Site icon Sanchika

నలుపు! (శ్యామసుందరం!)

[dropcap]బీ[/dropcap]రాల మేఘంపు కలిమదీ ఏమిటే
చల్లంగ రాలేటి వర్షంపు బిందులా?!
***
రాగాల కోయిల ఘనతదీ ఏమిటే
కొసరి సాగే గారాల పాటలా?!
***
నీలాల కన్నుల సొబగదీ ఏమిటే
మురిసి ఆడే కలల తోటలా?!
***
పూబాల లూగేటి పెన్నెఱుల మాటేమిటే
చిత్తాల మరపించు నెత్తావులా?!
***
ఏది కాదని నవ్వి చెప్పెనే శ్యామము,
శ్యామ కృష్ణీయ జగన్మోహనమూ!!
***


నల్లనీ మొయిలున్న నాడు కాదటే
మెరుపు తళతళల విలువలు?!
***
కజ్జలపు రేఖలను తీర్చిననె కాదటే
కనుల సౌరుల కలిమి కళకళలు?!
***
నీలమణులను పొదుగుటను కాదటే
శ్వేత శైలపు శిల్ప గరిమలు!?
***
ఇరుల దుప్పటి పరచుటను కాదటే
చుక్క పడుచుల తళ్కు సొబగులు!
***
దిష్టి చుక్కేను ఘన రక్ష కాదటే?!
చిదిమి దీపము వెట్టనోపు మోముకు!
***
తెలుపు స్థానమది,ఇరులతో కాదటే?!
తెలుపేమొ భోగము,నలుపౌను త్యాగము!
***
నలుపు గంధము కాదటే,పరిమళపు కస్తురి
నలుపు గుణము కాదటే,ఇట్టె కరుగు ప్రకృతి
నలుపు వర్ణము కాదటే, కృష్ణ లీలల పెన్నిధి
నలుపు సర్వము కాదటే,కాళి మాయల సాకృతి!

Exit mobile version