[box type=’note’ fontsize=’16’] శ్రీ ఏల్చూరి మురళీధరరావు రచించిన ‘నన్నయ గారి విశాలమైన వైదుష్య వాక్ప్రపంచం’ అనే వ్యాసాన్ని పాఠకులకు అందిస్తున్నాము. [/box]
ధారుణి రాజ్యసంపద మ
దంబునఁ గోమలిఁ గృష్ణఁ జూచి రం
భోరునిజోరుదేశమున
నుండఁగఁ బిల్చిన యి ద్దురాత్ము దు
ర్వారమదీయబాహుపరి
వర్తితచండగదాభిఘాత భ
గ్నోరుతరోరుఁ జేయుదు సు
యోధను నుగ్రరణాంతరంబునన్.
క్రోధావేశాలు నిండిన కన్నులలో నిప్పులను కురిపిస్తూ సభాపర్వం (2-249) లో భీమసేనుడు చేసిన ప్రతిజ్ఞ యిది. నన్నయ్య గారి లోకవిదితాలైన హృద్యపద్యాలలో ఇదొకటి.
భూమండల రాజ్యవైభవం వల్ల మదమెక్కి, సుకుమారి ద్రౌపదిని చూసి, తన అరటిబోదె వంటి తొడపై కూర్చుండమని పిలిచిన ఈ దురాత్ముణ్ణి ఘోరసంగ్రామంలో నేను ఎటువంటివారైనా వారింపలేని నా బాహుధృతమైన గదాఘాతంతో తొడను పగలగొడతాను – అని తాత్పర్యం.
ఒక మహాకవి అసంఖ్యాకములైన రచనలనేకం చేసినప్పటికీ ఆయన ప్రజ్ఞాసర్వస్వమూ విశ్వనాథ వారన్నట్లు, “సకలోహవైభవసనాథ”మై ఒక్క కావ్యంలో అంతర్భవిస్తుంది. అందులోనూ కథానుగత సన్నివేశాలను ధగద్ధగాయమానం కావించిన శిల్పకల్పనలు కొన్ని ఉంటాయి. ఆ కల్పనలను, ఆ పద్యాలను లోకం అందిపుచ్చుకొంటుంది. నన్నయ్య గారి పేరు వినగానే స్మరణోత్సవంగా మన మనోమయకోశంలో సాక్షాత్కరించే పది పదిహేను పద్యాలలో ఇదొకటి.
ఇదే రంగస్థల నాటకంలోని పద్యమైతే, దర్శకుడు శిక్షాప్రణీతంగా నటునికి నేర్పే అభినయ సూచనలుంటాయి. భీముడు ధీరోద్ధతుడు. క్రోధావతారునికి శారీరం కూడా తోడైతే చెప్పేదేమున్నది. ‘ధారుణి రాజ్యసంపద మదంబున’ అని పలుకుతున్నప్పుడు క్రోధప్రాప్తి పరాకాష్ఠను చెందిన భీముడు ఉద్వృత్తనేత్రాలతో, దీర్ఘనిఃశ్వాసాలతో, వికటభ్రుకుటీనటనంతో లయకాలదండధరుని వలె దుర్యోధనుని మదోద్ధతవర్తనపై ధిక్కృతిని చూపుతున్నప్పటి వీరావేశాన్ని నన్నయ్య గారు ఉద్ధతాక్షరసంహతితో మన కళ్ళముందు నిలిపారు. భీముడు వామోరువును పైకెత్తి, దుర్యోధనుడు రారమ్మంటూ పాండవ పట్టమహిషిని తన తొడపై కూర్చుండమన్నప్పటి దృశ్యమంతటినీ తన మహోరువుపై ఆస్ఫాలిస్తూ – క్రోధాన్ని వెలిగ్రక్కిన ఆ భంగిమకు నాట్యశాస్త్రపరిభాషలో ‘ఉద్వర్తనము’ అనిపేరు. తన ప్రక్కనున్న గదను చేతిలోనికి తీసికొని, యుద్ధచారీ నిమిత్తంగా వర్తులాకారంలో తిప్పుతున్నప్పుడు ఆయన ఆకృతి ఎంత భయానకంగా ఉండినదో ఊహించేందుకే భయానకంగా ఉంటుంది.
అటువంటి దృశ్యాన్ని మాటలలోకి అనువదిస్తున్నప్పుడు నన్నయ్య గారి ముఖరేఖ ఎలా ఉండినదో!
ఆవేశకావేశాలను ప్రక్కనుంచి, జాగ్రత్తగా ఈ సన్నివేశ చిత్రణకు కథాస్థగితమైన ప్రయోజనమేమిటి? అని ఆలోచిస్తే, తమకు దక్కవలసిన రాజ్యసంపదకోసం కౌరవ పాండవులకు మహోగ్రమైన సంగ్రామం సంభవింపనున్నదన్న వృత్తాంతానికి బీజావాపనం జరిగిన మొట్టమొదటి సన్నివేశం ఇది. అప్పటికింకా పాండవులు పూర్తిగా ఓడిపోయినట్లు కాలేదు. వైరశుద్ధి ప్రసక్తి రాలేదు. ద్యూతక్రీడ ముగిసినంతనే ధృతరాష్ట్రుడు ద్రౌపదికి వరదానం నిమిత్తంగా మళ్ళీ రాజ్యాన్ని ఇచ్చివేశాడు. అన్నదమ్ముల కొడుకులు మళ్ళీ ఆటకు కూర్చున్నారు. శకుని వంచన కారణాన ఓడిపోయారు. పందెం ప్రకారం పాండవులకు పన్నెండు సంవత్సరాల అరణ్యవాసం, ఆపై ఏడాది పాటు అజ్ఞాతవాసం విహితములైనాయి. ఆ తర్వాత సంజయుని రాయబారం, శ్రీకృష్ణుని రాయబారం విఫలమైనాక గాని యుద్ధవిషయం నిశ్చయం కాలేదు.
తొలిసారి ద్యూతంలో ఓడిపోయినప్పుడు దుశ్శాసనుడు ద్రౌపదిని జుట్టుపట్టుకొని సభలోనికి ఈడ్చుకొనిరావటం, దుశ్శాసనుడు దుర్యోధనునిచే ప్రేరేపితుడై ద్రౌపదిని విగతవస్త్రను చేయబూనటం జరిగాయి. ఆ అవమానాన్ని సహింపలేక ఉగ్రుడై భీముడు,
కురువృద్ధుల్ గురువృద్ధబాంధవు లనే
కుల్ సూచుచుండన్ మదో
ద్ధురుఁడై ద్రోవది నిట్లుసేసిన ఖలున్
దుశ్శాసనున్ లోకభీ
కరలీలన్ వధియించి తద్విపులవ
క్షశ్శైలరక్తౌఘని
ర్ఝర ముర్వీపతి సూచుచుండ నని నా
స్వాదింతు నుగ్రాకృతిన్.”
అని 2-233) శపథం చేశాడు. ఆ తర్వాత దుర్యోధనుడు ద్రౌపదిని “తన రమ్యపృథూరుతలంబు నెక్కఁగా” (2-247) సన్నచేయటం, అప్పుడు భీముడు, “రంభోరునిజోరుదేశమున నుండఁగఁ బిల్చిన యి ద్దురాత్ము దుర్వార మదీయబాహుపరివర్తిత చండగదాభిఘాత భగ్నోరుతరోరుఁ జేయుదు” (2-249) అని ప్రతిజ్ఞ చేయటం సంభవించాయి. ఆగామి కౌరవ పాండవ మహాసంగ్రామ సమయంలో భీముడు దుర్యోధనుని నాభికి అధోభాగంలో ఊరువుపై మోది హతమార్చేందుకు ఇది ప్రాతిపదికంగా అమరింది.
“ఏ తొడపై కూర్చుండమని అతిచారం చేశావో, ఆ తొడనే చీల్చి నిన్ను మట్టుపెడతాను” అనటం భావ్యర్థసూచన. అది భీముని నోటినుంచి దైవికంగా వెలువడిన మాట. దాని పరిణామం యుద్ధంలో భీముడు దుర్యోధనుని హతమార్చటం.
ఆ తర్వాత ఆరణ్య పర్వంలో మైత్రేయ మహాముని ధృతరాష్ట్రునితో మాట్లాడుతున్నప్పుడు దుర్యోధనుడు పెద్దల పట్ల అవిధేయుడై, “పాదాంగుష్ఠంబున నేల వ్రాయుచు, బాహువెత్తి తొడలు సఱచి నగుచున్న” మైత్రేయుడు కుపితుడై, “యీ యపరాధంబున నాహవం బగు; నందు భీము గదాఘాతంబున నీ యూరుయుగళంబు భగ్నం బయ్యెడు” (1-103) అని శపించిన ఘట్టం ఉన్నది.
ఈ రెండూ యుద్ధంలో దుర్యోధనుని ఊరుభంగానికి పురోవచనికలు.
ద్వంద్వయుద్ధంలో నాభికి దిగువ ప్రహరణాన్ని ప్రయోగించటం అధర్మమని బలరామునికి కోపం వస్తుంది. అప్పుడు అన్నగారికి నచ్చజెబుతూ శ్రీకృష్ణుడు చెప్పిన వివరణ తిక్కన గారి చిత్రణలో శల్య పర్వం ద్వితీయాశ్వాసం (పద్యసంఖ్య: 300) లో వచ్చింది:
ప్రతిన నెఱపుట నృపులకుఁ బరమధర్మ
మగుట మనమునఁ జర్చింపు; మనిలసుతుఁడు
గద సుయోధను తొడలు భగ్నములు సేయు
వాఁడు గా సభఁ బూనినవాఁడు గాఁడె?
అని. అదీగాక, దుర్యోధనుని ఊరువు మైత్రేయ మహాముని శాపం వలన కూడా భగ్నం కావలసి ఉన్నది కదా, ఇది దాని పరిణామమే – అని శ్రీకృష్ణుడన్నాడు.
ద్యూతమందిరంలో భీముడు ఈ దురంత ప్రతిజ్ఞను చేసినప్పుడు శ్రీకృష్ణుడు అక్కడ లేడు. అయితేనేమి! ఆ తర్వాత జరిగిన బహుళోదంతాలలో ఆ ఘటిత వృత్తాంతాన్ని తెలుసుకొన్నాడు. అందుకే అన్నగారికి అంత వివరంగా చెప్పగలిగాడు. అయినా, సర్వజ్ఞుడు – రణయజ్ఞాన్ని ఒక్కచేతిమీదుగా నిర్వహించినవాడు – ఆయనకు తెలియనిది ఉంటుందా.
సభాపర్వ రచనలో నన్నయ్య గారి నాటకీయ శిల్పకళను, దృశ్యదర్శనకౌశలాన్ని, రసోపస్కారితను, పద్యంలోని ఓజోగుణాన్ని, ఆరభటీ వృత్తిని, శబ్దశక్తి వల్ల ధ్వనిస్తున్న ఉగ్రతను మనము నేత్రపర్వంగా చూడగలుగుతున్నాము. ‘రంభోరుతరోరు’, ‘భగ్నోరుతరోరు’ అన్నప్పుడు అక్షరసామ్యం వల్ల, గణములలోని ‘తూగు’ వల్ల శబ్దాలంకారశోభ మిన్నుముట్టింది.
సభాపర్వ రచనలో నన్నయ్య గారి నాటకీయ శిల్పకళను, దృశ్యదర్శనకౌశలాన్ని, రసోపస్కారితను, పద్యంలోని ఓజోగుణాన్ని, ఆరభటీ వృత్తిని, శబ్దశక్తి వల్ల ధ్వనిస్తున్న ఉగ్రతను మనము నేత్రపర్వంగా చూడగలుగుతున్నాము.
పద్యం ఎత్తుగడలోని “ధారుణి” అన్న పదం మనను ఆకర్షింపక తప్పదు. నన్నయ్య గారు అంతకు మునుపే, ఆది పర్వం (7-129) లో “సమస్త ధా,రుణి ప్రజ” అని వాడారు. సభాపర్వంలోనూ “ధారుణీధర!” అని ప్రయోగం (1-276) ఉన్నది. సంస్కృతంలో ఈ అర్థంలో ఈ పదం ఉన్నదేమో కాని, నాకింతవరకు కవిప్రయుక్తమై ఎక్కడా కనబడలేదు. నన్నయ్య గారి యీ ప్రత్యేకాభిమానానికి కారణమేమిటో!
ధరుణము అంటే నీరు. “ధరుణ స్సమ్మతే నీరే స్వర్లోకే పరమేష్ఠిని” అని మేదినీ కోశం. ధరుణము నుంచి పుట్టినది ధారుణి – భూమి. “అద్భ్యః పృథివీ” అని.
నన్నయ్య గారి వైదుష్యం
“ధారుణి రాజ్యసంపద” ఇత్యాదిగా నిర్మితమైన పద్యాన్ని చదువుతున్నప్పుడు ముమ్మొదటగా మనను ఆశ్చర్యపరిచేది నన్నయ్య గారి విశాలమైన వైదుష్యం. ఆయన సంకల్పశిశువు రూపుదిద్దుకొన్నంతనే – ఎప్పుడు చదివినవో, ఎక్కడ చదివినవో – వందలాది కావ్యపంక్తులు ఆయన నాలుక కొసమీద నాట్యం చేస్తాయి. శబ్దసంస్కారం వల్ల ఆయన వాటిలో నుంచి తనకు నచ్చినదానిని ఎన్నుకొంటాడు. ఎంతో సందర్భ విదర్భంగా వాడుకొంటాడు.
మహాకవి భట్ట నారాయణుని ‘వేణీ సంహారము’ ప్రథమాంకంలోని సన్నివేశం. నిండుసభలో కురువృద్ధుల సమక్షంలో జరిగిన పరాభవాన్ని నెమరువేసుకొంటున్నప్పుడు భీముడు ఈ మాటను ద్రౌపదితో అంటాడు:
చంచద్భుజభ్రమిత చండగదాభిఘాత
సంచూర్ణితోరుయుగలస్య సుయోధనస్య
స్త్యానావనద్ధఘనశోణిత సిక్తపాణి
రుత్తంసయిష్యతి కచాం స్తవ దేవి! భీమః.
ఓ పాంచాలరాజతనయా! (శ్రూయతామ్ =) విను. ఈ భీముడు కదలాడుతున్న బాహువులతో, భయంకరమైన గదాభిఘాతంతో ఆ దుర్యోధనుని తొడలు చీల్చి, ఆ రక్తాన్ని చేతులలోకి తీసుకొని, నీ శిరోజాలకు అలంకరింపబోతున్నాడు – అని.
నన్నయ్య గారిపై ఈ పలుకుల ప్రభావం స్పష్టమే. “చంచద్భుజభ్రమిత చండగదాభిఘాత, సంచూర్ణితోరుయుగలస్య సుయోధనస్య” అన్న దళాన్ని యాథాతథ్యంతో “దుర్వార మదీయబాహు పరివర్తిత చండగదాభిఘాత భగ్నోరుతరోరుఁ జేయుదు సుయోధను” అని అనువర్తించుకొన్నాడు. భారతానువాదానికి మునుపు ఆయన ఎన్నెన్ని మహాగ్రంథాలను అధ్యయనించి, తనకు నచ్చిన భావాలను మనస్సులో ముద్రించుకొన్నాడో అని మనకు ఆశ్చర్యం కలుగుతుంది.
అంతే కాదు. భట్ట నారాయణునికి మునుపు మహాకవి రాజశేఖరుడు తన ‘ప్రచండ పాండవ నాటకము’లో చిత్రించిన చిత్రణ కూడా నన్నయ్య గారి మనస్సులో నిలిచే ఉన్నది.
సభలోనికి దుశ్శాసనుడు పాండవ పట్టమహిషిని జుట్టుపట్టుకొని ఈడ్చుకొని రావటమూ, ఆపై జరిగిన అవమానక్రమాన్నీ, ద్రౌపది ఆక్రోశాన్నీ చూస్తున్నప్పుడు భీమునికి ఆవేశం కట్టలు తెంచుకొని, దురంతమైన క్రోధం పెల్లుబికింది. అప్పుడన్నాడు: “రేరే దుర్యోధన! దోర్దణ్డద్వయభీమస్య భీమసేనస్య మమ శృణు ప్రతిజ్ఞామ్” అంటూ – ప్రతిజ్ఞ చేశాడు. రాజసభలో యాజ్ఞసేనిని ఉన్నట్లుండి జుట్టుపట్టుకొని ఈడ్చుకొనిరావటమే గాక వలువలూడ్చి దిగంబరను చేయాలని ఉంకించిన ఈ దుష్టదుశ్శాసనుణ్ణి కళ్ళలో నిప్పులు రేగుతుండగా మీదికురికి రంపాల వంటి యీ గోళ్ళతో రొమ్ముచీల్చి నెత్తురు తాగుతాను చూడు:
యేనేయం యాజ్ఞసేనీ నృపసదసి హఠాత్కేశపాశే గృహీతా
యశ్చాస్యాః కోటవీత్వం కలయతి భో వాససాం రాశికారః
సోఽహం తేనైవ రోషారుణనయనపుటః పాణినోత్పాటితేన
త్వాం హన్తా హన్త వక్షస్తటభువి రటతో దుష్టదుఃశాసనస్య.
అన్నాడు. దుర్యోధనునితో ఇంకా ఇలా అంటున్నాడు:
నఖక్రకచపాటనత్రుటితకీకసా ద్వక్షసః
సిరాసరణిభిర్మృధే రుధిర ముత్ఫలత్ఫేనిలమ్
త దఞ్జలిమయం రుషా హృది నివేశ్య దౌఃశాసనే
యుధిష్ఠిరసహోదరః శృణు వృకోదరః పాస్యతి.
ఈ మాటలే మదిలో నెలకొన్నందువల్ల నన్నయ్య గారు, “కురువృద్ధుల్ గురువృద్ధబాంధవు లనేకుల్ సూచుచుండన్ (“నృపసదసి”) మదోద్ధురుఁడై ద్రోవదిని (“ఇయం యాజ్ఞసేనీ హఠాత్ కేశపాశే గృహీతా”) ఇట్లు (“అస్యాః కోటవీత్వం కలయతి వాససాం రాశికారః”) సేసిన ఖలున్ దుశ్శాసనున్ లోకభీకరలీలన్ వధియించి త ద్విపులవక్షశ్శైలరక్తౌఘనిర్ఝరము (“నఖక్రకచపాటనత్రుటితకీకసాత్ వక్షసః సిరాసరణిభి ర్మృధే రుధిర ముత్ఫలత్ఫేనిలం త దఞ్జలిం అయం హృది నివేశ్య దౌఃశాసనే”) ఉర్వీపతి సూచుచుండ నని నాస్వాదింతు (“వృకోదరః పాస్యతి”) నుగ్రాకృతిన్ (“రుషా”).”
అన్న అనర్ఘమైన పద్యాన్ని అనురణింపజేశారు. రాజశేఖరుని చిత్రణలో భీముడు ఇంకా కోపం రెట్టింపవుతుండగా –
దోర్దణ్డమణ్డలితచణ్డగదాప్రహారై
రామూలతస్తడడితి త్రుటితోరుసన్ధేః
దుర్యోధనస్య వికటాం ముకుటాగ్రపీడాం
ద్రాగ్లోఠయిష్యతి రనే చరణేన భీమః.
అని కూడా అన్నాడు కాని, నన్నయ్య గారి చిత్తసంయమం మూలాన భీముడు ఆ సన్నివేశానికి ఎంతవరకు ఔచిత్యపూర్ణమో అంతవరకే ప్రసంగించి, తన ప్రతిజ్ఞను అంతంలో నిలబెట్టుకొన్నాడు.
రాజశేఖరుని రమ్యమైన కల్పనకు భట్ట నారాయణుని భవ్యమైన శబ్దశిల్పాన్ని జోడించి, “ధారుణి రాజ్యసంపద”, “కురువృద్ధుల్ గురువృద్ధబాంధవు లనేకుల్” అన్న దీప్తావేశబంధురమైన పద్యయుగళాన్ని నన్నయ్య గారు తెలుగు జాతికి స్మరణోత్సవంగా ప్రసాదించారు.
వేణీసంహార, ప్రచండపాండవ నాటకములను చదువుతున్నప్పుడు కనుపించిన మహాకవి నన్నయ్య విశాలవైదుష్యవాక్ప్రపంచంలోని విశేషాన్ని కనుగొన్న ఆనందంలో ఆ సృష్టిసౌందర్యాన్ని మీకు కూడా నివేదించాను.