[box type=’note’ fontsize=’16’] “ఇసుక తిన్నెల ఎడారి అందాలను కళ్ళతో చూడాలే కాని మాటలతో వర్ణించలేము” అంటూ యునెస్కో వారి హెరిటేజ్ సైట్ అయిన నమీబియా ఇసుక సముద్రంలో తమ పర్యటనల విశేషాలు వివరిస్తున్నారు నర్మద రెడ్డి. [/box]
కొండలు, లోయలు! కనుచూపు మేర బంగారు కొండలు, చల్లని వాతావరణం! ఒక్కో అడుగు పైకి వెళ్తుంటే బంగారు కొండల్లా తళుకులీనే ఆ ఎడారి ఇసుక తిన్నెలు మనసును కట్టి పడేస్తాయి. ఉదయ సాయంత్ర ఎర్రని సూర్యకిరణాలు సోసి ఆ బంగారు కొండలు ఇసుక తిన్నెలు రా రమ్మని పిలుస్తూ వుంటే ఆ ఇసుక తిన్నెల ఎడారులను అందాలను కళ్ళతో చూడాలే కాని మాటలతో వర్ణించలేము. ‘ఎన్నెన్నో అందాలు’ అని పాడుతూ ఆ ఇసుక తిన్నెలమీద నడుస్తుంటే దూది పింజల్లాగా అడుగులు వేస్తూ పైపైన నడుస్తూ ప్రపంచంలోనే అతి ఎత్తైన ఎడారి ఇసుక తిన్నె మీదకి వెళ్తుంటే అక్కడ హోరుమనే గాలి! ఆ గాలికి ఆ ఇసుక రేణువులు వీణ మీటినట్లుగా ఎగిరి పడ్తూ ఒక సంగీత కళాకారుడు గీచినట్లు కనుచూపు మేర ఆ సంగీత నినాదాలకి తలలు వంచి ఆ ఇసుకతిన్నెల మీద రాసిగా పోసి వేలితో వీణను మీటినట్లు ఆ ఎడారి అంతా లయబద్ధాకారమైన గీతలతో ఎంతో అందంగా వుంది.
UNESCO World Heritage Site
దీనినే నమీబియా ఇసుక సముద్రం (Sand Sea) అంటారు. Namib అంటే vast place. నమీబ్ అంటే విస్తారమైన స్థలం అని అర్థం. ఇది అట్లాంటిక్ సముద్రతీరాన (1200 మీటర్ల) 200 కి.మీ. అంగోలా ప్రాంతం వరకు విస్తరించి వుంది. ఆఫ్రికాలో 55-60 మిలియన్స్ సంవత్సరాల ముందు ఏర్పడిన ఈ ఎడారి 9-20°C (48-68°F) వుంటుంది. రాత్రిలో కొన్నిసార్లు freezing అంటే అతి చల్లగా వుంటుంది.
హైద్రాబాద్ నుండి నమీబియా 18000 కి.మీ. ఈ ప్రయాణంలో హైద్రాబాద్ నుండి ఢిల్లీకి, ఢిల్లీ నుండి ఇథియోపియా, ఇథియోపియా నుండి నమీబియాకి వెళ్ళాము. వాతావరణం చాలా చల్లగా వుంది.
విన్‌డాక్ నమీబియా రాజధాని. ఈ నగరానికి చేరుకోగానే మేము ఈ ఎడారి ప్రాంతంలో తిరిగేందుకు ఒక స్పెషల్ వెహికల్ తీసుకొని ప్రొద్దున 11 గంటలకి బయలుదేరాము. దారి పొడవునా వింతయైన చెట్లు, అతి పొడవైన తాటిచెట్లు కాని ఆ ఆకులకి మధ్య కాండానికి వింతగా బ్రౌన్ కలర్లో ఏదో పిచ్చుకల గూళ్ళు లాగా వుంది.
ఆ ఎడారి ప్రాంతంలో ఎంతో వింతగా ఒక చెట్టుకి గూళ్ళు పెద్ద పక్షులు పెద్దగా ఒక వల విసిరితే ఎంత పెద్దగా అవుతుందో అంత పెద్దగా గూళ్ళు కట్టుకున్న విధానాన్ని చూస్తే ఆశ్చర్యం అన్పిస్తుంది.
11 గంటల నుండి రాత్రి 7 గంటలకి మేము ఒక రిసార్టు చేరుకున్నాము. అక్కడ ఆ రిసార్టు చాలా అందంగా వుంది. మేము గుడారాలలో పడుకున్నాము. ఆ రాత్రికి ఆ ఎడారిలో రాత్రి భోంచేయగానే మేము 1 కి.మీ. నడిచి వుంటాము. కాని ప్రొద్దున్నే తెల్సింది అక్కడ ఆ రిసార్ట్ పరిసరాలల్లో, చాలా తేళ్ళు వుంటాయని. ‘ఓ మై గాడ్! మనకు తెలికుండా ఎంత భయంకరమైన స్థలంలో అంత నిర్భయంగా తిరిగా’మని గుండెమీద చేయి వేసుకున్నాం.
అది కూడ అర్ధరాత్రి పూట. ‘పాపం పసివాడు’ అనే సినిమా గుర్తొచ్చింది. ఆ అబ్బాయి ఒంటరిగా ఎడారులలో తిరుగుతూ ప్రాణాలు నిలుపుకునేందుకు రకరకాల పదార్థాలు తింటాడు ఆ సినిమాలో.
మర్నాడు ఉదయం 4 గంటలకి నా బ్యాగ్ తీసుకుని సూట్‌కేస్ లాగుకుంటూ 1 కి.మీ. నడిచాను ఆ రిసార్ట్‌లో. అప్పుడు కూడ చిమ్మచీకటి. నమీబియాలో ఆకాశంలో నక్షత్రాలు చాలా బాగా కన్పిస్తాయి.
ప్రపంచంలోనే అతి చక్కటి స్థలం:
ఆ నిశీధి అర్ధరాత్రిలో నక్షత్రాలని చూడడానికి ఈ నమీబియా ప్రాంతం ప్రపంచంలోనే గొప్ప ప్రదేశమట. ఈ నమీబియాలో నక్షత్రాలు మిణుకు మిణుకు మని మెరుస్తూవుంటే నేను మావారు ప్రక్క ప్రక్కనే నడుస్తూ వుంటే ‘ఈ రేయి తీయనిది ఈ చిరుగాలి మనసైనది. ఈ హాయి మాయనిది ఇంతకు మంచి ఏమున్నది?’ అని పాడుకున్నాము.
మాకు అంత ప్రొద్దున్నే ఆ రిసార్ట్‌లో పెట్టి ఇచ్చాడు. అవి తీసుకొని 4 గంటలప్పుడు ప్రయాణం. 60 కి.మీ. నమీబ్ ఎడారికి బయలుదేరాము. మాకు ఆ వెలుతురు కాంతిలో జిరాఫీ, జీబ్రా, అడవి జింకలు కన్పించాయి. జీబ్రాలు 10 మా వాహనంతో సమాంతరంగా పరుగెత్తాయి. ఒక వీడియో తీసుకున్నాను.
అక్కడి నుండి సూర్యోదయం, ఆ ఇసుక కొండలమీద తొంగి తొంగి చూస్తూ సూర్యుడు కొండలపైకి వస్తూ వుంటే ఆ ఎర్రటి ఇసుకమేటలు బంగారు వర్ణంలో తళతళ లాడుతూ మెరుస్తూ వుంటే అలాగే నిశ్చేష్టులమై చూశాము.
అక్కడకి జనాలు 100 నుండి 200 మంది వరకు వచ్చారు. ఇక్కడికి లోపలికి రావడానికి ప్రత్యేక అనుమతి తీసుకొని రావాలి. వాహనాలకి కూడ ఫీజు కట్టి లోపలికి వెళ్ళాలి.
డ్రైవరు 45 dune దగ్గరికి మా వాహానాన్ని తీసుకెళ్ళి ఆపారు. అక్కడ ఫొటోలు దిగి 5 గంటలకి పైకి వెళ్ళడానికి ఉపక్రమించాము. ఇది 1000 అడుగుల పైన వుంటుందట. ప్రపంచంలోనే అతి ఎత్తైన ఎడారి నమీబియా లోని ఎడారే. నేను మావారు కల్సి నడవడం మొదలు పెట్టాము. పైకి వెళ్తుంటే హోరున గాలి, ఇసుక ఎగిరిగి పడ్తుంది. కళ్ళకి అద్దాలు వున్నాయి కాబట్టి కళ్ళలో ఆ ఇసుక పడటం లేదు. కాలు తీసి కాలు నడుస్తూ వుంటే మెత్తని దూది పింజాల్లోల్లా కాళ్ళు కూరుకుపోతున్నాయి. అడుగు తీసి అడుగు వేయటం ఎడారులలో ఒక అడుగు పైకివేస్తే రెండు అడుగులు క్రిందికి జారుతున్నాము. అలా నడుస్తూ పైకి వెళ్ళి క్రిందికి రావటానికి ఒకటిన్నర గంటల నుండి రెండు గంటలు పట్టింది. అన్నిటికంటే ఆశ్చర్యమేమిటంటే ఒక గీయ గీసినట్లుగా పైనుండి క్రింది వరకు మనిషి పేర్చినా ఇంత అందంగా రాదు, ఊహకు అందని అందం ఆ పేర్చినట్లుండే ఇసుక ఎడార్లు ఈ ఇసుక మేటలు నన్ను చూడు అని వర్ణించడానికి కూడ మాటలు రావు. అంతటి అందమైన ఎడార్లు మేము ప్రయాణం చేసిన 9000 కి.మీ. రెండు రాత్రుళ్ళు నిద్రలేమి అన్నిటిని మైమరచిపోయ్యాము.
ఈ దీవిని, భువిని సృష్టించిన భగవంతుని హర్షించాల్సిందే. మేము హైద్రాబాద్ నుండి వచ్చేటప్పుడు ఆఫ్రికన్ దేశాలకు అంటే ఎందుకు వెళ్తున్నారు? అడిగారు. కాని ఇంతటి ఈ ఎడారి మనల్ని మురిపించేస్తుంది. అక్కడ నుండి మేము నమీబ్ లోని నేషనల్ పార్క్‌కి వెళ్ళాము. ఇది వెళ్లడానికి మనం తీసుకెళ్ళిన జీపులు పనికి రావట.
ప్రత్యేకమైన బండిలో మేము Namib – Naukluft Parh కి వెళ్ళాము.
నమీబ్ ఎడారి SOSSUSV/EI అనే స్థలంలో వుంది. దీని అర్థం Salt & Clay Pan అని అంటారు. Sussuvlei “dead end” అని అర్థం అంటారు. అంటే no return తిరిగిరారు అని అర్థం.
ఇక్కడ వున్న సోసోవిల్లే 45 dune లో 5 మిలియన్ సంవత్సరాల నాటి ఇసుక తిన్నెలు వున్నాయట. ఇది ఎంత ఎర్రగా వుంటే అంత పాత dunes అని అర్థం. ఇక్కడి నుండి ప్రత్యేకమైన బండ్లు 4WD అనే బండిపై ప్రయాణం చేయాలి. మామూలు మన బండ్ల టైర్లు ఎగిరిపోతాయట. ఈ ప్రాంతంలో ఇసుకలో కూరుకుపోతాయట. అక్కడ ఫీజు కట్టి బండిలో కూర్చుని వెళ్ళాలి. అక్కడికి వెళ్ళగానే అతి ఎత్తైన 325 మీటర్లు అతి ఎత్తైన Big daddy అనే స్థలంలో అందరూ పైకి ఎక్కారు.
వాల్విస్ బే (Walvis Bay) దగ్గర dune7 అంటారు. అక్కడికి ఆ ఎండలో 7 కి.మీ. నడిచి 325 మీటర్లు Big mama ఇసుక దిన్నెని ఎక్కి దిగివచ్చాము. క్రింద టిసుచ్హాబ్ అనే నది (T Sauchat river) ఇది ఒక చోట వరదలు పొంగి ఇక్కడే ఈ నీరు ఎక్కడికీ పోకుండా ఆగిపోతుంది. ఈ నీరు ఎక్కడికీ పారదు, కాబట్టి అక్కడే ఆ నీరంతా ఇంకిపోతుంది. ఇది ఎన్నో సంవత్సరాల కొకసారి అది అలా పొంగుతుందట. ఈ నీరంతా ఇంకిపోయి తెల్లటి ఉప్పు మేటలాగ ఏర్పడి కొంత భాగం మాత్రం బురదలాగ ఏర్పడుతుంది. ఇది కూడ చాలా అద్భుతమనే చెప్పాలి. Sesriem లో అక్కడక్కడి ఎండిపోయిన చెట్లు. ఈ చెట్లు కూడ వున్నాయి. ఇదీ ఒయాసిస్సులు (Oasis). ఈ ఒయాసిస్సులని చూచి ఎంత సంతోషించానో దేవుడి సృష్టిలో వున్న అన్నీ అద్భుతాలు ఈ కళ్ళతో చూశానని ఉప్పొంగిపోయాను.
సిసిరము దగ్గర ఈ ఇసుక అంతా కొన్ని సంవత్సరాలకి రాళ్ళలా ఏర్పడి కొండల ఏర్పడయి. Canyon hot balloons లో చూడవచ్చు.
ఇవన్నీ చూచి మేము బయటికి వచ్చాము. ఆ రోజులు మేము 45 అంతస్థులు ఎక్కి 12 కి.మీ. నడిచినట్లుగా నా యాప్‌లో చూచాను. ‘ఓ మై గాడ్! 45 అంతస్తులు 12 కి.మీ. నేనేనా? అని అబ్బుర పడ్డాను.
బయటకి రాగానే ఒక చెట్టు క్రింద అందరూ కూర్చున్నారు. అక్కడ వున్న అన్ని చెట్లు 700 సంవత్సరాలు క్రితం చెట్లు అట. వాటి దగ్గర ఫొటోలు దిగి ఈ స్పెషల్ బండి ఒక స్టూల్ మీద నుండి ఎక్కి ఆ బండి ఎక్కాను. అంత height లో వుంది. అది ఎక్కి మళ్ళీ Sesreim అనే స్థలం నుండి గేట్ వరకు వస్తున్నప్పుడు పిచ్చి గాలి మనం కూడ ఎగిరిపోతామా అనే హోరుగాలి. చెవులు గట్టిగా మూసుకొని బెల్టులు పెట్టుకొని వచ్చాము.
గేటు దగ్గ ఆ కార్లో return 10 గంటల ప్రయాణం మళ్ళీ తిరిగి (whindock) రావడానికి పట్టింది. టాక్సీ అబ్బాయిని 2:30 గంటలకి రమ్మని చెప్పాము. నమీబియా రాజధాని విన్‌డాక్. ఈ నగరమంతా చూడడానికి బయల్దేరాము.
ఇక్కడి నుండి మొదట ఒక పురాతనమైన చర్చికి వెళ్ళాము అక్కడి నుండి మ్యూజియం చూడడానికి వెళ్ళాము. ఆ మ్యూజియంలో ఆ దేశానికి స్వతంత్ర్యం రావడానికి వారు పడిన పాట్లు తెలుసుకున్నాం. ఆ దేశ భక్తుల ఫోటోలు చూచాము.
అక్కడ బాగా ఆకర్షించినది ‘నెల్సన్ మండేలా’ దక్షిణాఫ్రికాలో వున్న జైలు గదిని ఇక్కడ కూడ నిర్మించారు. నెల్సన్ మండేలా వాడిన బట్టలు, అతడి టేబుల్, ఆ సెల్ అలాగే వుంది. కాని దక్షిణాఫ్రికాలో వున్నంత పెద్దగా లేదు. ఎందుకంటే 20 ఏళ్ళ క్రితం నేను నెల్సన్ మండేలా జైలు చూశారు. అని ఒక చిన్న దీవిలో వుంది. ఆ దీవికి వెళ్ళాలంట ఒక (క్రూజ్) పడవలో వెళ్ళాలి. నెల్సన్ మండేలా ఎట్టి పరిస్థితులలో బయటికి రావానికి వీలులేదు, వచ్చినా ఆ మహా సముద్రాన్ని దాటలేరు. ఆయన వున్న గదిలో నుంచి నీళ్ళకి ఒక కుండ, తినడానికి మట్టితో చేసిన ఒక చిన్న కుండ ఒక ప్లేట్, అది కడుగుకోవటం కూడా అక్కడే చిన్న చదరపు గదిలో కలిగి అక్కడే ఉండాలి. అది చూచినప్పుడు ఒక మనిషి 27 సంవత్సరాలు ఆ జైలులో మగ్గటం చూస్తే ఆశ్చ్యమనిస్తుంది. ఒక మనిషి అలా ఒంటరిగా మనకు జ్వరం వచ్చి వారం రోజులు ఒక స్థలంలో వుండాలంటే ఎంత కష్టమన్పిస్తుంది.
Zambezi Choba Rivers border
3వ రోజు మేము పొద్దున్నే బయలుదేరి Zambezi Choba Rivers border of Bothswana, Namibia, Zambia and Zimbabwe చూశాము. తర్వాత Chobe National Park కి వెళ్ళాము. నాది ఎంత అదృష్టం అని చెప్పాలంటే నమీబియాలో Zambezi Choba నదిని, Zambiaలో వున్న ఆ నదిని, Zimbabwe లో వున్న నదిని చూచి మురిసిపోయాను. ఎందుకంటే ఈ 5 దేశాలలో ఈ నది పారుతున్నది. నేను ఈ 5 దేశాలు చూశాను.
ఇన్ని దేశాలలో పారే నది. ఈ నది చుట్టు ప్రక్కల అన్నీ జంతువులు. ఇదంతా National Parks. ఈ National Park కి మేము ప్రొద్దున 8 గంటలకి బయలుదేరి వెళ్ళాము. ఒక Safari అడవులలో తిప్పే బండిలో మేము బయలుదేరి జిరాఫీలు, జీబ్రాలు, కొండెంగలు, కోతులు, కుక్కలు, సింహాలు, పులులు అన్నీ చూశాం. వింతగా వున్న కుక్కలు మచ్చలతో వున్నాయి. అవి చాలా ప్రమాదకరమైన జంతువులు. ఈ జంతువులన్నీ ఎన్నో వేల ఎకరాలలో అడవులలో వున్నాయి. ఈ జంతువులు కన్పించినప్పుడల్లా మా గ్రూప్‍లో కేకలు కేరింతలు, అవి చూచిన ఆనందంతో అక్కడి నుండి మేము మరుసటి రోజు మేము నమీబ్ ట్రైబ్స్‌ని కలవటానికి వెళ్ళాము.
హించా జాతికి చెందిన తెగవారు వున్నారు. ఈ హింబా జాతివారు సంచార జీవులు. చెట్ల ఆకులతో ఎన్నో రకాల వైద్యాలు చేసుకుంటారు వారు మాట్లాడే మాటలు మనకు అర్థం కావు. అయినా ఆ మూగభాష నాకు మాత్రం అర్థం అయ్యింది. వారి జడలు ఎర్రటి మట్టితో రాసి పాయలు పాయలుగా వేసుకున్నారు. వారు ఆ ఎర్రటి మట్టిని వంటి నిండా రాసుకున్నారు. అది చల్లదనాన్ని ఇస్తాయనుకుంటా. ఆడవారు అంతా వారి వంటికి తలలకు పులుముకున్నారు. మొలలకి జంతు చర్మాలు కట్టుకొని వున్నారు. వారు పూసలతో అల్లుతున్నారు. ఒక నెక్లెస్ కొనుక్కొన్నాను. వారి జీవన విధానాన్ని, వారి పూరిగుడిసెల్ని చూచి చాలా బాధ వేసింది. ఇంతటి నాగరిక ప్రపంచంలో 2.5 లక్షల ట్రైబ్స్ వున్నారట. అక్కడ వారితో కల్సి అడవిలోకి వెళ్ళి ఏ చెట్టు ఆకుల్ని దేనికి ఉపయోగిస్తారో మా గైడ్ వారు చెప్పి మాటల్ని తర్జుమా చేసి చెప్పారు. వారు తినే ఆహారం పండ్లు, కూరగాయలు, కొన్ని రకాల ఆహారపు దినుసులు, గంజి తాగుతారు. వీరు వారి వయస్సు తెలియదు వీరికి ఉన్న ఆవులు, గేదెలకి వారు డబ్బు మార్పిడిలాగా వాడుకుంటారు. ఇక్కడి ఆడవారిదే ఆధిక్యత. అబ్బాయిలు వారికి అణిగి మణిగి వంటారు. వీరు నాగరికత ప్రపంచంలోకి రావటానికి ఇష్టపడరు. వీరి ప్రపంచం వీరిది.
6వ రోజు మేము Orphane Sanitary కి వెళ్ళాము. ఇక్కడ గాయపడిన, జబ్బు వచ్చిన జంతువులను తీసుకొనివచ్చి చికిత్స చేస్తున్నారు. Naankuse అనే ప్రదేశంలో అన్ని జంతువులను సుమారు 500 ఎకరాలలో వీటిని పెంచుతున్నారు. వీటికి అన్ని కంచెలు వేసి వున్నాయి. అన్నిటిని చూడవచ్చు. దగ్గరగా అవన్నీ తిలకించాం. డెన్మార్క్ నుండి ఇద్దరు అమ్మాయిలు ఈ జంతువులకి సేవ చేయటానికి వచ్చారు. చాలా ఆశ్చర్యం వేసింది, వారి సేవా భావానికి. 3 నెలల ఇక్కడే వుండి ఆ జంతువులకి సేవ చేస్తారట. అంత విడ్డూరంగా అన్పించింది.
మరుసటి రోజు అన్నీ కుట్లు, అల్లికలు చేనేత వస్తువులు, వారి జీవన విధానము అన్నీ 5 గంటలు వారితో గడిపి ఎన్నో అనుభూతులు మనసులో నింపుకుని అక్కడి నుండి Victoria Falls, Zimbabwe కు వెళ్ళాము.