Site icon Sanchika

నమో అంకేశ్వరా!!

[dropcap]“ఒ[/dropcap]రే, ఒంట్లు చెప్పరా”, అనగానే లంకించుకునే వాళ్ళం, చిన్నప్పుడు, కుంటి మాస్టారు బళ్ళో!

పాపం ఆయనకు, కాలు పోలియో వల్ల, ఆ పేరే స్థిరపడ్డది.

అసలు పేరేమిటో, అప్పుడు అడిగే ఆలోచనే లేదు, ధైర్యం అంతకంటే లేదు. పేరు అడగటంలో ఏముంది అంత భయంకరం అంటే, ఆ భయానికి కారణం, పేరు కాదు, హేమీ కాదు – ఆయన పెట్టే తొడ పాశపు భయం!

ఎంత మంచివాడో, అంత కోపిష్టి, ఏం చేస్తాం! ఒక్కమాట అడిగే సాహసం చేసేవారు కాదు ఎవ్వరూ!

ఏ పెద్దలూ ఏమీ చేయలేరు ఆ విషయంలో!

భయమూ, భక్తి కూడా, ఆయన సహృదయుడని, పిల్లల మేలు కోరే మేస్టారనీ!

మేం అసలే పిల్లలం మా వల్ల ఏమౌతుంది! అందుకునే చచ్చేట్టు భయపడి ఊరుకునేవాళ్ళం!

నిజానికి ఇప్పుడు తెలుసుకోవాలని ఉన్నా, అవకాశమే లేదుగా! ఆయన పోగానే ఆ బడే ఎత్తేశారట!

***

ఇంతకీ అంకెలు గురించి కదూ, ఆయన ప్రస్తావన వచ్చింది, ఆయన అచ్చు గుద్దినట్లు సిరా కలంతో రాసిచ్చేవారు, ఉన్న పది పదిహేను మంది పిల్లల పుస్తకాలలో, విషయం ఏదైనా!

అట్లాగే అంకెలూ ఇచ్చేవారు, తెలుగు, ఇంగ్లీషు, రెండూ! ఆయన అప్పుడన్న మాట నాకింకా బాగా గుర్తు!

“ఒరేయ్ పిల్లలు, అక్షరాలూ, అంకెలు మనల్ని కాపాడే మంత్రాలురా, జాగ్రత్త వీటితో! బుధ్ధిగా నేర్చుకొని, శ్రధ్ధగా మళ్ళీ మళ్ళీ వల్లించుకోండి”, అని!

విని ఊర్కునే వాళ్ళం, మంత్రాలో తంత్రాలో ఏమీ పట్టేది కాదు ఆ వయస్సులో!

***

అంకెలతో తరువాతి గండం, ఎక్కాల ఘట్టం!!

అదేదో ఏ సంగీతంలో లేని రాగంతో చెప్పేవారు, అట్లాగే అప్పగించాలి అని నిబంధన కూడా పెట్టేవారు, మేస్టారు!

రాగం రాక ఎక్కం వచ్చినా, రానట్టే ఆయన లెక్కలో!

పైగా ఇది కంఠతా వచ్చిన తరువాత, కింది నుంచి  చెప్పాలి! ఇదొక యమగండం, కొందరు పిల్లలకు!

ఒకడుండేవాడు, వాడిది మరీ వింత మెమరీ!

వాడు పది  పదుల వందా అని మొదలు పెట్టి, పది తొమ్ముదులు 20, పదెందుల ఎనభై, పది ఏళ్ళ 30 అంటూ జెట్ స్పీడ్‌లో రెండుసార్లు తిరగేసి చదివేవాడు. వాడి చదివే స్ఫీడుకి, వాడి కాన్ఫిడెన్స్‌కీ,ఇంప్రెస్ అయిపోయి కాస్త శ్రవణ లోపం ఉన్న మేస్టారు “ఊ, కూచో”, అనేవారు! యమపురి నుంచి బయట పడ్డవాడి లాగా వాడు ఒక నిట్టూర్పుతో చతికిలబడేవాడు!!

అది ఎట్లా ఓకే చేశారో కరెక్ట్‌గా తెలిసిన నాలాంటి నలుగురైదుగురికి అర్థమే అయ్యేది కాదు!

అప్పట్లో, మేష్టారికి చెప్పాలంటే తొడ పాశపు భయం!

వాడికే చెప్పాలంటే, వాళ్ళ నాన్న భయం! ఆయనొక పోలీసు!

కనుక అప్పటి మా పాలసీ -వాడేం చెప్పాడో మేం వినలేదు గాక వినలేదు!

హుష్! గప్‌చుప్?!

***

అసలు ఒంట్లు లేందే, ఈ సృష్టే లేదండీ! ఒకటి, రెండూ అని రాకపోతే, ఎన్ని అవతారాలో ఎట్లా చెప్తారు చెప్పండి!

మీనం వచ్చి, కూర్మంతో, కూర్మం వచ్చి వరాహంతో తగువు కొచ్చేవేమో, నాది ముందరి నెంబరు అంటే నాది ముందరని!

కలగాపులగం అయిపోయి, ఆ వ్యాస భగవానుడికి ఇదొక పెద్ద పని అయ్యేది, విడదీయటం!

ఇప్పటికే, వేద విభజన ఒకటి చేసి అలసి ఉన్నారు వారు, పెద్ద వారు!!

అంకెలు సృష్ట్యాది నుంచి ఉన్నాయి  కాబట్టి, అంతా సాఫీగా సాగిపోయింది.

దశావతారాలు, క్రమశిక్షణగా ఒక దాన్ని ఒకటి ఆదరించుకొంటూ, ఎవరి సీనియారిటీని వారిదిగా గుర్తించి మసలుకుంటున్నాయి!

ఓం అనే ప్రథమాక్షరాని  కెంత ప్రాముఖ్యతో, అంకెల్లో అగ్రగణ్యత్వం సంఖ్య ఒకటిదే!

అంతా ఒక్కటే!

‘సర్వం జగన్నాథం!’

తత్త్వార్థంలో- అంతా ఒక్కటేనని; తిట్టర్థంలో – అన్ని హద్దులు చెరిగిపోయి, అంతా ఒక్కటై పోయిందనీ, పై దానికి సులువుగా చెప్పాలంటే సారం అదే!!

మొదటి సంఖ్య ‘ఒకటి’ మహిమ మరి!

***

దశకంఠుడైన ఆ రావణుడికి, ధైర్యం, ధీరసా వాడి వరాల బలం వల్ల కాదు, రాక్షస సైన్యం చూసీ కాదు!

వాడికి ఉన్నది, అంకెల బలం!!

అదే అధిక శిరాల బలం! పది తలలు కదూ, అందుకు!

ఒక తల కుండే పొగరుతోటే తల కిందులవుతాం, ఇక పది తలల బిరుసు ఒరుసుకోదూ?!

ఒరుసు కోవటమేమిటి,శిరసులే ఖండింపచేసింది!

విర్ర వీగాడు, సర్రున చేయి జాపి అగ్గిని ముట్టుకోబోయాడు, బుర్ర లెగిరి ఆమడ దూరం పడ్డాయి!

పేరు లంకేశ్వరుడు, పేరులో అంత దగ్గరైన ‘అంకేశ్వరుడి’ ఘనత తెలియలేక పోయాడు!

ఇది కాదూ, త్యాగరాజస్వామి వారు, ‘సరస సామదాన..’ కీర్తనలో అన్నది ఈ గ్రంథసాంగుడి గురించి: ‘పరమ శాంభవాగ్రేసరుం డనుచు పలుకు రావణుడు తెలియలేక పోయె’ అని!!

అంకెల గర్వం బొత్తిగా పనికి రాదని లోకానికి పాఠం నేర్పాడు, అనుకోకుండా!

నేర్చిన వాళ్ళు నేర్చారు, లేని వారు మసై పోతూనే ఉన్నారు!

***

ఇంకోడున్నాడు, వీడి తమ్ముడు, వేరే యుగంలో అనుకోండి!

కౌరవుల్లో పెద్దన్న!

వీడూ బోల్తా పడ్డది, అంకెలను సరిగ్గా అర్థం చేసుకోకే!!

మొట్ట మొదటి నుంచీ వీడి గర్వం, మంది బలం చూసే!

రూలింగ్ ప్రభుత్వం మాది, యుద్ధం అంటూ వస్తే రాజులు ఎక్కువ మంది మా వైపే ఉంటారని వీడి లెక్క! అట్లాగే, అనుకున్నట్టే,11 అక్షౌహిణుల సైన్యం పోగయ్యారు కౌరవుల వైపు! ఎదిరి పాండవులకు 7 అక్షౌహిణులే!

ఎంత మంది అని చూశాడే కానీ, ఎట్లాంటి వారని పెద్దగా పట్టించుకునట్టు లేడు, ప్రభువు!

ఈ కురురాజు అంకెల ప్రేమ చూసే, సహాయం చేస్తానంటూనే కృష్ణుడు బురిడీ కొట్టించాడు. పదివేల నారాయణ సైన్యం కౌరవులకు వెళ్ళింది, నారాయణమూర్తి స్వయంగా తెలివైన అర్జునుడి పక్షం అయ్యాడు!

ఆ ఒక్క మహదంశం అటు ఉండటంతో కాదూ కౌరవులు ఓడిందీ, పాండవులు గెలిచిందీనూ, భారత మహా యుధ్ధంలో!

అంటే ఏమిటీ, పదివేల కంటే ఒకటి ఎక్కువైందన్న మాట!

సరే ఈ ఒక్కటీ (కృష్ణుడు) అన్నిటి కంటే ఎక్కువ అనుకోండి, అది వేరే విషయం!

వందా, వేయీ కంటే ఒక్కోసారి ఒకటే ఎక్కువ అవుతుంది అని గ్రహించాలన్నది పిండితార్ధం!

సంఖ్య ఎక్కువనీ, తక్కువనీ గాక అ అంకె ‘బరువు’ అర్థం చేసుకొని, ఆచితూచి అడుగు వేయమని ఈ విషయంలో విస్సన్న గారి వేదం!!

అదే సాంఖ్య సారాంశం అనుకోండి, ఒక్క ముక్కలో!!!

***

ఇంకోటి చెప్పుకోవాలి, ఈ రామాయణం, భారతం కథల గురించి, ఆదిమూలమైన విషయం!

ఈ రెండూ నడచినవి, రాజ్యాలు, రాజ్యార్హతలు, రాజ్య విభాగాలు గురించే అయినా, వాటిలో ముఖ్య పాత్ర మాత్రం సంఖ్యలదే!

అవి, 12, 13, 14!

రామాయణంలో 14 ఏళ్ళ వనవాసం, భారతంలో 12 ఏళ్ళు అరణ్యవాసం, ఒక ఏడాది అజ్ఞాతవాసం!

ఇవి ఇలాగే నిర్ణయించటానికి కారణాలు పెద్దలు అనేకం చెప్పారు, అది విషయాంతరం అని ఎంతమాత్రం అనలేము సుమా!

రాజు కాబోతున్న వాడికీ, రాజ్యార్హతే కోల్పోయేట్టు చేయగల సంఖ్య 14 ట ఆ త్రేతలో, అందుకని ఆ సంఖ్య పెట్టిందట కైకేయి!

ఇక పక్కలో బల్లెం లాగా ఉన్న పాండవులను ఏపుగా పెరిగిన అడవులకు పంపిస్తే 12 ఏళ్ళు, ఏ పులో గిలో మింగేస్తే గొడవే లేదు! అట్లా కాని పక్షంలో ఏడాది పాటు అజ్ఞాతంలో ఉండటం ఎట్లాగూ అంత తేలిక కాదు, బయటపడటం ఖాయం!

కనుక మళ్ళీ అరణ్యవాసం చేయించవచ్చు అని దూరాలోచనతో పెట్టినవట ఆ రెండూను!

అదే నిజమయితే, అరణ్యాలు కాగానే, అజ్ఞాతం, అజ్ఞాతంలో బయట పడగానే మళ్ళీ 12 ఏళ్ళు అరణ్యాలు, ఇదే ఇంక పాండవుల గతి, మార్చి- సెప్టెంబరు-మార్చి పరీక్షల రైళ్ళు ఎక్కే కుర్రాళ్ళలాగా, అన్నది ఆ మహా బుధ్ధిమంతుడు దుర్యోధనుడి దురాలోచన!

పైగా ఆ కాలాల్లో ఏదైనా వస్తువుకీ, సంపదకీ 12 ఏళ్ళు గనుక సొంతదారు దూరమైతే, శాశ్వతంగా ఆ హక్కు, అది ఎవరి చేతిలో ఉంటే వారికి బదిలీ అయిపోతుందని ఒక న్యాయశాస్త్రపు దన్ను కూడా ఉన్నట్టు ఎవరో చెప్పగా విన్నాను!

అంతటి ప్రమాదకారులన్న మాట ఈ సంఖ్యలు!

తస్మాత్ జాగ్రత!!

అట్లా అనుకున్నది అనుకున్నట్టు, కైకకు, దుర్యోధనుడికి ఇద్దరికీ సాగ లేదనుకోండి, కానీ ఆ సంఖ్యలో బలం, మర్మం అంత గొప్పవని మాత్రం అందరం గ్రహించాలి! అదీ, నా ఈ చెప్పే తాపత్రయోపఖ్యానం!

అన్నట్టు, ఈ 13 నెంబరు అంటే ఇంగ్లీషు వాళ్ళకు కూడా భయమేనట! దానికి, వాళ్ళ కారణాలు, కథలూ వేరే – అంతే తేడా!!

***

అమ్మలగన్న యమ్మ అని దుర్గమ్మను పొగుడుతూ పోతన గారన్నది కూడా సంఖ్యతోనే! ‘ముగురమ్మల మూలపుటమ్మ’ అన్నారు, ‘మూడు’ సంఖ్య మురిసి ముక్కలయేట్టు!

అనేక కోట్ల బ్రహ్మాండలకూ జనని, కానీ ఆమె మహిమ చెప్పే గొప్ప మంత్రం మాత్రం కేవలం పదిహేను అక్షరాల ‘పంచదశి’ యట!

కనుక, చిన్న సంఖ్య అంటే చులకన పనికిరాదు. సూక్ష్మం లోనే స్థూలం మొత్తం ఇమిడి లేదూ, అట్లాగే ఇది కూడా మరి!

***

ఇక శతకాలలో నూరంటే కొన్ని చోట్లే నూరు!

నూట ఎనిమిది ఐనవి ఉన్నాయి, నూట ఇరవై వరకు వెళ్ళినవీ ఉన్నాయి!

చాలా మటుకు భగవంతుని స్తుతి చేసేవే అయినా, వీటిలో నిందాస్తుతులు, ప్రత్యక్ష నిందలు, చివరకు తిట్టు శతకాలు కూడా ఉన్నాయి, ఆశ్చర్యంగా!

ప్రేరణను బట్టి కవిత్వం!

ఆనందం వచ్చినా, అవమానం ఆయినా ఈ కవిత్వ శక్తి ఉన్న వాళ్ళు తట్టుకోలేరేమో, వెంటనే అక్షర రూపం ఇచ్చేస్తారు. ఇన్ని రకాలు, ఆ శక్తికి ప్రతిరూపాలే!!

***

ఒకటి, రెండు, మూడు అని లెక్కబెట్ట గానే, పరుగు పందాలు మొదలౌతాయి! కీ ఇచ్చిన వారిలాగా పరిగెత్తడం మొదలు పెట్తారు, పాల్గొనే వాళ్ళు, యథాశక్తి!!

కానీ ఒకాయన ఉండేవాడు, వంద వరకూ లెక్కపెట్టినా తన ప్రాణం పరిగెత్తి అయినా రక్షించుకోలేక పోయాడు!

శిశుపాలుడు!

పరిగెత్తినా లాభం ఉండేది కాదు లెండి, శిశుపాలుడికి!

సుదర్శన చక్రంతో పోటీయా?!

వెంటాడి వెంటాడి, కుత్తుక లుత్తరించడంలో అది వరల్డ్ ఛాంపియన్!!

బొత్తిగా పసిబాలుడై, నిప్పు లాంటి కృష్ణుడితో చెలగాట మాడబోయాడు, చక్రాహతికి గురై, నేల కూలాడు!

పొరపాటు, నేలా కూలలేదు!ఆ కృష్ణుడిలోనే కలిసిపోయాట్ట!

ఎంతైనా, ఆశ్రిత పక్షపాతి కృష్ణుడు, అనగా ఆ విష్ణువు! తన దగ్గర ఉండే ద్వారపాలకుడు కాదూ, ఈ శిశుపాలుడు ఒకప్పుడు!

శిక్ష వేసినట్టే వేయించి, విముక్తి తానే కలిగించాడు!

‘వంద’ అనే సంఖ్యతో ముడిపడ్డ ప్రాణం, ఆ రకంగా మహా సంఖ్యా ప్రియుడే, ఈ శిశుపాలుడు కూడా!

***

ఒక విచిత్రం చూశారా, పది అంటే అలుసుగా, “పట్టుమని పదిమంది లేరు, పదేళ్ళు లేవు”, అంటారు, మళ్ళీ “పదుగురాడు మాట పాడియై చెల్లు” అంటూ పెద్ద పీట వేస్తారు!

ఇదేం న్యాయమండీ, ఒకచోట తగ్గిస్తూ, ఇంకోచోట అగ్గిస్తూ,  పదిలమైన అంకె, ‘పది’ని!

మరీ, మద్దెల దరువు వైనంగా ఉంటుందిది, అటూ ఇటూ వాయింపులతో?!

***

ఇంకా సంస్థలకూ, పుస్తకాలకు, కళాకారుల, నాటక బ్రృందాలకూ రజత, స్వర్ణ, వజ్రోత్సవాలని చేస్తూంటారు!

అవి మెరిసేట్టు కనబడాలని పెట్టే పేరులే గాని, నిజానికి వాటికి మూలమూ, కళా అంతా ‘సంఖ్య’లదే!

25, 50, 75 లకు పెట్టిన ఖరీదైన నామకరణాలవి!

అన్నట్టు, వజ్రోత్సవాలు అంటే గుర్తు రాకుండా ఉండని సంఘటన ఒకటుంది, తెలుసుగా!

అదే, తెలుగు సినిమా వజ్రోత్సవాలు!

ఇంతకీ ఆ మీమాంస ఇప్పటికీ తేలినట్టు లేదు, ఆ నటుల అభిమానులకి, ఎవరు లెజెండ్ మాత్రమే, ఎవరు సెలబ్రిటీ మాత్రమే అన్నది!

శపథాలు, ఆవేశాలు గట్లు దాటిపోయాయి, ఆ రోజు!

వజ్రోత్సవాల్లో, రత్నం లాంటి ఎపిసోడ్ అది! అంతా సజావుగా సాగిపోతోంది అనుకున్న సమయంలో, సునామీ లాగా వచ్చి ‘నిమ్మదీపం’, అమాంతం లాగేసుకుంది!

అదే, ‘లైమ్ లైట్’!

***

చివరిగా ఒకాయన గురించి చెప్పి, ముగిస్తాను.

ఒంట్లు, ఎక్కాలతోనే కుస్తీ పట్టే యోధానుయోధులున్న ఈ ప్రపంచంలో, ఆయనకు కలలో కూడా అంకెలే వచ్చేవిట!

అంకెలను ఆయన ప్రేమించేవాడట! వాటి హృదయం తెలుసట ఆయనకు!

నల చక్రవర్తికి తెలిసినది, ‘అక్ష హృదయం’ అయితే ఈయనకు తెలిసింది, ‘అంకె హృదయం’, అన్నమాట!

ఆసుపత్రిలో అనారోగ్యంతో పడుకుని ఉన్నపుడు, బయట ఉన్న కారు నెంబరు 1729 అని ఎవరో చెప్తే, ఆహా, “సంఖ్యలలో ధన్య సంఖ్య”, ఇదొక “పర్ఫెక్ట్ స్క్వేర్”, అని దాని వివిధ కోణాలు ఆవిష్కరించి, ముచ్చట పడ్డాడట!

ఎవరి పిచ్చి వారి కానందం అన్నారు, అందుకనే!

అంటే భయంకరమైన ఇష్టం అన్న మాట!

ప్రశంసే ఇది, లేకపోతే అంత పెద్ద మేధావిని అనే ఖలేజా మన కెక్కడిదీ?!

***

ఆయన పేరా?!

రాముల వారి తమ్ముడు గారి పేరు! శ్రీ రామానుజన్!!

ఈయనకు మాత్రం రాముడి కన్నా అంకెల మీదే ఇష్టం, గౌరవం ఎక్కువట!

“ఫలానా నీ పేరు మీదే పేరున్నవాడికి, నీ మీద కంటే, అంకెల మీదే ఎక్కువ ఇష్టం”ట, అని ఈ ముక్క శ్రీరాముడికి చేరవేయకుండా ఉంచే పూచీ మీదే, ముమ్మాటికీ మీదే!

నేను చెప్పలేదు గాక చెప్పలేదు!

‘రాశానంతే, కనుక చెప్పినట్టు అవదు’, అన్నది ఇక్కడ ‘లా’ పాయింట్ మరి!!

ఓం నమో అంకేశ్వరా!

పోయి వత్తునా!!

Exit mobile version