Site icon Sanchika

నన్ను చంపెయ్యండి

[box type=’note’ fontsize=’16’] వర్తమాన సమాజం పతనమతువున్న తీరుకి దిగులుతో, మమతను సమతను మరచిపోయిన మానవ జన్మే వద్దనుకున్న ఓ  అంతరంగాన్ని ఆవిష్కరిస్తున్నారు భువనచంద్రనన్ను చంపెయ్యండి” కవితలో. ఇంతకీ ఆ అంతరంగం ఎవరిదో???? [/box]

[dropcap]చూ[/dropcap]స్తున్నాను చూస్తున్నాను మనోదృష్టితో చూస్తున్నాను
మానవనైజం చూస్తున్నా మహిషాసురధర్మం చూస్తున్నా…    II చూ II

ఆకలిచావులు చూస్తున్నా… ఆత్మహత్యల్ని చూస్తున్నా
రౌడీరాజ్యం చూస్తున్నా… గూండా దౌర్జన్యం చూస్తున్నా
పత్రికల్నీ చూస్తున్నా… ‘విష పుత్రికల్నీ’ చూస్తున్నా
పేదల బతుకుని చూస్తున్నా… బలహీనుల వేదన చూస్తున్నా                                   II చూ II

చెమటలు ఓడ్చే రైతు కళ్ళలో కారే రక్తం చూస్తున్నా
వైద్యం పేరిట రోగుల్ని దోచే ఘన వైద్యులనీ చూస్తున్నా
బుల్ బేర్ అంటూ మాయలు చేసే స్టాక్ ఎక్సేంజిని చూస్తున్నా
న్యాయదేవతకి గంతలు కట్టే నల్ల డబ్బునీ చూస్తున్నా                                          II చూ II

కన్న కూతుర్ని కులటగా మార్చే తల్లిదండ్రుల్ని చూస్తున్నా
జల్సా కోసం శీలాన్నొదిలే కాలేజ్ గాళ్స్‌ని చూస్తున్నా
ప్రేమ పేరుతో చెత్తని గుప్పే కవిపుంగవులని చూస్తున్నా
కాల్‌సెంటర్స్‌లో యువతీయువకుల బానిస బతుకుని చూస్తున్నా                                II చూ II

మసాజ్ సెంటర్ తలుపుల వెనుక వ్యభిచారాన్ని చూస్తున్నా
కాసుల కోసం విద్యను అమ్మే విద్యాలయాల్ని చూస్తున్నా
విద్యను వదిలీ రేగింగ్ చేసే వింత పశువుల్ని చూస్తున్నా
విద్యార్థినులను బలాత్కరించే దైత్యగురువుల్ని చూస్తున్నా                                       II చూ II

కాకులగొట్టీ గద్దలకేసే మంత్రివర్యుల్ని చూస్తున్నా
జీతం మెక్కీ పనులే చేయని అధికారుల్నీ చూస్తున్నా
‘పబ్బం’ కోసం ‘ఫేన్స్’ని దువ్వే నటభైరవుల్నీ చూస్తున్నా
అబ్బని చూసుకు జబ్బులు చరిచే దుష్ట పుత్రుల్ని చూస్తున్నా                                   II చూ II

కట్నం కోసం అబలని చంపే అత్తమామల్ని చూస్తున్నా
పచ్చని సంసారాలని చీల్చే పతివ్రతల్నీ చూస్తున్నా
పదవుల కోసం పెళ్ళాన్నంపే పరమనీచుల్ని చూస్తున్నా
తిమ్మిని బమ్మిని చేసి వర్ధిల్లు ప్రజానాయకుల జూస్తున్నా                                       II చూ II

అడవులనే అడ్దాలుగా మార్చిన దోపిడిగాళ్ళను చూస్తున్నా
అమాయకుల్నే ఎరగా చేసే ఎన్‌కౌంటర్లని చూస్తున్నా
ప్రజారక్షణను మాటే మరచిన పోలీసుల్నీ చూస్తున్నా
సభ్యసమాజం తల వొంచుకునే లాకప్ డెత్స్‌ని చూస్తున్నా                                       II చూ II

మతం పేరుతో నిత్యం జరిగే మారణ హోమం చూస్తున్నా
కులం పేరుతో కుత్తుక నులిమే నరాధముల్నీ చూస్తున్నా
ఓట్ బేంక్ పేరుతో సమతను చీల్చే అపర ‘క్లైవ్’లను చూస్తున్నా
రిజర్వేషన్ల చిచ్చును రేపిన స్వార్థపరుల్నీ చూస్తున్నా                                          II చూ II

పట్టాలున్నా పనులే లేని మేధావుల్నీ చూస్తున్నా
అడ్డదారిలో అందలమెక్కిన అసమర్థుల్నీ చూస్తున్నా
మహమ్మారిలా చెలరేగుతున్న బెల్టు షాపుల్ని చూస్తున్నా
మత్తుతోటి నిర్వీర్యమౌతున్న భావి పౌరుల్ని చూస్తున్నా                                       II చూ II

మనిషి బుద్ధినే మృగ్యం చేసే మూఢాచారాల్ని చూస్తున్నా
మనుషుల కోసం తెగిపడుతున్న మహా వృక్షాలను చూస్తున్నా
పచ్చని నీడే కరవౌతున్న పక్షి గణాలని చూస్తున్నా
ల్యాబుల్లో నిర్జీవమౌతున్న జంతుజాలాన్ని చూస్తున్నా                                         II చూ II

పంట పొలాలను బీళ్ళుగా మార్చే రియల్టర్లనీ చూస్తున్నా
గనుల పేరుతో భూమిని తవ్వే సగర పుత్రుల్ని చూస్తున్నా
బంధుప్రేమతో బాధ్యత మరచిన ధృతరాష్ట్రుల్నీ చూస్తున్నా
పరాయి దేశపు స్వరాలు పలికే సైద్ధాంతికులను చూస్తున్నా                                      II చూ II

జన్మనిచ్చిన అమ్మను మరిచే కలి పుత్రుల్నీ చూస్తున్నా
వృద్ధాశ్రమాల్లో ఒంటిగ నిలిచిన వెర్రి తండ్రుల్ని చూస్తున్నా
భస్మాసురుల్ని తయారుచేసే బడాబాబుల్ని చూస్తున్నా
అన్నీ చూస్తూ కిమ్మనకుండే అధినాయకుల్ని చూస్తున్నా                                      II చూ II

కాలుష్యంతో నిండిపోతున్న నదీనదాలని చూస్తున్నా
క్షణక్షణానికి కరిగిపోతున్న మంచుకొండల్ని చూస్తున్నా
కొసప్రాణంతో పరితపిస్తున్న ప్రకృతి మాతను చూస్తున్నా
యుగయుగాల సంస్కృతినే మరచిన భరతజాతినే చూస్తున్నా                                   II చూ II

ఇన్నీ చూస్తూ ఇన్నీ వింటూ పేగు చీల్చుకుని ఎలా పుట్టనూ?
స్వర్గాన్నైనా నరకం చేసే మనుషుల మధ్య ఎలా ఉండనూ?

క్షణక్షణానికి ఛస్తు బ్రతుకుతు మీ లోకంలో బ్రతికే కన్నా
అమ్మ కడుపులో మరణించడమే ఎంతో ఎంతో మేలనుకుంటున్నా.                          II క్షణ II

మమతను సమతను మరచిపోయిన మానవ జన్మే వద్దంటున్నా
నమ్మిన వారి గొంతును కోసే రాక్షసుడ్ని నే కాలేనన్నా

తల్లి కడుపులో చల్లగ చచ్చే వరాన్ని నాకు ఇమ్మంటున్నా
మరో వంద వెయ్యేళ్ళకి అయినా మీకు ఋణపడి ఉంటానన్నా.                                II తల్లి II

Exit mobile version