[హనన్ మిఖైల్ అష్రావి రచించిన కవితని తెలుగులో అందిస్తున్నారు ప్రముఖ రచయిత్రి గీతాంజలి. Telugu Translation of Hanan Mikhail Ashravi’s poem ‘From the Diary of an Almost-Four-Year-Old’ by Mrs. Geetanjali.]
~
[dropcap]రే[/dropcap]పట్లోపు గాయాలకు కట్టిన గాజ్ బాండేజీలు తొలగిపోతాయి!
రేపు.. నేనసలు సగం తోలు ఊడిన నోరూరించే
తాజా ఆరెంజ్, ఆపిల్ పండ్లని చూస్తానా మళ్లీ..?
పోనీ.. కరుణ నిండిన మా అమ్మి సగం ముఖాన్ని?
అదీ నా ఈ ఒంటి కన్నుతో?
మీరే చెప్పండి?
పొడవాటి గన్‌తో.. అస్థిరంగా కంపించే చేతులతో..
అతని కళ్ళలోకి ఒకసారి చూసినా..
నమ్మండి.. నా కైతే ఏమీ అర్థమే కాలేదు!
నేను బులెట్‌ని అసలు చూడనే లేదు..
విచిత్రంగా, నేను మూసుకున్న కళ్ళతో మాత్రమే అతన్ని చూడగలిగాను.
ఎందుకంటే.. ఒక జత అదనపు కళ్ళు
మా మెదళ్ల లోపల మాత్రమే అమరి ఉన్నాయనిపిస్తుంది.
బహుశా కోల్పోయిన మా సహచరులను కనుక్కోడానికో..
వాళ్లకి మేకప్ వేసి అందంగా చేయడానికో
అలా తలలో కళ్ళు రహస్యంగా దాక్కుని ఉండొచ్చు..
మీకు తెలుసా.. నేను నా దగ్గర ఉన్న అన్నీ రంగు రాళ్ళ లోపలనుంచి..
కొత్తగా కనిపిస్తున్న ఈ లోకాన్ని కొద్దిగా అయినా.. సంభ్రమంతో చూసాను.
కానీ ఎంత దుర్మార్గమో చూసారా!
ఈ మధ్యనే నాతో పాటుగా
తొమ్మిది నెలల పసి పాపాయి కూడా కళ్ళని పోగొట్టుకుందని విన్నాను!
నన్ను కాల్చిన సైనికుడే ఈ పనీ చేసుంటాడా?
ఏ సైనికుడైతే.. పాలస్తీనా పాపాయిలు..
ఆయన కళ్ళల్లోకి నేరుగా చూస్తున్నారో,
ఆ పసిపిల్లల కోసం తుపాకి పట్టుకుని వెతుకుతూ, ఆ పాపాయిని కూడా
కాల్చేసి ఉంటాడా.. నాకు చాలా ఆశ్చర్యంగా.. దుఃఖంగా ఉంది!
ఆ పాప కన్నా నేను వయసులో పెద్దదాన్ని..
దాదాపు నాలుగేళ్ళుంటాయేమో నాకు?
మీకు తెలీదు కానీ కళ్ళున్నప్పుడు నేను
కనీసం చాలా ప్రపంచాన్ని చూసేసి ఉంటాను!
కానీ ఆ పసిది..?
ఆ నెలల పాప ఈ ప్రపంచాన్ని ఇంకా చూడనంత చిన్నది!
ఏం పాపం చేసిందని..
ఆ నెలల పసికందు కళ్ళని కూడా కాల్చేశారు..
గుడ్డిదాన్ని చేసేశారు.. మీరే చెప్పండి?
~
మూలం: హనన్ మిఖైల్ అష్రావి
అనుసృజన: గీతాంజలి
హనన్ మిఖైల్ అష్రావి పాలస్తీనాకి చెందిన ప్రముఖ విద్యావేత్త, కవయిత్రి, రాజకీయవేత్త, మానవ హక్కుల కార్యకర్త. శాంతి కోసం పాలస్తీనా-ఇజ్రాయెల్ చర్చలలో ఆమె చేసిన కృషికి ఆమె ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందారు.