Site icon Sanchika

నల్లటి మంచు – దృశ్యం 2

[box type=’note’ fontsize=’16’] ఇంటిని, ఊరినే కాదు తమ ఉనికినే కోల్పోతున్న కాశ్మీరీ ప్రజల దుఃఖం – “డయస్పోరా’గా మారుతున్న కటువైన నిజాన్ని ‘నల్లటి మంచు’ నాటకం ప్రదర్శిస్తుంది. హిందీ మూలం డా. మీరాకాంత్. తెలుగు సేత డా. సుమన్‌లత రుద్రావజ్ఝల. [/box]

దృశ్యం-2

(Flash Back)

[dropcap]రం[/dropcap]గస్థలంపైకి ఒకవైపు నుండి ఇద్దరు యువకులు – శిబన్, చమన్ ప్రవేశిస్తారు. శిబన్ చేతిలో కొన్ని పుస్తకాలున్నాయి. చమన్ చేతులు ఖాళీగా ఉన్నాయి. ఇది శ్రీనగర్ లోని పండిత్ శ్రీ కంఠ వౌఖాలూగారి ఇల్లు. ఆయన శిబన్, శారికల తండ్రి.

చమన్ : (గంభీరమైన గొంతుకతో) ఇది ఆలోచించవలసిన సమయం కాదు, ఏదైనా చేయ్యవలసిన తరుణం.

శిబన్ : (వ్యంగ్యంగా) అబ్బో! చేస్తునే ఉన్నావుగా క్లాసులు ఎగ్గొట్టడం!

చమన్ : (అతడి మాటలను పట్టించుకోకుండా) నువ్వు ఒకసారి పద; కలిసి చూడు!

(శిబన్ లోపలికొచ్చి పుస్తకాలను ఒక పక్క ఉంచుతాడు. శిబన్ వంక పరీక్షగా చూస్తాడు) శిబన్! ఓ శిబన్! నా మాట విను…. ఒక్కసారంటే ఒక్కసారే… కలుద్దువుగాని రా!… కలిసేక నీకు సరి కాదనిపిస్తే ఇక మీదట మరింకెప్పుడూ రానే వద్దు….

(శిబన్ ఏదో ఆలోచనలో పడతాడు)

అరే! ఇందులో ఇంత ఆలోచించవలసినదేముంది?

(శారిక ప్రవేశిస్తూ, శిబన్ అన్న ఆఖరు వాక్యాన్ని వింటుంది. రెండోవైపు నుండి గోషా, చేతిలో క్రికెట్టు బ్యాటుతో ప్రవేశిస్తాడు.)

శారిక : (ప్రవేశిస్తూ) ఆలోచించవలసిన మాట ఏముందో తెలుసా! రోఠ్‌లు (కాశ్మీరులో భాద్రపద మాసంలో దాదాపు వినాయక చవితి సమయంలో 15 రోజుల్లో తమకి ఎప్పుడు కుదుర్తే అప్పుడు చేసుకునే తియ్యటి రొట్టె)… చేసి కూడా ఐదు రోజులవుతోంది… రెండుసార్లు నీకు కబురూ పెట్టేను… కాని ఎవరికి తీరిక? మిగిలినవారి గురించి సరే, రోఠ్‌ల గురించీ కనుక్కోలేదు.

చమన్: (నవ్వుతూ, అభినయిస్తున్నట్లు) అమ్మో విషయం గంభీరంగా ఆలోచించదగ్గదే… (కూర్చుంటాడు)

గోషా : అయితే చెప్పండి మహాశయా… మీకేం శిక్ష వెయ్యాలో?

(శారిక, చమన్ అతడి వంక కొంచెం ఆందోళనగా చూస్తారు, కాని శిబన్ తన తలపుల్లో మునిగిపోయి గంభీరంగా కూర్చున్నాడు)

చమన్ : (ఉల్లాసంగా) ఓహో లిటిల్ మాస్టర్! ఎవరెవర్ని ఇళ్లకి పంపించి వచ్చావో చెప్పు?

గోషా: మాటని మార్చొద్దు…

చమన్ : (అర్థంకాక) మార్చొద్దా?

గోషా : మీకేం శిక్ష వెయ్యాలో చెప్పలేదుగా…

చమన్ : (నవ్వుతూ) హఁ హఁ హఁ!…. శిక్ష… ఓహోహో

గోషా : అత్తా…. దురద పెట్టే ఆకుల కొమ్మని ఈయనకు – జామ్మాని రుద్దేయ్ అంతే….. గోక్కుంటూ (దురదని అభినయిస్తూ) … గోక్కుంటూనే…. ఆపైన…. హఁ! హఁ! హాఁ!….. (అనేసి లోపల కెళ్తాడు. చమన్, శారిక కూడా నవ్వేస్తారు)

శారిక : ఉండు తెస్తాను. (లోపలికి వెళ్తూండగా)

చమన్ : ఏంటీ? జామ్ (అంటూ దురద అభినయం)

శారిక : కాదులే (నవ్వేసి) రోఠ్ (వెళ్తుంది)

చమన్ : బతికించావు (శిబన్ వంక తిరిగి గంభీరంగా) శిబన్ ఏమాలోచించావు? ఇప్పుడొస్తావా?

శిబన్ : (హఠాత్తుగా లేచి నిల్చుని) నా ఒంట్లో అంత బాగులేదు….

చమన్ : శిబన్….

శిబన్ : నేను… రేపు తప్పక… తప్పకుండా నీతో వస్తాను… కాలేజీ నుండే వెళ్లిపోదాం! (ఏదో ఆలోచించి) కాని, నువ్వు ఈ మధ్య కాలేజీకి రావటమే లేదు!

చమన్ : నేను రేపు నిన్ను అక్కడే కలుస్తాను… రెండు గంటలకి… కేంటీనులో….

శిబన్ : రేపు తప్పక వెళాం… ఈ రోజు కాస్తంత జ్వరంలా…

(అంటూ లోపలికి వెళ్లాడు. అక్కడి నుండే శారిక ఒక ట్రేలో రోఠ్‌లు తీసుకు వస్తుంది. చమన్ ముందు ఏదో సందేహంలో పడ్డట్టు ఉంటాడు. అటుపైన అతని దృష్టి శారిక పైన పడుతుంది)

చమన్ : అరే! శిబన్, గోషాల నుండి ఈ రోఠ్‌లు ఎలా తప్పించుకు మిగిలాయబ్బా?

శారిక : ప్రతిసారీ నీ కోసమని వాళ్లిద్దరి కళ్లబడకుండా జాగ్రత్తగా దాచి ఉంచుతాను. కాని… నమ్మకం ఉంటే కద ఎవరికయినా? (చమన్ నవ్వుతూ రోఠ్‌ను కాస్తంత ముక్క తుంచి నోట్లో వేసుకుంటాడు) ప్రస్తుతం ఎక్కడుంటున్నావ్?

చమన్ : ఏం అలా అడుగుతున్నావు? ఇదిగో ఇక్కడే ఉన్నానుగా….

శారిక : ఎన్నోరోజుల నుండి కాలేజికి వెళ్లటం లేదుగా….

చమన్ : ఊఁ! అంటే అన్ని విషయాలు తెలుసుకుంటూనే ఉంటావన్న మాట! బాబోయ్ నువ్వసలు సీబీఐలో ఉండవలసిన దానివి!

శారిక : హాస్యాలింక కట్టిపెట్టు చమన్!… నువ్వెక్కడున్నావో చెప్పు? (గంభీరంగా మారతాడు; కానీ మాట్లాడడు.) చదువుని ఇంత తేలికగా ఎందుకు తీసుకుంటున్నావ్? అందులో నీది అఖరి సంవత్సరం కూడా!

చమన్ : (గంభీరంగా) తల్లి కొంగు కాలుతూ ఉంటే, ఇంకెక్కడి చదువు?

శారిక : అంటే నువ్వొక్కడివే ఈ అగ్గిని ఆర్పెయ్య గలవా?

చమన్ : (దృఢమైన గొంతుకతో) నేనొక్కడినే కాదులే…

శారిక : అవును. నాతో బాటు ఆపై వాడున్నాడంటావిప్పుడు.. అవునా?

చమన్ : (గంభీరంగానే) శారికా! నేనొంటరి వాడినేం కాదు… చాలామంది ఉన్నారు తోడుగా … ఇంకా మరెందరో వస్తారు కూడా..!

(శారిక రోఠ్‌లున్న ట్రేని టేబిలు పైనుంచి తను కూడా కుర్చీలో కూర్చుంటుంది. మొహం ఆందోళన ప్రస్ఫుటిస్తూ ఉంటుంది)

శారిక : నువ్వు ఇలాటి ఆశల్లో బతకటం! (చమన్ ఆమె ఆందోళన చూసి తాను ఆందోళనకు గురవుతాడు. అందుకే విషయాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తాడు.) నీకు తెలియదు, వారికెంత బలముందో! నాశనం చేసే బలం… నిన్ను నలిపి పారేస్తారు… కానీ నువ్వు… నువ్విలా అశల్ని ఆసరా చేసుకుంటూనే బతుకు!

చమన్ : (దగ్గరగా వచ్చి మృదువైన కంఠంతో) నీ ఆసరాతోనే జీవిస్తున్నాను! నువ్వే నా అశవి! ఈ శ్వాసకు మరెవ్వరి ఆసరా ఉందో చెప్పు! (శారీక కోపంలో నవ్వు కలిసిపోతుంది. కళ్లలో నునుసిగ్గు భావం కదలాడుతుంది. శారీక ఏదో చెప్పబోయేంతలో గోషా గదిలో కొస్తాడు. చమన్ కూడా తనను తాను సంబాళించుకుంటాడు.)

శారిక : (కాస్తంత తడబడుతూ) అయితే నువ్వనేదేంటి….

చమన్ : అదే! వెళ్తానంటున్నాను… (గోషాతో)

అయ్యో! నీ చాక్లెట్టు మళ్లీ జేబులోకి దూరుతుందా? ఈ రోజు? (గోషాకి తన జేబులోంచి తీసి ఇచ్చి)

శారిక : పద… కనీసం ద్వారం వరకయినా…

గోషా : అత్తా! నిన్నటి చాక్లెట్టేదీ?… అదే శిబన్ అన్న తెచ్చి ఇచ్చేడు కదా… నువ్వే దాచేవు కదా?

(ముందు చమన్, వెనక శారిక. చమన్ ఇంటి నుండి బైటకు వెళ్తున్నాడు. శారిక అతడిని గుమ్మం వరకూ సాగనంపటానికి వెళ్తోంది)

శారిక : తలుపు వేసి వచ్చి, వెతుకుతానుండు!… (చమన్ చెయ్యి ఊపి బైటకు వెళ్తాడు. శారిక చిరునవ్వుతో తలుపు రెండు రెక్కలు పట్టుకు నిల్చుని, అందులో సరిగ్గా ఇమిడిపోయి నట్లుంటుంది. వెళ్తున్న చమన్‌ను చూస్తూ నిల్చుంటుంది. దూరంగా నిల్చున్న గోషా, వీథిలోకి తొంగిచూస్తున్న ఆమెను చూస్తున్నాడు. చమన్ కూడా దూరంగా వెళ్లే వరకూ మధ్య – మధ్యలో వెనక్కు తిరిగి చూస్తూ ఉంటాడు. కాని గోషాకీ ఇది కనిపించదు. అందుకే శారిక అక్కడ నిల్చుని ఏం చేస్తోందా అని ఆలోచిస్తూ)

గోషా : (స్వగతం) అబ్బా! ఎంతసేపు చేస్తుందో! అరే! తలుపు వెయ్యటమే లేదు. మర్చిపోయిందో ఏంటో! (కొన్ని క్షణాలు ఆగి చూసి) ఏం చేస్తోందక్కడ? (కాస్తంత ఆలోచించి) ఆఁ! వీథిలో షైరు కొడుతున్న బాతుల్ని చూస్తున్నట్లుంది. ఎంత ముద్దొస్తాయో… రాత్రి మిగిలిన బియ్యం లడ్డూలు తింటూ… తిరుగుతూ… (కొన్ని క్షణాలు చిరునవ్వుతో చూస్తూ ఉండి పోతాడు. ఆ పైన గట్టిగా) అత్తా! (శారిక వినిపించుకోదు. ఆమె దృష్టంతా చమన్ వైపే ఉంది) అత్తా…

శారిక : (ఉలిక్కిపడి) ఆఁ! ఆఁ!…. (తొందరగా తలుపులు వేసి, వెనక్కి తిరిగి వస్తుంది.)

గోషా : (కాస్తంత అలిగినట్లు) ఏం చేస్తున్నావక్కడ?

శారిక : (ఏమీ బోధపడనట్లున్న గొంతుకతో) తలుపు వేస్తున్నాను. మరేం చేస్తున్నాను?

గోషా : ఎక్కడ ముయ్యటం? (శారిక గోషా వంక తేరపారి చూస్తుంది) ముయ్యటం మర్చిపోయావు.

శారిక : (గోషా బుగ్గపైన ముద్దుగా తట్టి) సరే, సరే మర్చిపోయానులే! (శారిక ముఖంపైన చిరునవ్వు మృదువుగా కానవస్తుంది. తనలో తనే మునిగి పోయినట్లు ముందుకు సాగుతుంది.)

గోషా : (తను వెనకబడ్డానని గ్రహించి స్వగతం) అయ్యో! ఇప్పుడు నా చాక్లెట్టు కూడా వెతకడం మర్చిపోయింది. (అదే సమయంలో తలుపు మీద టకటక ఎవరో కొట్టిన చప్పుడు. ముందుకు వెళ్తున్న శారిక, ఏం పాలుపోక కాస్తంత గాభరాగా వెనక్కు తిరుగుతుంది. గోషా చురుకుగా కదులూ) ఉండు! ఉండు! నేను తీస్తాను…. లేకపోతే మళ్లీ మర్చిపోతావు. (గోషా వేగంగా దాదాపు దూకుతున్నట్లే తలుపు వైపు వెళ్లాడు. శారిక చిరునవ్వు నవ్వుతుంది. తలుపు తియ్యగానే రూప, రాజ్ ప్రవేశిస్తారు. రూప ముందుంటుంది, వెనక రాజ్)

శారిక : అక్కా…. (రూప వైపు ముందుకు సాగుతుంది)

రూప : (చేతులు చాచి) ఎలా ఉన్నావు? (ఇద్దరూ కౌగలించుకుంటారు.)

శారిక : (రాజ్ ను చూస్తూ) నమస్కారం బావగారూ!

రాజ్ : మీరసలు అటువైపు రాకూడదని ఒట్టు పెట్టుకున్నట్లున్నారు…

శారిక : (కాస్తంత వెక్కిరిస్తున్న ధోరణిలో) మరేం… లేకపోతే మీరసలు ఇటువైపు తొంగి చూసేవారా?….

రాజ్ : (చిరునవ్వుతో; గోషా తల వెంట్రుకల్ని చెరిపి) ఏం మాస్టర్? నీ క్రికెట్టు ఎలా నడుస్తోంది? కపిల్‌దేవ్‌కి స్వస్తి చెప్పేవా – లేదా?

గోషా : ముందు ఇది చెప్పండి, నాకేం తెచ్చారు?

శారిక : అరే! అదేంటలా అడుగుతున్నవ్?

రాజ్ : ఇది, నాకు – గోషాకు సంబంధించిన పర్సనల్ విషయం సుమా!

శారిక : మీకు – గోషాకి? (లోపలకు వినిపించేటట్లు గట్టిగా) టాఠాజీ… అక్క వచ్చింది…. రూప చెయ్యి పట్టుకుని శారిక లోపలికి లాక్కెళుతుంది. రాజ్ గోషాకి ఒక చాక్లెట్టు ఇస్తాడు. అది తీసుకున్న గోషా గెంతుకుంటు లోపలకు వెళ్తాడు)

టాఠాజీ : (లోపల నుంచి బైటకొస్తూ) అమ్మా రూపా! ఈసారి చాలా రోజుల తరవాత…

రూప : నమస్కారం టాఠాజీ!

టాఠాజీ : నమస్తే రాజ్!… నువ్వు కూడా వచ్చి మంచిపనే చేశావు…. నిన్ను చూసి ఎన్నాళ్లయిందో అనిపిస్తుంది… పనిలో బాగా మునిగిపోయినట్లున్నావు! …

(అంతా లోపలకొచ్చి కూర్చుంటారు.)

రాజ్ : అవును, ఈ మధ్య పని కాస్త హెచ్చుగానే… అంటే… షేరే కశ్మీర్ ఇన్‌స్టిట్యూట్‌కి ఫర్నిచరు చెయ్యటానికి కాంట్రాక్టు దొరికింది. సోఫా – కం బెడ్లు, కొన్ని మంచాలు, కొన్ని కుర్చీలు… ఏదో కాస్త పెద్ద ఆర్డరే ననుకోండి… ఇవిగో ఈ పనుల్లోనే మునిగి తేలుతున్నా…

టాఠాజీ : (సంతోషంగా) చాలామంచి మాటే చెప్పేవయ్యా… పనుంటేనే కదా… ఇందులో నువ్వు చాలా వృద్ధిలోకి రావాలి! (ఒక్కసారి ముఖం గంభీరంగా మారిపోతుంది.)

రాజ్ : ఏమయింది టాఠాజీ?….. మీరెందుకో డల్‌గా… ఒంట్లో….

టాఠాజీ : ఆరోగ్యానికేముందిలే! కాని! రోజు – రోజు ఈ కర్ఫ్యూలు, బందులు, చూస్తూ ఉంటే మనసులోంచి ఒణుకు వస్తోంది.

రాజ్ : నిజమే! రోజు – రోజుకూ పరిస్థితి దిగజారి పోతోంది.

టాఠాజీ : దీని వలన ప్రజలు ఎక్కడి వారక్కడ ఇళ్లు – వాకిళ్లు ఒదులుకుని… రాత్రికి రాత్రే వెళ్లవలసి వస్తోంది… విచిత్రంగా అనిపిస్తున్నాయి వింటూంటే… (ఏదో తెలియని భావంతో నవ్వి) నిన్న సాయంత్రం రోడ్డు మీద కలిసి, ‘బాగున్నారా’ అని కుశల ప్రశ్న వేసుకున్నవారిల్లు… ఉదయం చూసేసరికి తాళం ప్రత్యక్షమవుతుంది… రాత్రికి రాత్రే భార్యా – బిడ్డల్లో ఇల్లు విడిచి వెళ్లిపోతున్నారు….

రాజ్ : అవును టాఠాజీ! ఏమీ అర్థం కావటం లేదు. పరిస్థితి బాగులేదు… ప్రాణాలకి, ఆస్తులకీ చెప్పలేని భయం… అయితే ఒక్కమాట.. పరిస్థితులు ఎక్కడయినా భయంకరంగా మారొచ్చు… మారతాయి కూడా! కాని… కాని అన్నిచోట్లా ఇలాగే ప్రజలు తమ ఇళ్లు – వాకిళ్లు, ఊరు ఒదులుకుని పారిపోతున్నారా చెప్పండి?

(శిబన్ ప్రవేశిస్తాడు)

శిబన్ : అసలు … ఉండక పోతే, ఇళ్లు- వాకిళ్ళు ఏమిటి? ఊరు – వీథి ఏంటి?

టాఠాజీ : (గొంతుకలో కోపం తొంగి చూస్తుండగా) ఇదీ ఈ రోజుల్లో పిల్లల వరస! ఇంటితో గాని, తమ నేలతో గానీ ఏమాత్రం బంధం లేదు.

శిబన్ : అసలు, బైట ఏం జరుగుతుందో మీకేమైనా తెలుసా?…

రాజ్ : (కోప్పడుతూ) శిబన్… నీకు తెలుస్తోందా ఎవరితో ఏం మాట్లాడుతున్నావో?….

శిబన్ : (పెద్దగా) ఆఁ! మహ బాగా తెలుసు…. (కాస్తంత అగి) ఒప్పుకుంటున్నాను… టాఠాజీకి జరిగిన సంఘటనలన్నీ….

రాజ్ : (మాటను మధ్యలోనే తుంచేసి) జరిగిన..? నువ్వు వాటిని జరిగిన అంటావా? మంచి వయస్సులో ఉన్న కొడుకు – కోడలు బాంబు దాడిలో చనిపోవటాన్ని నువ్వు గడచిన సంఘటన అంటావా?

శిబన్ : అయితే, ఈ దిక్కుమాలిన ఊరు విడిచి పెట్టెయ్యలేం? ఎందుకు ఇంకా అంటిపెట్టుకు కూర్చున్నారిక్కడ?… మేం/మనం కూడా ఏదైనా దుర్ఘటనలో, ఎప్పుడు…..

టాఠాజీ : (దుఃఖంతో కళ్లు మూసుకుని) అయ్యో… ఈశ్వరా భగవంతుడా!…

రాజ్ : (కోపాన్ని బలవంతంగా దిగమింగుకుంటూ) శిబన్…. నువ్వు…. నువ్వు…. అసలు సృహలో లేవు….

శిబన్ : (తన కంఠస్వరాన్ని అదుపు చేసుకోడానికి ప్రయత్నిస్తూ) ఔనూ, స్పృహలో లేను… బహుశా అందుకే ఇంకా బతికే ఉన్నానేమో! (తలుపువైపు అడుగులు వేస్తూ) ఇలాటి పరిస్థితుల్లో జీవించాలని మాత్రం ఎవరు కోరుకుంటారు? (బైటకు వెళ్లిపోతాడు)

రాజ్ : టాఠాజీ! ఇంకా చిన్నవాడేనండీ తను….

టాఠాజీ : (దుఃఖిస్తూ) ఇంక… ఎన్నిరోజులు మిగిలేయి గనక నేనుండటానికి? కష్టం – సుఖం, …. అన్నీ ఈ మట్టిమీదే అనుభవించాం. ఎలా వదిలేది ఈ నేలని? (కాస్తంత గట్టిగా) ఎవరు వెళ్లాలనుకుంటే వాళ్లు వెళ్లొచ్చు. నేను మాత్రం ఈ ఇంటి నాలుగ్గోడల మధ్యే ఆఖరి ఊపిరి పీల్చుకుంటాను… ఈ గాలిలోనే …. (గొంతుక పూడుకు పోతుంది)

రాజ్ : (విషయాన్ని మార్చాలన్న ఉద్దేశ్యంతో) ఇక్కడ చలిగా ఉంది. లోపలకెళ్తామా?

(వీరిద్దరూ లోపలికి వెళ్తూండగా, రెండోవైపు నుండి శారిక, రూప మాట్లాడుకుంటూ రంగస్థలం పైకి వస్తారు)

రూప : అప్పుడప్పుడు, నిన్ను కూర్చోబెట్టి బాగా ముద్దు చెయ్యాలని పిస్తూంటుంది.

శారిక : (అల్లరి – ముద్దులను కలబోసి, ఆమె ఎదురుగా కూర్చుని, అక్క భుజం పైన తలవాల్చి) మరి చెయ్యి…..

రూప : (చెల్లెలి తలమీద చేత్తో నిమురుతూ ఆలోచనలతో కూడిన గంభీరమైన కంఠస్వరంతో) చిన్నదానివి. నీ భుజాల మీద కుటుంబ భారం మొత్తం పడి…. నేను పెద్దదాన్ని ఉండీ ఏం చెయ్యలేక పోతున్నాను.

(శారిక లేచి ఎదురుగా కూర్చుంటుంది). గోషా కూడా….

శారిక : (కంగారుగా) గోషా ఏంటి?

రూప : అప్పుడప్పుడు గోషాని పెంచుకుంటే బాగుంటుందనిపిస్తూ ఉంటుంది.

శారిక : అలా ఎప్పటికీ ఆలోచించకు. (శారికను రూప కాస్త తేరిపార చూస్తుంది) అమ్మ, అన్న – ఒదినలు పోయాక నాన్నగారు, గోషాను చూసుకునే… (కంటి కొసలలో వచ్చిన కన్నీటిని తుడుచుకుంటూ) వాడి మాటల్లోనే ఆయన తన కష్టాన్ని కాస్తంత మరవ గలుగుతున్నారు.

రూప : ఔను, నాకు తెలుసు.

శారిక : (బరువుగా మారిన వాతావరణాన్ని కాస్త సంబాళిస్తూ) నువ్వు అప్పడప్పుడు వచ్చి వెళ్తూ ఉండు. చాలు (రూప కూడా నవ్వేసి ‘సరే’ నన్నట్లు తల ఊపుతుంది.) అక్కా నువ్వే కద, నా మోరల్ సపోర్టువి.

రూప: (కాస్తంత ఏడిపిస్తున్నట్లు) అబ్బో! ఇప్పడు నేను మోరల్ సపోర్టు అయ్యేనంటావా?

శారిక : అంటే?

రూప : చమన్ ఈ మధ్య… ఏదో విన్నాంలే అందుకు!

(శారిక ఒక్కసారి ……. సర్దుకున్నట్లు అవుతుంది. ఆ పైన అక్క భుజంపైన తేలికగా గుద్దుతూ ఉంటే రూప తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. ఇద్దరూ నవ్వేస్తారు.)

శారిక : (గంభీరంగా) భయం వేస్తూంటుంది!

రూప : ఎందుకూ భయం?

శారిక : తనూ… తనీమధ్య ఒక గ్రూపును తయారు చేస్తున్నాడు!

రూప : గ్రూపునా?

శారిక : అవును. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా… చెప్తే అర్థమే చేసుకోవటం లేదు… (గొంతుకలో కాస్తంత ఉద్రేకం కనిపిస్తుంది) కేవలం తుపాకి భాష మాత్రమే తెలిసిన వారితో ఎలా నెట్టుకు రాగలడు చెప్పు?

రూప : నువ్వు అతడికి బోధపరచవచ్చు కదా! (తిరిగి హఠాత్తుగా ఏదో ఆలోచనలో మునిగి పోయింది. ఏదో లోకంలో ఉన్నట్లు. తనలో తనే మునిగిపోయి) నువ్వు అతడిని తీసుకుని ఎటైనా దూరంగా… వెళ్లిపో… (తనతో తనే చెప్పుకుంటున్నట్లు ‘ప్రేమను పోగొట్టుకోవటం అంటే ఏమిటో నీకు తెలియదు’.)

శారిక : (అక్క బాధను అర్థం చేసుకుంటూ) అక్కా!! (రూప కంట నీరు తిరుగుతుంది) సుహైల్ దుబాయి వెళ్లి పోయాడు. అక్కడ ఏదో హోటల్లో మేనేజరుగా కుదురుకున్నాడుట.

రూప : మరి పెద్దమ్మ?

శారిక : తను ఇక్కడే ఉంది… కనిపించినప్పుడల్లా నీ గురించి అడుగుతూనే ఉంటుంది….

రూప : (బరువుగా ఊపిరి వదుల్తూ) ఒక్కసారి తనని కలసి వద్దమా అనుకుంటున్నాను.

శారిక : మంచిదే! వెళ్లి కలిసిరా! నీకు కూడా సుహైల్ రాసిన ఉత్తరాలు చదివి వినిపిస్తుంది. మరీ ఒంటరిదయిపోయింది…. ఒక్క ఆ ఉత్తరాల ఆసరాతోనే బతుకుతోంది. అంతే!

రూప: (ఉదాసీనంగా, ఏదో పోగొట్టుకున్న ధోరణిలో) కనీసం ఆవిడ వద్ద ఉత్తరాలయినా ఉన్నాయి!

(శారిక, అక్కను ఒకసారి తేరపారి చూస్తుంది.)

(సశేషం)

Exit mobile version