నల్లటి మంచు – దృశ్యం1

0
3

[box type=’note’ fontsize=’16’] ఇంటిని, ఊరినే కాదు తమ ఉనికినే కోల్పోతున్న కాశ్మీరీ ప్రజల దుఃఖం – “డయస్పోరా’గా మారుతున్న కటువైన నిజాన్ని ‘నల్లటి మంచు’ నాటకం ప్రదర్శిస్తుంది. హిందీ మూలం డా. మీరాకాంత్. తెలుగు సేత డా. సుమన్‌లత రుద్రావజ్ఝల. [/box]

దృశ్యం-1

దిల్లీ మహానగరంలో ఒక పై మధ్యతరగతి కాలనీలో ఒక పెద్ద ఇంట్లోని ఒక చిన్నగది. గదికి ఆనుకుని ఉన్న వంటిల్లు. వంటింటి తలుపు గదిలోకి తెరుచుకుంటుంది. మరొక తలుపు గది నుండి బైటకి, అంటే ఇంటినుండి కూడా బైటకు తీసుకువెళ్లేది. ఇంటి తక్కిన గదులకు తాళాలు పెట్టి ఉన్నాయి. ఇల్లు దాదాపు నిర్మానుష్యంగానే ఉంది. ఈ ఇంట్లో పండిత్ శ్రీకంఠ వౌఖలూ గారి కుటుంబం శ్రీనగర్ నుండి వలస వచ్చినప్పటి నుండి ఎన్నో నెలలుగా ఉంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఇటుక – సున్నంతో కట్టిన మర్యాదతో కూడిన శిబిరమేనని చెప్పాలి.

శీతాకాలం. ఉదయం వేళ. రంగంపైన వెల్తురు పడి కనిపించే గదిలోనే పండిత్ శ్రీ కంఠ వౌఖలూ గారు తన కూతురు శారిక, కొడుకు శిబన్, మనుమడు గోషాతో నివాసం ఉంటున్నారు. వెల్తురు ద్వారా గది రూపురేఖలు మనకు కనిపిస్తాయి. గదిలో ఒక వైపు మంచం, ఎదురుగా కుర్చీలున్నాయి. గోడలకు కొట్టిన మేకులకు బట్టలు నిస్త్రాణగా వేలాడుతున్నాయి. బట్టలకని వేరేగా కట్టిన ఒక తాడుపై కూడా చాలా బట్టలు వేలాడుతున్నాయి. ఒక మూల ఒక ట్రంకుపెట్టె, కొన్ని సూటుకేసులు కనిపిస్తున్నాయి. గదిని చూస్తే కిటకిట లాడుతున్నట్లుంటుంది. మంచం పైన గోషా తాతగారు పండిత్ శ్రీ కంఠ వౌఖలూ కూర్చున్నారు. అందరూ ఈయనని ‘టాఠాజీ’ అని సంబోధిస్తారు. ఆయన పేపరు చదువుతున్నారు. గదిలో ఉన్న టేపు రికార్డరు లోంచి కాశ్మీర ప్రదేశానికి చెందిన పాట వినవస్తోంది.

టాఠాజీ : (పేపరుపై నుండి చూపు పైకెత్తి) శారికా…. శారికా!

శారిక : (వంటింట్లోంచి చేతులు తుడుచుకుంటూ వచ్చి) చెప్పండి టాఠాజీ!

టాఠాజీ : కాస్త టేపును ఆపెయ్యి!

శారిక : టేపును ఆపేసేదా? ఏం? ఇది కశ్మీరీ పాట కదా…

టాఠాజీ : అవును కశ్మీరీ గీతమే!….

నువ్వు ఆపెయ్యి… (శారిక టేపు ఆపేసి వంటింట్లోకి వెళ్తుంది. టాఠాగారు పేపరును మడిచి పెట్టేసి బాధపడుతూ స్వగతం) కశ్మీరీ గీతం! హుఁ! ఇప్పడు ఇంకేం వినేది ఈ పాటల్ని! వీటిలోని ఒక్కొక్క పదం శరీరం – మనసులోకి అవే పాత పరిస్థితులను కళ్ల ముందుంచుతుంది. తల్చుకుంటే… ఈ రోజు కూడా అన్నీ కళ్లముందే తిరుగుతున్నాయి.

శారిక : (లోపలి నుండి కేక వేసి) టాఠాజీ! మీరు కూడా తయారవండి. లేకపోతే ఆలస్యం అవుతుంది.

టాఠాజీ : (ఉలిక్కిపడి) ఆఁ! ఆఁ! తయారువుతాను. ఇంతకీ అసలు స్కూలుకెళ్లవలసిన వాడెక్కడ? తయారవటానికి ఎంతసేపు తీసుకుంటాడో వీడు!

శారిక : (కాఫీ తెస్తూ) తనూ ఒస్తూనే ఉన్నాడు లెండి! గోషా! ఓ గోషా త్వరగా తయారయి బైటపడు –

గోషా : (లోపటి నుండి) వస్తున్నా తాతగారూ….

శారిక : (టాఠాజీతో) ఇదిగో మీ కాఫీ! (టాఠాజీ లేచి తయారవుతూంటారు)

టాఠాజీ : ఈ రోజు శివన్‌కి కూడా ఆలస్యమయింది.

శారిక : ఈపాటికి వచ్చేసేవాడే; కాని ఈ రోజు మాత్రం….

టాఠాజీ : తప్పకుండా ఏదో పేపరు ఆలస్యంగా ప్రింటయి వచ్చి ఉంటుంది. పాపం! ఇక్కడి సందు – గొందుల్లో తిరుగుతూ ఉండి ఉంటాడు…పాపం!.. విధి! అదృష్టం తోడుంటే ఈ రోజు డాక్టరయి ఉండేవాడు. మన అదృష్టరేఖల్ని మనం చదవగలిగితే, వాటి ప్రకారమే అన్నీ చేస్తాం కదా!

శారిక : (కాఫీ టేబిలుపైన పెట్టి) మీరు కాఫీ తాగండి.

టాఠాజీ : ఆఁ! ఆఁ! తాగుతాను…

శారిక : అక్కనుండి ఉత్తరం ఏమీ రాలేదు. ఈ రోజు మధ్యాహ్నం అలా బజారులోకి వెళ్లి తనకి ఫోను చేద్దామనుకుంటున్నాను.

టాఠాజీ : అవునవును! మనసు కులాసాగా ఉందో లేదో కూడా మర్చిపోకుండా అడుగు… జీవితంలో అతిపెద్ద వ్యాధి ఇదిగో ఈ ముసలితనమే! తనకీ వయస్సు మారింది. (ఏదో ఆలోచిస్తూ) ఇలాంటి సమయంలో ఎవరి ఊరిని వారు వదిలి పెట్టవలసి రావటం… ఏదో ఈ ప్రాణాలు శరీరాన్ని విడిచినట్లే! ఓహ్!

గోషా : ఉహుహు! అబ్బో ఎంత చలిగా ఉంది! మజాగా కూడా వచ్చింది.

శారిక : అసలు నువ్వు స్నానం చేసేవా? లేకపోతే ఉత్తినే మొహం – కాళ్లూ – చేతులు కడిగి వచ్చేసావా?

గోషా: (చలికీ కొంకర్లు పోతున్నట్లు అభినయించి) అయినా సింహాలు కూడా ఎక్కడయినా ముఖం కడుగుకుంటాయా? తాతగారూ! ఈ రోజు మరీ చలిగా ఉందికదండీ!

శారిక : మంచిదే! కాస్త చలిగా ఉంది… తొమ్మిది నెలలపాటు వేడినే భరించాలిక్కడ.

(టాఠాజీ కాలికి ఒక మేజోడు తొడుక్కుని ఉన్నారు. రెండో కాలి మేజోడు కోసం నాలుగు పక్కలా వెతుక్కుంటున్నారు.)

గోషా : మీరే చూడండి టాఠాజీ ! బైటకు వెళ్తూనే నా ముక్కు మంచుముక్కయి పోతుంది… చల్లని మంచుగడ్డ! (కాసేపు ఆలోచించి) అవును టారాజీ! ఒక్కమాట చెప్పండి మనం కాళ్లకి మేజోళ్లు తొడుగుకుంటాం; చేతులకు గ్లోవు! కాని పాపం, ముక్కును చలినుండి రక్షించుకోవడానికి ఏదీ తొడగం ఎందువలన? చెప్పండీ.

(టాఠాజీ పిల్లవాడి మాట విని, ఒక్కసారి ఆగి, ఆ అబ్బాయి వంక చూసి, చిరునవ్వు నవ్వుతారు)

శారిక : సరే – సరే తొందరగా తయారవ్వాలి మరి… నీ ముక్కుకు కూడా ఇక ఒక కవరు అల్లి పెడతాను లే… (వెక్కిరిస్తున్నట్లుగా) ఎఱ్ఱటి రంగుది… కోతిగాడా!…

(గోషా కూడా గట్టిగా నవ్వేస్తాడు…) టాఠాజీ! మీ కాఫీ చల్లారీ పోతోంది…

టాఠాజీ : (కాస్తంత ఇబ్బంది పడుతున్న రీతిలో) తాగుతా – తాగుతా… కాస్తంత నేను…

శారిక : ఏమయింది టాఠాజీ?

గోషా : తాతగారు ఏదో వెతుక్కుంటున్నారు. అత్తా! (సంతోషంతో) మంచిదే నేను ఫస్టు వచ్చేసాను – ఆయన ఇంకా తయారే కాలేదు (తనలో తను) రోజు నన్ను ఓడించేసేవారు.

టాఠాజీ : (గోషాని ఉత్సాహపరచటానికన్నట్లు) ఆఁ! గోషా ఈ రోజు ఫస్టు వచ్చేసేడు (కాని గొంతులో ఇబ్బంది).. కాని నా మేజోడు…

గోషా : కాలికి తొడుగుకున్నారు కదా!

టాఠాజీ : కాని రెండో కాలిది… ఇప్పుడిక్కడే ఉండేది…. ఏమయిందో? అరే, ఇక్కడే పెట్టేను (టాఠాజీతో బాటు శారిక కూడా వెతుకుతూ)

శారిక : మీరు కాఫీ తాగండి. చల్లారి పోతుంది. నేను వెతుకుతాను…

టాఠాజీ : కాఫీ వచ్చి తాగుతాను లే… ఆలస్యం అయింది. ఓహో! ఈ మేజోడు… (విసుక్కుంటూ) ఉండనీ… ఒక్కరోజుకి మేజోడు లేకుండా కూడా వెళ్లొచ్చు….

శారిక : కాని ఎక్కడికి పోయుంటుందా మేజోడు? (వెతుకుతూ ఉంటుంది)

(టాఠాజీ మేజోళ్లు లేకుండానే బూట్లు తొడుక్కోవాలన్న నిశ్చయానికి రావటంతో, తొడుక్కున్న మేజోడునూ విప్పుతూ ఉంటే రెండోది కనిపిస్తుంది. రెండు మేజోళ్లూ ఒకే పాదానికి తొడుగుకున్నట్లు బోధపడింది. చేతిలో విప్పిన మేజోడు, కాలికి ఒకటీ తొడిగి ఉన్నాయి. ఇది చూసిన గోషా కిలకిలా నవ్వుతాడు)

గోషా : అత్తా! మేజోడు! హ… హ…. హ….

టాఠాజీ : (కాస్తంత అశ్చర్యం, కొంచెం ముడుచుకుపోయినట్లు….) అరే! ఇదేంటి?

(ఆయన త్వరత్వరగా పాదం నుండి మేజోడును విప్పి, బూట్లలో కాళ్లు పెట్టి తొడుక్కుని, తలుపువైపుకు వెళ్తూ) (గోషాతో) పద – పద ఆలస్యమయింది అసలే!… బ్యాగు తీసుకున్నావా?… నవ్వటం ఎందుకు?… ముసలి కాలం లక్షణాలివి… (శారికతో) ఇంకేం చెప్పి వస్తుందా ముసలి కాలం చెప్పూ…!

(శారిక ఆయన వంక చూసి నవ్వడమయితే నవ్వుతుంది కాని ఆ నవ్వులో ఒక రకమయిన వైరాగ్యముంది. గోషా భూజానికి బ్యాగు తగిలించి తలపైన ప్రేమగా చేత్తో నిమురుతుంది. గోషా, టాఠాజీగారి వెనకాతలే వెళ్తాడు. శారిక నాలుగు అడుగులు వేసి తలుపు మూస్తుంది. గాని గొళ్ళెం పెట్టదు. వెనక్కు తిరిగి గది వైపు చూస్తుంది. తన మనసు ఉదాసీనంగా ఉన్నట్లు తెలుస్తుంది. మెల్ల మెల్లగా మంచం వైపు అడుగులు వేస్తుంది. అక్కడ పడున్న బట్టల్ని తీసి మడతలు పెడుతూండగా చేతిలోకి మేజోడు వస్తుంది. దానిని చూసిన ఆమె కళ్లలో నీళ్లు తిరుగుతాయి)

శారీక : (స్వగతం) ఇవి కేవలం ముసలికాలం లక్షణాలు మాత్రమేనా? కాదు…

కేవలం వృద్ధాప్యం వల్ల మాత్రం కాదు… పండిత్ శ్రీ కంఠ వౌఖలూ అంటే ఎలా ఉండేవారు? ఎప్పుడూ నవ్వుతూ – నవ్విస్తూ ఆనందంగా ఉండే వ్యక్తి! ప్రభుత్వ విభాగంలో పట్వారీ…. వారసత్వంతో వచ్చిన ఆపిల్ తోటలు యజమాని; తనకి కావల్సినట్లు జీవితాన్ని నడుపుకున్న వ్యక్తి. ఈ రోజు ఇలాటి పరాయి దేశంలాటి ఊర్లో ఏమీ తెలియని ఈ నాలుగ్గోడల మధ్య మిగిలి ఉన్న కుటుంబంలోని వ్యక్తులతో ఉండవలసి వస్తోందాయనకు…

అయ్యో! ఈలాటి రోజుల్ని కూడా చూడవలసి వచ్చింది. ప్చ్!

(శారిక దుఃఖం మరింత తీవ్రమవుతుంది) ఆమె అడుగులు భారంగా వేసుకుంటూ నడిచి, రంగస్థలానికి చాలా ముందు భాగంలోకి వచ్చేస్తుంది. రంగస్థలం వెనకనున్న తెరపైన ఒక చీనార్ చెట్టు నీడ పైకొస్తుంది. రంగస్థలం ముందు భాగానికొచ్చిన శారిక నీడ కూడా వెల్తురు ప్రభావం ద్వారా సరిగ్గా దాని వెనకాతలే చీనార్ చెట్టు నీడవైపు వెళ్తూ పొడుగ్గా కనిపిస్తూంటుంది. ఒక వంక పడి ఉన్న చీనార్ చెట్టు కాండం పైన కూర్చుంటుంది. రంగస్థలంపై నున్న చీనార్ చెట్టు కాండం గతస్మృతులకు ప్రతీక. నాటకంలో ఎప్పుడు ఏ పాత్రనయినా గత స్మృతులు చుట్టుముట్టాయంటే, ఆ పాత్ర ఈ కాండం పైన కూర్చుంటుంది. ఒక విధంగా చెప్పాలంటే ఈ చీనార్ చెట్టుకాండం గత స్మృతులకు గవాక్షం.)

ఒక్కొక్కసారి నేనే చీనార్ వృక్షంగా మారి, దూరం నుండి జరుగుతున్న సంఘటనలను చూస్తున్నానేమో అనిపిస్తోంది!

(తెర వెనక సంగీతంతో బాటే శారిక కూడా తిరిగి, చెట్టు నీడవైపు వెళ్తుంది. ఆ వృక్షంలో ఆమె కలసిపోయినట్లనిపిస్తుంది. ఆ సమయంలో ఆమె పాతరోజుల జ్ఞాపకాలు రంగస్థలంపైన ప్రదర్శింపబడతాయి.)

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here