[box type=’note’ fontsize=’16’] భక్తి పర్యటనలో భాగంగా తమ నర్మదా పరిక్రమణ యాత్రానుభవ కదంబాన్ని సంచిక పాఠకులకు అందిస్తున్నారు శ్రీమతి సంధ్యా యల్లాప్రగడ. [/box]
నర్మదా పరిక్రమ యాత్రానుభవ కదంబం
మూడవ రోజు – షహడా
[dropcap]’ష[/dropcap]హడా’ లో మా కాలకృత్యాలు తీర్చుకొని,
“ప్రాతః స్మరామి లలితా వదనారవిందం
ఆకర్ణదీర్ఘ నయనం మణికుండలాఢ్యం
మందస్మితం మృగమదోజ్జ్యల పాలదేశమ్॥” అంటూ జపతపాదులు ముగించుకుని, ఉదయపు ఫలహారం చేసి బయలుదేరాము.
మా ఉద్దేశంలో ‘షహడా’లో ఒక రాత్రి ఉంచటమన్నది చాలా అనవసరం. కేవలం దూరం తగ్గించటానికి, మంచి బస కోసము మాత్రమే ఈ ఊరు ఎన్నుకొని ఉంటారు. ఈ చోట మాత్రమే మేము నర్మదా నదికి దూరంగా ఉన్నాము. మరి ఎక్కడ ఇలా లేము. ఈ ఊరికి దగ్గరగా తపతి నది, గోముఖి నది సంగమం ఉంది. ఆ సంగమంకు చేరాము ముందుగా. ఆ సంగమంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. వాటిలో ఒక శివాలయంలో వెలసిన పరమశివుడు స్వయంభువు. ఆయనను కేదారేశ్వరుడని కొలుస్తారు. ఆ ప్రదేశాన్ని ‘దక్షిణ కాశీ’ అని కూడా అంటారు.
దక్షిణ కాశీగా పేరుపొందినవి ఎన్నో ఉన్నాయి దక్షిణదేశాన. ఇది మరొకటి, ఇక్కడ ఈ దేవాలయానికి ఎంతో చరిత్ర, ప్రఖ్యాతి ఉంది. ఇక్కడ పుష్పదంతుడనే గంధర్వుడు శాపవశాత్తు ఈ ప్రదేశంలో తిరుగుతూ, ఒక కోరిక కోసం రాత్రికి రాత్రి ఇక్కడ శివాలయం నిర్మించాడట!!!. అతని భక్తికి మెచ్చి పరమశివుడు అతని శాపవిమోచనున్ని చేశాడట!!!! నేటికి ఈ దేవాలయానికి రాత్రి పూట ఇక్కడికి దేవతలు వచ్చి శివుడిని సేవిస్తారని కథా విశేషాలు తెలిపారు అర్చకులు. దేవాలయం ఎత్తు తక్కువగా ఉంది.
శివుని పానవట్టము చాలా పెద్దదిగా, వృత్తాకారంగా ఉండి అభిషేకానికి వీలుగా ఉంది. పూజారి మా చేత సంకల్పం చెప్పించి శివునికి అభిషేకం చేయించారు. ఈ నది నర్మదా కానందున ఇది మేము డబ్బాలలోకి మార్చుకోనక్కర్లేదని మా డ్రైవరు చెప్పాడు.
మేము ఆ దేవాలయం సన్నిధిలో కొంత సేపు జపం చేసుకున్నాము. ఈ ఊరు ప్రక్కనే ఉన్న పురాతనమైన త్రవ్వకాలు ఉన్నాయన్నాడు అనిల్, కాని ఎందుకో మమ్మల్ని తీసుకుపోలేదు. కాని శ్రీ వారు ‘సర్దారు సరోవర్ డ్యామ్’ చూపించమని పట్టుపట్టారు. ఆ డ్యామ్ మా ప్యాకేజీలో లేదని, కాబట్టి దానికి తీసుకుపోలేనని అనిల్ చెప్పాడు. మేము వెంటనే మా టూర్ మేనేజరుకి ఫోన్ చేశాము. అసలు షహడాలో బస బాగుండనందున శ్రీవారు మేనేజరుకు అప్పటికే ఫిర్యాదు చేశారు.
ఆ బస బయట వరాహాలు, బసలో మూషికాలు శ్రీవారిని చిరాకు పరిచాయి మరి. వాటి ఫోటోలు తీసి టూర్ మేనేజరుకు పంపి “ఇవేనా మీరు మా కోసం ప్రత్యేకంగా నిర్మించి ఇచ్చిన ప్యాకేజ్? ” అంటూ గొడవ పడ్డారు. యాత్రలో నదితో అనుసంధానం చేసుకోమని, ధ్యానం మీద మనస్సు పెట్టమని నేను చెబితే ఆయనకు చిరాకు కూడ కలిగిందనుకుంటా!!!
“నదిని మేము దాటకూడదు కాబట్టి మీరు డ్యామ్ దగ్గరకు వెళ్ళకూడదు…” అని అంటాడు డ్రైవరు.
“మేము నదిని దాటము. ఇటు వైపు నుంచి డ్యామ్‌ను, వల్లభాయిపటేల్ విగ్రహాన్ని చూసి మన తరువాతి గమ్యస్థానం వెళదాము…” అని మావారి మాట.
మమ్ములను కొంత నెమ్మది పరచటానికి మా టూర్ మేనేజరు సర్దార్ సరోవర్ డ్యామ్ వద్ద నదిని దాటకుండా ఇటు వైపుగా చూసిరమ్మని చెప్పాడు.
డ్రైవరుతో మాట్లాడిన తరువాత, ఆ డ్రైవర్ మమ్ములను అటు వైపు తీసుకుపోయాడు.
దాని వల్ల మేము ప్రయాణం చెయ్యవలసిన దూరం దాదాపు వంద కిలోమీటర్లు పెరిగింది.
***
మహారాష్ట్ర దాటి గుజరాత్‌లో ప్రవేశించిన తరువాత చుట్టూ వాతావరణం, రోడ్డు మారిపోయాయి. చుట్టూరా పత్తి పంట. భూమి మీద తెల్లని చుక్కల వలె ఉన్న పత్తి, జేగురు రంగు భూమి, అందమైన దృశ్యం కళ్ళకు విందు చేసింది. కారు దిగి భూమి తల్లికి నమస్కారం చేసుకున్నాము. నర్మదా ప్రక్కన సస్యశ్యామల భూమిని చూస్తే భక్తి భావం కలగకుండా ఉండగలదా! అనిపించింది. అక్కడి నుంచి గరుడేశ్వర వైపుకు సాగాము.
చక్కటి రహదారులు గుజరాత్ వైభవం చెప్పకనే చెప్పాయి. డ్యామ్ వైపుకు వెళ్ళే దారి ఘాట్ రోడ్డు. రోడ్డు ప్రక్కన టేకు చెట్లతో అడవి. క్షణం సేపు మేము ఇండియాలో ఉన్నామా? లేక మా అట్లాంటా నుంచి స్మోక్సీ వైపు డ్రైవింగుకొచ్చామా? అన్నంత చక్కటి రోడ్లు. పూల తేరులా అనిపించింది ప్రయాణం. ఘాట్ దాటి చిన్న పల్లెల నుంచి మేము డ్యామ్ సమీపిస్తుండగా నిలువెత్తు వల్లభాయ్ పటేల్ విగ్రహం నది వైపుకు తిరిగి కనపడటం మొదలెట్టింది. ఆ విగ్రహం నదికి ఆవల వైపుకు ఉన్నా, ఇటు వైపు వ్యూ పాయింటు ఉంది.
మేము సంభ్రమాశ్చర్యాలతో ముందుకు సాగాము. అత్యంత అద్భుతమైన ఆ విగ్రహం నది వైపు చూస్తూ కలికితురాయిలా ఉంది. భారతదేశ సమైక్యతకు ముఖ్యమైన పాత్ర పోషించిన ఆ మహానుభావుని ఆ విధంగా నిలబెట్టటం ఎంతైనా సముచితమని మేము భావించాము. ఉక్కు మనిషిగా పేరుతెచ్చుకున్న వాడు, నీతివంతుడు, ధైర్యవంతుడు, భారత దేశ ఉన్నతికి, ఒక్క దేశముగా నిలవటానికి ముఖ్య భూమిక అయిన వాడు వల్లభాయ్ పటేల్. నీచ రాజకీయం కనుక లేకపోతే భారతదేశానికి తొలి ప్రధాని కావలసినవాడు. అలా జరిగి ఉంటే దేశం ఎంత ఉన్నతమైన స్థాయిలో ఉండేదో అని మేము చాలా సార్లు అనుకుంటూ ఉంటాము.
అలాంటి మహానుభావుని నిలువెత్తు విగ్రహాన్ని ఈ యాత్రలో దర్శించగలగటం నిజంగా చాలా సంతోషం కలిగింది. దీనికి ‘ఐక్యత ప్రతిమ’ అని పేరు పెట్టారట. (స్టాచ్యూ ఆఫ్ యూనిటీ). గుజరాత్‌లో 182 నియోజక వర్గాల గుర్తుగా 182 మీటర్ల ఎత్తున ఈ విగ్రహం ఏర్పాటు చేశారు. అంటే 597 అడుగులు. దీని నిర్మాణానికి నాలుగు సంవత్సరాలు పట్టింది. ఇది అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి రెండింతలు ఉందట. ఇది ప్రపంచములోనే అత్యంత ఎతైన విగ్రహం. ఆ విగ్రహం పాదాల వద్ద మానవులు చీమల సైజ్‌లో ఉంటారు. ఈవల గట్టున కూడా అది అద్భుతమైన ఆకారంలో మమ్మల్ని సంతోషపెట్టింది.
ఈ విగ్రహంలో లిప్ట్ ద్వారా ప్రయాణించి పైకి వెళ్ళి వింద్యాచల అందాలు చూడవచ్చు!!
మేము ఇవతల వైపు ఉన్నందున, నది దాటకూడదు కాబట్టి, ఆ ప్రయత్నాలు ఆపి ఆ విగ్రహాన్ని చూసి, వివిధ ఫోటోలు తీసుకొని మా తరువాతి గమ్యస్థానమైన అంక్లేశ్వర్ వైపుకు సాగాము.
దారిలో మంచి శుభ్రమైన హోటల్స్ కనిపించాయి.
వాటిలో ఒక దానిలో మా మధ్యాహ్నపు భోజనం చేశాము…
త్వదీయ పాద పంకజం నమామి దేవి నర్మదే!!
***
అంక్లేశ్వర్
అంక్లేశ్వర్ చేరుకునే సరికే సూర్యుడు పశ్చిమానికి కృంగిపోయాడు. నాకు జలుబు, దగ్గు పూర్తిస్థాయికి చేరాయి. నేను ముసముసలాడటం ఎక్కువైంది. దగ్గు తగ్గటానికి నేను సాధారణంగా ‘కరక్కాయ’ వాడుతాను. హైదరాబాదులో మాకు కరక్కాయ దొరకలేదు. ఎన్ని విక్స్ గోళీలు నములుతున్నా గొంతు గరగర తగ్గటం లేదు, పైపెచ్చు పెరగటమే. ఆ రోజు మేము అంక్లేశ్వర్ చేరే సమయానికి పూర్తి జలుబు, దగ్గుతో పాటు డస్సి పోయాను.
అంక్లేశ్వర్‌లో మేము శ్రీవారి మిత్రులను కలవాలి. వారింటికి వెళ్ళాలి. పరిక్రమలో అలా ఎవ్వరి ఇంటికి వెళ్ళరాదని, వద్దని అనుకున్నా, చిన్ననాటి మిత్రులని, చుట్టాలని ఒక విధమైన బలవంతం చేశారు.
వారిని “కరక్కాయ ఇవ్వగలరేమో” అడగమని.. నేను శ్రీవారిని ప్రార్థించాను. కాని ప్రయాణపు అలసట, గొంతులో ఇన్ఫెక్షన్ పతాకస్థాయికి చేరి, అసలు యాత్ర పూర్తి చెయ్యగలనా? అని అనుమానం కూడా కలిగింది. అంక్లేశ్వర్ చేరే సరికే పొద్దువాలి నర్మదలో స్నానానికి వెళ్ళటానికి కొంత అనుమానం వచ్చింది. ‘చలి, పైపెచ్చు ఒంట్లో ఇంత బాగోలేక ఎలా?’ అని సందేహం కలిగింది.
“రేపు ఉదయం చెయ్యండి…” అని డ్రైవర్ ఊరడించాడు. అలా ఆ రోజు నర్మద సమీపానికి వెళ్ళినా నర్మదలో మునకలెయ్యలేకపోయాను.
హోటల్ బృందావన్ గార్డెన్లో చెకిన్ అయి, అక్కడే నర్మదను పూజించుకున్నాము.
ఆ హోటల్ బావుంది. కాని కోవిడ్ వలన స్టాఫ్ చాలా తక్కువ మంది ఉన్నట్లున్నారు. ఆనాటి నా పూజలో నర్మదామాయిని పరిపరి విధాలా వేడుకున్నాను.
“నర్మదా మాయి! నీవు పరాదేవతవని నమ్మి నీ ప్రరికమ పెట్టుకున్నా. రెండో రోజునే నీ నదిలో మునగలేని నా స్థితిని మన్నించు. నేను అన్న ఈ శరీరం నీ సేవకై ప్రాకులాడుతున్నది. పరిక్రమ కుదురుతుందో? అనారోగ్యంతో కుదరదో? నీవు పరిక్రమ చేసే వారికి కరుణతో ఆదుకుంటావని కథలు చదివాను ఎన్నో! నీవు నడిపిస్తే తప్ప పూర్తి చెయ్యలేనిక ఈ యాత్ర. శరీరం డస్సిపోతోంది. నీవే దిక్కు. నడిపిస్తావో? సాగనంపుతావో?…” అంటు ఎన్నో రకాలుగా నర్మదామాయికి మనస్సులో మొర పెట్టుకున్నాను ఆనాటి సాయంత్రం.
***
మా ఆరోగ్య పరిస్థితుల వల్ల, బయట పెరుగుతున్న కరోనా వల్ల మేము శ్రీవారి మిత్రుని ఇంటికి వెళ్ళకూడదని నిశ్చయించుకున్నాము.
“మాకు చాలా జలుబు, దగ్గు. మేము రాలేము!” అని శ్రీవారు చెబితే వారి మిత్రులు, “మా అమ్మాయికి వ్యాక్సిన్ ఇవ్వలేదు. మీరు రాకపోవటము మంచిదే!!” అని చెప్పారుట.
అవును! అది అందరూ జాగ్రత్తగా ఉండవలసిన కాలము మరి. మాకు బూస్టరు వాక్సిన్‌డోసు ఉన్నా, మా నుంచి మరొకరికి అందవెయ్యకూడదు కదా.
మేము మా పూజాదులు కానిచ్చుకుని ఇక విశాంత్రి తీసుకుందామనుకుంటుండగా శ్రీవారి మిత్రుడు వస్తానని, హోటల్ లోనే కలుస్తానని కబురు చేశారు.
ఈయన “సరే, రా!” అని చెప్పి ఊరుకున్నారు.
నేను కరక్కాయ గుర్తుచేస్తే, “దొరికితే తెస్తారులే. హైదరాబాదులోనే దొరకలేదు, ఇక్కడ దొరుకుతుందా?” అన్నారాయన కొంత విసుగుతో…. నేను మౌనం వహించాను. జగదంబను ప్రార్థిస్తూ నా జపం మీద మనస్సును నిలిపే యత్నం చేశాను.
దాదాపు గంట తరువాత “మా ఫ్రెండ్ తన భార్యతో వస్తున్నాడు. నీవు క్రిందికి రాగలవా? దూరం నుంచి కలసి వద్దాం…” అన్నారు.
అప్పటికే నేను దగ్గు మందు వేసుకున్నాను. పడుకుందామనుకుంటున్నా. సమయం తొమ్మిది. “సరే!” అని వెళ్ళాము క్రిందికి. మాస్క్‌లు పెట్టుకున్నా మధ్య మధ్య కళ్ళ్ కళ్ మన్న దగ్గు ప్రక్కవారిని భయపెడుతోంది. అసలు ఆ హోటల్‌లో జనాలు చాలా తక్కువగా ఉన్నారు కూడా. మేము లాబీలో కెళ్ళి వచ్చిన మిత్రులను కలిశాము. మా పరిస్థితి ఎలా తెలిసిందో కాని, శ్రీవారి మిత్రులు, ఆయన భార్య మా కోసం ఎన్నో తీసుకువచ్చారు. అందులో ముఖ్యమైనవి ఒక సీసాడు కషాయం. అది ఇండియాలో కోవిడ్ సమయంలో అందరూ చాలా త్రాగేవారట.
ఒక లీటరు నీటిలో అల్లం, జీలకర్ర, తిప్పతీగ వేరు లేదా కాండం, పసుపు వేసి అరలీటరు అయ్యేలా కాచాలట. అలా కాచిన నీటిని వడగట్టి సీసాలో భద్రపరిచి, రోజూ రెండు పూటలా కొద్దిగా గోరు వెచ్చగా చేసుకు త్రాగాలని ఆమె చెప్పారు. (నేను ఆ కషాయం హైదరాబాదులో మా అత్తయ్యగారికి కోవిడ్ వచ్చినప్పుడు చేసి త్రాగమని ఇచ్చాను. ఆమెకు అది త్రాగితే చాలా రిలీఫ్‌గా ఉందని చెప్పారు). ఒక చిన్న గుడ్డలో కర్పూరంతో పాటు వేప పువ్వు, కొన్ని మూలికలు కట్టి తెచ్చారు. అవి రెండు మాకిచ్చి రోజూ పీల్చమని ఊపిరి చక్కపడుతుందని, ఆక్సిజన్ లెవల్ పడిపోదని చెప్పారు. దగ్గు మందు, కరక్కాయలు ఇచ్చారు. మా ఇద్దరికి బట్టలు, నాకు పావుకిలో పసుపు, కుంకుమ, రెండు డజన్లు గాజులు ఇచ్చారామె. మాకు తినటానికి మిరపకాయ బజ్జీలు తెచ్చారు. అసలు అన్ని పదార్థాలు నాకు ఇస్తుంటే నా హృదయంలో నుంచి దుఃఖం తన్నుకు వచ్చింది.
భర్త మిత్రులు వచ్చారంటే, వారికేదో ఇస్తాము బహుమతిగా. ఒంట్లో బాగోలేదంటే అడిగిన మందు ఇస్తాము. కాని ఇన్ని ఎవరన్నా తెచ్చి ఇస్తారా?
ఇది కదా నర్మదామాయి కరుణ అంటే!!
ఇది కదూ జగదంబ అణుక్షణం ప్రక్కనుండి వేలు పట్టుకు నడిపించటము!!
నా హృదయం మైనంలా కరిగింది.
మాయి మీద కలిగిన భక్తి ప్రేమకు మాటలు వర్ణించగలమా?
ఏ భాషలో తల్లిని స్తోత్రం చెయ్యగలను?
ఏమిచ్చి చూపగలను భక్తిని?
సర్వం ఇచ్చే తల్లి…. నీకు నమస్కారం తప్ప ఇవ్వలేని అశక్తురాలి ఉపాధి….
దాసోఽహం తవ పాద పద్మ యుగళం అంబికే!! దాసోహం…
“శ్యామాంగీ శరదిందు కోటి వదనే సిద్ధాంత మార్గప్రియే
శాంతే శారదవిగ్రహే శుభకరే శాస్త్రాదిషడ్దర్శనే।
శర్మాణి పరమాత్మికే పరశివే ప్రత్యక్ష సిద్ధిప్రదే
దాసోఽహం తవ పాదపద్మయుగళం వందేఽఖిలాండేశ్వరీ॥”
కొండంత దేవుని కొండంత పత్రి ఇవ్వగలమా?
అంబికే…నీ దయకు తూగ గల భక్తి నాకెక్కడిదమ్మా?
అంబికే… పరిపరి విధాల కలుగుతున్న భావ వీచికల మధ్య ఆ తల్లితో “మీకెంత దయ… ఏమీ తెలియని వారికోసం ఎంత శ్రమ తీసుకున్నారు. మీ ఋణం తీర్చుకోలేని, నిజం చెప్పండి మీరే నర్మదామాయి కదూ…” అన్నాను కంఠం మరింత బొంగురు పోగా…
“నా పేరు కామేశ్వరి…” అన్నదామే కరుణతో.
హృదయంలో వణుకుతో, భావాతీతమైన భావనతో మౌనం…కళ్ళలో నీరు…మా అమ్మ జగదంబ ఏదో రూపములో వచ్చి… నా చెయ్యి వదలదు…
ఈ ఉపాధిని నడిపించే శక్తి ఆమె.
తగలకూడదు..
కరోనా అని దూరంగా ఉన్నాము…
లేకపోతే వెళ్ళి ఆమె కాళ్ళకు దండం పెట్టేదాన్ని…
కనీసం హృదయానికి దగ్గరగా హత్తుకునేదానిని.
ఏమీ చెయ్యలేని పరిస్థితుల వలన… దూరం నుంచి చేతులు ముకుళించి నమస్కరించాను.
నా ముఖం అప్పటికే జ్వరం పడ్డవాళ్ళ ముఖంలా వడలిపోయింది. నేను తూలుతూ… “నే నిలబడలేకపోతున్నా… వెళ్ళవచ్చా?” అన్నాను.
వాళ్ళు నా పరిస్థితి చూసి “వెళ్ళు… పర్వాలేదు…” దయతో అన్నారు.
శ్రీవారు కూడా బాగా జలుబుతో ఉన్నందున తను వచ్చేశారు. అలా ఇద్దరం కదిలి గదికొచ్చాము. ఆ రాత్రి కషాయం త్రాగి కరక్కాయ నోట్లో పెట్టుకొని పడుకున్నా.
ఆ రాత్రి నా దగ్గు ఆకాశానికంటింది. దగ్గి, వాంతి కూడా చేసుకున్నా. నా గుండె కూడా బయట పడుతుందేమో అనుకున్నాను…. అంతటి దగ్గు…
మరునాడు ఉదయం మేము కరోనా టెస్టు చేసుకుంటే రిజల్ట్ ‘నెగిటివ్’.
ఉదయం కార్యక్రమాలు పూర్తి చేసుకొని, ఇద్దరం కషాయం త్రాగాము.
(సశేషం)