నన్ను మాట్లాడనివ్వండి

0
2

[అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా శ్రీ మల్లాప్రగడ రామారావు రచించిన ‘నన్ను మాట్లాడనివ్వండి’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

1
ఎనిమిది గంటల పనిదినం ఎలాంటిదో ఎరగను నేను/
ఉదయం పదవుతూనే బట్టల కొట్టులో కొలువు తీరుతాను/
మీరు రాగానే చిరునవ్వుల తివాచీ పరుస్తాను/
ఆప్యాయపుటత్తరు చల్లుతాను/
మీరు ఏది ఎంచుకోవాలన్నా దిక్సూచినవుతాను/
ఉదయం మధ్యాహ్నమౌతుంది…
సాయంకాలమౌతుంది.. రాత్రవుతుంది..
మధ్యలో రెండుసార్లు షావుకారు ఉదారంగా పంచే తేనీరు/
ఇంటినుంచి వస్తున్నప్పుడే తెచ్చుకున్న చల్లారిన మెతుకులు/
అమృతంలా ఆస్వాదిస్తాను/
ఇంకా పదవని గడియారం ముళ్లు గుచ్చుకుంటాయి/
అప్పుడు వేంచేసే కొనుగోలు మహారాజుల/రాణుల కోసం/
ప్లాస్టిక్ పూల నవ్వులు పూయిస్తాను/
వారు కుళ్ళు హాస్యోక్తులు వెలగబెట్టినా/
వరప్రసాదంలా మూట కట్టుకున్నాను/
ఇంటి ‘చింత’ల మంటల్ని ఒడికట్టుకునే/
అర్ధరాత్రికి రెండే గంటలు బాకీ ఉన్నంతవరకూ
బండి లాగిస్తాను.
2
కనీస వేతనం ఒకటుందని ఎవరు చెప్తారు నాకు?/
ఇచ్చే గొర్రెతోక జీతంతోనే ఏకరూప దుస్తులు సమకూర్చుకోవాలి/
కాళ్ళకి కవచాలు బిగించాలి/
నడుముకు పటకాలు ధరించాలి/
నివాస సముదాయాలు మొదలుకొని,
బహుళజాతి సంస్థల వరకూ/
పెద్ద పెద్ద దుకాణాల నుంచి, బ్యాంకులూ, ఏటిఎంల వరకూ/
అంతటా కాపలా కుక్కలం మేమే!/
బడాబాబులు కనబడితే నిటారుగా నుంచోవాలి/
దొరగార్ల వాహనాల తలుపుల తాళాలం కావాలి/
పనిగంటలు పది వరకు సాగినా, మించినా/
‘మహాభాగ్యం’ అనుకోవాలి/
ఎంత ముట్టినట్టు సంతకం చేసినా,
చేతికొచ్చేది ఆరువేలు దాటితే గగనమే.
3
‘అందరికీ సామాజిక భద్రత దిశగా అడుగులు’ అంటూ/
వార్తాపత్రికలూ, దృశ్య, శ్రవణ సాధనాలూ ఘోషిస్తుంటే/
అప్రయత్నంగానే
నా నోరు తెరుచుకుంటుంది/
మా సంస్థల లాంటి సంస్థలలో/
ఆ చట్టాలిప్పటికే అమలులో ఉన్నట్టు స్పష్టపరిస్తే/
తెరిచిన నోరు మూతపడటం మరచిపోతుంది/
యజమానినేమైనా అడగడానికి భయం లేదు నాకు/
ఎందుకంటే, మా జోడే మా పెద్ద కూలీను/
మోకాళ్ళమీద కూలబడి, /
మీ పాదాలకు రక్షలు తొడుగుతాను/
నాకొచ్చే నెల బిచ్చం ఆరువేలైతే/
బిల్లు రాసేవాడి చేతిలో పడే మాదాకబళం ఎనిమిదివేలు/
ఈ తోలుబొమ్మలాడించే విధాత ఎవరో ఎరగం మేం/
దేశ దేశాలలో ఊడలు దింపిన మర్రిచెట్టు మా సంస్థ/
ఒక్కో పట్టణంలో ఎన్నో శాఖలుండటం మా ఘనత/
మాది నియామక పత్రం ఎండమావియైన ఉద్యోగం/
ఏ దస్త్రాలలోనైనా చిత్ర‘గుప్తులు’
మా పేర్లు వ్రాస్తారేమో తెలియని అజ్ఞానం/
కార్మిక లోకాన్ని ‘కాచే’ అధికార గాంధారుల కలికానికీ కానరాం మేం/
కార్మిక నాయక గణాలకూ ఆనం మేం.
4
ఇక చాలు/
స్వకుచమర్దనాలు.. స్వాలింగనాలు/
ఈ ‘మే డే’లు, విజయోత్సవాలూ ఆపండి/
అధిక శాతం కార్మిక లోకం దగాపడటం మానలేదని చాటండి/
కబేళాకు తోలుకుపోతున్న మేకల్లా/ మేం ‘మే’ ‘మే’ అంటుంటే/
అవి, ‘మే డే’ ధ్వానాలని భ్రమించడం మానండి/

తలో రంగు జెండా చేత పట్టుకుని/
ఒకరిపై మరొకరు బురదలు జల్లుకుంటూ/
ఎన్నాళ్ళు ‘లాంగ్‌మార్చ్’ చేసినా/ ఉన్నచోటే ఉంటారు./

ఏకత్రాటి మీదకు రండి/
పోయేవి పదవులు, ప్రాభవాలు మాత్రమేనని ఎరగండి/
ప్రస్తుతానికి ‘ఉట్టి’ ఎక్కుదాం పదండి/
ఉన్న కార్మిక చట్టాలనే సమర్థవంతంగా అమలుచెయ్యాలనే/
ఒకే ఒక ఎజెండాతో మరో ప్రస్థానం మొదలెట్టండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here