[dropcap]అ[/dropcap]మ్మ నిజమైతే నాన్న నమ్మకమంటారుగానీ
నిజానికి జీవితంపై నమ్మకం పెంచింది నాన్నే కదా!
నవమాసాలు మోసి కన్నది అమ్మయితే
చేయిపట్టి పడిపోకుండా నడక నేర్పింది నాన్నే కదా!
ప్రతి చెమటచుక్కనూ రక్తపు బొట్టునూ
అక్షరాలుగా జ్ఞానకోశంలోకి ప్రసారించింది నాన్నేకదా!
పండగలోస్తే ఇంటిల్లిపాదికీ కొత్తబట్టలొచ్చినా
పాతబట్టలేసుకున్న నాన్నను వెంటబడి అడిగితే
తల నిమిరి నవ్వేసి వెళ్ళిపోయాడు కానీ .. నిజం చెప్పలేదు!
పాత స్కూటర్ నే బతుకు బండిగా చేసుకుని
ఎన్నిసార్లు ఈడిగిలపడినా దానిని బుజ్జగిస్తున్నప్పుడు
కొత్తది కొనమన్నఅమ్మకేసి ఆర్ద్రంగా చూశాడుకానీ .. నిజం చెప్పలేదు!
చదువులతో మేము విదేశవలస పక్షులయి
జన్మ ఇచ్చిన అమ్మ కడసారి చూపుకు రాలేనప్పుడు
కర్రపట్టుకుని గుమ్మందాకా వెళ్ళి కన్నీరు దాచుకుని
ఆఖరిక్షణం దాకా అమ్మను అనునయించాడు కానీ .. నిజం చెప్పలేదు
ఇంటికి ఎప్పుడూ శక్తిస్తంభంలా నిలబడిన నాన్న
మానాదినంతా మనసులోనే దాచుకుని పెంచాడు
తాను కరిగిపోతూ మాకు ఆనందం పంచాడు
నాన్నని ఎప్పుడు ఏమడిగినా.. నిజం చెప్పలేదు.
నిజం తెలిసి కన్నీటితో ఇంటికి వస్తే…. ఇప్పుడు నాన్నే లేడు.. !!