నరాలయం

0
2

[box type=’note’ fontsize=’16’] ఉగాది 2022 సందర్భంగా సంచిక నిర్వహించిన కథల పోటీలలో బహుమతి పొందిన కథ. [/box]

[dropcap]అ[/dropcap]ది దేవలోకం. అక్కడి జనాభా ముఫ్ఫై మూడు కోట్లు. యుగయుగాలుగా వారు అష్టైశ్వర్యాలు అనుభవిస్తూ కష్టం అంటే ఏమిటో తెలియకుండా జీవిస్తున్నారు. భూగోళం అన్ని వైపుల నుంచీ వారు ఏదో రూపంలో పూజలందుకుంటూ ఉంటారు. పూజలతో బాటుగా వారు భూరి బహుమతులు కూడా అందుకుంటూ ఉంటారు.. అవి వస్తు రూపేణా కాని, ధనరూపేణా కానీ ఉండవచ్చు. ఆ విధంగా వారిలో కొందరు వేలు, పదివేలు కోట్లకి కూడా పడగలెత్తారు. భక్తులు అడిగిన వాటిని ఇచ్చినట్టే ఇచ్చి, వాటిలో సింహ భాగం మొక్కుల రూపంలో వసూలు చేస్తూ ఉంటారు. అందరూ అంత గొప్ప వాళ్ళు కాకపోయినా కొందరు చెప్పుకోదగ్గ ధనవంతులూ ఉన్నారు.అంటే అప్పర్ మిడిల్ క్లాస్ అన్నమాట. అటువంటి దేవుళ్ళకి గుళ్ళు చిన్నవి, రాబడి, రాపిడి కూడా తక్కువే. కాని మరీ అంత దిగజారిన పరిస్థితి లేదు. ఇంకోరకం, ఎవరూ పట్టించుకోక పోయినా గుళ్ళో దేముడిలా కూచున్న దేముళ్ళు ఉన్నారు. పై గొప్ప గొప్ప భాగ్యవంతులైన దేవుళ్ళు భక్తుల ఒత్తిడికి తట్టుకోలేక, పెద్ద పెద్ద కొండలు ఎక్కి కూచున్నారు. చాలా మంది ఓపిక లేక ఒకటీ అరా కొండలతో సరిపెట్టుకున్నారు. అయినా భక్తులు ఊరుకుంటారా ఏమిటి? ఎంత పెద్ద కొండ అయితే అంత పెద్ద దేముడని అందరూ అక్కడికే పొలోమని పోతున్నారు. అందుకే ఈ చిన్నా చితకా దేవుళ్ళు భక్తులకి బాదలేకుండా, ఊళ్ళ లోనే బస చేశారు. అయినా రాబడి మాత్రం అంతంత మాత్రమే! ఇక మిగిలింది బి.పి.ఎల్. దేవుళ్ళు. వీరు పాపం, ఊరి పొలిమేరల్లోను, చెట్లకిందా వెలిసి, భక్తుల్ని ఆకర్షించాలని చూస్తున్నారు. ఏ కొంత మందో అమాయకులు, పసుపూ, కుంకుమా రాసినా వీరికి దక్కేవి, బడిపంతులుకి దసరా మామూలులా, పప్పు బెల్లాలే. పాపం కొందరైతే పూజా పునస్కారాలు లేక బూజు పట్టినవారూ ఉన్నారు. ఈ విధంగా పెక్కు భంగులు దైవ మహిమల్!

ఈ సోది అంతా ఎందుకంటే, మనుషుల్లోనే కాక దేవుళ్ళలోను వర్గ భేదాలు ఉంటాయని తెలియ జెప్పడానికి. ఒక్కటే తేడా. మనుషుల్లో వర్గ భేదాలు పోరాటాలు, కత్తులు, కటార్లకి దారి తీస్తాయి. మనకి తెలిసి దేముళ్ళు మాత్రం సజావుగానే సహజీవనం చేస్తున్నారు.

ఇంకో మతలబు కూడా ఉంది. ఒకనాడు ఈ జనాభా ముఫ్ఫై మూడు కోట్లు బ్రహ్మగారి మీదికి ఉప్పెనలా దూసుకెళ్లారు. వీరూ వెళ్లేసరికి ఆయన బొమ్మల్ని చెక్కుతున్నాడు. ఇంతమంది కట్టకట్టుకు రావడం చూసి గతుక్కుమన్నాడు. చేతిలో పని పక్కన పెట్టి, “ఏమైంది?” అని అడిగాడు.

వేల గొంతుకలు ఒక్కసారిగా పగిలాయి. దేవలోకం దద్దరిల్లిపోయింది. ఎవరేం చెప్పుతున్నారో అర్థం కావడం లేదు. వారంతా ఎదో పెద్ద ఆపదలో ఉన్నారని మాత్రం తెలిసింది.

“అలా కాదు. మీ అందరి తరఫున మాట్లాడడానికి ఓ పదిమందిని ఎన్నుకుని, నా దగ్గరికి పంపండి. సావధానంగా విని సమస్యని పరిష్కరిద్దాం” అన్నాడు. అప్పటికప్పుడే అందరూ కూడ బలుక్కుని, అన్ని వర్గాలవారు రిప్రజెంటు అయ్యేలా పేర్లు నమోదు చేసుకుంటే. లిస్టు పాతిక పైగానే వచ్చింది.

వారంతా వెళ్లి బ్రహ్మగారి సదనంలో ఉన్నతాసనాలు అలంకరించారు. ఒక్కొక్కరూ వారి బాధలు వివరించ సాగారు. ఒకరు లేచి,

“అసలేం జరుగుతోంది ఈ లోకంలో? ఒక క్రమమైన పరిపాలన అంటూ ఉందా? లేదా? ఇంతటి అరాచక పరిస్థితుల్లో మా ఉనికికే ప్రమాదం తెచ్చే సమయం ఆసన్నమైంది.”

ఈయన ఎంత సేపు ఇలా ఉపోద్ఘాతం ఇస్తాడో అని బుర్రగోక్కుని, బ్రహ్మగారు, “అసలు విషయంలోకి రండి.” అన్నాడు.. అప్పుడొక కొండ (ఒక కొండ అంటే ఓ మాదిరి దేముడన్నమాట) మీద వెలిసిన దేవుడు లేచి నిలబడి, “ నా బాధ ఏం చెప్పమంటారు దేవా! శతాబ్దాలుగా మహారాజులు, చక్రవర్తుల నన్ను కొలిచి, నా సైజుకి సరిపడా పచ్చల హారాలు, మణి హారాలు కర్ణాభరణాలు భక్తితో నాకు సమర్పించారు. వాటిని ధరించి నేను దివ్య తేజస్సుతో వెలిగి పోయే వాడిని. రాజుల కాలం పోయింది. ఆంగ్లేయులు వచ్చారు. వారి దేవుళ్ళని వారు తెచ్చుకున్నారు కాని చాలా వరకు మా జోలికి రాలేదు. ఆ తరవాత స్వతంత్రం వచ్చేసింది. కాని, మా స్వతంత్రం పోయింది. ఏ గుడిలోను, మా ఇష్టప్రకారం ఏదీ జరగదు. పాప భీతి పోయింది. చదువు సంధ్యలు నేర్చిన మానవుడి మానస ప్రవ్రుత్తి తామసమయింది. ఇదంతా ఎందుకు చెప్పుతున్నానంటే, ఎవరిష్టం ప్రకారం వారు ప్రవర్తించ వచ్చును కనుక, నా గర్భగుడిలో దూరి, శతాబ్దాల నాటి నా ఆభరణాలన్నీ దోచుకుపోయారు. ఇదుగో చూడండి నా బోసి మెడ. ఈ అవతారంలో నేను ప్రజల ముందు ప్రత్యక్షం కావడానికే సిగ్గుపడుతున్నాను. భక్తులు గోల పెడితే, “ఇదుగో చూడండి. యిట్టె పట్టేస్తాం దొంగల్ని” అన్నారు. దశాబ్దాలు దాటిపోయాయి. ఆచూకీ లేదు. ఆశ కూడా లేదు.” అని, ఇక ఆయాసం వచ్చి మాట్లాడలేక కూర్చున్నాడు. ఇంతలో ఒక దేవి మాత లేచి నిలబడింది. “దేవా! పురుష దేవుళ్ళకెలాగూ దిక్కు లేదు. స్త్రీని అని కుడా ఆలోచించకుండా మాలాంటి వాళ్ళ కంఠాభరణాలు, చెవులవి, ముక్కులవి కూడా దోపిడీకి గురి అవుతున్నాయి. మొన్నటికి మొన్న నేను ఎన్నో సంవత్సరాలుగా సవారి చేస్తున్న రథాన్ని లాగే సింహాల్ని ఎత్తుకుపోయారు. నా కాళ్ళు విరిగి నట్టయింది. చిత్రం ఏమిటంటే, వారంతా నా భక్తులే! భక్తి దారి భక్తిదే! దోపిడీ దోపిడీయే. ‘ఇంకేముంది దొంగలు దొరికారు. అంటారు.’ వస్తువులు మాత్రం కంట పడవు. ఇంటి దొంగని నీ లాంటి వాడు కూడా పట్టలేడని తెలియదా దేవా!” అని కన్నెర్ర జేసింది.

“శాంతించు,.మాతా! శాంతించు!” అని బ్రతిమిలాడాడు బ్రహ్మ.

మరొకాయన వంతు వచ్చింది. “స్వామీ! కొండెక్కి కూచున్న దేవుళ్ళ అవస్థలే ఇలా ఉంటే, మా లాంటి మామూలు దేవుళ్ళకి, దేవాలయాలకి రక్షణ ఏముంటుంది? ఏదో ఒక రోజు, ఒక దొంగ అయితే, సరే, పోతే పోయిందిలే! అని ఉపేక్షించవచ్చు. ‘దినదిన గండం, వెయ్యేళ్ళు ఆయుష్షు’ అన్నట్టుగా ‘దొరికినంత దోచుకో’ అనే ప్రాతిపదిక మీద దండెత్తే వాళ్ళంటే, మేం భయపడి చస్తున్నాం. ఒకప్పుడు సృష్టిలో దొంగల్ని ఏరేసే వారు. ఇప్పుడది సాధ్యంకాదు. ఓపిక పడితే దొరలని ఏరేయడం సులభం.”

ఈయనా పూర్తి చేశాడో లేదో, అక్కడొక తలలేని మొండెం లాంటిది దర్శన మిచ్చింది. ఇదేమి రూపం? అని విస్తుపోయాడు బ్రహ్మ. కాని, భుజం మీద గద, వెనక తోక ఆయన్ని పట్టి ఇచ్చాయి. “చిరంజీవా! అసమాన బల వంతుడవు నువ్వేనా? ఏం జరిగింది? ” అడిగారు బ్రహ్మగారు.

“చూస్తూనే ఉన్నారుగా స్వామీ! వేరే చెప్పేదేముంది? ఎవరో ధూర్తులు చీకటిలో నన్నిలా ధ్వంసం చేసి, పారిపోయారు. నేను వాళ్లకి ఏం అన్యాయం చేశానని? నా భక్తులు, నేను, మాదారిన మేము బతుకుతున్నాం. చూసి సహించలేకపోయారు. అనుచరులు కొందరు గోల పెడితే, ‘ఆఁ ! బొమ్మే కదా! పోతే పోయింది’ అన్నారు. ఆ మాత్రం దానికి ప్రాణ ప్రతిష్ఠలు, బాగోతం అంటూ ఆర్భాటాలు దేనికి? నాకీ చిరంజీవత్వం వద్దు స్వామీ! ఉపసంహరించుకోండి” కోపంగా అన్నాడాయన.

ఆయనా ఇలా కూచున్నాడో లేదో, పక్కనుంచి కోదండం పట్టుకుని మరొకాయన లేచాడు. “దేవా వీరు వల్లించిన వన్నీ దోపిడిలు దొంగతనాలు. కాని కంచే చేను మేస్తే కాపాడేది ఎవరు? పురాతన కాలంలో ఎవరో భక్తులు సమర్పించిన నా వెండి అభిషేక పాత్రలు ఏకంగా అర్చకుడే తాకట్టు పెట్టేశాడు. నేనెవరితో చెప్పుకోను?” అని ముగించాడు.

ఇంతమంది ఇన్ని విధాలుగా చెబుతూ ఉంటే మనం మౌనంగా ఉండడం భావ్యం కాదని అందరికన్నా ఎక్కువ కొండలున్న స్వామి లేచి నిలబడ్డాడు. సభ అంతా నిశ్శబ్దం చోటు చేసుకుంది. బ్రహ్మ గారు నివ్వెర పోయాడు. భక్తజన పరిపాలకుడికే కష్టాలా? ఇదేం విడ్డూరం! అని అంతా ముక్కు మీద వేలేసుకున్నారు.

దేముడు ఉపన్యాసం ఆరంభించాడు. “స్వామీ! నా విషయం ప్రపంచ ప్రసిద్ధం. ప్రత్యేకంగా పరిచయం అక్కరలేదు. నేను బ్రహ్మాండ నాయకుడనని బ్రహ్మ రథం పట్టారు. అబ్బో! చాలా కాలమే నడిచింది ఈ కోలాహలం. పెద్ద, చిన్నా, పేదలూ, ధనికులూ బేధాలు లేకుండా కొలిచిన వారినందరినీ ఆదుకున్నాను. ఆపద మొక్కులవాడినని పేరు పొందాను. కృతజ్ఞతా భావంతో కానుకల సమర్పణ మొదలయ్యింది. ఒకటి, రెండు, వేలు లక్షలు కోట్లలో ఆదాయం పెరగ జొచ్చింది. అప్పటికింకా మరీ ఇంతగా స్వతంత్రం వచ్చేయ లేదు ప్రజల్లో. కొందరు బుద్ధిమంతులు, ఈ ఆదాయాన్ని, సత్కార్యాలకి, విద్యా, వైద్యాలకి, సదుపాయాలకి ఉపయోగించసాగారు. వాటిని అన్నింటినీ ఇక్కడ ఏకరువు పెట్టడం సబబు కాదు. సందర్భమూ కాదు. మీ నిర్ణయం కోసం కోట్లాది దేవతలు ఎదురు చూస్తున్నారు. కాని, కలియుగంలో ఇది ఏ పాదమో కాని, మనిషికి సర్వ తంత్ర స్వతంత్రం వచ్చేసింది. దానితో తనకి ఎదురేదీ లేదని గర్వించాడు. దేవతలా? వాళ్ళేవరు? అంటున్నాడు.

ఆ మద్యనో బడుద్ధాయి, ఏడుకొండలు ఎందుకు నీకు? ఒకటి నాకిచ్చేయ్! అన్నాడట. ఇప్పుడు నీకంత డబ్బెందుకు? అని ప్రశ్నిస్తున్నారు. చదువుల మీదా, వైద్యం మీదా తగలేస్తున్నారు. మాకిచ్చేయ్. మేమేదో చేసుకుంటాం అంటున్నారు. కోట్ల భక్తులకి శఠగోపం పెట్టిన నాకే నరుడు శఠగోపం పెడుతున్నాడు స్వామీ!. ఆ కొండల మీదనుంచి నేనెప్పుడు దూకేస్తానో నాకే తెలియదు.” అని కూర్చున్నాడు.

ముక్కోటి దేవతల కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ‘ఎంత చెట్టుకంత గాలి ‘ అన్నట్టు, ఎంత గొప్ప దేముడైతే అన్ని ఎక్కువ కష్టాలు. అని నిట్టూర్చారు.

మరొక ఇద్దరు కూడా వచ్చిన వారిలో ఉన్నారు. అయితే వారి రంగు రూపులు, వేష భాషలు వేరేగా ఉన్నాయి. “మీ సంగతి ఏమిటి?” అని అడిగితే, తడబడుతూ “మేం చెప్పవలసింది ఏమీ లేదు.” అన్నారు. నిజానికి వారూ బాధలు చెప్పుకుందామనే వచ్చారు. కాని ఈ దేవతల కష్టాలు విన్నాక వారి పని చాలా మెరుగు అనిపించింది. కనుక మాటాడక ఊరుకోవడమే మంచిదని నిశ్చయించుకున్నారు.

ఇదంతా విన్నాక బ్రహ్మ గారు విభ్రమం చెందారు. పరిస్థితి ఇంత అధ్వాన్నంగా ఉందా? ఇలా ఎందుకు జరిగింది? ధర్మానికి హాని కలిగి నప్పుడల్లా యోగేశ్వరేశ్వరుడిని పంపి ఉద్దరిస్తున్నామే! ఇప్పటికే తొమ్మిది అవతారాలు అయ్యాయి. ఇక పదోది, కల్కి మిగిలింది. ఈ లోగా భూలోకంలో ఇలా ఎందుకు జరుగుతోంది?

ఆయన బాగా ఆలోచించాడు. ఇంతమంది చెప్పిన దాని సారాంశం ఒక్కటే. లోకంలో రాక్షస తత్త్వం బాగా పెరిగింది. ధర్మానికి గ్లాని కలిగనప్పుడల్లా త్రిమూర్తుల దృష్టి రాక్షసుల మీదికి మళ్ళుతుంది. వెంటనే బ్రహ్మ గారు అంజనం వేసి, దుర్భిణిలో పరికించారు. వర్తమానం, భవిష్యత్తు, సంగతి అటుంచి భూతకాలానికి పోయే టైం మెషీన్ ఎక్కారు. ఒక దగ్గర కోలాహలంగా ఉంటే అక్కడ ఆగారు.

ఆ సమయంలో…. …. ….

రాక్షస లోకంలో పెద్ద మీటింగు జరుగుతోంది. గోల గోలగా ఉంది. రకరకాల మారణాయుధాలు ధరించి రాక్షసులు చిందులు తొక్కుతున్నారు. చాలా మంది ముఖాలు వివర్ణమై ఉన్నాయి. వారి ప్రభువు వచ్చేసరికి కొంత సద్దు మణిగింది. “ఏమిటి? మీ కష్టాలు?” అని ప్రశ్నించాడు సుఖాసీనుడయ్యాక.

ఒక్కొక్కరు ఏడుస్తూ చెప్పసాగారు. రక్తాక్షుడైతే కళ్ళనుంచి రక్తం కారుతుండగా చెప్పాడు. “స్వామీ! లోకంలో పూర్వం ప్రసిద్ధికెక్కిన రాక్షస రాజులుంటే, వారి అండలో మేము నానా దురాగతాలు చేస్తూ, మానవుల్ని చంపుకుని, కాల్చుకుని, వేపుకుని, తిని విందులు చేసుకునే వాళ్ళం. కడుపు నిండా రక్తం తాగే వాళ్ళం. మాకు అడ్డూ ఆపూ లేకపోయేది. కాని రోజులు మారి పోయాయి. ఇప్పుడు మాకు సరిపడా ఆహారం దొరకడం లేదు. మన ప్రభువులు ఘోరమైన తపస్సు చేసి, దేవతల్ని ఉబ్బేసి, చావు లేకుండా వరాలు పొందేవారు. అందువల్ల మాకు తిరుగు లేకుండా పోయేది. కాని, మాయావులైన దేవతలు, ఆ ఇచ్చిన వరంలో ఏదో మడత పేచి పెట్టి ప్రభువుల్ని చంపేసే వారు. దానికోసం వారు అవతారాలెత్త వలసి వచ్చినా సరే! ఇప్పుడిప్పుడే అందిన సమాచారాన్ని బట్టి రాబోయే కాలంలో మరో అవతారానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిసింది. మనం ఎంత తపస్సు చేసి వరాలు పొందినా ఆ వచ్చే అవతారం – దాని పేరేంటబ్బా! ఆఁ! కల్కి అట!. వాడు మన ప్రభువుని మట్టుబెట్టడని గ్యారంటి ఏమిటి? వాడు కత్తి చేత బట్టి, గుర్రాన్నెక్కి వస్తాడట! మేమిలా విలాసాలు, విందులు, వినోదాలు లేకుండా మగ్గిపోవల సిందేనా? తమరే ఏదో ఉపాయం ఆలోచించాలి” అని విన్నవించుకున్నాడు. అరిష్టుడు, ప్రచండుడు, కరాళ దంష్ట్రుడు, కపాలుడు కూడా అతనితో ఏకీభవిస్తూ నినాదాలు చేశారు.

“సరే! సరే! మీరేమీ బాధ పడకండి, ప్రతీ సమస్యకి ఒక పరిష్కార మార్గం ఉంటుంది. నేను ఆలోచిస్తాను. మీరూ మీకు తోచిన సలహాలు ఇవ్వండి.” అని తల పట్టుకుని శూన్యంలోకి చూడసాగాడు. ఆలోచించడం ఆ మందబుద్దులకి అలవాటులేని పని. వారిలో ఒక కృశించిన శరీరం వాడు ఉన్నాడు. వాడు లేచి నిలబడ్డాడు. వాడి ఆకారం వికారం అయినా బుద్ది సురేకారంలా పని చేస్తుంది. అమృత భాండం కోసం దేవాసురులు పోట్లాడుకునే సమయంలో వేలుకింత పిసరు అమృతం అంటుకుంటే, అది నాకిన వాడు వాడు. అదీ రహస్యం.

“ప్రభూ! దీనికోసం ఇంత బుర్ర బద్దలు కొట్టుకో వలసిన అవసరం లేదు. సూక్ష్మంగా ఆలోచిస్తే, ఎంత మట్టి బుర్రకయినా తట్టగలదు. సావధానంగా వినండి. మన సమస్య ఏమిటి? ఒకే ఒక్క మహానుభావుడు ప్రచండమైన తపస్సు చేసి వరాలు పొందితే, వారున్నారన్న ధైర్యంతో మనం లోకంలో చెలరేగి పోయే వాళ్ళం. అప్పుడు దేవతలు ఒకే ఒక్క బలవంతుడిని పంపి, మన వాళ్ళని హతమార్చేవారు. అలా కాకుండా మనమంతా భూలోకానికి పోయి, కొన్ని వేల, లక్షల మానవులలో మన అంశల్ని ప్రవేశ పెట్టగలిగితే, వారే స్వయంగా రాక్షస కృత్యాలకి పాల్పడి మనకి తోడు అవుతారు. ఈ కలియుగం ప్రథమ పాదంలోనే మనం ఈ ప్రక్రియ ప్రారంభిస్తే, కల్కీ ఉండడు వాడి గుఱ్ఱము, కత్తీ ఉండవు. ఎంత మంది నని చంపుతాడు.”

అది విన్న రాక్షసరాజు చప్పట్లు కొట్టి వాడిని అభినందించాడు. ఆ ప్రతిపాదనని వెంటనే అమలు చేయాలని ఆజ్జాపించాడు. రాక్షస గణాలన్నీ వాడిని ఎంతో మెచ్చుకున్నాయి. ఇదే మన తక్షణ కర్తవ్యం అని నిర్ణయించాయి. ఇలా కలియుగం ప్రథమ పాదంలో కొందరు మానవులే దానవులై, అకృత్యాలు, అత్యాచారాలు చేయసాగారు.

నాకు తెలియకుండా ఇంత జరిగిందా! అని బ్రహ్మగారు. అవాక్కయ్యారు. రహస్యం బట్ట బయలు కాగానే, మురికి గుడ్డ స్వచ్చమైన తెలుపుగా మారినట్టు, ఆయన మనసు తేలిక పడింది. “హారి నీ! ఇదా సంగతి?” అనుకుని, వెనక్కి వర్తమానంలోకి వచ్చారు. ఇదంతా జరగడానికి బి.ఎస్.టి. (అనగా బ్రహ్మలోక స్టాండర్డ్ టైం అని) లో అయిదు సెకండ్లు మాత్రం పట్టింది. కాని భూలోకంలో కలియుగం ప్రథమ పాదంలో కొన్ని వేల సంవత్సరాలు గడిచి పోయాయి.

వారి కోసం ఆతురతగా ఎదురు చూస్తున్న దేవతలు, ఆ ముఖంలో ప్రసన్నత, చిరునవ్వు చూసి సంబర పడ్డారు. “పుత్రులారా! చింతించకండి. సమస్యకి కారణం తెలిసింది. కనుక పరిష్కారం తప్పక ఆలోచిద్దాం.” అని తను దివ్య దృష్టితో చూసిన దంతా కళ్ళకు కట్టినట్టు వర్ణించి చెప్పారు, ఇంకా ఇలా అన్నారు. “దీనిని గురించి కూలంకషంగా చర్చించి ఒక నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. నేను అధ్యక్షుడిగా, విష్ణుమూర్తి, మహేశ్వరుడు సభ్యులుగా ఇప్పుడే కమిటీ వేస్తున్నాను. వీలైనంత త్వరలో ఒక పథకం ప్రకారం ముందుకు సాగుదాం. ప్రస్తుతానికి చేయగలిగింది ఏమీ లేదు. మీరంతా మీ మీ ఇళ్ళకు వెళ్లి, గృహోత్తర భాగంలో కాని, ఈశాన్యమూలన కాని నరుడికి ‘నరాలయం’ ఒకటి నిర్మించండి. ప్రతి రోజు పూజాదికాలు నిర్వహిస్తూ ఉండండి. వాడికి ఆగ్రహం రాకుండా చూసుకోండి. బృహస్పతి గారిని ‘నర సహస్ర నామాలు’ త్వరగా రచించమని కోరండి. ఈ లోగా మేము ప్రత్యామ్నాయాలు ప్రకటిస్తాం.”

దేవలంతా సంతృప్తులై డిస్పర్స్ కాగానే, త్రిమూర్తులు చర్చ ఆరంభించారు.

“ఏం చేద్దాం అంటావు?” విష్ణుమూర్తిని అడిగాడు బ్రహ్మ.

“లయకారుడు. ఆయనే చెప్పాలి.” ఆన్నాడు విష్ణువు మహేశ్వరుడిని ఓర కంట చూస్తూ. .

“నువ్వెలాగూ కల్కిగా వెళ్ళబోతున్నావుగా! ఇందులో నా ప్రమేయం ఏముంది?” అన్నాడు ఈశ్వరుడు.

“నిజమే! ఇదివరకులా ఒకరిద్దరు రాక్షసులని మర్దించడం అంటే, రివ్వున వెళ్లి వచ్చేవాడిని. ప్రస్తుతం సమస్య రూపు మారింది. కల్కి ప్రాజెక్టులో మార్పులు అవసరం రావచ్చు. ఇప్పుడు చావవలసిన వాడు ఒక్కడు కాదు. లక్షలు, కోట్లలో ఉన్నారు. అంత జనాభాలో వీరిని వెదికి పట్టడం సాధ్యం కాదు. గోముఖ వ్యాఘ్రాలుంటాయి. అంతేకాదు. అనుకోకుండా అమాయకులు కూడా బలి అయి పోయే ప్రమాదం ఉంది. అంత మందిని ఒక్కసారి చంపుతే, ‘జెనోసైడు’ అవుతుంది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల చట్టం ఉల్లంఘన క్రింద జమకట్టి శిక్ష వేస్తుంది. సమస్య జటిలమైనది. ఇదంత హర్రీ బుర్రీగా తేలే వ్యవహారం కాదు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. లక్ష్మి అన్నం తినకుండా నా కోసం కూర్చుని కునికిపాట్లు పడుతూ ఉంటుంది. నేను వెళ్ళాలి.” అన్నాడు. శ్రీహరి.

ఆ రోజు మీటింగు అలా ముగిసింది. కలియుగంలో ఏదో ఒక పాదంలో విష్ణుమూర్తి తన ఉక్కు పాదం మోపి తమని రక్షిస్తాడని దేవలోకం ఎదురు చూస్తోంది.

సర్వే దేవతా స్సుఖినో భవంతు.

(మనవి. పై కథ కేవలం ఊహాజనితమని గమనించ ప్రార్థన.)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here