చదివిన వారికి చదివినంత! – ‘నల్లమల వాలిమామ ప్రపంచం’

10
2

[శ్రీ సురేష్ వెలుగూరి రచించిన ‘నల్లమల వాలి మామ ప్రపంచం’ అనే ఐదు భాగాల పుస్తకాన్ని సమీక్షిస్తున్నారు శ్రీమతి జె. శ్యామల.]

‘ప్రకృతి ప్రత్యక్ష దైవం’ అనేది నిర్వివాదాంశం. అందుకే ఆది నుంచి మనిషి చెట్టును, పుట్టను, భూమిని, నదిని, కొండను, గుట్టను ఆరాధిస్తున్నాడు. అయితే క్రమేణా మనిషి స్వార్థపరుడై తన ఉనికికి ఆధారమైన ప్రకృతినే ధ్వంసం చేయడం మొదలుపెట్టి స్వయంకృతాపరాధిగా పరిణమించాడు. ఫలితంగా కాలాల తీరు మారిపోతోంది. ప్రకృతి విపత్తులు పదేపదే తలెత్తి మనిషి మనుగడను దుఃఖభాజనం చేస్తున్నాయి. స్వచ్చమైన గాలి, నీరు కరువైపోతున్నాయి. ప్రస్తుతమే ఇలా ఉంటే భావి గురించిన ఊహే భయం.. భయం! ప్రాణాధారమైన గాలి, నీరు మృగ్యమైతే ప్రాణి మనుగడ ప్రశ్నార్థకమే. ఈ విషయమై ఇటీవలికాలంలో శాస్త్రవేత్తలు, మేధావులు, రచయితలు, కళాకారులు పర్యావరణ పరిరక్షణ గురించి హెచ్చరిస్తూ, అందుకోసం పాటుపడుతూ, ప్రజల్లో చైతన్యం, అవగాహన కలిగిస్తున్నారు.

ప్రసంగాలు, వ్యాసాలు, పాటలు, పాఠాలు, నృత్యాలు తదితర ప్రక్రియలన్నిటా ‘ప్రకృతిని ప్రేమించి, రక్షిస్తే అది నిన్ను రక్షిస్తుంది, ప్రకృతి క్షేమమే మనిషికి క్షేమం, లేదంటే అంతా క్షామమే’ అనే సందేశం అందిస్తున్నారు. ఈ బాటలో.. గొప్ప ఆలోచన, ఆచరణ గల ‘కలం’కారీ నిపుణుడు, మీదుమిక్కిలి పుస్తకాల తయారీలో.. ఆధునిక సాంకేతికతలో మంచి పట్టున్న సురేశ్ వెలుగూరి మానవాళి శ్రేయస్సును ఆకాంక్షిస్తూ అనన్య సామాన్యమైన రచనను ‘నల్లమల వాలిమామ ప్రపంచం’ పేరుతో, ప్రకృతి ఒడిలో ఓ చెంచువీరుడి జీవితయానాన్ని, ఆసక్తికరమైన కథలుగా అల్లి, అందమైన అయిదు పుస్తకాల సిరీస్‌ను వెలువరించడం ఎంతో అభినందనీయం.

పుస్తకం చూడగానే ముఖ చిత్ర సహజ సౌందర్యానికి పాఠకుడు ఫిదా అయిపోవడం ఖాయం. ఆపైన పుస్తకం పేజీలు ఒక్కొక్కటిగా పరికిస్తే .. కథనం, చిత్రాలు పోటాపోటీగా ఉన్నాయనిపిస్తుంది. పిల్లలకు, పెద్దలకు కూడా ‘పెద్ద బాలశిక్ష’ ఎంత ముఖ్యమైందో, ‘నల్లమల వాలిమామ ప్రపంచం’ సిరీస్ కూడా అంతే ముఖ్యమైందని నేను గట్టిగా చెప్పగలను. ఈ సిరీస్ చదివి, పాఠకులు వాలిమామ జీవిత గమనాన్ని మాత్రమే కాదు, నల్లమల అడవుల అంతరంగాన్ని, అక్కడి ప్రాణులను, చెంచుల జీవన శైలిని, ఆచారాలను, వారి భాషను.. మరెన్నింటినో తెలుసుకోగలుగుతారు. కొన్ని విలువైన సమకాలీనాంశాలను బాక్స్ ఐటమ్స్ గా చేర్చి అదనపు ప్రయోజనం అందించారు. ప్రతి పాత్రను పాఠకుడి కళ్ళకు రూపు కట్టడంలో సురేశ్ వెలుగూరి నూటికి నూరు శాతం విజయం సాధించాడు.

వీరత్వం, ధీరత్వం, మానవత్వం, భూతదయ, ప్రకృతి పట్ల అపార ప్రేమ, కర్తవ్య నిర్వహణలో అంకితభావం వగైరా, వగైరా సద్గుణాలన్నీ మూర్తీభవించిన అపూర్వ, అపురూప పాత్ర వాలిమామ. పదిహేనేళ్ళ వయసులోనే మనుషులపై దాడి చేస్తోన్న పులిని మట్టుబెట్టిన చెంచు వీరుడు. వన్యప్రాణుల పట్ల కరుణ గల వాలికి ఓ పులి ఏకంగా నేస్తంగా మారడం ఎంత అద్భుతం! కల్దారి వంతెనకు కాపలాదారు అయిన వాలిమామకు ఆ వంతెన ప్రాణసమం. అన్నివేళలా అన్యాయాన్ని ఎదిరించే ధీశాలి. అతడి భార్య శంబాయి సైతం వీరనారి. వారి బిడ్డ సీంబలి. ఆ పేరుకు గల నేపథ్య కథనం కూడా ఎంతో ఆసక్తికరంగా ఉంది.

రెండో భాగంలో నైజాంకు చెందిన పెద్ద వేటగాడు సర్ రిచ్ వాల్టన్‌నే మెప్పిస్తాడు వాలి. అదే సమయంలో చంపిన పులిని చూస్తూ కన్నీరు పెట్టే వాలి పాఠకుల మనసును చెమ్మగిల్లేలా చేస్తాడు. అడవి వీరుడు వాలి, చిత్తానూరు కుర్రాడి మాటను సవాలుగా తీసుకొని కబడ్డీని ఓ పట్టుబట్టడం భలేగా ఉంది. సర్కారు సాయం అందని గూడేల వారికి పూనుకుని సాయం సాధించడంలో గానీ, రైల్లో దొంగల ఆట కట్టించడం, ఔషధాల పేరిట కట్టెముక్కలమ్మే రంగడికి బుద్ధిచెప్పడం.. ఇదంతా ఒక ఎత్తయితే, కల్దారి సందర్శనకు వచ్చిన ప్రధాని నెహ్రూ, వాలిని ప్రశంసించడం మరో ఎత్తు. ఎవరికి ఏ సాయం అవసరమైనా ముందు నిలిచే వాలి, తన బృందంతో తిరుపతి ప్రయాణంలో అక్కడ నల్లమలలో మంటలు చెలరేగితే అంతా తానై అదుపు చేయడం..ఇలా కథలన్నీ వేటికవే అలరిస్తాయి. ముఖ్యంగా వాలిమామ, తన కొడుకుకు చెప్పిన బతుకు పాఠం బహు బాగుంది.

ఫారెస్ట్ ఆఫీసర్ గా పనిచేసి, గిరిజనుల ప్రేమను గెలుచుకుని, స్వాతంత్రానంతరం బ్రిటన్ తిరిగి వెళ్లిన రాబర్ట్ కొడుకు, కోడలు భారతదేశం వచ్చి, కల్దారిని సందర్శించడం ఉద్వేగ భరిత సందర్భం.. ఎల్లలెరుగని వారి ఆత్మీయతానుబంధం, అవినాభావ సంబంధం.. పాఠకుడు తానూ అక్కడున్న అనుభూతిచెందుతాడు. జల ప్రళయంలో తండ్రిని కాపాడుకునేందుకు వాలిమామ పడ్డ తపన, చేను వీడని తండ్రి మొండితనం, కడ దాకా తన కాళ్ళ మీదే నిలబడాలన్న తండ్రి పట్టుదల.. వారి వ్యక్తిత్వాలను మెచ్చకుండా ఉండలేం. వంతెన మీదకు చేరి కదలని ఏనుగుపిల్లను రక్షించే కథ మనోరంజకంగా, స్ఫూర్తిదాయకంగా ఉంది. వాలి తల్లిదండ్రుల నిష్క్రమణ వైనం పాఠకులను విచలితులను చేస్తుంది. అడవి చూడాలని వచ్చే స్కూలు పిల్లలు, అలాగే వెటర్నరీ కాలేజీ విద్యార్థులు.. భావితరాలను ఎడ్యుకేట్ చేసి, వారికి సాయపడి, గురుతర బాధ్యతను వాలి నిర్వర్తించిన తీరు అమోఘం. అడవిలో పీపుల్స్‌వార్ వారి కదలికలు, వారితో పరిచయం, వారిని అర్థం చేసుకునే వాలి ప్రయత్నం ఆసక్తికరంగా ఉన్నాయి. వాలి కొడుకు సీంబలి సొంతంగా లోతడివికి వెళ్ళి, తెల్ల ముంగిసలను వేటాడే ఘట్టం థ్రిల్లింగ్‌గా ఉంది. అడవి భూమిని అన్యాక్రాంతం చేసేందుకు జరిగిన కుట్ర, దాన్ని ఛేదించడానికి జరిగిన ప్రయత్నాలు, దుండగులపై ముప్పేట దాడి, అందులో బుధూ పాత్ర, అనంతరం అవలోకనం ఎంతో బాగుంది.

నాలుగో పుస్తకం ఆరంభ కథే అదిరిపోయింది. నంద్యాల ఫారెస్టు ఆఫీసుకు వెళ్లిన వాలి నటరత్న ఎన్ టి రామారావును సందర్శించిన ఘట్టం మనోజ్ఞంగా ఉంది. ఎన్.టి.ఆర్. చుట్టూ అల్లిన కథ సురేశ్ కల్పనా చాతుర్యానికి ఓ మచ్చుతునక. కల్దారీ బడి సంస్కరణ, కల్దారి వంతెనను కంటిపాపగా కాచుకున్న సందర్భాలు, దాష్టీకం చేసిన పోలీసులకు తగిన బుద్ధి చెప్పడం అర్ధరాత్రి వేళ దారిమధ్యలో సైకిలు చక్రంలో ఇరుక్కున్న పెద్ద పాముతోనే ఇల్లు చేరడం వాలి సేవా, కర్తవ్య పరాయణతకు, సాహసానికి ఆనవాళ్లు. ఎలుగుల గడ్డ లోతడివిలో, ఎలుగు.. వాలి, రంగు చేతులను పట్టుకు నడవడం, ఆ తర్వాత వివిధ చెట్ల కాయల పంపిణీ పాఠకులకు ఆశ్చర్యానందాలు కలిగిస్తాయి. ఇనుప గూలం గుచ్చుకుని గాయపడ్డ పులికి, వాలి నొప్పాకు వైద్యం చేయడం మరో అద్భుత కథనం!

మునిమాకుల దిక్కుకు వాలి బృందం వెళ్ళడం, అక్కడి గుహలో విచిత్రానుభూతిని పొందడం, మళ్లీ మర్నాడు దేవారం వెళ్ళడం.. వాలి రాజ స్వామి సమాధిని కనుగొనడం, హఠాత్తుగా చిన్నాయన రామ్లు వచ్చి.. అంతలోనే అంతర్థానమై.. సమాధి నుంచి సెలవు పలకడం.. పాఠకుడి మనసును చిత్రంగా స్పందింపజేస్తుంది. అడవిలో గంజాయి పండించే దుష్టులను దునుమాడి సీంబలి తండ్రికి దగ్గ బిడ్డగా నిలవడం అలరిస్తుంది. డి.ఎఫ్.ఓ అజిత్ కథనం స్ఫూర్తిదాయకం. వాల్టన్ ఆహ్వానంపై వాలి హైదారాబాద్ సందర్శనం మనోరంజకంగా ఉంది. గుట్టను వీడి అగచాట్ల పాలైన శీను బతుకును తిరిగి నిలబెట్టిన వాలి అందరి బంధువుగా మెప్పిస్తాడు.

సిరీస్ లో 5వ పుస్తకం వాలిమామ తమ్ముడు బుధూ ఆర్మీలో రిటైర్మెంట్ కథతో ప్రారంభం అవుతుంది. సర్వీస్‌లో ఆఖరి రోజున కూడా బుధూ, మంచురాళ్ళతో యుద్ధం చేసి, తన సత్తా చాటిన వైనం ‘ఔరా’ అనిపిస్తుంది. వాలి మామ శరీర దారుఢ్య పరీక్షలలో నెగ్గి మరో అయిదేళ్లు కల్దారి వంతెన కాపలాకు అంకితమై, ఉద్యోగ విరమణ అనంతరం ‘ప్రకృతి బడి’ ని నిర్వహించి భావి తరాలను జాగృతం చేయడం.. అతడి ముందుచుపుకు సలాం చేయాల్సిందే. అడవిని దోచుకుని, చెంచుల జీవితాలతో చెలగాటం ఆడిన ప్రతి ఒక్కరిని దీటుగా ఎదుర్కొని న్యాయాన్ని గెలిపించడం.. నాయకుడంటే, పెద్దదిక్కంటే అలా ఉండాలి అనిపిస్తుంది. కల్దారి వంతెన కనుమరుగు కావడం.. వాలి పడ్డ వేదన పాఠకుల మనసును చెమరింపజేస్తుంది. కుటుంబ రహస్యం.. వాలిరాజ స్వామి గురించిన కథనం ఎంతో థ్రిల్లింగ్‌గా ఆసక్తికరంగా ఉంది. వాలిరాజస్వామి ఆదేశం మేరకు బుధూ దేవళం నిర్మాణం, వాలి మామ అడవి బడి నిర్మాణం చేపట్టడం.. వాలి రాజస్వామి మాట కూడా వాలి నోటనే పలకడం, వాలిమామ అనుభూతులు అన్నీ పాఠకులను కూడా అందులో లీనం చేస్తాయి. ఇందులో మరణాలు కూడా చిత్రమే. సోమ్లు, రుక్కుమా అర్ధరాత్రి అగ్నికి ఆహుతి కావడం, రామ్లు వాలిరాజ స్వామిలో ఐక్యం కావడం, ఆలయంలోనే అజయ్, రేఖ అంతర్ధానం కావడం ఊహాతీతం! వాలి తరం వారు ఒక్కొక్కరు రాలిపోవడం.. అందునా ఏకూ, ఛైలియా ఒక్కసారే కన్ను మూయడం.. ఇద్దర్నీ పక్కపక్కనే పూడ్చడం పఠిత కూడా కంటతడి పెట్టే సన్నివేశాలు. హైదరాబాద్‌లో ఐ.ఎఫ్.ఎస్.లకు ఏర్పాటు చేసిన ‘డీప్ లెర్నింగ్’ సదస్సులో వాలి ఉపన్యసించడం ఓ అనూహ్య.. అద్భుత ఘట్టం. ‘నల్లమల వాలిమామ ప్రపంచం’ లో కరోనా కాలాన్ని కూడా ఇమిడ్చి, వాక్సిన్ల విషయంలో గిరిజనులకు జరిగిన అన్యాయాన్ని ఎండగట్టడం అభినందనీయం. చివరగా కలదారి వాలి రాజ స్వామి నేపథ్య కథనం.. చారిత్రక యుద్ధ సన్నివేశాలతో రోమాంచితులను చేస్తుంది.

‘నల్లమల వాలిమామ ప్రపంచం!’ సిరీస్ చదవడం ముగించినా, ఆలోచనల్లో వాలి మామ మిగిలే ఉంటాడు. ప్రకృతి పట్ల ఒక పరిపూర్ణ అవగాహన కలిగించే అపురూపమైన పుస్తకాల సిరీస్ తో పాఠకులకు ‘వెలుగు’ పంచిన సురేశ్ వెలుగూరి ధన్యజీవి. ఇది నామమాత్ర పరిచయమే. ఈ సిరీస్‌ను పెద్దలు.. పిల్లలు.. ఎవరికి వారు సొంతంగా చదివితేనే మనసులో ప్రకృతి వెలుగు పరుచుకునేది!

***

నల్లమల వాలిమామ ప్రపంచం
రచన: సురేశ్‌ వెలుగూరి
మొత్తం ఐదు పుస్త‌కాల పేజీలు: 1000
మొత్తం ఐదు పుస్త‌కాల వెల: ₹ 3000/-
ప్రతులకు:
విఎమ్‌ఆర్‌జి బుక్స్,
#403, అభి రెసిడెన్సీ, రోడ్ నెం.5,
మిథిలా నగర్,
ప్రగతి నగర్ ఎక్స్‌టెన్షన్,
హైదరాబాద్. 500090
ఫోన్: 098499 70455
vaalimaama@gmail.com
https://vmrgbooks.com/

~

శ్రీ సురేష్ వెలుగూరి గారి ప్రత్యేక ఇంటర్వ్యూ:
https://sanchika.com/special-interview-with-mr-suresh-veluguri/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here