[శ్రీ శివానంద మహారాజ్ రచించిన వ్యాఖ్యానం, వ్యాసాశ్రమ శ్రీ మలయాళ స్వామివారి వ్యాఖ్యానం ఆధారంగా శ్రీమతి సంధ్యా యల్లాప్రగడ అందిస్తున్న ఆధ్యాత్మిక సుమమాలిక ‘నారద భక్తి సూత్రాలు’]
~
ప్రారంభం!!
1.
సిరిని చేత పట్టి, సిరినగవులవాడు
కలియుగమున జనుల కనికరించు
వాడు, కోరి కొలుచు వారి అండనతడు
భక్తి కొలువ మొక్ష ఫలము వాడు॥
2.
భక్తి కలుగు వారు పరమభాగవతులు
భక్తి జనుల పాలి భవ్యమగును।
భక్తి కన్న మించు పరమపదము లేదు
భక్తినొక్కటున్న ముక్తి నిచ్చు॥
3.
సకల దైవముండు సద్గురురూపున
సకల చదవులందు సారమిదియె।
చేరి సద్గురువును సేవలు చేసిన
భక్తి కలిగి జనులు ముక్తి నొందు॥
***
కార్తీక మాసము గొప్ప మాసం. చిరు చలి ముదిరే కాలం. హృదయాలలో భక్తి మొలకెత్తి పువ్వలు పూసే కాలము కూడా ఇదే.
శివునికిష్టమైన కాలము. కాబట్టి శివునికిష్టమైన నారాయణ్ని తలచే దామోదర కాలము కూడా ఇదే.
ఈ మాసమంతా శివాభిషేకాలతో, పురాణపఠనాలతో తెలుగు నేల పులకరించి పోతుంది.
ఈ నెలలో వచ్చే నాలుగు సోమవారాలు పవిత్రమైనవి. ప్రతి వారు ఒక్క సోమవారమైనా శివునికి చెంబెడు నీరు పోసి నాలుగు దళాలోతో సేవించుకోవటం ఆనవాయితీ.
సోమవార వ్రతాలు, అభిషేకాలే కాక వనభోజనాలని మిత్రులను కలిసే కాలము కూడా ఇది.
దివ్యమైన కార్తీకమాసంలో శివుని జటాజూటమని పిలవబడే ఉత్తరకాశిలో ఉండే అవకాశం కలిగింది.
గంగానది గంగోత్రి వద్ద ఉన్న గోముఖంలో జన్మించి తన గలగలలతో చకచకా హిమాలయాలలో కొండలను చుట్టు ముట్టి పారుతూ మైదానాల వైపుకు సాగుతుంది.
గంగోత్రికి దాదాపు వంద కిలోమీటర్లు దూరంలో ఉన్న పట్టణం ఈ ఉత్తరకాశి. పవిత్రమైన ఈ పట్టణంలో కాశీవిశ్వనాథుడు కొలువై ఉంటాడు. సాధకులకు స్వర్గభూమి అయి ఉన్న ఈ ప్రదేశంలో గంగను భాగీరధి అంటారు.
ఇక్కడ నది స్వచ్ఛంగా ఉంటుంది. అడుగు కనపడుతూ, నీలి రంగులో ఉన్న జలం కన్నులకు హృదయానికి కూడా పండుగలా ఉంటుంది. ఈ పవిత్ర జలలను మనం త్రాగవచ్చు. అంత స్వచ్చంగా ఉంటుందీ నది.
కార్తీకంలో ఆ నది ప్రక్కన ఉన్న కుటీరంలో మూడు వారాలు గడిపే అవకాశం కలిగింది. ఆ కుటీరం పేరు శివానంద కుటీరం.
శ్రీ శివానంద కుటీరులో గడిపిన మూడు వారాలు దివ్యమైనవి. ఈ నది ప్రక్క గడిపిన కార్తీకం, ఈ జన్మ కూడా ధన్యమొందాయి. దివ్యమైన ఆ వాతావరణంలో ఒక పవిత్రత తేలియాడుతూ ఉంటుంది. ఆ పవిత్రత ఎలాంటి వారినైనా భగవంతుని గురించి ఆలోచింప చేస్తుంది. మనసులలో భక్తి నింపుతుంది. అలాంటి దివ్యమైన ప్రదేశంలో గాలిలోనే భక్తిని నింపుకున్న చోట, నారద భక్తి సూత్రాలు చదివితే మనస్సంతా భక్తిమయం కావటం తథ్యం కదా.
కలియుగములో అన్నింటికన్నా ఉత్తమమైనది భక్తి యని పెద్దలెందరో చెప్పారు. వారు చెప్పినదానికి ప్రమాణమేమిటన్న ప్రశ్న కలగటం సామాన్యం కదా!
పరమ భాగవతోత్తములైన వారి జీవిత చరిత్రలే ప్రమాణంగా కనపడుతున్నాయి.
ప్రహ్లాదుని నుంచి తుకారాం వరకూ, చైతన్య ప్రభువు నుంచి త్యాగరాజు వరకూ, మీరాబాయి నుంచి రామకృష్ణ పరమహంస వరకూ మన దేశంలో ఎందరో మహానుభావులు వెలిసి భక్తి స్వరూపము చూపించారు ప్రత్యక్షంగా. వారి చరిత్రులు చదువుకున్నా మనకు భక్తి స్వరూప స్వభావాల మీద అవగాహన కలుగటం నిజం.
***
మనము చేసే నిత్యకర్మలు ముక్తికి, స్వస్వరూప జ్ఞానానికి సోపానాలు. అదేలాగంటే, నిత్యకర్మలు అనుష్ఠించటం వల్ల ధర్మం కలుగుతుంది. ఈ ధర్మం వలన పాపక్షయం కలుగుతుంది. పాపం నశించిన వారికి చిత్తం శుద్ధి అవుతుంది. చిత్తశుద్ధి ఉంటే మనస్సు నిర్మలం అయి చిదాత్మ గురించి ఆసక్తి కలుగుతుంది. అది అజ్ఞానాన్ని నాశనంచేసి స్వస్సరూప జ్ఞానానికి హేతువుగా మారుతుంది.
దక్షిణామూర్త్యుపనిషత్తులో ఇలా చెబుతారు –
“వైరాగ్య తైల సంపూర్ణే భక్తివర్తి సమన్వితే।
ప్రబోధ పూర్ణపాత్రే తు జ్ఞాప్తిదీపం విలోకయేత్॥”
దీపము వలన ఇంటి లోపలి చీకటి పోతుంది. జ్ఞానమన్న దీపం వెలిగిస్తే అజ్ఞానమన్న చీకటి మాయమవుతుంది. దీపానికి నూనె, వత్తి, ప్రమిద ఎలా అవసరమో, జ్ఞానమన్న దీపం వెలిగించటానికి వైరాగ్యం, ధ్యానము, భక్తి అవసరం అని చెబుతున్నదీ శ్లోకం.
భక్తి అన్నది వత్తి లాంటిదన్నమాట.
శంకరాచార్యులు తన మణిరత్నమాలలో
“అపార సంసార సముద్రమధ్యే సమ్మజ్జతో మే శరణం కిమస్తి
గురోకృపా లో కృపయా వదై తద్విశ్వేశపాదాంబుజ దీర్ఘనాకా॥” అన్నారు.
అపారమైన సంసారమన్న సాగరం నుంచి తప్పించుకునే మార్గమేమిటి? అంటే ఈశ్వరుని పాదాలను భక్తితో పట్టుకోవటమే అని చెప్పారు.
భగవద్గీతలో భక్తి గురించి సవివరంగా చెప్పబడింది.
శృతులు మర్జాల కిషోర న్యాయం, మర్కట కిశోర న్యాయం అని రెండు రకాలుగా చెప్పారు. అందులో మార్జాల కిషోర న్యాయానికి భక్తి మార్గమని, మర్కటకిషోర న్యాయానికి జ్ఞానయోగ మార్గమని చెబుతారు.
భక్తులను భగవంతుడు మార్జాలంలా పట్టుకు తీసుకుపోతాడని భావం.
***
మానవ జన్మ జీవరాశులన్నింటి కన్నా ఉన్నతమైనది. కారణం ఆలోచన కలిగి జన్మపరంపరల నుంచి తప్పించుకునే అవకాశం కలిగి జన్మ కాబట్టి.
మరి ఈ మానవజన్మ ఎత్తిన వారు ఎలా ముక్తి పొందాలని ఆలోచన కలిగినప్పుడు వారికి కలియుగంలో భక్తి, నామసంకీర్తన ఒక్కటే తరుణోపాయని చెప్పబడింది.
భక్తి గురించి ఎన్నో చెబుతున్నా నారద భక్తి సూత్రాలు అత్యంత్త ప్రమాణికమైనవి. పాటించవలసినవి.
నారదుడు పూర్వజన్మలలో ఒక సేవకురాలి కుమారునిగా పుడతాడు. తల్లి సాధువులకు సేవచేస్తూ ఉంటుంది. కుమారుడు కూడా ఆమెతో కూడి వారిని సేవిస్తూ ఉంటాడు. ఆ బాలుని సేవకు మెచ్చి కొందరు సాదువులు అతనికి నారాయణ మంత్రం చెబుతారు. ఆ బాలుడు నారాయణ మంత్రం అనుష్ఠానం చేసి, ఆ జన్మ తదనంతరం బ్రహ్మ మానస పుత్రునిగా జన్మిస్తాడని కథనం.
ఇందులో భావార్థం: నామసంకీర్తన మాత్రం చేసిన సేవక కుమారుడు బ్రహ్మ మానస పుత్రునిగా పుట్టాడని చెబుతుంది. అంత శక్తివంతమైనది నామసంకీర్తనం. మనకు తెలిసే నామసంకీర్తనంతో ఉద్ధరించబడిన వారుగా భక్త తుకారాం, కబీరు, మీరాబాయి, చైతన్యప్రభువు, తులసీదాసు, రామకృష్ణ పరమహంస, అక్కమహాదేవి, భద్రాద్రి రామదాసు ఇలా ఎందరో కనపడతారు. వారు మన ముందు తరాలకు చెందినవారు. మనకు మార్గదర్శకత్వం చూపినవారు.
నారద భక్తి సూత్రాలు చదవటం వలన, వాటిని చదివి మరల మరల మననం చేసి భక్తి పెంపొందించు కోవటం వలన మానవజన్మ సార్థకత పొందవచ్చు అనటంలో సందేహమే లేదు.
***
నారదుల వారు దేవర్షి. బ్రహ్మ మానస పుత్రులు. ఆయన కథలోకి వచ్చారంటే ఆగిపోయిన కథ వేగవంతమవుతుంది. పరమాత్మతత్త్వం బోధపడుతుంది. ఆయనను సర్వులూ స్వాగతిస్తారు.
అందరిచే సేవలు పొంది, అందరికీ మార్గం చూపటం నారదుల వారి స్వభావం. వ్యాస వాల్మీకి మునుల నుంచి త్యాగరాజస్వామి వరకూ ఆయన నుంచి మంత్రం, సలహా పొంది సాధనలో, వారి పనులలో ముందుకు సాగారు. పరమ భాగవతోత్తముడు, ఎల్లప్పుడూ హరినామ చింతన చేసే భక్తుడైన నారద మహర్షి ఒక సందర్భంలో చెప్పిన కొన్ని సూత్రాలే ఈ భక్తి సూత్రాలు.
సరస్వతీ నది వడ్డున వ్యాసమహర్షి కొంత విచారంగా కూర్చున్నప్పుడు, నారదులు వారు వచ్చి “ఎందుకు విచారంగా ఉన్నావు మహర్షి?” అని అడుగుతాడు.
వ్యాస మహర్షి నారదుల వారికి నమస్కరించి “పురాణాలు వ్రాసినా, భారతం వ్రాసినా తృప్తి కలగలేదు.” అంటారు దిగులుగా.
నారదుల వారు నవ్వి “కారణం నీవు పరమాత్ముని మీద భక్తి గురించి, ఆయన భక్తుల గురించి రచించలేదు. అన్నింటి కన్నా ఉత్తమమైనది భక్తి. భాగవతం రచించి మనస్సులో శాంతి పొందు…” అని చెబుతూ భక్తి సూత్రాలను చెపుతాడు.
అదిగో అలా నారద మహర్షి చెప్పిన సూత్రాలే ఈ ‘నారద భక్తి సూత్రాలు’.
పరమ భక్తులు అంటే ఎవరు? వారు ఏ విధంగా ఉంటారు? ఏ విధంగా నడుచుకోవాలి వంటి వివరాలు ఉన్న సూత్రాలివి. సూత్రాలంటే చిన్నవిగా, ఒకటి లేదా రెండూ వాక్యాలలో ఉంటాయి. వాటిని విప్పి చెప్పుకోవటం, ఆలోచించటం, అనుసంధాన పర్చుకోవటం మన వంతు. దానికి సహాయంగా మనకు భగవద్గీత, యోగవాశిష్ఠము వంటి గ్రంథాల తోడు ఉండనే ఉంది కదా!
ఈ భక్తి సూత్రాలు మనకు కలిగే ఎన్నో సందేహాలను తీరుస్తాయి. కలియుగములో మనకు లభ్యమైన వరము భక్తి. భక్తితో భగవంతుని కొలిస్తే ముక్తి తథ్యమని చెబుతాయీ సూత్రాలు.
***
భక్తి అంటే సేవ, స్నేహము, గౌరవంతో కూడిన స్నేహమని నిఘంటువు చెబుతుంది. భక్తి గురించి మాట్లాడినప్పుడు నారద భక్తి సూత్రాలనే ఉదహరిస్తారు. భక్తి గురించి నారదుల వారికన్నా చెప్పగల పూజ్యలెవరు అసలు? అనన్యభక్తితో సదా నారాయణ నామం ఉచ్చరించే నారదులు వారు చెప్పగలిగేదే భక్తి అంటే.
కలియుగంలో జ్ఞానం పొందటం కష్టమని, భక్తి మాత్రమే సులభతరమని మునులు చెప్పారు.
“జ్ఞానం తు దుష్కరం లోకే భక్తిర్హిసుకరం వృణామ్”…
ఈ భక్తిని కలిగి ఉండటం అంత సులభమైన విషయం కాదు. భక్తి మార్గంలోకి వెళ్ళటానికి, భక్తితో భగవంతుని సాధించటానికి భక్తి సూత్రాలను నారదుల వారు శ్రీ వేదవ్యాసులకు చెప్పారు. అది మనకు భాగవతంలో ప్రథమస్కందంలో లభ్యమవుతున్నాయి.
ఈ సూత్రాలను చదువుకున్నా, నేర్చుకొని పాటించినా, భక్తిలో ఉన్నత స్థితి పొంది పరమాత్మలో ఐక్యమవవచ్చు, ముక్తి పొందవచ్చు.
ఇవి, మొత్తం 84 సూత్రాలున్నాయి. మొదటి సూత్రం నుంచి 24వ సూత్రం వరకూ భక్తి అంటే ఏమిటో వివరిస్తాయి. 25 నుంచి 33 సూత్రం వరకూ భక్తి యోగం ఏ విధంగా ఉత్కృష్టమైనదో వివరిస్తాయి. కర్మ మార్గం, జ్ఞాన మార్గం, యోగమార్గం కన్నా ఉన్నతమైనదని చెబుతాయి ఈ సూత్రాలు.
34 నుంచి 50 వరకూ కూడా భక్తి మార్గన్ని ఎలా అవలంబించాలో చెబుతాయి. యాబది ఒకటి నుంచి అరువైఆరు వరకూ భక్తులను గుర్తించే మార్గం చూపుతాయి. 67 నుంచి 84 వరకూ భక్తులను వారు పొందిన ఫలాలను గూర్చి చెబుతాయి.
నిత్య దైనందిత జీవితాలలో కలిగే దుఃఖం నుంచి విడుదల కోరుకోవటం భక్తికి మొదటి అడుగు.
భక్తి సులభమార్గంగా పేరు పొందింది. బాలులు నుంచి వృద్ధుల వరకూ ఈ భక్తి లోకి రావటం సులభం.
ఎన్ని ఉన్నా మానవునికి భక్తి లేకపోతే, సారవంతమైన భూమి ఉండి, మంచి విత్తనాలు ఉన్నా వర్షం లేకపోతే ఎలా ఫలవంతం కాదో, అలాగే భక్తి లేని మానవులు బీడుగా మారిపోతారు.
సూత్రాలంటే తాడు, దారం. ఈ అపూర్వమైన విషయాలను భక్తి అన్న సూత్రంచే కట్టబడ్డాయని. వీటికి భాష్యాలు లేకపోతే అర్థమవటం కష్టమని కూడా సూత్రాలన్నారు వీటిని. ఈ సూత్రాలకు భాష్యాలు లభ్యమవుతున్నాయి కూడా.
(సశేషం)