Site icon Sanchika

నల్లటి మంచు – దృశ్యం 5

[box type=’note’ fontsize=’16’] ఇంటిని, ఊరినే కాదు తమ ఉనికినే కోల్పోతున్న కాశ్మీరీ ప్రజల దుఃఖం – “డయస్పోరా’గా మారుతున్న కటువైన నిజాన్ని ‘నల్లటి మంచు’ నాటకం ప్రదర్శిస్తుంది. హిందీ మూలం డా. మీరాకాంత్. తెలుగు సేత డా. సుమన్‌లత రుద్రావజ్ఝల. [/box]

దృశ్యం-5

[dropcap](నే[/dropcap]పథ్యంలో హబ్బాఖాతూన్ పాట భావానువాదం వినిపిస్తూంటుంది)

ఇచ్చేవాడే వెనకాడితే

అదృష్టం కూడా తోడురాదే

ఇక్కడ కాస్తంతలో ఎవరైనా

ఎలా జీవించగలరు?

దుఃఖపు గిన్నె నిండుగా నింపి

హబ్బా తాగుతోంది మరి – మరి

(ఓ చెట్టుపైన ఇంతసేపూ కనిపించిన చీనార్ వృక్షం లేదిప్పుడు. ఢిల్లీలోని శ్రీకంఠ కౌఖలూగారి గది తలుపు ధడాలున తెరుచుకుంటుంది. అలసి పోయిన శిబన్ ప్రవేశిస్తాడు. శారిక గతం జ్ఞాపకాల Flash back పూర్తయింది. తను ఉలిక్కిపడి శిబన్ వంక చూస్తుంది. శిబన్ నిర్లక్ష్యంగా, జోళ్లు విడిచి ఒక మూలకి విసిరేసి ధడాలున మంచం పైన విసురుగా అడ్డం పడతాడు.)

శిబన్ : ( ) కాఫీ ఉందా?

శారిక : (మృదువుగా) ఏమయింది శిబన్?

శిబన్ : (ఇందాకటి మూడ్లోనే) నువ్వు కాఫీ తే!

(కళ్లను చేతుల్తో కప్పుకుంటాడు)

శారిక : తెస్తాను గాని, అసలేమయింది చెప్పు?

(శిబన్ జవాబివ్వక పోవటంతో దగ్గర కొస్తుంది.) శిబన్…. శిబన్…!

శిబన్ : (కళ్లపై నుండి చేతులను తీసి) ఈ రోజు మళ్లీ పొద్దున్న….. పొద్దున్నే….. మూడ్‌ను పూర్తిగా పాడు చేశాడు… ఛ…! (లేచి కూర్చుంటాడు) ఈ చలిలో, తెల్లవారు ఝామున నాలుగు గంటలకి చిమ్మచీకట్లో ఇంట్లోంచి బైటపడతాను… అసలు పేపరు ప్రింటయి ఆలస్యంగా వస్తే నేనేం చెయ్యగలను చెప్పు? నా తప్పా?… కాదు కదా… అబ్బో! ఆయనో పెద్ద దొరగారు గదా!… (కొద్ది క్షణాలు ఆగుతాడు… శారిక వంటింట్లోకి వెళ్తుంది)

శిబన్ : (స్వగతం) ఇదేం ఊరు? పక్కవారి నిస్సహాయ పరిస్థితుల్లో పనేం లేదు… మనిషిని మనిషిగా చూడరు. అరే…. వాడు… (శారికతో గట్టిగా) నీకు తెలుసా?… అదే ఆ సైకిలు స్టాండు యజమాని, వాడికేం తెలుసు నా పరిస్థితి? అయ్యో! నేను M.B.B.S అఖరి సంవత్సరంలో ఉండేవాడినని! అంతా సరిగ్గా ఉంటే, ఈనాడు డాక్టరయ్యే వాడిని!…. ఈ రోజు పొద్దేన్నే లేచి గడప-గడపకీ ఎక్కి దిగి పేపర్లు పంచుకోవలసి వస్తోంది. (కోపంగా పక్కన ఉన్న కాఫీ గ్లాసును ఎత్తి తాగుతూ ఉంటాడు. ఈలోగా లోపల్నుంచి కాఫీ గ్లాసు తెచ్చిన శారిక, ఇందాక టాఠాజీకని పెట్టిన కాఫీ, చల్లారిపోయినా దానినే శిబన్ తాగుతున్నాడని గమనిస్తుంది.)

శారిక : అరే, అది నీ కాఫీ కాదు… ఇదిగో వేడి వేడిగా తాగు!

శిబన్: (నిర్వేదంగా) హుఁ! మన జీవితాన్నే మనకు కావల్సినట్లు బతకలేక పోతూంటే కాఫీదేముందిలే! ఇలాటి చప్పటి బతుకులకి ఈ చల్లారిన కాఫీయే చాల్లే! (ఆ కాఫీనే గుటకవేసి తాగుతూంటాడు శారిక తన ఏడుపు శిబన్ కళ్లపడకుండా అపుకుంటూ, వేడి కాఫీని పట్టుకుని వంటింటి వైపు అడుగులు వేస్తూండగా రాజ్ – రూప తలుపును తడతారు. వెనక్కి తిరిగిన శారిక, వాళ్లిద్దరినీ చూసి మహా సంతోషంతో ఎగిరి గంతేస్తుంది. శిబన్ కూడా ఆశ్చర్యపడుతూ, మంచంపై నుండి లేచి నిల్చుంటాడు. రూప ఒక బాగుతోను, రాజ్ ఒక సూట్ కేసును చేతిలో పట్టుకుని లోపలకు ప్రవేశిస్తారు.)

శారిక : (గలగలా నవ్వుతూ ముందుకెళ్తుంది. ఇద్దరూ ఒకరినొకరు కౌగలించుకుని) అక్కా!

రూప : (ఆప్యాయంగా) ఎన్నాళ్లయింది నిన్ను చూసి!

శిబన్ : (రాజ్‌ను కౌగలించుకుని) మీరు వస్తారని తెలిస్తే స్టేషనుకు వచ్చేవాడిని కదా!

రాజ్ : సరేలే, ఇప్పుడు ప్రోగ్రాము వేసుకుని ఎవరు నడవగలరు? అనుకున్నదంతా మట్టిగా మారిపోయింది కదా… టాఠాజీ కనిపించలేదు…

(ఇంతట్లో టాఠాజీ ప్రవేశిస్తారు. వీరి నందరినీ చూసి ఆశ్చర్యపోతారు. ముందు సంతోషిస్తూ, రాజ్ నమస్కారానికి తల ఊపుతారు. కాని మరుక్షణమే ఉదాసీనంగా మారిపోతారు.)

టాఠాజీ : (ప్రసన్నంగా) నాయనా! రా! వారయ్!… ఎలా ఉన్నావయ్యా?

రాజ్ : వారయ్! టాఠాజీ…

టాఠాజీ : (చిన్నబోయిన గొంతుకతో) రా బాబూ ఇలా వచ్చి కూర్చో!

(రాజ్‌ను కుర్చీ మీద కూర్చోమని సైగ జేస్తూ, తను మంచంవైపు అడుగు వేస్తారు) ఇలాటి రోజు కూడా వస్తుందని ఎవరికి తెలుసు? మీరు ఇంటికి వస్తే కూర్చోబెట్టటానికి జాగా కూడా ఉండదనుకున్నామా?

రాజ్ : (పూడుకు పోతున్న గొంతుకతో) అలా ఎందుకనుకుంటారు టాఠాజీ?… కనీసం, ఎక్కడ కూర్చోబెట్టాలని, ఎక్కడ కూర్చోవాలని ఆలోచించేందుకయినా మనం మిగిలేం అనుకోవాలి…!

టాఠాజీ : (ఏకీభవిస్తున్నట్లు తల ఊపీ) సరే, కనీసం ఒక గూడయినా ఉంది తలదాచుకుందికి… (రూప, శారికతో బాటు వంటింట్లోకి వెళ్తుంది.)

కేంపుల్లో తల దాచుకుంటున్న వేలమంది మనషుల్ని అడగాలి!…

శిబన్ : నేను చెస్తే ఒక్కరూ ఒప్పుకోలేదు… ఆఖరికి అయింది అదే కదా!…

రాజ్ : (శ్వాస ఒదులుతూ) ఔను! పరిస్థితులు అలా మారిపోయేయి. లేకపోతే…. నేను నా ఇంటిని….. నాకున్నదంతా పెట్టి కట్టుకున్న కొత్త ఇంటిని…. నా ఊరిని వదులుకుని జమ్మూలో… ఆ రాళ్ల నగరంలో బూడిద వెతుక్కోనా? నా ఫేక్టరీ పత్రాలు తీసుకుని రోడ్లమీద దారి తప్పినట్లు నడిచేదా?

శిబన్ : ఇక ఈ రకం మాటల్లో ఏం మిగలలేదు…. మనం ఇల్లూ – వాకిలి లేని… ఉద్యోగం – వ్యాపారం అన్నీ ఒదులుకుని, పేపరు భాషలో చెప్పాలంటే శరణార్థులం అన్నదే సత్యం… అదే నిజం… హుఁ! మై ఫుట్… పరిస్థితులకు కొత్త – కొత్త పదప్రయోగాలను కనిపెట్టడం ఎవరయినా ఈ జర్నలిస్టుల దగ్గరే నేర్వాలి.

రాజ్ : అస్సలు నమ్మకం కలగటం లేదు…. నా ఇంటిని నేను శాశ్వతంగా వదిలి వచ్చేసేనంటే, నాకే నమ్మకం కుదరటం లేదు… ఎప్పటికీ తిరిగి పోలేనంటే… (కంట్లో నీరు, ముఖంపై ఉదాసీనతతో కూడుకున్న చిన్న నవ్వుతో) అప్పుడప్పుడు, ఏదో శలవలు గడుపుదామని వచ్చాననిపిస్తూ ఉంటుంది. తరవాత బస్సు పట్టుకుని శ్రీనగర్ చేరి, ఇంటికి వెళ్లి… (గొంతుక పూడుకుపోతుంది. శిబన్ పరుపుపైన కూర్చుంటాడు.)

టాఠాజీ : రాజ్… బాబూ రాజ్…

రాజ్ : (తనను తాను సంబాళించుకుని) టాఠాజీ! జనం తమ చేతుల్లో తమ ఇళ్లకు తాళాలు బిగించి తమ ఊరికి ‘శలవ్!’ అని చెప్పిపోతూంటే చూసిన నాకు చాలా ఆశ్చర్యం వేసేది… నిజం చాలా… చాలా వింతగా ఉండేది… అదే! వీళ్లేం మనుష్యులు? ఇలా – ఎలా పోగలుగుతున్నారనుకునే వాడిని… కాని. పరిస్థితులు ఎంత వేగంగా మారిపోయేయంటే, నేనూ నెమ్మదిగా మారిపోవటం మొదలయింది…. ఈ పరిస్థితులు నన్నూ మార్చేశాయి… నేను ఓడిపోయాను టాఠాజీ … ఓడిపోయాను… (కాంతి రాజ్ పైన పూర్తిగా ఫోకస్ అవుతుంది. తక్కిన పాత్రధారులు, రంగస్థలం చీకటిలోకి వెళ్తారు. రాజ్ లేచి, నెమ్మదిగా అడుగులు వేస్తూ, స్టేజికి ఒకవైపు ఉన్న చీనార్ చెట్టు కాండం పైన కూర్చుంటాడు. అదే సమయంలో రంగస్థలంపైకి రెండోవైపు నుండి డా. నసీరుద్దీన్ ప్రవేశిస్తారు. ఇది రాజ్ జ్ఞాపకాల Flash back. అతనికి శ్రీనగర్లో ఉన్న తన ఇల్లు, మిత్రులు గుర్తొస్తున్నారు.)

(సశేషం)

Exit mobile version