నల్లటి మంచు – పరిచయం

0
3

[box type=’note’ fontsize=’16’] ఇంటిని, ఊరినే కాదు తమ ఉనికినే కోల్పోతున్న కాశ్మీరీ ప్రజల దుఃఖం – “డయస్పోరా’గా మారుతున్న కటువైన నిజాన్ని ‘నల్లటి మంచు’ నాటకం ప్రదర్శిస్తుంది. హిందీ మూలం డా. మీరాకాంత్. తెలుగు సేత డా. సుమన్‌లత రుద్రావజ్ఝల. [/box]

నల్లటి మంచు – డయస్పోరా బాధ

[dropcap]’కా[/dropcap]లీ బర్ఫ్’ (నల్లటి మంచు) అన్న ఈ నాటకం కాశ్మీరు ప్రజల వ్యథల – కథలలో ఒక చిన్నబిందువు మాత్రమే! ప్రజల జీవితాల వ్యథాభరిత గాథలన్నీ ప్రవహిస్తూన్న నీటి మడుగుల్లా తయారవుతున్నాయి. అయితే ఆ వ్యధా సరోవరాలలోనే ‘ఆశ’ – ‘నమ్మకం’ అనే కమలాలూ వికసిస్తున్నాయి. కాశ్మీరీ భాషలో ‘కాలీ బర్ఫ్’ (‘క్రుహున్ షీన్’) అన్నదొక జాతీయం, ‘నల్లటి మంచు’ దాని అర్థం. ‘ఎన్నడూ జరగనిది’ అని! ఈ నాటకం కాశ్మీరులో నేడు జరుగుతున్న యథార్థాన్ని చిత్రించటంతో బాటు, మంచు ఇంకా నల్లబడలేదని, అంటే కాందిశీకుల్లా ఇటూ – అటూ చెల్లా చెదరయిన కాశ్మీరు ప్రజలు తమ సొంత గడ్డకు తిరిగి వెళ్తామన్న ఆశని – నమ్మకాన్ని వదులుకోలేదన్న ఆశాభావాన్ని కూడా పాఠకుల ముందు ఉంచుతోంది. దూరాన్నుండి నల్లగా కనిపించే ఈ తెల్లని మంచు, నలుపురంగు పైనుండి జల్లినదే తప్ప స్వతహగా నల్లబడటం కాదని చెప్తుంది. సత్ప్రయత్నాలనే వర్షంతో దగ్గరలోనే ఆ నలుపుదనం కడుక్కుపోతుందన్న ఆశల కల, ప్రతి కాశ్మీరు వ్యక్తి మనసులోనూ సజీవంగా ఉంటుంది.

ఉగ్రవాదం వలన ఏర్పడిన పరిస్థితులతో కూకటి వేళ్లతో తొలగించబడిన కాందిశీకుల కుటుంబం కథ. పండిత్ శ్రీ కంర్ వౌఖలూ (టాఠాజీ) ఆయన కుమార్తె శారిక – తమ స్వంత ఇల్లు, ప్రదేశం నుండి దూరమయి ఒక డయస్పోరా జీవితాన్ని గడపవలసిన దురవస్థకు లోనవుతారు. ఎంతటి భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొన్నా, తిరిగి తమ ఇంటికి, తమ ఊరికి తిరిగి చేరుకుంటామన్న ఆశ – తీవ్రమయిన ఆకాంక్ష వారిలో ఊపిరి పీలుస్తునే ఉంటాయి. అదే ఎంతో శక్తిమంతమయిన భావం. తమ గడ్డ, మట్టికి దూరం అవటం అనే దుఃఖంతో బాటు, పండిత్ శ్రీ కంఠీ వౌఖలూగారు కాశ్మీరు లోయలోని ఉగ్రవాద దాడిలో కొడుకు – కోడల్ని పోగొట్టుకున్న భయంకరమైన ఆవేదననూ అనుభవిస్తున్నారు. శారిక తన జీవితానికి చుక్కాని అనుకున్న తనకు కాబోయే భర్త, చమన్‌ను పోగొట్టుకుంది. మొత్తం మీద చెప్పాలంటే భావుకతతో నిండిన ఆసరా ఇచ్చే భుజం ఏదీ వారికి మిగలలేదు.

అయినా లోయలో పరిస్థితులు ఏదో నాటికి తప్పక బాగుపడి, తమ ఇంటికి తాము తిరిగి వెళ్తామన్న ఆశాభావాన్ని వారు ఎప్పటి కప్పుడు పెంచి పెద్ద చేసుకుంటూనే ఉంటారు. వారి కుటుంబ మిత్రుడయిన డా. నసీరుద్దీన్ డార్ కాశ్మీరు తిరిగి వెళ్తున్నారు. ఎందుకంటే వారి కుటుంబాన్ని బెదిరించి, భయభ్రాంతులకులోను చేస్తున్న ‘గుల్లా’ పోలీసుల చేతుల్లో మరణించాడు. ఈ సంఘటన శారిక మనసులో తమ గూటికి చేరుకోవాలన్న ఆశకు జీవం పోస్తుంది. తొందరలోనే తమ ‘గుల్లా’ కూడా నశిస్తాడని విశ్వసిస్తుంది. ఇక్కడ ‘గుల్లా ఉగ్రవాదానికి, అసత్యానికి చిహ్నం.

ఉగ్రవాదం వలన తమ ఇంటికి, ఊరికి దూరమవటంలోని చేదు నిజాలను చిత్రించటంతో బాటు ఈ నాటకంలో వాస్తవ జీవితంలో ఎన్ని అగాధాలున్నా, అవి ఎంత జటిలమైనవయినా, నిజమైన ప్రయత్నాలతో సరి చెయ్యాలన్న బలమైన ఆకాంక్షతో వాటిని తప్పకుండా దాటవచ్చు; వాటిని పూడ్చుకోవచ్చునన్న సత్యాన్ని కూడా చూపించటం జరిగింది. తమ మూలాలను పోగొట్టుకున్న బాధ లోలోపలే, ఉండీ – ఉండీ పోటు పెడుతూ ఉంటుంది. ఈ బాధ తమ ఊరిని, తమ వారిని కలుసుకోగానే ఉపశమిస్తుంది.

‘కాలీ బర్ఫ్’ (నల్లటి మంచు) ఈనాడు నిత్యం ఎదురయ్యే యథార్థానికి, వాస్తవాలకు మరింత దగ్గరగా అనిపించటం సహజం. ప్రాంతీయంగా, జాతీయంగా కలిసి బతకటానికి జరుగుతున్న ప్రయత్నాలను మరింత అర్థవంతమైన ప్రయత్నాలుగా ఇది మీ ముందుంచుతోంది. ఈ శాంతితో కూడిన ‘సహవాస’ భావమే ‘కాశ్మీరత్వం’లో ఉన్న మూలమంత్రం కూడా!

ఈ నాటకంలో కాశ్మీరీ ప్రజల మనసుల్లో గూడు కట్టుకున్న బాధలున్నాయి; వారి చిరు ఆనందాలూ ఉన్నాయి; వారి కన్నీటి చుక్కలూ ఉన్నాయి. వారి గతకాలపు జ్ఞాపకాలు, ఈనాటి పాడుపడి, శిథిలమయిన జీవితాలతో బాటు వారి కళ్లలో మెరుస్తున్న భవిష్యత్తును గూర్చిన రంగుల కలలూ ఉన్నాయి. ఈ నాటకంలో కాశ్మీరు లోయలో నెలకొన్న పరిస్థితులను మానవత్వపు దృష్టి కోణంతో చూసి – అర్థం చేసుకునే ప్రయత్నం జరిగింది. కాశ్మీరు కుంకుమ పువ్వు సువాసనలూ వెదజల్లే అక్కడి ప్రాంతీయ భాషను సాధ్యమైనంతవరకూ సంభాషణల్లో ఉపయోగించటం ద్వారా, ఈ నాటకాన్ని ప్రజలందరి హృదయాల వద్దకూ తీసుకుపోవాలన్న ప్రయత్నమూ జరిగింది.

అన్నిటికన్నా మిన్నగా ఇంటిని, ఊరినే కాదు తమ ఉనికినే కోల్పోతున్న కాశ్మీరీ ప్రజల దుఃఖం – “డయస్పోరా’గా మారుతున్న కటువైన నిజం ఈ నాటకం ద్వారా మీ ముందుకు తెచ్చే ప్రయత్నం జరిగింది.

***

దేశకాల వాతావరణం : ఉగ్రవాదం వలన శ్రీనగర్ నుండి శరణార్థులుగా వచ్చిన వారితో నిండిన ఈనాటి దిల్లీ వాతావరణంతో బాటు గతజ్ఞాపకాల స్మృతులతో నిండిన శ్రీనగర్ భౌగోళిక – సాంస్కృతిక వాతావరణం.

***

పాత్రలు

  1. పండిత్ శ్రీ కంఠీ వౌఖలూ :

సుమారు 65 సంవత్సరాల వయస్సు, రిటరయిన ప్రభుత్వోద్యోగి. ఇంటి పెద్ద. అందరూ ఆయన్ని ఆప్యాయంగా ‘టాఠాజీ!” అని వ్యవహరిస్తారు. శాంతం, ఔదార్యం వంటి గుణాలతోబాటు కోమలమైన స్వభావం ఆయనది.

  1. శారిక :

వయస్సు సుమారు 21 సంవత్సరాలు. టాఠాజీ చిన్నకూతురు. అనుభవం, భావుకతతో బాటు ఆశవాద వ్యక్తిత్వమున్న అమ్మాయి.

  1. శిబన్ :

వయస్సు సుమారు 25 సంవత్సరాలు. టాఠాజీ కొడుకు. నిరుద్యోగి, కటువు స్వభావం.

  1. గోషా :

సుమారు 8 ఏళ్లు, టాఠాజీ (తల్లితండ్రులు గతించేరు) మనవడు.

  1. రూప :

వయస్సు సుమారు 30 సంవత్సరాలు, టాఠాజీ పెద్దకూతురు; రాజ్ భార్య

  1. రాజ్ :

వయస్సు సుమారు 35 సంవత్సరాలు. రూప భర్త; టాఠాజీ అల్లుడు. శ్రీనగర్లో కర్రతో ఫర్నీచరు తయారుచేసే కార్ఖానా యజమాని. కాని వర్తమానంలో పని లేక ఖాళీగా ఉంటున్నాడు.

  1. డా. నసీర్ :

వయస్సు సుమారు 45 సంవత్సరాలు. పూర్తి పేరు డా. నసీరుద్దీన్ డార్. వృత్తిరీత్యా వైద్యుడు. రాజ్ పక్కిల్లు. మిత్రుడు కూడా!

  1. ముషాన్ :

వయస్సు సుమారు 35 సంవత్సరాలు. రాజ్ మిత్రుడు; హితైషి కూడా.

  1. చమన్ :

వయస్సు సుమారు 22 సంవత్సరాలు. శిబన్ మిత్రుడు; శ్రీనగర్లో అతని సహాధ్యాయి. శారిక అంతరంగ మిత్రుడు; ఆమెతో పెళ్లి నిశ్చితార్థమయింది.

  1. సుహైల్ :

వయస్సు సుమారు 18 సంవత్సరాలు. శ్రీనగర్‌లో వౌఖలూ కుటుంబం పక్క ఇంటివారి కుర్రాడు; రూప సహాధ్యాయి.

  1. గుల్లా :

వయస్సు సుమారు 20 సంవత్సరాలు. డా. నసీర్ గారింట చిన్ననాటి నుండి పెరిగిన నౌకరు. తరవాత ఉగ్రవాదుల్లో కలిసిపోయాడు.

***

హిందీలో డా. మీరాకాంత్ రాసిన ఈ నాటకానికి తెలుగు సేత డా. సుమన్‌లత రుద్రావజ్ఝల.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here