Site icon Sanchika

నమ్మిన సిద్ధాంతం

[శ్రీ ఉషారం రచించిన ‘నమ్మిన సిద్ధాంతం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]“ఏ[/dropcap]మోయ్.. త్వరగా తయారవ్వండి. మనం చాలా దూరం వెళ్ళాలి. మధ్యలో మీకు నచ్చిన చోట టిఫినీలు తినాలిగా” అంటూ చిన్నగా కేక పెడుతూ కంగారు పెడుతున్నాడు రమణ.

“ఇదిగో రెండు నిమిషాల్లో సిద్ధం. పిల్లలు ఇద్దరూ సిద్ధం అయిపోయారు. ఇంక బయలుదేరటమే తరువాయి” అంటూ భర్త హడావిడి తెలిసి మరింత కంగారుగా బదులు పలికింది భార్యామణి రేఖ.

రమణ స్థానికంగా అదే ఊరిలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగి. తన సొంత ఊరు అక్కడకు ఒక రెండు గంటలు ప్రయాణం. ఆ రోజు ఆదివారం కుటుంబ మంతా వాళ్ళ సొంత ఊరికి బయలుదేరారు.

అలా బయలుదేరిన వారి ప్రయాణం పిల్లలు మధ్యలో ఆకలి అనడంతో ఒక పల్లెటూరి పాక హోటలు దగ్గర టిఫినీలకు ఆగింది.

“నాన్న.. ఇక్కడేనా నువ్వు టిఫిన్ చేస్తూ ఉంటావు. చాలా బాగుంటుందని చెబుతావ్, అది ఇదేనా” అంటూ ఏమీ తినకుండానే లొట్టలు వేస్తూ అడిగాడు సుపుత్రుడు తరుణ్.

“అవునురా.. అందరూ ఇక్కడే కారులో ఉండండి. నేను వెళ్లి అక్కడ నుండి ప్లేట్ల్లో ఒక్కొక్కరికి తెస్తాను.”

అంటూ ఆ పక్కనే ఉన్న చిన్న వినాయకుడి గుడి దగ్గర చెట్టు నీడలో కారు ఆపాడు.

రమణ కారు దిగి ఆ చిన్న హోటల్లోకి వెళ్లి టిఫిన్ ఏమి కావాలో చెప్పి, తయారు అవ్వగానే ఒక్కొక్క ప్లేటు అందుకుని కారు దగ్గరికి తీసుకు వచ్చాడు. అందరూ టిఫినీలు మెల్లగా ఆరగించారు. ఏం మందు కలిపాడో కానీ అమోఘమైన రుచిని ఆస్వాదిస్తూ కడుపునిండా తినేశారు.

“నాన్నా.. చాలా బాగుంది నాన్నా. నువ్వు టిఫిన్ తెచ్చేలోపు అదిగో ఆ చిన్న గుడిలో వినాయకుడికి దండం పెట్టుకు వచ్చాం. నువ్వు కూడా పెట్టుకుని రా” అంది కూతురు లక్ష్మి. ‘అంతా మా అమ్మ పోలిక’ అని మనసులో అనుకుంటూ పైకి నవ్వుతూ “సరే లేవే వెళతాను” అని అన్నాడు రమణ.

మొత్తానికి ఆత్మారాముడు శాంతించిన తరువాత మరోసారి కుటుంబం మొత్తం ఆ చిన్న గుడిలోకి వెళ్లి దండం పెట్టుకున్నారు. ఆదాయం ఏ మాత్రం లేని గుడి అదని, అక్కడ పూజారిని చూడంగానే అర్థం అయ్యింది.

నెరిసిపోయిన గెడ్డం, కళ్ళు లోతుకుపోయి, ఎముకల గూడు లాంటి శరీరంతో పూజారి.. ఏదో పూజ చేయటం వచ్చు కానీ పండితుడు కాడని తెలుస్తూనే ఉంది.

రమణ తన జేబులోంచి ఒక యాభై రూపాయల నోట తీసి అక్కడ పళ్ళెంలో వేసాడు. అదే విధంగా మిగతా అందరి చేత తలో ఇరవై రూపాయలు వేయించాడు.

ఏ గుడికి ఎప్పుడు వెళ్లినా అక్కడ పూజారి పళ్ళెంలో మాత్రమే తన వేయదలుచుకున్న దక్షిణ వేస్తాడు.

అలా కాకుండా హుండీలో వేస్తే ఎవరికి ఉపయోగపడుతుందో, అసలు గుడికి ఉపయోగిస్తారా అని అపనమ్మకం.

ఇలా వేస్తే కనీసం ఆ పూజారి కుటుంబానికైనా ఉపయోగపడుతుందని ప్రగాడ విశ్వాశం.

నేటి ఆలయాల దుర్భర పరిస్థితులు చూసిన రమణకు కలిగిన సందేహం.

అలా అందరూ దక్షిణ వేసి, పూజ అనంతరం, ప్రసాదంగా ఇచ్చిన పటికబెల్లం చిన్న ముక్కలు ఇచ్చాడు అక్కడ పూజారి. అక్కడ పరిస్థితులు చూసిన రమణ భార్య రేఖ రమణ వైపు తిరిగి “చూసారా గుడి పరిస్థితి ఎలా ఉందో? పోషణ లేదు” అంటూ జాలిగా పూజారి వైపు చూసింది.

అలా ఆ కొద్దీ సమయాంలోనే పూజారి బాగా పరిచయం అయ్యాడు. తన పేరు గణపతిశర్మ అని కోనసీమలో ఒక కుగ్రామం తన ఊరని చెప్పాడు. అలా కొద్దిసేపు మాట్లాడిన తరువాత అందరూ బయలుదేరి వెళ్లిపోయారు.

***

ఇంకో వారం గడిచింది, రమణకు అనుకోకుండా మళ్లీ అటువైపు తన ఉద్యోగ రీత్యా వెళ్లే అవకాశం రావటం, టిఫిన్ కోసం అక్కడ కారు ఆపడం జరిగింది. కారు ఆపి దిగుతుండగా గుడిలో ఉన్న గణపతిశర్మ చూసి రమ్మనమని ఆహ్వానించాడు. ‘వస్తాను’ అంటూ రమణ సౌజ్ఞచేసి పక్క హోటల్లో టిఫిన్ తిని నెమ్మదిగా గుడిలోకి అడుగుపెట్టి “గణపతి శర్మగారు బాగున్నారా” అంటూ పలకరిస్తూ లోపల దేమునికి దండం పెట్టుకుంటూ ఒక ఇరవై ఒక్క రూపాయలు దక్షిణగా పళ్ళెంలో వేసాడు. గణపతి శర్మ గోత్రనామాలతో లఘు పూజ చేసి ప్రసాదం ఇచ్చాడు.

“ఏమిటి సార్.. మీ కుటుంబం రాలేదా” అంటూ గణపతి శర్మ పలకరింపుకు నవ్వుతూ

“రాలేదు శర్మగారు, నేను ఉద్యోగ రీత్యా ఇటువైపు వెడుతున్నాను. ఇంకో రెండు సార్లు ఈ వైపు వెళ్ళాలి, సరే నేను తొందరగా వెళ్ళాలి. మరి ఉంటాను” అంటూ రమణ తన కారువైపు బయలుదేరాడు.

రమణతో పాటు కొంతదూరం నడచి వచ్చిన గణపతి శర్మ “రమణ గారు.. ఇవాళ మీరు పళ్ళెంలో వేసిందే నాకు భిక్ష. ఇవాళ దానితోనే నాకు భోజనం” అంటూ కృతజ్ఞతతో దీనంగా అన్నాడు.

గణపతి శర్మ మాటలకు రమణకు ఎక్కడో గుండెల్లో కలుక్కుమంది.

“ఏమిటి?.. నేను వేసిన ఆ ఇరవై ఒక్క రూపాయలు మీకు ఈ రోజు భోజనమా? నిజంగా ఇక్కడ అంత ఆదాయం కూడా లేదా? ఎలా జీవనం సాగుతోంది? ఇంత దుర్భర పరిస్థితుల్లో ఎలా ఉన్నారు. ఏమిటి శర్మ గారు.. నిజమా.. ఏం.. ఎందువల్ల? వివరించగలరా?” అంటూ ఒకింత ఆశ్చర్యంతో అడిగాడు రమణ.

“అవును సార్.. ఈ గుడికి పెద్దగా ఆదాయం రాదు. నెలకు నాకు రెండువేల రూపాయలు ముట్ట చెబుతారు. నాకు కుటుంబ పోషణకు అది సరిపోదు. నా భార్య మరణించింది. ఉన్న ఒక్క కొడుకూ నన్ను వదిలేసి తన దారి తాను చూసుకున్నాడు. నాకు అరవై సంవత్సరాలు.. ప్రభుత్వాలు ఇచ్చే ఏ పథకానికి నేను అర్హుడను కాదట. ఇంకో ఆదాయం లేదు, ఇది తప్ప ఇంకోటి నాకు రాదు. మరో పని చేయలేను. ఎవరైనా పళ్ళెంలో వేసింది, ఆ వచ్చే రెండు వేల రూపాయలతో నెల గడపాలి.

స్వామి వారి నైవేద్యం కూడా ఏమీ పెట్టలేక పోతున్నా. ఈ స్వామికే ఆర్జన లేనప్పుడు నాకు ఎక్కడ వస్తుంది స్వామి. నిన్న పూర్తి ఉపవాసం. ఇవాళ దక్కిందే ఇదే ఈ రోజు నా భోజనం” అంటూ దీనంగా తన గోడు వెళ్లబోసుకున్నాడు.

రమణకు మనసంతా ఆర్ద్రమయిపోయింది. తిన్న టిఫిన్ చేదుగా అనిపించింది. మనసంతా వికలం అయిపోయి.. ఇంకొంచెం డబ్బులు వేద్దామని అనుకున్నా తన పర్స్‌లో అంతగా లేని కారణంగా, సమయాభావం వల్ల అక్కడ నుండి శలవు తీసుకుని, “నేను మీకు ఏదైనా సహాయం త్వరలో చేస్తాను” అంటూ బయలుదేరాడు.

కారు నడుపుతూ తన గమ్యం చేరిలోపు ఎంతో ఆలోచించాడు. ‘దేముడు నాకు ఎంత మంచి జీవితం వరంలా ఇచ్చాడు. నిజంగా ఇలాంటి జీవితం ఎంత కష్టం. ఏమైనా సాయం చేయాలి. ఏదో ఒక ప్రయత్నం చేసి ఆదుకోవాలి. ఎంతమంది ఇలాంటి వారు ఉన్నారో. తనదా మంచి ఉద్యోగమే కానీ పెద్ద అధికారం ఉన్నది కాదు. ఏమైనా భారీగా సహాయం చేద్దాం అంటే. తపన ఉంది కానీ భారీ విరాళాలు చేసే ఆర్థిక స్తోమత లేదు. అదేంటో దేముడు ఇలాంటి తపన ఉన్నవాడికి అధికారం, అంగబలం, అర్ధబలం ఎందుకు ఇవ్వలేదో? ఒకవేళ అన్నీ ఇచ్చినవాడికి ఆ బుద్ది, విచక్షణ ఎందుకు ఇవ్వలేదో? ఏమిటో ఈ మాయ’ అని అనుకుంటూ ఆలోచనల మధ్య ఆ రోజు గడిపాడు.

మరో రెండు రోజుల తరువాత అటువైపు వెళుతూ గుడి దగ్గర ఆగి దేముని దర్శన అనంతరం గణపతి శర్మ చేతిలో రెండువేల రూపాయలు పెట్టాడు.

“అయ్యా.. ఇదేంటి. ఇంత ఇస్తున్నారేమిటి. వద్దు. వద్దు” అంటున్న శర్మను వారించి “ఏదో నా తృప్తి కోసం. ఉండనివ్వండి. ఇంకా నాకు వీలు కుదిరిన సహాయం మీకు చేస్తాను. మీ వివరాలు ఇవ్వండి” అంటూ శర్మకు నమస్కారం పెట్టి అక్కడనుండి శలవు తీసుకున్నాడు రమణ.

అలా కొద్ది రోజులు పోయిన తరువాత తన స్నేహితుడు సత్యంను కలవటం జరిగింది. ఎన్నో విషయాలు, మరెన్నో కబుర్లు చెప్పుకుంటుంటే మాటలలో పూజారుల పరిస్థితులు, గణపతి శర్మ వృత్తాంతం మధ్యలో వచ్చాయి.

“ఒరేయ్.. రమణా.. బక్కగా ఉండే ఆ గెడ్డం బ్రాహ్మడే కదా.. నువ్వు మాట్లాడేది అతని గురించేనా. ఆ టిఫిన్ సెంటర్ పక్కన గుడి అతనే కదా.. అతనికి ఎంత ఇచ్చినా తాగి తగలెట్టేస్తాడురా. అతను చెప్పే విషయాలు కొన్ని నిజమే కానీ, ఎంత ఇచ్చినా సుబ్బరంగా తాగేస్తాడు. అసలు ఇలాంటి వాళ్లకు ఇవ్వకూడదు.

ఎవరైనా బాధగా కబుర్లు చెబితే కరిగిపోయి ఇచ్చేయడమేనా? కాస్త ఆలోచించు. నువ్వు చిన్నప్పటి నుండి ఇంతేరా. కల్లబొల్లి మాటలకు కరిగి అపాత్రదానం చేస్తావ్. కాస్త ఇబ్బంది అంటే ఏదో జాలి పడిపోయి ఏదో చేయాలని ప్రయత్నం చేస్తావ్. మరోసారి పప్పులో కాలేశావ్” అంటూ రమణను మందలించాడు సత్యం.

“పోరా.. నువ్వు ఎప్పుడూ ఎవ్వరినీ నమ్మవు. అందరినీ దొంగలు అనుకుంటే ఎలా, నువ్వు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో? పాపం.. ఆ గణపతి శర్మను చూస్తే ఏమీ అలా లేడురా. నిజంగానే పూట గడవని స్థితి. గుళ్లో అతని పరిస్థితి, అక్కడ ఆదాయం పరిస్థితి చూసానుగా. అందుకే నాకు తోచింది సహాయం చేసాను. ఇంకా వీలు కుదిరితే చేస్తాను. నావల్ల ఒక్క కుటుంబం బాగుపడినా నాకు అది తృప్తే” అంటూ తన ధోరణిలో చెప్పుకుపోయాడు రమణ.

“ఒరేయ్.. నేను చెప్పింది నిజం. అయినా నువ్వు నమ్మవు కదా.. రుజువులు తెచ్చి చూపిస్తాను. కొంచెం సమయం ఇవ్వు” అంటూ వీడికి రుజువు చూపించి మార్చాలి అని గొణుక్కుంటూ అక్కడ నుండి శలవు తీసుకున్నాడు సత్యం.

అలా ఒక వారం గడిచింది. ఒక ఆదివారం పొద్దున్నే సత్యం రమణ దగ్గరకు గబగబా వచ్చి తన మొబైల్ తెరిచి “ఒరేయ్.. రమణ.. నువ్వు ఈ ఫోటో చూడు. ఇతనికేనా నువ్వు డబ్బులు ఇచ్చింది” అంటూ చూపాడు.

రమణ ఆ ఫొటోలో వ్యక్తిని గణపతి శర్మగా గుర్తుపట్టి “అవునురా.. ఏమైంది” అంటూ ఆత్రంగా అడిగాడు.

“మరి అదే.. నేను చెప్పానుగా అతనే. ఇదిగో ఈ వీడియో కావాలంటే చూడు. అతను తాగేసి రోడ్డు పక్కన పడిపోయిన తీరు. అర్థం చేసుకోరా బాబూ. ఎవరైనా జాలిగా అడిగితే అంతలా కరిగిపోకు. డబ్బులు తగలెయ్యకు. ఇలాంటి మాయగాళ్ళు ఉంటారు.” అంటూ మందలిస్తూ వీడియో చూపించడానికి ప్రయత్నం చేసాడు సత్యం.

అప్పటి దాకా ఓపికగా విన్న రమణ ఒకింత విసుక్కుంటూ “ఒరేయ్ సత్యం.. నా వరకు నేను మనసుకు నచ్చింది, సహాయం చేద్దాం అనుకున్నది చేసాను. అది తప్పో, ఒప్పో దేమునికి తెలియాలి. నేను అతనిని చూసిన క్షణంలో నాకు నిజమనిపించింది. సహాయం అవసరమని, చెయ్యాలని నమ్మాను. అది తప్పుడు వ్యక్తికి చేస్తున్నానా, అసలైనా వాడికి చేస్తున్నానా అన్న విచక్షణ నాకు కలగదు. సహాయం చెయ్యాలి అన్న ఉద్దేశమే నాకు గొప్పది.

బహుశా నీవు చెప్పునట్లు అపాత్రదానం చేసాను అని అనుకుందాం, నిజంగా అలాంటి దీన స్థితిలో ఉన్నవాళ్లు లేరా.. మరి వాళ్ళను గుర్తించేది ఎలా. ఒకవేళ ఇతని కథ నిజమే అయితే నా సహాయం మంచి ఫలితాన్ని ఇచ్చేది కదా.. నేను ఎలా ప్రతీది గుర్తించగలను. గణపతి శర్మ తప్పుడు వ్యవహారం నేను చూస్తే, నిజంగా సహాయం కావలిసినవాడు వచ్చినప్పుడు నేను చేయలేకపోవచ్చు. వంద మంది మనుషుల్లో ఇలాంటి వాళ్ళు తొంభై శాతం ఉన్నారు. నేను మిగిలిన పది శాతం నిజమైన వాళ్ళ గురించి నేను ఆలోచిస్తున్నాను. అందువల్ల నువ్వు ఇప్పుడు రుజువులు తీసుకువచ్చినా నేను చూడను. నన్ను ఇలాగే ఉండనీ.

నాకు తోచిన సహాయం ఇవ్వడం వల్ల కనీసం కొద్దిమందికైనా పనికి వస్తే అదే నాకు చాలు. నాకు అదే తృప్తి. ఇంక ఈ విషయం వదిలేయి. ఎందుకంటె నాలో అనుమానం మొదలైతే అది మహావృక్షంలా మారి నా నైజాన్ని చంపేస్తుంది.” అంటూ నిక్కచ్చిగా తాను అనుకున్నది చెప్పేసాడు రమణ.

అప్పటిదాకా వాళ్ళ మాటలు వింటున్న రమణ భార్య రేఖ రమణ మాటలకు అడ్డుపడుతూ ఇహ ఉండలేక

“అదేమిటండీ సత్యం గారు చెప్పింది నిజమే కదా. మరీ అంత నిష్ఠూరంగా మాట్లాడతారు” అంటూ ఏదో అనబోయింది.

అంతలో ఆమె మాటలకు సత్యం అడ్డుపడి “అమ్మా.. రేఖ.. ఆగమ్మా.. వాడి వరకు వాడు నిజం. వాడు చెప్పిన దాంట్లో ఎంతో సమంజసం ఉంది. వాడిని అలాగే ఉండనీ. వాడు చేద్దాం అనుకున్న, చేస్తున్న పని మీద మంచి అవగాహన వాడికి ఉంది. వాడిది నిజంగా జాలి గుండె, ఏదో తప్పు జరుగుతుందనో, ఏదో ఆశించో వాడు సహాయం చెయ్యటం లేదు. తాను నమ్మిన సిద్ధాంతం, చూసిన ఘటనపై మనసుకు నచ్చింది చేసాడు. వాడి వరకు వాడు న్యాయంగా, నిశ్చలంగా ఉన్నాడు. ఇలాంటి వాళ్ళ వల్లే ఇంకా భూమ్మీద మంచి బతికే ఉంది. వాళ్లకు శక్తి ఇవ్వాలని, ఆ దేముడిని కోరుకుందాం. ఒరేయ్.. రమణా.. నువ్వు నిజంగా మానవతావాదివిరా, నువ్వు మానవుడిలో మాధవుడిని చూస్తున్నావురా.. ఇలాగే కలకాలం ఉండు. మాకు ఎప్పుడైనా ఇది మానవులు ఉండే లోకమేనా అని అనుమానం వస్తే నీ వైపు, నీలాంటి వాళ్ళ వైపు చూస్తాం.. నమ్మకం కలుగుతుంది” అంటూ రమణ భుజం తట్టి కౌగలించుకొని ఎంతో తృప్తిగా అక్కడనుండి వెళ్ళిపోయాడు.

Exit mobile version