Site icon Sanchika

నమామి దేవి నర్మదే!! -1

[box type=’note’ fontsize=’16’] భక్తి పర్యటనలో భాగంగా తమ నర్మదా పరిక్రమణ యాత్రానుభవ కదంబాన్ని సంచిక పాఠకులకు అందిస్తున్నారు శ్రీమతి సంధ్యా యల్లాప్రగడ. [/box]

నర్మదా పరిక్రమ యాత్రానుభవ కదంబం

ఆ.వె.

శ్రీకరమగు యాత్ర శ్రేయస్సు నిచ్చును

సాధకులు నడిచెడి జాడ కొరకు।

నర్మద నది ఒడ్డు నాణ్యమని తలచు

భక్తి నడచు పుణ్య చరితు లిలను॥

కం॥

తలతును ప్రథమ గణపతిని

తలతును జగమేలునంబ తల్లియు తానే

తలతును గురువును భక్తిగ

తలచిన కావ్యము రచించ తపంబు చేయన్॥

***

ఉపోద్ఘాతం:-

శ్లో॥

జంతూనాం నరజన్మ దుర్లభమతః పుంస్త్వం తతో విప్రతా

తస్మాద్వైదిక ధర్మమార్గపరతా విద్వత్వ మస్మాత్పరమ్‌।

ఆత్మానాత్మ వివేచనం స్వనుభవో బ్రహ్మాత్మనా సంస్థితిః

ముక్తిర్నో శతకోటి జన్మ సుకృతైః పుణ్యైర్వినా లభ్యతే॥(వివేకచూడామణి)

సర్వ ప్రాణికోటికీ, చేతనాచేతనాలన్నిటికీ అధిష్టానం ఒక్కటే. సర్వం ఆత్మమయం. జడమయిన రాతిలో కూడా ఈ సత్యం ఉనికిగా వ్యక్తిమవుతూనే ఉంది. అయితే రాయి దీనిని తెలుసుకోలేదు. జడమైన రాయి కంటే వృక్షాలలో కొద్దిగా చైతన్యం వ్యక్తమవుతుంది. జంతువులలో వైవిధ్యాలు కనబడుతాయి.

కాని ప్రాణులన్నిటిలోనూ ఒక్క మనిషి మాత్రమే స్వతంత్రంగా, తార్కికంగా ఆలోచించి బుద్ధిపరంగా నిర్ణయాలు తీసుకోగలుగుతాడు. ఆ కారణము చేత మానవ జన్మ ఎంతో ఉత్తమమైనదని మహర్షులు చెబుతారు.

మానవులుగా జన్మించిన వారు తమ జన్మకు గల కారణం తెలుసుకోవాలి. జ్ఞాన సముపార్జన చేసి జన్మ రాహిత్యమైన మోక్షము కోసం కృషి చెయ్యాలి. మోక్షమంటే స్వస్వరూప జ్ఞానము, పునర్జన్మ లేకపోవటం.

మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతమ్

నాప్నువంతి మహాత్మానః సంసిద్దిం పరమాం గతాః॥

మోక్షపదాన్ని పొందిన మహాత్ములు నన్ను చేరి, దుఃఖపూరితం, అశాశ్వతమూ అయిన పునర్జన్మ పొందరు. అని మోక్షం గురించి గీతలో చెబుతాడు భగవానుడు.

మనం చూసేదంతా నిజమని మనకు అనిపించినా ఇదంతా మనసు చేస్తున్న భ్రాంతి మాత్రమే. మన సనాతన ధర్మం ఈ విషయం గురించి ఎంతో విజ్ఞానాన్ని అందిస్తుంది. అది తమంతట తాము తెలుసుకోలేకపోతే, కనీసం గురువు సహాయంతో తెలుసుకొన కృషి చెయ్యాలి. భగవంతుని మీద భక్తి కలిగి ఉంటే మార్గం కనబడుతుంది. నిత్య కర్మలు ఆచరించటము ద్వారా గృహస్థు మోక్షం పొందవచ్చని మనకు పెద్దలు చెబుతున్నారు.

భగవంతుని పూజ వలన హృదయం శుద్ధి చెంది జ్ఞానవాంఛ కలుగుతుంది. అభిషేకం వలన పాపం నశిస్తుంది. పీఠాన్ని అర్పిస్తే సామ్రాజ్యం, గంధ పుష్పాల వలన సౌభాగ్యం, ధూపం వలన సౌగంధ్యం, దీపము వలన కాంతిమత్వం, నైవేద్యం వలన భోగాలు, తాంబూలం వలన నాలుగు పురుషార్థాలు, జపం వలన అష్ట ఐశ్వర్యాలు, హోమం వలన సిరిసంపదలు, దానం వలన సర్వదేవతా సంతృప్తి కలుగుతాయని ‘గురుచరిత్ర’ చెబుతుంది……

మానవ జన్మ ఎత్తిన తరువాత కొన్ని తెలియక చేసే పాపాలు ఉంటాయి. ఆ పాపాలు ఎలా నశింప చేసుకోవాలా అని సాధకులకు ఆలోచన కలగటం సహజం. క్షేత్రాలు, తీర్థాలు దర్శించటం వలన మానవజన్మలో చేసిన పాపాలు తొలిగిపోతాయని మన పెద్దలు, గురువులు చెబుతారు. అది కాక ఆ దివ్య క్షేత్రాల దర్శనము వలన కుదురు కలిగి ధ్యానము నిలుస్తుంది.

అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలమ్” అంటూ మనస్సుని కాసేపు నిలబెట్ట గలవాడు అరుదని గీతలో చెప్పారుగా! అటు వంటిది సాధన ద్వారా మాత్రమే సాధ్యము, మన వంటి జనులకు… ఈ క్షేత్ర దర్శనాలు మనస్సును నెమ్మదించటానికి సహాయపడగలవు. మన భారతదేశములో పరమ పవిత్రమైన క్షేత్రాలు కోకొల్లలు.

వడివడిగా సాగే నది నుంచి నీటిని గ్రహించలేము. నీటిని తీసుకోవటానికి ‘రేవు’ ఎలాగో, సర్వత్రా వ్యాపించిన పరమాత్మను ఎరుకలోకి తెచ్చుకోవటానికి క్షేత్రాలు, తీర్థాలు అలా సహయపడగలవు. ఆ క్షేత్రాలలో కొన్ని మరీ అత్యంత పవిత్రమైనవి, తప్పక దర్శించవలసినవి. మన నదీ నదాలు కూడా ఎంతో పవిత్రమైనవి. నదులలో గంగానది పరమ పూజ్యమైనది. గంగానది స్నానం పాపవిమోచనం. ‘గంగ’ విష్ణువు పాదాలలో జన్మించి, శివుని శిరస్సున తాకి, భారతావనిని పవిత్రపరుస్తున్నది. గంగా నది వంటి పవిత్రమైనవి మరిన్ని నదులు ఉన్నాయి మనకు. అందులో ‘నర్మదానది’ ముఖ్యమైనది. నర్మదానది భౌతికంగా భారతదేశము నడిబొడ్డు మీద ప్రవహించే నది. అది తల్లి భారతికి వడ్డాణమై మురుస్తున్నది. ఈ నదిని ‘రేవా నది’ అని కూడా అంటారు.

మన దేశములో దేవాలయాలలో ప్రదక్షిణ చేసే ఆచారం ఉంది. నిత్య పూజలో ఆత్మ ప్రదక్షిణ నుంచి, మహా పర్వతాలైన కైలాసగిరికి ప్రదక్షిణ వరకు అదో అద్భుతమైన క్రియ….

ప్రదక్షిణ అంటే ‘ప్ర‘ అనే అక్షరము పాప నాశనము…‘’ అనగా కోరికలు తీర్చమని, ‘క్షి‘ అన్న అక్షరము మరుజన్మ వద్దని, ‘‘ అనగా అజ్ఞానము పారద్రోలి ఆత్మజ్ఞానము ఇవ్వమని. అంటే అజ్ఞానమును పారద్రోలి, పాపమును రూపుమాపి, మరుజన్మలేని మోక్షం కోసం ప్రదక్షిణ చెయ్యాలి. గుడిలో భగవంతుడి చుట్టూ తిరిగే ప్రదక్షిణంలో ఇంత అర్థం ఉంది. మన దేశంలోని గుడులలో ప్రదక్షిణ అన్నది ఆచారంగా ఉంది. పరమాత్మను ఆ దేవాలయాలలోని మూర్తిలో దర్శిస్తూ చేసేది ప్రదక్షిణ.

అలాగే గిరులకు, నదులకు చేసే అనవాయితీ కూడా ఉంది. అరుణాచలానికి ప్రదక్షిణ చెయ్యటం మనకు సాంప్రదాయంగా ఉంది. తిరువన్నామలై వెళ్ళి, అరుణగిరికి ప్రదక్షిణ చేసి, రమణాశ్రమమును సందర్శించి, అక్కడ ధ్యానం చెయ్యటం సాధకులకు అలవాటు.

బృందావనంలో గోవర్ధనగిరికి కూడా ప్రదక్షిణ చేస్తారు కృష్ణ భక్తులు.

గిర్నార్ పర్వతానికి ప్రదక్షిణ దత్తభక్తులు చేస్తారు.

సింహాచలానికి ప్రదక్షిణ చెయ్యటం కూడా సాంప్రదాయకంగా వస్తున్న ఒక సాధన.

అలాగే కైలాస పర్వతానికి కూడా ప్రదక్షిణ చేస్తారు. కైలాసం పరమశివుని ఆవాసము. స్వామి వారు అక్కడ కొలువై ఉన్నాడని, అక్కడ్నుంచి మనలను కాపాడుతున్నాడని మన నమ్మకం. అందుకే ఆ పర్వాతానికి ప్రదక్షిణ చేస్తే పరమశివునికి చేసినదిగా భక్తుల భావన.

ఈ ప్రదక్షిణలలో పరమాత్మని నామం సాధనగా, కొన్ని నిబంధనలతో, బయటి ప్రపంచంలోని ఆకర్షణల నుంచి మనసును లోపలికి లాగి, అంతర్ముఖమవటం దీనిలోని పరమార్థం.

అన్నింటిలో అత్యంత కష్టమైన, సాధనలో ముందుకు తీసుకుపోయే ప్రదక్షిణ నర్మదా పరిక్రమణ. నర్మదా నది చుట్టూ ఒకసారైనా ప్రదక్షిణ చెయ్యటం ఈ పరిక్రమణ ముఖ్యం. ఎన్నో నియమాలతో కూడినది ఈ యాత్ర. సాధకుని జీవితంలో ఈ పరిక్రమణ ఎంతో ముఖ్యమైనది. వారి సాధనా ప్రస్థానం గురించి మాట్లాడుకుంటే, పరిక్రమణకు ముందు జీవితం, తరువాత జీవితం అని చెప్పవచ్చు. అంత ప్రాముఖ్యమైన యాత్ర ఈ నర్మదా పరిక్రమణ.

తదియ పాద పంకజం నమామి దేవి నర్మదే!!!

***

2020 సంవత్సరం చాలా ప్రత్యేకమైంది. ఆ సంఖ్యే కాదు, దానితో మన మీద మనకున్న ఎన్నో ఆశలు, ఆశయాలు. ఆ సంవత్సరం నిజంగా ప్రపంచానికి చాలా ప్రత్యేకంగానే నిలిచింది. కాని ముఖ్యకారణం విచార కరమైనది. కరోనా అన్న సూక్ష్మజీవి అనుకోని విధంగా ప్రాకి ప్రపంచాన్ని నిలువరించింది.

అంత వరకూ ఉన్న ఉరుకులు, పరుగులు తగ్గి లోకం స్తంభించిపోయింది. విశ్వమంతా కరోనా ముందు, కరోనా తరువాత అన్నంతగా ఈ కనిపించని జీవి మార్చింది. మాకు వ్యక్తిగతంగా 2020 ముఖ్యమైంది. మానససరోవరం వెళ్ళాలనే ప్రయత్నంలో ఉన్న మేము ఈ ప్రపంచ పరిణామానికి హతాశులైనాం. మా గురువుగారు మా అందరికీ ‘రామనామం’ జపం చెయ్యమని, ప్రపంచ ఆరోగ్యం కోసం ఆ జపం ధారపోయమని చెప్పారు. చండీసప్తశతి కూడా చెయ్యమన్నారు గురువుగారు.

వారి పిలుపు మేరకు శక్తి కొలది జపతపాదులు చేశాం. ఆ సందర్భంలో వారు నాతో టెలిఫోన్‌లో మాట్లాడుతూ, “ఉన్న చోటనే జపం చేసుకో”మని సలహా ఇచ్చారు. నిజానికి నేను భారతదేశం వెళ్ళి క్షేత్రంలో సాధన చెయ్యాలన్న గొప్ప పట్టుదలతో ఉన్నాను. అంతకు పూర్వమే కాశీ క్షేత్ర యాత్ర చేసి, అక్కడ జపం చేసుకుని వచ్చాను కూడా కదా. అదే ఉత్సాహంతో నా మనస్సులో పెట్టుకున్నా వెళ్ళాలని. కాని ఈ కొత్త జీవి పుట్టి మావంటి సాధకులను కట్టడి చేసింది. చెయ్యటానికేమీ లేదు… ఉన్న చోటనే కైలాసం, వైకుంఠం… ఆ సంవత్సరం నేను శ్రద్ధగా యోగవాశిష్ఠం ప్రవచనం వినటం, చదవటం చేశాను నా సాధనలో భాగంగా. వచ్చే కాలంలో భారతదేశంలోని క్షేత్రాలలో నివసించాలని ఎన్నో ఆలోచనలు చేశాను.

ఈ పరిస్థితి మారటం లేదు. నా కోరిక తీరేలా లేదు. అలా పుణ్యభూమి, కర్మభూమి అయిన నా మాతృదేశానికి దూరంగా ఉన్న ఆ రోజులలో నాకు ఎందుకో ‘నర్మదా పరిక్రమణ చేస్తేనో?’ అని అనిపించింది.

సాధనను పర్వతాగ్రే, నదీతీరే, బిల్వమూలే,

మనోరమే శుచీదేశే, వేదఘోషే సమన్వితే

ఫలమూలే సుసంపన్నే వారిజల సంబుద్ధే అన్నారు పెద్దలు.

పర్వతాలపైన, నదీ మూలంలో, క్షేత్రాలలో ఉత్తమం. బహుశా అందుకే నదీ తీరాలలో సాధన చెయ్యాలని ఆలోచన కలిగి ఉంటుంది.

అందుకే అప్పటి వరకూ నేను ఈ పరిక్రమణ గురించి ఏమీ తెలియకపోయినా, వినకపోయినా ఆలోచన కలిగింది. ఎలా నా మనస్సులో ఈ ఆలోచన వచ్చిందో తెలియదు. అసలు అది ఎలా చేస్తారు? ఎవరు, ఎక్కడ్నుంచి ఎక్కడికి? ఇలాంటివి ఏమీ తెలియదు.

పరిక్రమణ చెయ్యాలని అని నా మనసులో తట్టింది. బహుశా జగదాంబయే కలిగించిన ఆలోచనగా తోచింది.

మనకున్న సౌలభ్యం అంతర్జాలం. కాబట్టి నేను ఆ రోజు నుంచి నర్మద నది గురించి, నర్మద నది పుట్టుక గురించి వివరాలు సేకరించటం ప్రారంభించాను. అప్పటి వరకు నాకు తెలిసినంతలో గంగానదే ముక్తిదాయిని. గంగను మించినది లేదు. కాని భారతదేశంలోని నదులన్నీ పరమ పవిత్రమైనవే, పురాతనమైనవే. మనం ‘గంగేచ యమునేచైవ నర్మదా సింధు కావేరి’ అని కలశపూజలో అన్ని నదులని స్మరిస్తాము.

***

నర్మద నది చరిత్ర –

నదులలో పురాతనమైనదిగా, అనాదిగా ఉన్న నదిగా నర్మదకు పేరున్నది. భూమి మొత్తం ఒక ఖండంగా ఉన్నప్పటి క్షేత్రంలో నర్మదను ‘నమడస్ లేదా నేర్బుడ్డా’ అని పేర్కొన్నారు (ref: Periplus Maris Erythari).

ఆనాటి కాలములో నర్మద పరివాహక ప్రాంతములో డైనోసార్స్ తిరిగేవి. వాటి కుటుంబాల పెంపు, వృద్ధి జరిగింది. (Ref: India-today news article dated 17 March 2010, Dinosaurs fossils found in Narmada valley) తరువాత మార్పులలో భారత ద్వీపకల్పం ఆసియా ఖండానికి వచ్చి తాకటము వలన మహోజ్వలమైన హిమాలయాలు ఏర్పడి గంగావతరణం జరిగింది. అంటే భౌతికంగా నర్మదా నది గంగానది కన్నా పురాతనమైనదిగా తోస్తుంది.

మన పురాణాలను (వాయు పురాణం, స్కంద పురాణం) బట్టి నర్మదానదికి ఎంతో ప్రాశస్త్యము ఉంది. నర్మదా నది పుట్టుక మీద మనకు ఎన్నో కథనాలు లభ్యమవుతున్నాయి.

విష్ణు పురాణములో రేవా నది ఒడ్డున చేసుకున్న ఏకాదశి వ్రతం జీవితకాల వ్రతముతో సమానమన్న కథ కూడా ప్రచారంలో ఉంది.

మన పురాణాల బట్టి, ఈ నర్మదా నది పుట్టుకకు సంబంధించిన కథ ఇలా సాగుతుంది…

సముద్రమథనం జరుగుతోంది. దేవతలు, దానవులు కూడా వాసుకిని తాడుగా మలచి, మంధర పర్వతాన్ని మథిస్తున్నారు. అందుండి ఎన్నో ఉద్భవించాయి. అందరూ అన్ని తీసుకుంటున్నారు. ఇంతలో గరళం పుట్టింది. అది మహా గరళం. ఆ గరళాన్ని స్వీకరించాడు మహాదేవుడు. సర్వభువనాలకు ఆధారమైనవాడు, విశ్వమంతా వ్యాపించిన వాడైన శివుడు గరళాన్ని స్వీకరించాడు.

ఓంకారేశ్వర్

మింగెడిది విషంబని

మింగెడి వాడు విభుండని

మింగుమనె సర్వమంగళ

మంగళ సూత్రమును మదినెంత నమ్మినదో!!” (8-241) అంటారు పోతనవారు ఈ సందర్భములో.

మన స్వామి దయాళువు. ఆయన కరుణ వర్ణించగలమా?

బిల్హణుడన్న 11వ శతాబ్ధపు కవి. బిల్హణీయంలో ఆయన చేసిన శివస్తుతి ఉత్తమమైనది.

అందులో ఒకచోట ఆయన ఇలా చెబుతాడు

శివుని మీద రచించిన సోత్త్రం ఎంతో ఉత్తమమైనదని పేరు…

గృహ్యంతాం వసనేషు చర్మ భుజగో హారేషు యానేషు గా

ర్ధుత్తూరం కుసుమేషు నాత్ర రుదిమః కిం త్వత్ర కంపామహే .

అబ్ధేః కౌస్తుభకామధేనుకమలాకల్పద్రుమోచ్చైఃశ్రవః

పీయూషాదిషు సత్సు తాత భవతా యః కాలకూటగ్రహః

తండ్రీ,

నీవు చర్మాన్ని వస్త్రంగా చుట్టేవనీ,

పాముని హారంగా వేసేవనీ,

ఎద్దును వాహనంగా చేసేవనీ,

ఉమ్మెత్త పూవును ఇష్టపడ్డావనీ

మాకు బాధలేదు. కానీ,

సముద్రంలో కౌస్తుభం, కామధేనువు, లక్ష్మీ,

కల్పద్రుమం, ఉచ్చైశ్శ్రవం, అమృతం ఇన్ని ఉండగా,

విషాన్ని ఎంచుకున్న నీ దయకు

మేం కంపించిపోతున్నాం!!!!

ఇంత దయాళువైన మహాదేవుడు ఆ గరళం మ్రింగి వచ్చి వింధ్య పర్వతాల పైన కూర్చున్నాడట.

ఆయన కంఠం నుంచి అప్పుడు విపరీతమైన చెమట కారిందట. ఆ చెమటనే నదిగా ప్రవహించింది. అదే నర్మదా నదిగా మారిందని పురాణ కథనం. మనకు ఈ కథనమే చెబుతారు నర్మద జన్మస్థలములో.

(సశేషం)

Exit mobile version