[box type=’note’ fontsize=’16’] ఇంటిని, ఊరినే కాదు తమ ఉనికినే కోల్పోతున్న కాశ్మీరీ ప్రజల దుఃఖం – “డయస్పోరా’గా మారుతున్న కటువైన నిజాన్ని ‘నల్లటి మంచు’ నాటకం ప్రదర్శిస్తుంది. హిందీ మూలం డా. మీరాకాంత్. తెలుగు సేత డా. సుమన్‌లత రుద్రావజ్ఝల. [/box]
దృశ్యం-3
[dropcap](ఆ[/dropcap]పిల్ తోటలో నిల్చున్న చమన్ చాలా ఆతృతగా శారిక కోసం ఎదురు చూస్తున్నాడు. ఇంతలో ఆమె అతని వైపు వస్తూ కానవచ్చింది. శారిక వస్తోంది. చమన్ ఆమెనే చూస్తున్నాడు. దగ్గరగా వచ్చిన అమె ముఖం కాస్త గంభీరంగానే ఉంది)
చమన్ : ఏమయింది? అంతా కులాసాయే కదా!
శారిక : కులాసాయే!
చమన్ : అంటే… నా ఉద్దేశం… మరి నువ్వు నన్ను ఏదో మాట్లాడాలని ఎందుకు రమ్మన్నావు?
శారిక : ముందు కూర్చుని, కాస్త ఊపిరి పీల్చుకోనిస్తావా?
(చమన్ చిరునవ్వు నవ్వుతాడు. అటుపైన కాస్తంత రొమాంటిక్గా జేబులోంచి రుమాలు తీసి గడ్డి పైన పరుస్తాడు.)
చమన్ : రండి! వేంచెయ్యండి నా దేవీ గారూ!
(శారిక నవ్వి, రుమాలు తీసి గడ్డిలో కూర్చుంటుంది. ఇప్పుడు రుమాలు ఆమె ఒడిలో ఉంది. చమన్ కూడా నవ్వుతూ కూర్చుంటాడు)
శారిక : చమన్!….
(చమన్ ముఖం పైన చిరునవ్వు అలాగే ఉంటుంది గానీ శారిక ముఖం తిరిగి గంభీర ముద్రలోకి మారుతుంది.) నేను నీతో ఒక సెన్సిటివ్ విషయం మాట్లాడాలని వచ్చాను.
చమన్ : రుమాలు పరవటం కన్నా సెన్సిటివ్ సంగతా?
శారిక : చమన్ ప్లీజ్….
(శారిక గాంభీర్యం చూసి, చమన్ కూడా సెన్సిటివ్ మూడ్లోకి వచ్చి)
చమన్ : సరే, చెప్పు!
శారిక : నువ్వు వాళ్లతో ఎందుకు పెట్టుకుంటావు?
చమన్ : (విషయాన్ని అర్థం చేసుకుని, కొంచెం తమాయించుకుని) నేనెక్కడా వాళ్లతో తలపడడం లేదు శారికా!
శారిక : ఏదో ఒకటి! కాని నువ్వు వాళ్ల తోవలోకి రాకు… వాళ్లు…..
చమన్ : (మధ్యలోనే మాటను తుంచి) ఒక్క నిముషం… ఒక్క నిముషం…. తోవలో నేను రావటం కాదు… వాళ్లే అడ్డం పడుతున్నారన్న సంగతి నేను చెప్పాలి.
శారిక : నీ తోవలోనా?
చమన్ : అవును. నా తోవలో… నా దేశం తోవలో, మన ఎదుగుదల తోవలో….
శారిక : చమన్ ప్లీజ్!…. నాకు నువ్వు చెప్పే ఈ పెద్ద పెద్ద మాటలేవీ అర్థం కావు… నాకు కావల్సిందల్లా నువ్వు. నీ గురించి మాత్రమే నాకు కావాలంతే….
చమన్ : లేదు శారికా! కేవలం నా గురించి మాత్రమే కాదు….. నీకు అర్థం కావటం లేదంటే, అర్థం చేసుకోవాలి నువ్వు!
(శారిక చమన్ రూమాల్ని తన చేతివేలుకు చుడుతూ – తీస్తూ ఉంటుంది)
శారిక! నువ్వు నాతో బాటు అందరి గురించి ఆలోచించాలి!
శారిక : (విసిగిపోయి రోషంతో) అంతేనా? ఆపైన మా అన్నా – ఒదినల్లా నిన్నూ ఒదులుకోవాలా?
చమన్ : (కాస్తంత మెత్తబడిన ధోరణిలో) అది మన ఎవరి చేతుల్లో లేదు. ఉందా? నువ్వే చెప్పు!
శారిక : (అలిగి) నేను నువ్వడిగే ఇలాటి ప్రశ్నలకు జవాబు లివ్వటానికి నేనిక్కడికి రాలేదు (భావుకతలో మునిగి) నాకేం తెలియదు… నాకేం అర్థం కాదు. నేను నిన్ను మాత్రం ఒదులుకోలేను… నేను లోలోపల మథనపడుతూ ఉంటాను… నా మనసు… నా మనస్సులో నీ గురించిన ఆలోచనల్లో ఎప్పుడూ కంగారు – కంగారుగా ఉంటుంది…. చమన్ నువ్వెందుకు అర్థం చేసుకోవు? నేను నిన్ను ఒదులుకోలేను… ఏది ఏమైనా సరే!
(శారిక దుఃఖం కట్టలు తెంచుకు దూకుతుంది. తన మొహాన్ని రెండు చేతుల్తో కప్పుకుంటుంది. చమన్ కాస్త దగ్గరగా జరుగుతాడు. శారిక భుజాలు పట్టి ఆపి, చేతుల్ని మొహంపై నుండి తీస్తాడు)
చమన్ : (గద్గద స్వరంతో) శారికా… అరే… నేను… నేనెక్కడికి వెళ్తున్నాను? అసలు ఎక్కడికి పోతాను?…
(శారిక ఏడుస్తూనే, నవ్వేస్తుంది. తిరిగి మొహాన్ని కప్పుకోవాలని ప్రయత్నిస్తుంది. కాని చమన్ తన భుజాన్ని గట్టిగా పట్టుకునే ఉంటాడు. శారిక చేతిని తన వంక లాక్కొని, తన ఒడిలో పెట్టుకుంటాడు. శారిక తన చేతిని లాగేందుకు ప్రయత్నించినా, చమన్ బిగించి పట్టి ఉంచుతాడు. ఎదుటివైపు నుండి వస్తున్న గోషా వారిని చూసి)
గోషా : (తనలో తనే) అరే! అత్త, చమన్ భయ్యా!
శారిక : చమన్… ప్లీజ్… వదులు!
చమన్ : ఉహుఁ! ఓదల్ను…. ముందు ఇది చెప్పు ‘మరింకెప్పుడూ ఏడవను’ అను! అను శారికా! శారికా! నేను నీ కళ్లలో నీళ్లు చూడలేను. మనల్ని ఎవ్వరూ వేరు చెయ్యలేరు… ఎవరూ… ఎప్పటికీ విడదియ్యలేరు….
(చమన్ పట్టు కాస్తంత సడలుతుంది. శారిక తన తలను అతడి భుజం పైన ఆన్చుతుంది)
శారిక : చమన్!
(చమన్ చెయ్యి శారిక జుట్టువైపు వెళ్లబోతూ ఉండగా అతడి దృష్టి ఎదురుగా నిల్చున్న గోషాపైన పడుతుంది. అతడు తనను తాను సంబాళించుకుంటాడు. శారిక చేతిని వదిలేస్తాడు.)
చమన్ : అరే గోషా! నువ్విక్కడ?
(శారిక కూడా తనను తాను సర్దుకుంటుంది.)
ఇలా రా! దగ్గరకురా!…
(గోషా కాస్తంత బెదురు – బెదురుగా దగ్గర కొస్తాడు)
చమన్ : ఏదీ చెయ్యి ఊపు… (గోషా చమన్‌ని కళ్లు విప్పార్చి చూస్తూ ఉంటాడు. చమన్ తన జేబులోంచి ఒక అక్రోటు తీసి గోషా చేతిలో పెట్టి పిడికిలి మూసేస్తాడు) ఇదిగో ఈ అక్రోటు తీసుకో! (గోషా చాలా గంభీరంగా, మూసిన తన పిడికిలి వంక చూస్తాడు.) ఏదీ? నీ రెండో చెయ్యి ఏదీ?
(గోషా ఎడమ చేతిని చాపి విప్పుతాడు. చమన్ ముందు చేసినట్లే, గోషా చేతిలో అక్రోటు పెట్టి, పిడికిలి మూసేస్తాడు). ఇదిగో… ఈ రెండో అక్రోటు కూడా తీసుకో… తిను… పోయి హాయిగా ఆడుకో! పద, పరిగెట్టు ఇక!
గోషా: మూడో చెయ్యి ఉండి ఉంటే?
చమన్ : హారి పిడుగా!
(ముగ్గురు నవ్వుతారు. శారిక లేచి బట్టలు దులుపుకుని అక్కడి నుండి వెళ్లటానికి తయారుగా ఉంటుంది. గోషా ముందు తుర్రున పరిగెడుతాడు. శారిక, చమన్ నవ్వుకుంటూ అతడి వెనకే రంగస్థలం నుండి నిష్క్రమిస్తారు.)
(సశేషం)