Site icon Sanchika

నారద భక్తి సూత్రాలు-4

[శ్రీ శివానంద మహారాజ్ రచించిన వ్యాఖ్యానం, వ్యాసాశ్రమ శ్రీ మలయాళ స్వామివారి వ్యాఖ్యానం ఆధారంగా శ్రీమతి సంధ్యా యల్లాప్రగడ అందిస్తున్న ఆధ్యాత్మిక సుమమాలిక ‘నారద భక్తి సూత్రాలు’]

నారద భక్తి సూత్రాలు

11.లోకవేదేషు తదనుకూలాచరణం తద్విరోధిషూదాసీనతా

లోక వ్యవహారములో వేద వ్యవహారములో ఏది ఆచరించమని చెప్పబడిందో, దానిని ఆచరించాలి. విరోధమైన విషయాల జోలికి పోకుండా కేవలం సాక్షీభూతంగా ఉండాలని నారదుల వారు చెబుతున్నారు.

లోక మర్యాదను అతిక్రమించకూడదని మునుపు చెప్పారు.

భగవద్గీత, భాగవతము మనకు ఎలా ఉండాలో చెబుతున్నాయి.

భక్తుడు భగవంతునికి అయిష్టమైనవి చెయ్యడు. పరమాత్మను కించపరిచే వాటికి, అట్టి మనుష్యులకు దూరంగా ఉంటారు. ప్రహ్లాదుడు తన తండ్రి నుంచి దూరమైనట్లు, విభీషణుడు తన అన్న నుంచి దూరమైనట్లుగా.

పరమాత్మకు ఇష్టమైన పనులు ఎంత కష్టమైనవైనా భక్తులు ఆచరిస్తారు. నిత్య నైమిత్తిక కర్మలను ప్రతిఫలాపేక్ష లేక చేస్తారు.

ఇవన్నీ పరమాత్మను ప్రీతి పొందించటానికి చేస్తారు తప్ప ప్రతిఫలం ఆశించరు. దీనిని తపస్సుగా భావిస్తారు. భగవద్గీత ఈలాంటి తపస్సు మూడు రకాలుగా చెప్పింది. అవి శారీరిక తపస్సు, వాచక తపస్సు, మానసిక తపస్సు.

శారీరిక తపస్సు:

“దేవద్విజగురుప్రాజ్ఞపూజనం శౌచమార్జవమ్।

బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే॥” (గీత 17-11)

దేవునికి, ద్విజులకు, గురువులకు, జ్ఞానులకు మరియు పెద్దలకు సదా వినమ్రంగా సేవ చెయ్యాలి. వీరి ఆరాధన, శుచి, నిష్కపట్వం, బ్రహ్మచర్యం, అహింస మొదలైనవి ఆచరించటము శారీరక తపస్సు అని చెప్పబడుతుంది.

వాచక తపస్సు:

“అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్।

స్వాధ్యాయాభ్యసనం చైవ వాజ్ఞ్మయం తప ఉచ్యతే॥” (గీత 17-12)

ఉద్వేగము కలిగించని మాటలు, సత్య వచనాలు, కోపం కలిగించని మాటలు, ప్రియమైన హితకరమైన మాటలు, నిత్య వేదశాస్త్ర పఠనము ఇవి వాక్కుకు సంబంధించిన తపస్సు(వాచక తపస్సు) గా చెప్పబడుతుంది.

మానసిక తపస్సు:

మనఃప్రసాదః సౌమ్యత్వం మౌన మాత్మవినిగ్రహః।

భావసంశుద్ధిరిత్యేతత్తపో మానసముచ్యతే॥(గీత 17-13)

ఆలోచనలలో ప్రశాంతత, మృదుత్వం, మౌనం, ఆత్మ నిగ్రహం, మరియు భావములో పవిత్రత, ఇవి మనస్సు యొక్క తపస్సు అని చెప్పబడుతున్నాయి.

హృదయంలో చెడు పెట్టుకొని శారీరక తపస్సు చేస్తే ఫలితం శూన్యం. కాబట్టి ముందు మానసిక శుభ్రత, వాక్కు శుభ్రత ముఖ్యం. ప్రతీవారు తమకు ఉద్దేశించబడిన కర్మలను చేయ్యాలి. వీటి వలన భక్తుల పరమాత్మ ప్రీతి పొందగలరు.

12. భవతు నిశ్చయదార్డ్యాదూర్ధ్యం శాస్త్ర రక్షణం

భగవంతుని భక్తి వలన సాక్షాత్కారము కలిగిన తరువాత కూడా భక్తులు శాస్త్ర ప్రకారం ఆచరణ కలిగి ఉంటారు.

వేదాలు ప్రమాణం. వేద ప్రమాణంగా చెప్పబడిన ధర్మాలను ఆచరించటము భక్తులు చేస్తారు. భక్తులను చూసి అనుసరించేవారుంటారు. భక్తులు అనుసరించే శాస్త్ర ప్రమాణాలు మిగిలిన వారికి ఉదాహరణగా నిలవాలి. లోకము చూసి అనుసరిస్తుంది కాబట్టి భక్తులు అందుకే చెదరక స్థిరత్వం కలిగి ఆధ్యాత్మికతను చూపాలి.

రోగము తగ్గిన తరువాత వైద్యశాస్త్రాన్ని అవహేళన చెయ్యకూడదు. పరీక్ష పాసు అయ్యాక పరీక్షలు అనవసరమని చెప్పరాదు. ఎందుకంటే వీరు లోకానికి ఆదర్శంగా నిలవాలి కాబట్టి.

అందుకే శంకరభగవత్పాదుల వారు

“ఆ జీవితం త్రయస్సేవ్యా వేదాంతో గురురీశ్వరః।

అదౌ జ్ఞానాప్తయే పశ్చాత్ కృతఘ్నత్వ నివృత్తయే॥” అని చెప్పారు.

జీవన్ముక్తులు బొందిలో ప్రాణమున్నంత వరకూ గురువు, శాస్త్రం, ఈశ్వరుని యందు విశ్వాసము భక్తి విడవరాదు. దీని వలననే జ్ఞానప్రాప్తి కలుగుతుంది కాబట్టి.

ఇందుచేతనే కంచికామకోఠి పీఠాదీశ్వరులు శ్రీ చంద్రశేఖర యతివరేణ్యులు తమ చివరి వరకూ చంద్రమౌళీశ్వర పూజ చేసేవారు. వారే స్వయంగా శివుడైనా, పలువురికి ఉదాహరణగా చూపటానికి నిత్యకర్మలను ఆచరిస్తూ ఉండేవారు.

13. అన్యధా పాతిత్యాశజ్కయా

12వ సూత్రంలో చెప్పిన విషయమే గురించి మరింత వివరణ ఈ సూత్రం. ఇందులో నారదుల వారు చెబుతున్నారు, శాస్త్రాన్ని తిరస్కరించటము పాపహేతువు అవుతుంది.

ఆధ్యాత్మికతలో కొంత ముందుకు సాగిన తరువాత వెనకటి శాస్త్రాలను తిరస్కరించటము పాపహేతువే కాదు, సాధనా పథం నుంచి జారిపోవటం కూడా జరుగుతుంది.

తమ పూర్వ అలవాట్లను మార్చుకోకపోతే ఆ భక్తునికే నష్టం కలుగుతుంది. తిరిగి అజ్ఞానంలో పడటానికి అట్టే సమయం పట్టదు. పైకి ఎక్కటానికి ఎంతో కష్టపడాలి కాని పడటానికి నిముష కాలపు అజాగ్రత్త చాలు. అజ్ఞానపు లోతులలో పడ్డ తరువాత త్వరగా కోలుకోలేరు కూడా.

మాయ ఎంతో శక్తివంతమైనది. కామమోహందకారపు బలమి బహు గట్టిది.

భగవానుడు గీతలో చెబుతాడు

“యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః।

ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః॥”

ఇంద్రియాలు ఎంత బలమైనవి అల్లకల్లోలమైనవి అంటే వివేకం కలిగి స్వీయ నియంత్రణ పాటించే సాధకుని మనస్సుని కూడా బలవంతంగా లాక్కుపోగలవు.

“ఇంద్రియాణాం హి చరతాం యన్మనోఽను విధీయతే।

తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి॥”

ఎలాగైతే బలమైన గాలి నీటిలోని నావను, దాని దిశ నుంచి ప్రక్కకు నెట్టివేస్తుందో, అలాగే ఏ ఒక్క ఇంద్రియం పైన కాని మనస్సు కేంద్రీకృతమైతే అది బుద్ధిని హరిస్తుంది.

మనకు మన ఋషులలో విశ్వామిత్రుని గురించి తెలుసు. ఆయన తన కోపం అధిగమించలేకపోయాడు చాలా కాలము. అలాగే కామమును జయించలేక ఎంతో తపస్సును కోల్పోయాడు.

అలాగే ఎందరో సాధకులు కొంత కాలము సాధన చేసి ప్రపంచ మోహాలకు లోబడి భ్రష్టత్వం పొందుతారు. కాబట్టి భక్తుడు సదా అప్రమత్తుడై, శాస్త్ర కర్మలను ఆచరిస్తూ అందరికీ ఉదాహరణగా ఉండాలి.

14 లోకోఽపి తావదేవ కిం తు భోజనాది వ్యాపారస్త్వాశరీర ధారణావధి.

భోజనము మొదలైనని శరీరం ఉన్నంత వరకూ, లోక వ్యవహార శాస్త్రం భగవంతుని సాక్షాత్కార జ్ఞానము కలుగునంత వరకే.

ముముక్షత్వ కలిగే వరకే లోక వవ్యహారాలు. ముముక్షువు అంటే లోక వ్యవహారాల నుంచి స్వేచ్ఛ. ఈ లోకానికి సంబంధించిన సౌఖ్యాలు మోహింపవు ముముక్షువుకు.

శరీరం ఉన్నంత వరకూ దానికి కావలసిన ఆహారము, ఆరోగ్యం కోసం యోగా ఎలాగు తప్పవో, ముముక్షత్వం కలిగే వరకూ శాస్త్రము చెప్పిన కర్మలను ఆచరించక తప్పదు.

కాబట్టి భక్తుడు పరమాత్మను హృదయంలో నిలుపుకొని, అనన్య భక్తితో కొలవాలి. నిత్యకర్మలను ఆచరించాలి.

15. తల్లక్షణాని వాచ్యన్తే నానామత భేదాత్

ఆ భగవద్భక్తియు, దాని లక్షణములున్ను అనేక భేదాలు అనుసరించి బహు విధంగా చెప్పబడ్డాయి.

భక్తి గురించి వివిధ రకాలైన నమ్మకాలు కలవారు వివిధ రకాలుగా బోధిస్తారు. ప్రపంచములోని యోగులు, మహర్షులు సాధకులు ఎన్నో సాంప్రదాయాలు కలిగి ఉన్నారు. సాధకుల మార్గాలలో భేదాలున్నా గమ్యమొక్కటే. కాబట్టి మత వైషమ్యం లేకుండా ఉంటాడు భక్తుడు.

కలియుగంలో నామసంకీర్తన వలన మోక్షం కలుగుతుంది అని అంటారు.

సూత సంహితలో ఈశ్వర నామం ఒక్కటి చాలు సంసారం దాటటానికి అని చెబుతారు.

“శివనామైవ సంసారమహారోగై కశామకమ్।

నాన్యత్సంసారరోగస్య శామకం దృశ్యతే మయా॥”

సంసారము దాటటానికి ఈశ్వర నామమెక్కటి చాలును. ఇది మహా రోగాలకు దివ్యౌషధం. కలియుగములో భక్తి మార్గం సర్వ జనులకు సులభసాధ్యము అని చెప్పబడింది.

మహర్షులు ఒక్కొక్కరు ఒక్కొ మార్గం భక్తి గురించి సూచించారు.

దేవి భాగవతంలో ఈ భక్తి అన్నది తిలధారలా ఉండాలని చెబుతారు.

శంకరులు తన శివానందలహరిలో పరమాత్మ పాదాలు అయస్కాంతముగా, మానవుల భక్తి సూదిలా సూచించారు. అయస్కాంతము ఇనుము వస్తువులను హత్తుకున్నట్లుగా భక్తుడు తన హృదయాన్ని పరమాత్మ పాదాల వద్ద అతికించాలి.

భాగవతం భక్తి గురించి భాగవతోత్తముల గురించి ఎంతో చెబుతుంది. పరమ సత్యం యందు తన సర్వమును నిలపటమని చెబుతుంది.

సాంఖ్యమార్గంలో కపిలుడు, నిరంతరం భక్తి ఆలోచనలను సాగే నదితో పోల్చాడు. సముద్రం వైపు సాగు నదిలా తమ ఆలోచనలను అన్న నదిని సముద్రమన్న పరమాత్మ వైపుకు పంపాలని చెబుతాడు.

ప్రహ్లాదుడు పరమాత్మ వైపుకు ప్రేమతో మొగ్గు చూపాలని చెబుతాడు.

నారదపంచతంత్రంలో భక్తి గురించి చెబుతూ అన్ని ఇంద్రియాలతో చేసే సేవగా వర్ణిస్తారు.

రామానుజులు భక్తిని, భగవంతుని గురించి ప్రేమగా చేసే ధ్యానమని చెబుతారు.

అత్యంత ఉన్నతమైన ప్రేమే భక్తి, యని శాండిల్యుడు చెబుతాడు.

ఎందరో ఎన్నో మార్గాలు చెప్పినా ప్రేమపూర్వకమైన సమర్పణ భక్తి యని ఉద్ఘాటించారు అందరూ.

16. పూజాదిష్యనురాగ ఇతి పారాశర్యః

పూజాదుల యందు ప్రీతి, భక్తియని పరాశర మహర్షి పుత్రుడు వేదవ్యాసుడు చెప్పాడు.

నారదుడు మోక్షానికి భక్తియే మూల కారణమని చెప్పాడు. అదే విషయము వ్యాస, గర్గ, శాండిల్య మున్నగు మహర్షులు నిరూపించారు.

“శివజ్ఞానం ద్విధా జ్ఞేయం సగుణం నిర్గుణం తథా।

అదౌ సగుణమాశ్రిత్య పశ్చాన్నిర్గణ మాచరేత్॥”

అవ్యక్తమైన పరమాత్మ రూపము రెండు విధాలుగా గ్రహించబడుతోంది.

సగుణము, నిర్గుణము అని చెప్పబడుతోంది.

మొదట సగుణోపాసనతో మొదలుపెట్టినా అది నిర్గుణపాసనలోకి దింపుతుంది.

ఆత్మజ్ఞానము, ఆత్మపూజ నుంచి ఆధ్యాత్మిక జ్ఞానము కలిగినా పెరిగినా, మొదటే ఆత్మజ్ఞానానికి వెళ్ళలేరు. మొదట అది సాకార పూజతోనే మొదలు పెట్టాలి.

మొదటే అంతర్దృష్టి ఏర్పడదు కాబట్టి సాకార పూజ అవసరము.

విగ్రహమును పూజించుట మూఢత్వమని అనరాదు.

విగ్రహాలను దైవ భక్తితో పూజిస్తే వాటి ఫలితము తప్పక ఉంటుంది. అది రాను రాను ధ్యానములోకి దింపి మానసిక పూజగా మారుస్తుంది.

మార్కండేయుడు శివలింగమును ఈశ్వర భావనతో పూజించబట్టే లింగము నుంచి ఈశ్వరుడు వచ్చి కాపాడుతాడు. ప్రహ్లాదుడు చరాచరములలో నారాయణుడిని చూసినందుకే కదా నృసింహస్వామి స్తంభము నుంచి వెడలి కాపాడాడు.

పూజ బాహ్యమైనది పదహారు ఉపచారాలతో కూడి ఉంటుంది.

ధ్యానము, ఆవాహనము, పాద్యం, అర్ఘ్యం, ఆచమనీయం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, పుష్పాక్షతలు, దూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, నీరాజనం, మంత్రపుష్ప నమస్కారం.

మానసిక పూజ అత్యుత్తము అని సదా చెప్పబడింది. నయనార్లలో ఒకరైన పూసలన్ శివునికి మందిరము కట్టాలనుకుంటాడు. కాని పేదవాడైన అతనికి అది కుదరని పని. కాబట్టి మానసికంగా దేవాలయం నిర్మిస్తాడు తన హృదయంలో. అతను బాగా చదువుకున్నవాడు. అతనికి ఆగమశాస్త్ర విధి తెలుసు. ఆ పద్ధతిలో హృదయంలో దేవాలయం నిర్మించాడు. ప్రతిష్ఠకి అతను ఒక ముహుర్తం పెట్టుకున్నాడు.

ఆ దేశము నేలే రాజు శివునికి దేవాలయం కట్టాడు. రాజు కూడా శివ ప్రతిష్ఠకు ఒక ముహుర్తం నిర్ణయించుకుంటాడు. శివుడు రాజు కల్లోకి వచ్చి “నేను ఆ రోజు పూసలన్ కట్టిన దేవాలంలో ప్రతిష్ఠ వలన అక్కడే ఉంటా. నీ ముహుర్తం మార్చుకో!” అని చెప్పి మాయమవుతాడు.

రాజుకు ఆశ్చర్యం కలుగుతుంది.

తన రాజ్యంలో తనకు తెలియకుండా అంత గొప్ప దేవాలయం ఎక్కడుందని. రాజు మరురోజు పూసలన్‌ని వెదుకుతూ వెడతాడు.

పూసలన్ యధావిధిగా ధ్యానంలో కూర్చొని దేవాలయ ప్రతిష్ఠను చేసుకుంటూ ఉంటాడు.

రాజు వచ్చి పూసలన్‌కు నమస్కరించి దేవాలయం చూపమని అడుగుతాడు.

పూసలన్ ఆశ్చర్యపోతాడు. అతని మానసిక దేవాలయం అతనికీ శివునికీ తప్ప మరొకరికి తెలియదు కదా. తదనంతరం రాజు కల గురించి విని పూసలన్ పులకరించిపోతాడు. తన హృదయపు దేవాలయంలో పరమశివుడిని ప్రతిష్ఠించినప్పుడు బాహ్యమైనవి శివుడు తిరస్కరించాడని తెలిసి.

మానసికమైన పూజకు అంతటి శక్తి ఉంది. అది ఉత్తమోత్తమమైనది. కాని ఆ స్థితికి చేరటానికి ముందు సాకార పూజ అవసరము కలుగుతుంది.

(సశేషం)

Exit mobile version