారుచేస్తాయి. ఎక్కువగా డ్రమ్స్ శబ్దం పిల్లలను భజన బృందం కేసి లాగే గాలాలు. మఫ్లర్లు చుట్టుకుని మంచులో తడిసి, వేకువను చూసి, ఎవరి ఇంట్లోనైనా తాగిన బ్లాక్ కాఫీ రుచితో వెనుదిరిగే పిల్లలకు ఆ రాత్రి వరకూ ఈ వేడుకలు మదిని వదిలి వెళ్లలేవు. ఎవరి తలమీదైనా మోపబడే పెట్రోమాక్స్ లైట్ వెలుతురు ఈ పరిస్థితిని అలాగే కాపాడుకుంటుంది.

ఆ పాటకేసి ఆమె మనసు కదలటానికి ప్రయత్నించి ఓడిపోయింది. దేవుడు, భర్త, ఊమయన్, పాట, చిత్రంలోని మేకపిల్ల ఏవీ కూడా నచ్చకుండా పోయాయి.

చేతి నిండుగా చిల్లర నాణేలతో భజన బృందాన్ని ఆహ్వానించే ఆమె స్వభావం, పడకను వదిలి పెట్టకుండా వుండిపోయింది తెరవని తలుపు ముందు నిలబడి, దేవనామ సంకీర్తన భజన…

దేవా… దేవా…
నా కన్న తండ్రి కొక్కరికే
నమోస్తే… నమోస్తే…

అని గొంతెత్తి తర్వాతి ఇంటికేసి నడిచారు.

బృందం శబ్దంతో నిద్ర చెదిరి పక్కకు వొత్తిగిలి పడుకున్న విలియమ్స్, తన భార్య ఇలా ముడుక్కొని కూర్చొని వుండటం సహజమేనని అనుకున్నా, ఆమెను స్పృశించి ముఖాన్ని తనకేసి తిప్పాడు. ఆ ఎర్రబడ్డ ముఖంలో చాలాసేపటి నుండి ఏడుస్తున్న ఆనవాలును చూసి అదిరిపడ్డాడు.

చాలా సేపటి వరకూ బతిమాలి, అదిలించి, ఓదార్చిన తర్వాత ఆమె ఊమయన్ వాక్కును చెప్పి మరీ దుఃఖించసాగింది. లోలోపల అతనికీ ఒక భయమున్నప్పటికీ ఆమెకు తెలియకూడదని భావించి, ధైర్యశాలిలాగా… “వాడే నాలుక తెగేయబడ్డ ఊమయన్. మాట్లాడటానికి వీలుకాదు. వాడేదో బిచ్చమెత్తుకోవటానికి వాగినదాన్ని పెద్దదిగా వూహించుకొని ఏడుస్తున్నావే, నువ్వు చదువుకొని ఉద్యోగం చేస్తున్న ఆడదానివే కదూ?” అని మృదువైన కంఠంతో అదిలించాడు.

“లేదండీ, గర్భవతుల ఇంటి ముందు అపస్వరంతో గొంతెత్తి వాడు చెప్పినవంతా ఫలించాయి. ‘నగోమీ’ టీచర్ మొదలుకొని ‘డెయిసీ’ వరకూ…” అని ఆపి ఆపి మాట్లాడింది.

ఎక్కడో విన్నదాన్ని ఒక వార్తలాగా స్వీకరించినవాడికి తన ఇంట్లోనే అది సంభవించనున్నది అన్న విషయాన్ని ఒక వార్తలాగా గ్రహించటానికి వీలు కాకపోయింది. దుఃఖంతో ముంచేసి అతనినీ కృంగదీసింది. ఏమీ తెలియనివాడిలాగా నటించి, తన భార్యను ఓదార్చి, ధైర్యం చెప్పి, తన మాటల ఉదాసీనతతో ఆమె గాయపడకూడదని ఎంతో జాగ్రత్తగా మసలుకొన్నాడు. తన సాన్నిహిత్యమైన స్పర్శ ఆమెకు ఓదార్పునివ్వగలదని నమ్మి, ఆమెను తనలో దాచుకున్నాడు. చలితో ప్రారంభమైన ఆ రోజుటి ఉదయం వాళ్లకు ముగింపులేక కొనసాగింది.

ఎవరూ లేని ఏకాంతం, భయాన్ని నోటితో మూసుకుని ఆమె ఇంటి వాకిట్లో కూర్చుంది. మళ్లీ వీథిలో వినిపించిన ఊమయన్ గొంతు వణికేలా చేసింది. తలుపును తీసి వీథిని తీక్షణంగా చూసింది.

రాత్రి చెప్పిన వార్తకోసం సేకరించబడే పగటిపూట బిచ్చంలో ఊమయన్ లీనమై ఉన్నాడు. తలుపుల మధ్యన నిలబడి, ఎదురింటి ముందు నిలబడున్న అతనిని పూర్తిగా పరిశీలించింది మేరీ.

రివటలా పెరిగిన ఆకారం, మంచి తెలుపు రంగు. చర్మం ముడుతలలో అతని వయసు పండిపోయి దాక్కుంది. రంగురంగుల మురికి పట్టిన దుస్తులు ఒంటి నిండుగా చుట్టుకున్నాడు. భుజమ్మీద తగిలించుకొని వున్న రెండు మూడు సంచులలో ఒకటి నిండిపోయింది. నల్లని తిలకంతో నుదుటిమీద బొట్టు పెట్టుకొని, వెనకన ఆరెంజ్ రంగు సాదు పులుముకున్నాడు. ఎవరినీ దగ్గరకు రానియ్యని వాలకం, కళ్లు లోతుకెళ్లి వున్నాయి.

చటుక్కున ఈమె ఇంటివైపుకు తిరిగి నిలబడి ఏంటో నిదానించి, తర్వాత నిరాకరించి తర్వాతి ఇంటికేసి కదిలాడు. చెడువార్త చెప్పిన ఇంట్లో దక్షిణ ఎందుకు అడగాలి? అన్న ధర్మం అతనిలోనూ నిండి వుండొచ్చు.

ఈ చర్యవల్ల ఇంకా కృంగిపోయింది. నిన్న రాత్రి జరిగింది ఒక పీడకల లాంటిదని భావించి తుడిచెయ్యటానికి వీలుకాక తన శరీరంలో అంటుకొని వుందని గ్రహించింది. తలుపును లోపలి వైపున గెడియ పెట్టి పడకగది తెరలను దగ్గరకు లాగి గదిని చీకటిని చేసింది. కట్టుకున్న చీరెను పక్కకు తప్పించి పొత్తి కడుపుమీద చెయ్యి పెట్టి బిడ్డ కదలికలను గ్రహించి దాని సజీవాన్ని దృవీకరించుకుంది. కడుపుమీది గీతలు పోగొట్టుకున్న ఇద్దరు బిడ్డల జ్ఞాపకాలను గుర్తులుగా మిగిల్చాయి.

వీథి క్రిస్మస్ వేడుకలకు తనను పూర్తిగా అర్పించేసింది. పెరిగి పోతున్న సంగీత శబ్దాలు, అప్పుడప్పుడూ ఆలయం నుండి వినబడే క్రీస్తు పాటలు, ఇండ్లు పూసుకునే కొత్త రంగులు, ఇండ్ల ముందు వ్రేలాడే రంగురంగుల షత్రాలు, ఏర్పాటుచేసిన పూరిండ్లు, వచ్చి పడే గ్రీటింగ్ కార్డులు అంటూ పరిస్థితి కుతూహలంగా మారుతూ వున్నది. వేటిమీదా ఆసక్తి లేక ఒక శవంలా పడుంది మేరీ.

ఏరోథ్ (క్రీస్తు జన్మించిన బెత్లహామ్ రాజు) తళతళలాడే ఖడ్గపుటంచున అంటుకొని వున్న పసికందుల రక్తపుచుక్క ఒకటి తన ముఖంలో మరకలా వుండటాన్ని గ్రహించి నిర్ఘాంతపోతూ కేక పెట్టింది. రాజ్యమంతా చెదిరి పడున్న పసిపిల్లల తలలేని మొండాలు మళ్లీ మళ్లీ ఆమెకు గుర్తుకు రాసాగాయి.

తన బిడ్డా ఇలాగే అనాథలా వీథిలో పడుంటుందా? లేదూ స్మశానంలో ఖననం చెయ్యబడుతుందా? అన్న దుఃఖపు బాధను తట్టుకోలేక తపిస్తూ వుండిపోయింది. ఆమెను ఓదార్చేందుకు మాటలు రాక విలియమ్స్ లోలోన కుమిలిపోసాగాడు.

ఏరోథ్ రాజు యుద్ధవీరుల బూట్ల శబ్దాలు బాగా సమీపానికొచ్చాయి. ఆ బృందపు వీరుల ముఖాలను వెతికి వేసారిపోయింది. ఊమయన్ యుద్ధవీరుల దుస్తులలో, రక్తదాహంతో మెరిసే కళ్లతో వెళుతూ వున్నాడు. అతని నడుముకున్న ఒరలో ఖడ్గం బయటికి కనిపిస్తూ వున్నది. చటుక్కున లేచి కిటికీని తెరిచి వీథిని చూసింది. ఒక నల్లపిల్లి మాత్రం ఎదురింటి పిట్టగోడమీద కూర్చొని వుంది. నిప్పుకణికల్లా వెలుగుతున్న దాని ఎర్రటి కళ్లల్లో మరణం దాగి వుండటాన్ని చూసి భయపడి తన పొత్తి కడుపును మళ్లీ తడిమి చూసుకుంది. భజన శబ్దమూ, మనుషుల సంచారమూ లేని వీథి వెలవెలబోతూ వున్నది. దూరంగా చీకటిని పోగొడుతూ వెలుగుతున్న ఒక నక్షత్రం కనిపించింది. జ్యోతిశ్శాస్త్ర పండితులకు మార్గదర్శనం చేసే నక్షత్రం అదేమోనని నమ్మి చేతులు జోడించి నమస్కరించింది. తన ఇంటివైపు ఆ నక్షత్రం కదిలితే, తన బిడ్డ బతికిపోతుందని నమ్మింది. నక్షత్రం ఎదుటి దిక్కులో మేఘాలమధ్యన కదులుతూ కొంత సేపటికి మరుగయ్యింది. అది మేరీకి ఇంకా భయాన్ని కలిగించింది.

‘నా బిడ్డను కాపాడటానికి ఒక రక్షకుడు కావాలి’ అని మోకాళ్ల మీద కూర్చుని ప్రార్థించింది. నమ్మకానికీ అపనమ్మకానికీ మధ్య వున్న దూరాన్ని తన మనసుతో తాకినట్టుగా ఆ రాత్రిని గడిపింది.

క్రిస్మస్ చాలా దగ్గరుంది. ఇవ్వాల్టి రాత్రి గడపటం ద్వారా దాన్ని అందుకోగలం. పగలు కోసం అవసరంలేని వీథి చీకటిని విద్యుద్దీపాలు తొలుస్తూ వెలుతురును కక్కుతూ వున్నది. మార్గశిరం చలి పండుగకాల ఉత్సాహాన్ని కుమ్మరిస్తూ వున్నది. సీరియల్ లైట్ల వెలుతురూ, ఆడవాళ్ల జాగరణ, పిల్లల కొత్తబట్టల కుతూహలము, తర్వాతి రోజు ఉదయం ఒక పసికందు జననం లోకమంతా సంతోషాన్ని గుప్పించపోవటాన్ని తొలి ప్రకటన చేస్తూ వున్నది.

మేరీ పశువుల కొట్టంలోని గడ్డి పరుపుమీద అమితమైన నొప్పితో బాధపడుతూ వున్నది. పక్కనే కూర్చుని జోసెఫ్ ఆమె ముంగురులను సవరిస్తూ వున్నాడు. విలియమ్స్ ఒడిలో మేరీ చలనం లేకుండా పడుకొని వుంది. భాష లేని ఒక శబ్దం ఆమెను ముడుచుకొని పోయేలా చేసింది. ఆ రాత్రి ఆరాధన, వాళ్లు లేకనే యేసు జననం కోసం జరిగిపోయింది.

టపాసులు పేలుతూ మళ్లీ డ్రమ్స్ శబ్దం అదరిపోతూంటే, క్రిస్మస్ తాత వేషం వేసుకున్న ఒక వ్యక్తి చేతిలోని చాక్లెట్లతో నిండిన పెద్ద బక్కెట్లో చెయ్యివేసి పిడికిలినిండుగా తీసి ప్రతి ఇంటికీ పంచుతున్నాడు. గుత్తులు గుత్తులుగా వున్న సంతోషంతో వీథి నిండిపోతున్నది. డ్రమ్స్ శబ్దం తారాస్థాయికి వెళుతున్నది.

‘సర్వస్వాన్ని సృష్టించినవాడు
సర్వ ధీరుడూ – ఇక్కడ
భంగపాటుతో పశువుల కొట్టంలో
శయనించి వున్నాడు.’

ఆరాధన ముగిసిన పగటిపూట భజన బృందంలోని వాళ్ల నడక, దాదాపు పరుగులా మారింది. ఒక్కొక్కరి ముఖంలోనూ పండుగ సంతోషమూ, ఆవశ్యకతా కనిపిస్తోంది.

ఏడ్చి ఏడ్చి వుబ్బిన ముఖంతో మేరీ వాకిలి ముఖద్వారాన్ని పట్టుకొని ఒంటరిగా నిలబడి వుంది. ఎవరినీ తాకని కాంతి ఆమెను చుట్టుకొని వుంది. శబ్దపు నొప్పిని తాళలేక ఎక్కడికైనా వనాంతరాలకేసి పారిపోదామా? అని తపిస్తున్నది.

ఇంట్లోకి వెళదామని అనుకున్న ఆమె చేతిని పట్టుకొని తెరిచి, క్రిస్మస్ తాత చాలా చాక్లెట్లను గుప్పించాడు.

“ఎందుకిన్ని?”

“నిన్న రాత్రి మన కన్నెమేరీకి శిశువు జన్మించాడు.”

“ఏ నష్టమూ లేకుండానా?”

ఎదురుచూడని ఈ ప్రశ్నతో క్రిస్మస్ తాత చేతులు సన్నగా వణికాయి. నిగ్రహించుకుంటూ, “తల్లీ బిడ్డలు సంపూర్ణ క్షేమం.”

మేరీ ఒక ఆవుదూడలా ఎగిరి గెంతుతూ ఇంట్లోకి పరుగెత్తి ఒక ట్రే నిండుగా కేకుల్నీ, పలహారాలనూ సర్ది పెట్టసాగింది, భజన బృందానికి ఇవ్వటానికి.

~

తమిళ మూలం: బవా చెల్లదురై

అనువాదం: జిల్లేళ్ళ బాలాజీ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here