నారద భక్తి సూత్రాలు-12

0
3

[శ్రీ శివానంద మహారాజ్ రచించిన వ్యాఖ్యానం, వ్యాసాశ్రమ శ్రీ మలయాళ స్వామివారి వ్యాఖ్యానం ఆధారంగా శ్రీమతి సంధ్యా యల్లాప్రగడ అందిస్తున్న ఆధ్యాత్మిక సుమమాలిక ‘నారద భక్తి సూత్రాలు’]

నారద భక్తి సూత్రాలు

74. వాదో నావలమ్బ్యః

అర్థం: భగవద్భక్తులు కుతర్కవాదములోకి దిగరాదు.

పరమ భక్తులు కుతర్కవాదములోకి ప్రవేశించరాదు. అది పెరిగి విరోధము కలిగి మనఃశాంతి కోల్పోతారు.

అందరిలో అంతటా భగవంతుని దర్శించే భక్తునికి బేధబుద్ధి కలగరాదు. సమత్వం నుంచి జారరాదు.

జ్ఞానులంటూ కొందరు తర్కానికి దిగుతారు. ఇటువంటి తర్కాలు పరమాత్మ మెచ్చడు.

భక్తుని బాధ్యత తర్కాలకు, కుతర్కాలకు దూరంగా ఉండటం. వాదన అనేది జ్ఞానుల మధ్య సత్వగుణ ప్రధానంగా జరగాలి. అలా కాక మధ్యలో వితండం చేర్చి కువాదన చేస్తే అది భగవంతుడు మెచ్చడు. పైగా సత్యానికి నిరూపణ అక్కర్లేదు. భక్తుడు సత్యాన్ని అంగీకరిస్తాడు.

సత్యం వాదనలతో నిరూపించబడదు. వాదోపవాదాల వల్ల మనస్సులో అనవసరమైన ఆలోచనలు కలిగి నిజాన్ని గుర్తించలేరు. వాదనల వలన సమయం వృథా అవటం తప్ప మరి లాభము ఉండదు. వాదోపవాదాలు చేస్తే జ్ఞాని అయినా జీవిత కాలములో పరమాత్మను దర్శించ లేడు.

శంకరాచార్యులు తన సాధనాపంచకంలో ‘బుధజనైర్వాదః పరిత్యజ్యతామ్’ మహాత్ములతో, పరమ భక్తులతో వాదనలు చెయ్యరాదని చెబుతాడు.

కొందరు వివిధ మతాల గురించి, నమ్మకాల గురించి వాదనలు చేస్తూ ఉంటారు. పరమభక్తులకు తెలుసు సర్వత్రా ఉన్నది ఒక్కడే భగవంతుడని.

వాదనలలో మూడు రకాలైన వాదాలు చెప్పబడాయి, వాదము, జల్పము, వితండము అని.

సమానమైన స్థాయి కలిగి భక్తితో సావధానంగా నెమ్మదిగా జరుపు మాటలు వాదమంటారు.

శాస్త్ర ప్రమాణము చేత, యుక్తుల చేత తన వాదాన్ని స్థాపించి ఇతర పక్షాలను ఖండించటము జల్పమంటారు.

తమ సిద్ధాంతము తెలియచెయ్యక కుతర్కము చేస్తే వాడి కుయుక్తులతో నిందలతో ఇతరులను ఓడించటము వితండము.

వాదము సత్వ గుణముతో కూడి ఉత్తమైన వాదము. భక్తులు ఇది చెయ్యవచ్చు.

రెండవది రజో గుణముతో ఉండి మధ్యమము. మూడవది తమోగుణముతో కూడి అధమము. ఈ రెండూ భక్తులు చెయ్యరు.

అజ్ఞానం, మోహం, అతి నిద్ర, చపలత్వం, ఒకదాని నుంచి మరొకటి వేరు అని తలచుట, బుద్ధిమాంద్యం, పరులను పీడించుట, ఇతరులతో కుతర్కాలకు దిగుట తామస గుణ లక్షణాలని గీతలో చెప్పబడింది.

75. బాహూళ్యావకాశత్వాదనియతత్వాచ్చ

అర్థం: వాదము పెంచే కొద్ది పెరిగే అవకాశం ఉంది కనుక ఇటువంటి నిర్దిష్టమైన అవధిలేని దానిని భక్తులు అనుసరించరు.

భక్తులు వాదనలు చెయ్యరు. చెయ్యరాదు కూడా. ఇతరులతో అనవసరపు వాదన కూడదు. దేవుని ఉనికి గురించిన వాదనలు, ఎవరి మతం గొప్ప అన్న వాదనలు, భక్తులు చెయ్యరు. ఇవి అంతూపొంతూ లేని వాదోపవాదాలకు తావుతీస్తాయి.

తర్కంతో భగవంతుని దర్శించలేరు. తర్కం వలన వస్తువు మరింత జటిలమవుతుంది. అనవసరపు స్పర్ధలకు తావు కలుగుతుంది. మనఃశాంతిని కోల్పోతారు. సాధించిన విషయం కూడా ఏమీ ఉండదు.

నిజనిరూపణకు వాదనలు అన్నది నిజం కాదు. సత్యదర్శనానికి మౌనమే మంచి మార్గం.

భక్తులు ఈ విషయం గ్రహించి ఉంటారు కాబట్టి వారి వాదోపవాదాలకు తావు ఇవ్వరు.

“నిస్సంగతా ముక్తి పదం యతీనాం సంగాదశేషాః ప్రభవంతి దోషాః।

ఆరూఢయోగోఽపి నిపాత్య తేఽధః సంగేన యోగీ కిముతాల్పసిద్ధిః॥”

పరివ్రాజకులకు నిస్సంగత్వమే మోక్షపదాన్నిస్తుంది. దుర్జన సహవాసం అనేక దోషాలు సంభవిస్తాయి.

అజ్ఞానములో పడవేస్తాయి. కాబట్టి భక్తులు వాదనలకు దిగరాదు.

76. భక్తి శాస్త్రాణి మననీయాని తదుద్బోధక కర్మాణి కరణీయాని

అర్థం: భక్తులకు తమ భక్తిని వృద్ధి చేసుకోవటానికి భాగవతం, భగవద్గీత మొదలైనవి ఉన్నాయి. శ్రవణ మననం ద్వారా భక్తిని పెంచుకోవచ్చు.

భక్తులు కర్మకాండలలో మునిగి వ్యర్థజీవులుగా మారకూడదు. అంతరంగంలో శుద్ధి మీద మాత్రం శ్రద్ధ పెట్టాలి.

భక్తులు తమ సాధనను విడవక కొనసాగించాలి. నిష్కామకర్మ యందు కొంత పరిశ్రమ చెయ్యాలి.

పరమాత్మ గురించి కథలు, లీలలు చదవాలి. పరమ యోగుల చరిత్రలు తెలుసుకోవాలి.

భాగవతం, రామాయణము, గీత వంటి సద్గ్రంథాలు చదువుకోవాలి.

శివ సూత్రాలు, విష్ణు నామాలు, తుకారాము అభంగాలు వంటి వాటిని తెలుసుకోవాలి.

భక్తిని పెంచుకునే పనులను చెయ్యాలి. ఆ దిశలో వచ్చే ప్రతి అవకాశము సద్వినియోగం చేసుకోవాలి.

“అనంత శాస్త్రం బహు వేదితవ్యం

స్వల్పశ్చ కాలో బహవశ్చ విఘ్నాః

యత్పారభూతం తదుపాసి తవ్యం

హంసో యథాక్షీరమివాంబుమిశ్రమ్॥”

శాస్త్రం అనంతం. ఎంతకాలం చదివినా అంతు కనపడదు. జీవితం స్వల్పం. విఘ్నాలు అనంతం. అందుకే గురువులు చెప్పినవి ఉపాసించాలి. హంసలాగా క్షీరాన్ని నీటి నుంచి వేరు చేసుకొని గ్రహించాలి భక్తులు.

భక్తులు తమకు కుదిరినంతగా తమ గృహాలలో చిన్నదో పెద్దదో భగవత్ స్థలం పెట్టి ప్రతిరోజూ దీపం పెట్టుకోవటం వంటి నిత్యకర్మలను ఆచరింటము వలన వారిలో నియతి ఏర్పడి భక్తి తప్పక పెరుగుతుంది.

అహింస, సత్యం మాట్లాడటము, బ్రహ్మచర్యం వంటి వాటిని పాటించటము భక్తులకు ముఖ్యమైనవి. సదాచారం పాటింటము, డాంబికాలను వదిలెయ్యటము చెయ్యాలి. వదలక భగవద్సంకీర్తనము చెయ్యాలి.

ప్రతి రోజూ క్రమశిక్షణ కలిగిన జీవనవిధానము వలన భక్తి వృద్ధి చెందుతుంది. భక్తులు భగవంతునితో అనుసంధానపరుచుకోగలరు.

మనస్సును భగవంతుని చరణాల మీదకు వెళ్ళక ధనము, బాంధవ్యాలని తిప్పుకూడదు. ధనము, గృహము, బంధువులు ఎప్పటికన్నా నశించేవే. ఎల్లప్పుడు ఉండే పరమాత్మను వదలకూడదు.

శంకరులు అందుకే భజగోవిందంలో ‘సంప్రాప్తే సన్నిహితే కాలే నహినహి రక్షతి డుకృజ్ కరణే’ అన్నారు.

పరమాత్మ పాదాలే రక్ష శాశ్వతం కాబట్టి వాటిని పట్టుకోవాలి.

77. సుఖదుఃఖేచ్చాలాభాదిత్యక్తే కాలే ప్రతీక్ష్యమాణే క్షణార్దమపి వ్యర్థం న నేయమ్

అర్థం: భక్తులు సుఖదుఃఖాలతో నిరీక్షించే కాలం అరక్షణం కూడా వ్యర్థం చెయ్యకూడదు.

భక్తులు అరక్షణమైనా వృథా చెయ్యకూడదు.

సత్వగుణ ప్రధానమైనది సుఖము. తమో గుణ ప్రధానమైనది దుఃఖము.

భక్తుడు సత్వ గుణాలను పెంచుకున్నే ప్రయత్నం చెయ్యాలి. తమో, రజో గుణాలు అతనిని పడవేస్తాయి. వయస్సులో ఉన్నప్పుడు సమయం వృథా చెయ్యటమన్నది మానవనైజం. తరువాత సంసారంలో పడిపోతారు. భవబంధాలు పట్టేస్తాయి. జీవితంలో సగకాలం నిద్రలో పోతుంది. జీవితం క్షణభంగురము.

తరువాత ఎప్పుడో బాధ్యతలు తీరిన తరువాత దైవధ్యానం అనుకుంటే విలువైన సమయం కరిగిపోతుంది. జీవితాన్ని విద్యుచ్చలం జీవితం అంటారందుకే. మెరుపు వంటిది జీవితం. నీటి బుడగ వంటిది.

“శాన్తే సముద్రకల్లోలే స్నానమిచ్చతి మూఢధీః

తథైవ శాంతే సంసారే జ్ఞానమిచ్చతి దుర్మతిః॥”

సముద్రస్నానానికి వెళ్ళిన వారి అలలు తగ్గాక స్నానం చేద్దామంటే చెయ్యగలడా అసలు ఎప్పటికైనా? అలాగే అన్నీ తీరిన తరువాత భగవంతుని తలుకుంటానంటే కుదరదు.

సమయం విలువైనది. చేతిలోంచి జారిన తరువాత తిరిగి రాదు. కాబట్టి తెలివైనవారు సమయాన్ని వాడుకొని భగవంతుని భక్తితో పునీతులవుతారు.

78. అహింసా సత్యశౌచదయాఽస్తిక్యాదిచారిత్రాణి పరిపాలనీయాని

భగవంతుని భక్తులు అహింసా, సత్యం, శౌచము, దయ, ఆస్తిక్యము మొదలైనవి పాటించాలి.

ఒక తోటను పెంచాలనుకుంటే విత్తులను నాటి, నీరు పోసి, కలుపు తీసి, ఎరువు వేసి జాగ్రత్తగా పెంచుతారు. అలాగే భక్తి అన్న తోట కూడా జాగ్రత్తగా పెంచుకోవాల్సినది.

భజనము, సత్సంగము వంటివి ఆహారమైతే, అహింస, సత్యపాలన వంటి నియమాలు, శౌచము సంతోషము వంటివి పాటింటము వలన భగవత్ భక్తి పెంపొందుతుంది. తోటి వారి పట్ల దయగా ఉండటము, ప్రతి వారిలో పరమాత్మును చూడటము వలన భక్తులు సాధనలో నడవగలరు.

శరీర సౌఖ్యము చూసుకునేవారికి ఎప్పటికీ భక్తిలో సాగలేరు. పాలను చిలకటం వల్ల మాత్రమే వెన్న ఎలా తయారు చేస్తారో అలాగే భక్తులు యమ నియమాలన్న సూత్రాలు పాటిస్తేనే భగవంతుని అనుగ్రహం అన్న నవనీతం దొరుకుతుంది.

“ఇహైన నరకవ్యాధేశ్చికిత్సాం న కరోతి యః

గత్వా నిరౌషధం దేశం వ్యాధిస్థః కిం కరిష్యతి?॥”

మానవులుగా జన్మించిన వారు నరకమన్న వ్యాధిన పడకుండా ఉండాలంటే భక్తి అన్న ఔషదం సేవించాలి. భక్తి ఒక్కటే భవరోగాలకు మందు.

మనస్సు చంచలము. దానికి ఊతగా ఏదైనా ఇస్తే స్థిరమై నిలుస్తుంది. భగవత్భక్తి అన్న ఊతతో ఆ మనస్సును నిలపవచ్చు.

79. సర్వదా సర్వభావేన నిశ్చింతితైర్బగవానేన భజనాయః

సర్వకాల సర్వావస్థలలో అన్ని భావాలతో, ఏ భావము లేకనూ భజన, స్మరణ, కీర్తన చేయదగినవాడు భగవంతుడు.

సదా భగవంతుని గురించి చింత, సర్వభావన, భజన చెయ్యాలి. ఇలా చెయ్యటానికి అంటే స్మరణ, కీర్తన, ధ్యానాదులు చెయ్యటానికి సమయము చూడటం మంచి సమయమా కాదా అనుకోనక్కల్లేదు. అదే భక్తి యోగంలో విశేషం.

అదే వేదాంత విచారణ, యోగాభ్యాసము, తపస్సు మొదలైనవాటికి సమయము అర్హత ఇత్యాదివి అవసరము. కాని భక్తికి కేవలం భక్తి చాలు. స్త్రీ పురుష భేదము లేదు. అందరు సర్వత్రా భగవంతుని ఆరాధన చెయ్యవచ్చు. శ్రీ చైతన్య మహాప్రభు సదా కృష్ణ భజనములో మునిగితేలుతూ ఉండేవాడు.

సర్వకాల సర్వావస్థలలో భగవంతుని గురించి చింత చెయ్యాలి. చింత అంటే ఆలోచించటము. హృదయాన్ని ఆ వైపుకు తిప్పి ఉంచటము. ప్రతిదీ అదే అన్న భావము కలిగి ఉండటము.

శరీరం పైన మలినము ఉంటే తుడుకుంటారు. హృదయంలో మలినం భగవంతుని నామస్మరణతో తుడుకుపోతుంది. కాబట్టి సదా ఆ పరమాత్మను చింతన చేస్తూ ఉండాలి.

వాక్కుల ద్వారా మంచి మాటలే మాట్లాడుతూ ఉంటే వాక్కుకు శుద్ధి కలుగుతుంది. లేదా భగవంతుని నామం పలకటం వలన కూడా వాక్కుకు శుద్ధి కలుగుతుంది.

సర్వభావన కలిగి ఉండాలి. సర్వభావన అంటే చూస్తున్నది, వింటున్నది అంతా భగవంతుని నామమే అన్న తలపు.

భగవంతుని గురించి భావన చెయ్యటం వలన మనస్సుకు ఆ విషయం అలవాటు అవుతుంది.

శుచిగా ఉండటము గురించి చెబుతూ కొన్ని ప్రత్యేక సందర్భాలలో –

“అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాం గతోఽపి వా।

యస్స్మరేత్సుండరీకాక్షాం స బాహ్యాభ్యంతరశ్శుచిః॥”

ఎప్పుడైనా ఆరోగ్యం సహకరించకపోయినా విపత్కర పరిస్థితులలో ఈ శ్లోకం చదువుకు పుండరీకాక్ష అనుకుంటే శుచిగా మారి భగవద్ నామము తలుచుకోగలరు. విభూది దారణతో కూడా శుచిగా మారగలరు.

80. సకీర్త్యమానశ్శీఘ్ర మేవావిర్బవత్యనుభావయతి

భగవంతుడు భక్తుల చేత స్తుతించబడుచున్నవాడై ఆలస్యం చెయ్యక ప్రత్యక్షమవుతాడు. స్వస్వరూప జ్ఞానమిస్తాడు.

హరి తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించటానికి స్తంభము నుంచి నరసింహరూపములో బహిర్గతమైనాడు.

ప్రహ్లాదుడు శ్రీహరికి సర్వభావనతో శరణు వేడాడు. అనన్యభక్తితో దైవానుగ్రహం సిద్ధిస్తుంది.

ఈశ్వర కృప వలనే శాంతి, దాంతి వంటి గుణాలు కలిగి జ్ఞానముతో మోక్షం కోసము ప్రయత్నం మొదలెడతారు మానవులు. అదీ భక్తితోనే మొదలవుతుంది.

81. త్రిసత్యస్య భక్తి రేవ గరీయసీ

అర్థం: మోక్షమునకు త్రికాలబాధ్యుడు భగవంతుని గురించి భక్తి శ్రేష్ఠమైనది. అటువంటి భక్తి ఒక్కటే అధికమైనది.

మూడు కాలాలలో అంటే గడిచిన, గడుస్తున్న గడవబోతున్న కాలాలలో భగవద్భక్తి మాత్రమే ఉత్కృష్టమైనది. భూత భవిష్యత్ వర్తమానాలలో భక్తి మాత్రమే ఘనమైనది. భక్తి ఒక్కటే మిగిలిన వాటి కన్నా ఉన్నతమైన మార్గం. నారదులవారు ఈ సూత్రంలో భగవంతుని మీద భక్తి మాత్రమే విలువైనది కోరతగినది, మోక్షహేతువని చెప్పారు.

భక్తి మాత్రమే కోరతగినది. జ్ఞాన, కర్మ, భక్తి మార్గాలలో భక్తి మాత్రమే భగవంతునికి ప్రియమైనది. ఆయన వద్దకు చేర్చేది.

త్రికాలలో అంటే సృష్టి స్థితి లయలో భూతభవిష్యవర్తమానాలలో భక్తే మాత్రమే ముక్తి.

“జాగ్రత్స్వప్న సుషుప్త్యాది ప్రపఞ్చం

తద్ర్బహ్మాహమితి జ్ఞాత్వా సర్వబంధైః ప్రముచ్యతే॥”

జాగ్రత్ప్వప్న సుషుప్తాది అవస్థలలో, స్థూల సూక్ష్మకారణ దేహాలు ఏ ఆత్మలో ప్రకాశిస్తున్నాయో ఆ ఆత్మ తన ఆత్మగా, పరమాత్మగా తెలుసుకున్న వాడు సర్వబంధాల నుంచి విడుదల అవుతాడు.

82. గుణమాహాత్మ్యాసక్తి, రూపాసక్తి, పూజాఽఽసక్తి, స్మరణాసక్తి, దాస్యాసక్తి, సఖ్యాసక్తి, వాత్యల్యాసక్తి, కాంతాఽఽసక్త్యాత్మ నివేదనాఽఽసక్తి, తన్మయతాఽఽ సక్తి, పరమ విరహాసక్తి, రూపైకధాఽఽ ప్యేకదశధా భవతి

అర్థం: భగవంతుని మీద భక్తి జీవుల సంస్కారాన్ని బట్టి పదకొండు రకాలుగా ఉంటుంది. అవి భగవంతుని దివ్య గుణాలు వినటం వలన, దివ్యమైన అవతారాలని సందర్శించటం వలన, భగవంతుని పూజించటము వలన, భగవన్నామము స్మరింటము, దాసునిగా సేవించటము వలన, స్నేహితునిలా మెలగటం వలన, భగవంతునిగా తమ నాయకునిగా ఊహించి సేవించటము వలన, ఆత్మనివేదన వలన, భగవంతునిలో ఐక్యమవటం వలన, విడిచి ఉండలేని విరహం వలన. ఇలా వివిధ రకాలైన అవస్థలలో భక్తుడు భగవంతునితో అనుసంధానపరుకుంటాడు.

నారదుల వారు పదకొండు విధాల భక్తిని గూర్చి చెప్పారు.

భాగవతం నవవిధాలైన భక్తి గురించి చెబుతుంది.

“శ్రవణం కీర్తనం విష్ణోస్స్మరణం పాదసేవనం।

అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మనివేదనం॥”

శ్రవణకీర్తన స్మరణసేవన అర్చనవందన దాస్య సంఖ్య ఆత్మనివేదన.

ఇందుకు ఉదాహారణలుగా పరిక్షీతు మహారాజు శ్రవణము ద్వారా ముక్తి పొందాడు.

నారదులు వారు, త్యాగరాజు కీర్తనము వలన, శుకమహర్షి స్మరణ వలన, లక్ష్మణుడు పాదసేవ వలన, పృధు చక్రవర్తి అర్చన వలన, అక్రూరుడు వందనము వలన, హనుమంతుల వారు దాస్యం వలన, అర్జునుడు సంఖ్యత వలన, బలి చక్రవర్తి ఆత్మనివేదన వలన ముక్తి పొందారని భాగవతం చెబుతుంది.

కలి యుగంలో నామ సంకీర్తనముతో ముక్తి పొందుతారట.

అందుకే నచ్చిన దేవుడి నామాన్ని ఓంకార, నమఃల మధ్య చేర్చి నామసంకీర్తనము కలి యుగములో పరమాత్మను చేరటానికి నిర్దేశించబడింది.

విరహ భక్తి ఉత్తమమైనదిగా చెబుతారు నారదుల వారు. దానికి మనకు గోపికలే ఉదాహరణ. వారు కృష్ణుడిని ప్రేమించి, ఆయనకు తమను తాము సమర్పించి, కృష్ణుడు కనపడకపోతే తట్టుకోలేక వెతికి ఆయనలో ఐక్యమైపోతారు.

గురుదేవులైన రామకృష్ణ పరమహంస కూడా విరహంతో కాళీమాతను విడిచి ఉండలేకపోతాడు. మాత కనపడకపోతే తల నరుక్కోవాలని ప్రయత్నంలో ఆయనకు అమ్మవారి దర్శనం కలుగుతుంది.

అంత భక్తి ఉంటే పరమాత్మ క్షణమాత్రపు ఆలస్యం చెయ్యక భక్తుడిని రక్షించుకుంటాడు.

83. ఇత్యేవం వదన్తి జనజల్ప నిర్బయా ఏకమతాః కుమారవ్యాస శుకశాణ్డిల్య గర్గ విష్ణు కౌణ్డిన్య శేషోద్ధవారుణి బలి హనుమద్విభీషణాదయే భక్త్యాచార్యాః

పామర జనుల నిందలను పట్టించుకోక ముక్తిని కలగచేసే పనుల గురించి మునులు ఏకాభిప్రాయం చెప్పారు. ఆ మునులు సనత్కుమార, వ్యాస, శుక, శాండిల్యగర్గ, విష్ణువమఋషి, కౌండిన్య, ఆదిశేషు, హనుమంతుడు, ఉద్ధవుడు, అరుణి, బలి, విభీషణుడు మొదలైన భక్తులు, భక్తియే ముక్తి అని తెలిపారు.

బ్రహ్మ మానస పుత్రుడైన నారదుల వారు కూడా భక్తి ఒక్కటే ముక్తికి మార్గమని ఉటంకించాడు.

అద్వైతాన్ని వివరించిన శంకరులు, విశిష్టాన్ని చెప్పిన రామానుజులు వంటి వారు కూడా భక్తి ఒక్కటే ముక్తికి సోపానమని చెప్పారు.

84. య ఇదం నారద ప్రోక్తం శివానుశాసనం విశ్వసితి శ్రద్దత్తే సభక్తి మాన్భవతిస ప్రేష్ఠం లభతే స ప్రేష్ఠం లభత ఇతి

ఎవరు నారదుల వారిచే చెప్పబడిన ఈ నారదసూత్రాలను శ్రద్ధతో ఉపాసిస్తారో వారు భక్తి కలవారైతారు. మిక్కిలి ప్రేమకలవారై, భగవంతునికి ప్రీతిపాత్రులవుతారు.

గీతలో చెప్పినట్లుగా

“శ్రద్ధావాన్లభతే జ్ఞానం తత్పరస్సంయత్రేంద్రియ

జ్ఞానం లబ్ద్వా పరాం శాంతి మచిరేణాదిగచ్చతి॥”

శ్రద్ధ గలవాడు తదేక నిష్ఠ గలవాడు సరేంద్రియ నిగ్రహం గలవాడు జ్ఞానం పొంది సర్వోత్కృష్టమైన పరమశాంతిని పొందుతాడు.

కలియుగంలో భక్తితో కూడిన నామపారాయణము ఒక్కటే తరించటానికి మార్గమని చెప్పబడింది.

భగవంతుని మీద భక్తితో హృదయం నింపి, ఆయన ధ్యానంలో ఉన్న వారిని ఆయన రక్షించుకుంటాడు.

సంసారమన్న సాగరాన్ని దాటటానికి భక్తి ఒక నౌక వంటిది.

తోటను పెంచుకున్నట్లుగా భక్తిని పెంచుకోవాలి.

కోరికలకు అంతు ఉండదు. ఆ కోరికలు పరమాత్మ పరంగా చేస్తే ముక్తి కలుగుతుంది.

భక్తులు వాదనలు పెట్టుకోరు.

సర్వత్రా భగవంతునే చూస్తారు. తలుస్తారు.

సజ్జనులతో సాంగత్యం చేస్తారు. తద్వారా మరింతగా భగవంతుని తలుచుకుంటారు.

భక్తి మార్గం జ్ఞాన, కర్మ, యోగ మార్గాలకన్నా ఉత్తమమైనది. ఏ మార్గమనుసరించినా చివరికీ మళ్ళీ భక్తి మార్గంలోకి రావలసిందే.

భగవంతుని గురించి తలుస్తూ ఉంటే చివరి క్షణంలో కూడా ఆ పరమాత్మనే తలుస్తాము.

శ్రవణ మనన నిధిద్యాసనములతో భగవంతుని భక్తుడు ఆరాధిస్తాడు.

ఏకాంతంగా మౌనంగా ధ్యానం చేసి ఆ పరమాత్మను పొందుతాడు.

నారదుల వారు మానవులకు అందచేసిన ఈ భగవద్ మార్గం, భగీరథీ తీరాన్న జగదంబ కృపతో తెలుసుకొని నలుగురికీ పంచుకోవటం ద్వారా ఈ ఉపాధి భగవద్ నామంలో పులకరించుచున్నది.

!!హరిఃతస్సథ్!!

హరే నిత్యం!! హరే సత్యం!!

(సమాప్తం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here