[శ్రీమతి సంధ్యా యల్లాప్రగడ రచించిన ‘నమామి దేవి నర్మదే’ అనే పుస్తకాన్ని సమీక్షిస్తున్నారు శ్రీమతి షామీర్ జానకీదేవి.]
[dropcap]సా[/dropcap]ధారణంగా పరిక్రమణ అంటే అరుణాచలం, మానసరోవరం, గిరిప్రదక్షిణ ఇవి మాత్రమే నాకు తెలుసు. ఒక నదికి పరిక్రమణ, అది ఎక్కడ ఎలా మొదలు పెట్టాలి.. ఇది సాధ్యమేనా, ఇలాంటి నా అనుమానాలు నివృత్తి చేసుకోవాలంటే ఈ పుస్తకం చదవాల్సిందే అనే గట్టి పట్టుదల నాలో కలిగింది.
సంధ్యా యల్లాప్రగడగారి ‘కైంకర్యం’ పుస్తకం సమీక్ష చేసినప్పుడు, కొంతమంది రచయిత్రులను కలుసుకున్నాను.. అప్పుడే సంధ్యగారు నాకు పరిచయమయ్యారు.
నర్మదా పరిక్రమ చేయాలనే ఆమె సంకల్పం, అందులో ఎదుర్కొన్న అవరోధాలు, అయినా మొక్కవోని ధైర్యంతో, ఎక్కడో అమెరికాలో ఉండి కూడా నెరవేర్చుకోవడం మనకు ఆశ్చర్యం ఆనందం కలగజేస్తాయి. ఆమెకి తోడుగా నిలిచిన వారి శ్రీవారు కొండల్ గారి సహకారం, అది కూడ వారికి లభించిన భగవదనుగ్రహమే.
నదులలో అత్యంత గొప్పదైన గంగానదిని మనమందరం పూజిస్తాము. గంగలో స్నానం చేస్తే పాప విమోచన కలుగుతుందని భావిస్తాము. విష్ణుమూర్తి పాదాలలో జన్మించి, శివుని శిరస్సు నుంచి భూమి మీదకు వచ్చి, భారతావనిని పవిత్రంగా మార్చిన గంగానది గురించి మనకందరికీ తెలుసు. అలాంటి మరో పవిత్రమైన నది నర్మద. భారతదేశం నడి బొడ్డున ప్రవహిస్తూ, తల్లి భారతికి, వడ్డాణమై మురుస్తున్నది, అంటూ రచయిత్రి చక్కగా వివరించారు. ఈ నదిని రేవా నది అని కూడా అంటారు.
సాధారణంగా అరుణాచల గిరి ప్రదక్షిణ, సింహాచల ప్రదక్షిణ, అలాగే కైలాస పర్వత పరిక్రమణ చేస్తారు. కానీ అత్యంత క్లిష్టమైన, సాధనతో ముందుకు తీసుకుపోయే ప్రదక్షిణ నర్మదా పరిక్రమణ.. కరోనా సమయంలో, అమెరికాలో ఉండి, అంతర్జాలంలో ఇందుకు సంబంధించిన విశేషాలు సేకరించి, తన ప్రయాణానికి ఒక రూపం కల్పించి, అందరికీ అందుబాటులో, ఒక గైడ్‌లా ఉపకరించే ఈ పుస్తకం వెనుక ఉన్న సంధ్యగారి కృషి అభినందనీయం.
ప్రయాణంలో ఎదుర్కొన్న ఎన్నో అవరోధాలు, ఆరోగ్య సమస్యలు దాటుకుంటూ, 16 రోజులు జరిపిన ఏకధాటిగా సాగిన ఈ ప్రయాణం చదువుతుంటే, ఒళ్ళు గగురుపొడుస్తున్నది. చదువుతుంటే మనం కూడా అందులో భాగస్వామ్యం అయినట్లుగా అనిపిస్తుంది.
ఇండోర్‌ను పరిపాలించిన రాజవంశీయులలో కర్మయోగి రాజమాత, శ్రీమతి అహల్యా బాయి గురించి తెలియని వారికి మంచి వివరణ ఇచ్చారు. మన చరిత్ర పుస్తకాలలో ఈమె గురించి ఎక్కడా ఉటంకించలేదు అంటూ రచయిత్రి, ఆమెకు సంబంధించిన వివరాలు చాలా బాగా అందించారు.
శివుడు తనంతట తాను జ్ఞాన జ్యోతి స్వరూపునిగా ఆవిర్భవించిన ప్రదేశాలు 12. వాటిని ద్వాదశ జ్యోతిర్లింగాలు అంటారు. వాటిలో మహాశక్తివంతమైన ఓంకారేశ్వర జ్యోతిర్లింగం గురించి ఇచ్చిన కథనాలు బాగున్నాయి. ఆదిశంకరులు తమ గురువైన గోవిందపాదులవారిని ఇక్కడే కలుసుకున్నారు.
ప్రతిరోజు దానం చేయడానికి బిస్కెట్లు, నోటు పుస్తకాలు, దీపారాధన కోసం ఒత్తులు, అగ్గిపెట్టె, పెన్నులు, పది రూపాయల నోట్లు మరియు చిల్లర తమ దగ్గర ఉంచుకోవడం అనేది మంచి ఆలోచన. ఇలాంటి ప్రదేశాల్లోనే మనం మానవ సేవ చేయగలం. ఈ పరిక్రమణలో రచయిత్రికి, మార్గమధ్యంలో కనిపించిన పల్లెలు, అక్కడి వారి మనోభావాలు, ఇతర దేవాలయాలలో ఆమె అనుభవాలు చదువుతుంటే ఆమె పడిన శ్రమ ప్రస్ఫుటమవుతుంది.
భర్త మరణించిన తర్వాత స్త్రీలకు, భర్త ఆస్తిలో హక్కు కల్పించాలని ఒక చట్టం చేసిన అహల్యబాయి గురించి సవివరంగా వ్రాసారు. స్త్రీల జీవితాల్లో వెలుగు నింపిన అహల్య బాయి గురించి చరిత్రలో లేకపోవడం కొంత బాధాకరం అనిపించింది.
సుసంపన్నమైన రాజనీతితో, తన ప్రజలకు సుపరిపాలన అందించిన అమెవంటి రాణి వేరెవ్వరూ లేరని, భవిష్యత్తులో రాదని, నెహ్రూ తన ‘డిస్కవరీ ఆఫ్ ఇండియా’ అనే రచనలో చెబుతాడు. అంతటి మహారాణి గురించి తప్పక మన పాఠశాల పుస్తకాల్లో చేర్చాలి అనే రచయిత్రి అభిప్రాయం సమంజసంగా ఉంది.
తను దర్శిస్తున్న క్షేత్ర చరిత్రను వివరిస్తూ, అక్కడి దేవాలయాల గురించి వివరిస్తూ, సంధ్యగారు, మానసికంగా మనల్ని, తనతో పాటు తీసుకెళ్లారు.
ఇలాంటి రచనలు, భారతీయ ధర్మాన్ని, ప్రజలకు అందించడంలో, ముఖ్యంగా ఈ బిజీ యుగంలో, నర్మదా నది ప్రాశస్త్యం తెలియజేయడంలో రచయిత్రి కృతకృత్యులయ్యారు.
ప్రతి ఒక్కరూ ఒక గైడ్‌లా, తమ దగ్గర ఉంచుకొని, పదే పదే చదవాల్సిన విలువైన పుస్తకం, సంధ్య గారి ‘నమామి దేవీ నర్మదే’.
మరొకసారి సంధ్య గారికి అభినందనలు.
***
నమామి దేవీ నర్మదే
రచన: సంధ్యా యల్లాప్రగడ
పేజీలు: 152
వెల: ₹ 200
ప్రతులకు:
అచ్చంగా తెలుగు ప్రచురణలు – 8558899478
నవోదయ బుక్ హౌస్, కాచీగుడా +91 90004 13413
ఆన్‍లైన్‍లో తెప్పించుకునేందుకు:
https://books.acchamgatelugu.com/products/narmada-parikrama?sku_id=50013853