Site icon Sanchika

యువభారతి వారి ‘నన్నయ భట్టు’ – పరిచయం

[తెలుగు సాహిత్యం పట్ల కొన్ని తరాలలో ఆసక్తి రగిలించి, ఆధునిక తరానికి వ్యక్తిత్వ వికాస పాఠాలు చెప్తూ, యువతకు ఉత్తమ సాహిత్యం ద్వారా ఉత్తమ వ్యక్తిత్వాన్నివ్వాలని నిరంతరం తపించే యువభారతి సంస్థ స్థాపించి వచ్చే దసరాకు 60 సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలుగు సాహిత్యానికి, సమాజానికి యువభారతి చేసిన సేవను తెలుగు పాఠకులకు పరిచయం చేసే ఉద్దేశంతో ప్రతి ఆదివారం సంచికలో యువభారతి ప్రచురించిన పుస్తకాల పరిచయం వుంటుంది. ఈ శీర్షిక వచ్చే విజయదశమి వరకూ సాగుతుంది.]

నన్నయ భట్టు

[dropcap]ది[/dropcap]వాకర్ల వేంకటావధాని గారి మానస పుత్రిక “ఆంధ్ర కవి నక్షత్ర మాల” లో ప్రథమ నక్షత్రం – ఈ ‘నన్నయ భట్టు’.

వెయ్యేళ్ళ తెలుగు సాహితి సృష్టి, స్థితి, వికాసాలను గూర్చి తెలుసుకోవలసిన అగత్యం అందరికీ ఉంది. పరిశీలనా దృక్పథంతో అధ్యయనం చేసే పండితులకు కావ్యాలు, విమర్శలు, పరిశోధన గ్రంథాలు అనేకం ఉన్నాయి. కాని, తెలుగుభాషతో సామాన్య పరిచయం ఉన్న వ్యక్తికీ తెలుగు సాహిత్యంలో ధృవతారలుగా నిలిచిన మహా కవుల గూర్చి స్థూలంగానైనా తెలుసుకోవడానికి, సరళమైన భాషలో, సుగామమైన విధానంలో, కొనడానికీ, చాడువుకోనదానికీ అనువుగా ఉండే చిన్న పుస్తకాలు వెలువడాలనీ, యువభారతి అందుకు పూనుకోవాలనీ, ఆచార్య దివాకర్ల వేంకటావధాని గారు ఆదేశించినారు. తామే స్వయంగా 27 చిన్న పుస్తకాలలో దాదాపు నలుబది (40) మంది ప్రాచీన, అధునాతన ఆంధ్ర మహాకవులను గూర్చి వ్రాసి ఇస్తామని యువభారతికి అభయమిచ్చారు. ఈ book series కి ఆయనే “ఆంధ్ర కవి నక్షత్ర మాల” అని నామకరణం కూడా చేసినారు.

ఆ మహాత్ముడు తన సూచన మేరకు మొదటి పుస్తకం ఈ ‘నన్నయభట్టు’ వ్రాసి ఇచ్చినారు. మిగిలిన పుస్తకాలను పూర్తి చేయాలనుకున్న సందర్భంలో విధి ప్రేరణ చేత ఆయన యజుర్వేదాన్ని తెనిగించే ప్రయత్నంలో నిమగ్నులైనారు. ఆ రచన సాగిస్తూనే, ఈ ఇరవయ్యేడు పుస్తకాల రచన కూడా చేస్తామని ఆయన అన్నారు. కానీ దైవం అనుకూలించలేదు. అక్టోబరు 20, 1986 నాడు ఆ తెలుగు వెలుగు ఆరిపోయింది. ఆ మహా భాషా తపస్వి నిర్యాణం వలన, యువభారతి తాను తలపెట్టిన ఆంధ్రకవి నక్షత్రమాల కార్యక్రమానికి స్వస్తి పలికింది.

ఈ పుస్తక ప్రచురణకు ఇది నేపథ్యం.

ఇక ఈ పుస్తక విషయానికి వస్తే – తెలుగు భాష పుట్టుక, అభివృద్ధి, నన్నయను వాగనుశాసనుడు అని ఎందుకంటాము, తెలుగు భారతంలో నన్నయ జీవిత విశేషాలు, ఆంధ్ర భారతమునందలి అవతారిక, నన్నయ వర్ణనలు, నన్నయ కవితా రీతి, రస పాత్ర పోషణము, ఆయన శైలి, అక్షర రమ్యత, భాషా ఛందో విషయములను గురించి, ఆచార్య దివాకర్ల వేంకటావధాని గారు, సవిస్తరంగా, సోదాహరణంగా వివరించారు.

నన్నయ ఆదికవి అయినా, ఉదాత్త సుందరమైన రచన చేసి, తరువాతి ఆంద్ర కవులందరికీ మార్గదర్శకుడయ్యాడు. వారందరూ ఆయనను గురువుగా భావించి, తమ తమ కావ్యారంభములందు స్తుతించారు. సంస్కృతమున లౌకిక వాఙ్మయమునకు వాల్మీకి మహర్షి ఎలాగో, ఆంద్ర వాఙ్మయమునకు నన్నయ అట్టివాడు. ఇరువురు ఆది కవులయ్యు, అనన్య లభ్యమైన కవితా మార్గమును తీర్చి దిద్దినారు. వాల్మీకి ఋషియే. నన్నయ – కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారన్నట్లు – ఋషి వంటి వాడు. రెండవ వాల్మీకి.

ఒక రకంగా, ఈ పుస్తకం నన్నయపై ఒక సాధికారిక గ్రంథం – నన్నయను గురించిన తెలుసుకోవాలని అనుకుంటున్న వారికీ, ఆయన రచనలపై Ph.D చేయాలనుకునే వారికీ, ఇది ఒక encyclopedia అంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు.

ఆదికవి నన్నయభట్టు గురించి సమగ్ర అవగాహన కోసం, ఈ క్రింద ఇవ్వబడిన link ను క్లిక్ చేసి ఈ పుస్తకాన్ని ఉచితంగానే చదువుకోండి.

https://archive.org/details/YuvaBharathi/%E0%B0%A8%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B0%AF%E0%B0%AD%E0%B0%9F%E0%B1%8D%E0%B0%9F%E0%B1%81/page/n107/mode/2up

లేదా క్రింద ఇవ్వబడిన QR code ను scan చేసినా ఈ పుస్తకాన్ని ఉచితంగా చదువుకోవచ్చు.

Exit mobile version