నారద భక్తి సూత్రాలు-5

0
3

[శ్రీ శివానంద మహారాజ్ రచించిన వ్యాఖ్యానం, వ్యాసాశ్రమ శ్రీ మలయాళ స్వామివారి వ్యాఖ్యానం ఆధారంగా శ్రీమతి సంధ్యా యల్లాప్రగడ అందిస్తున్న ఆధ్యాత్మిక సుమమాలిక ‘నారద భక్తి సూత్రాలు’]

నారద భక్తి సూత్రాలు

17. కథాదిష్వితి గర్గః

[dropcap]నా[/dropcap]రదుడు, శాండిల్యుడు, వ్యాసుడు, కపిలుడు చెప్పినట్లుగానే గర్గుడు కూడా చెప్పాడు. ఆయన భగవంతుడి గుణగాథల యందు ప్రీతి కలిగి ఉండటము భక్తి అంటాడు.

రామునిగా, కృష్ణునిగా అవతారాలు లీలలు వినటం, చదవటం ప్రీతి కలిగి ఉండటము భక్తి.

ఎన్నో మంచి పనులు చెయ్యటము వలననే భక్తి కలుగుతుందని పెద్దలు చెబుతారు.

తపస్సు చేత కాని, వేదాధ్యయనము వలన కాని, శాస్త్ర జ్ఞానము వలన కాని, భగవంతుడిని పొందటము అంత సులభము కాదు. కాని అనన్య భక్తి వలన అది సాధ్యమే. దీనికి మంచి ఉదాహరణ గోపికా స్త్రీలే.

ఇందుకే ముకుందమాలలో కులశేఖరాళ్వారు ఇలా అంటారు:

“వ్యాధస్యాచరణం ధ్రవస్యచ వయో విద్యాగజేంద్రస్య కా
కుబ్జాయాఃకిము కామరూపమధికం కిం వా సుధామోన్ ధనమ్
వంశః కో విధురస్యయాదవపతేరుగ్రస్యకిం పౌరుషం
భక్త్యా తుష్యతి కేవలం న చ గుణైర్భక్తిప్రియో మాధవః॥”

ధర్మవ్యాధుని ఆచరణమేమి?

ధ్రువునికి వయస్సు ఎంత?

గజేంద్రుని విద్య యెంత? కుబ్జ సౌందర్యమెంత?

కుచేలుని ధనమెంత?

విదురుని వంశమేమిటి?

ఉగ్రసేనుని పౌరుషమేపాటిది? కాని వీరంతా తమ భక్తి చేతనే భగవంతునికి ప్రియమైనవారైనారు.

కాబట్టి భగవంతుని ప్రీతితో పూజించి, ఆయన గుణగణాలను శ్రవణ మనన నిధిధ్యాసన చెయ్యటము భక్తుల కర్తవ్యం.

18. ఆత్మరత్యవిరోధేనేతి శాండిల్య

ఆత్మధ్యానముకు విరోధములేని భగవత్కార్యాలు చెయ్యమని శాండిల్య మహర్షి తన భక్తి సూత్రాలు చెబుతాడు.

అంటే బ్రహ్మనిష్ఠకు అడ్డు తగలని కార్యాలు మాత్రమే చెయ్యమని మహర్షి బోధ. ఆత్మ పరమాత్మలో రమించటమే భక్తి యని మహర్షి భావన.

ఎంత పుణ్యం ఇచ్చే పనిగాని అది ఆత్మవిద్యకు భగవంతుని ధ్యానానికి ప్రతిబంధకమైతే వాటిని త్యజించాలి. ఎందుకంటే ఆత్మ కన్నా ఉన్నతమైనది మరి లేదు. ఆత్మ తత్త్వమును బోధించు విద్యయే ఉన్నతమైనది. దీనిని వ్యతిరేకమైనవి అముఖ్యములు.

గీతలో చెప్పినట్లుగా

“కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్।
ఇంద్రియార్థాన్విమూఢాత్మా మిథ్యాచారస్స ఉచ్యతే॥” (3-6)

మూఢుడు కర్మేంద్రియాలను జ్ఞానేంద్రియాలను అణచిపెట్టి ఇంద్రియ విషయాలపై మనస్సు పెట్టి స్మరిస్తాడో వాడిని మిథ్యాచారుడని, వంచనపరుడుని చెబుతారు.

కాబట్టి ఆత్మ విషయానికి వ్యతిరేకమైన పనులు చెయ్యరాదు. ఆత్మ యందు నిష్ఠతో ధ్యానము చేసిన అది బ్రహ్మవిద్యకు ద్రోహదం చేస్తుంది.

ఆత్మను తెలుసుకున్నవారికి వేరొకటితో పనిలేదు.

గంగాతీరములో ఉంటే నూతులతో పని ఏముంది?

సూర్యుడు ఉన్నప్పుడు నూనె దీపాల అవసరము లేదు కదా. అట్లే మనోవాక్కాయములతో ఆత్మవిద్య యందు మాత్రమే దృష్టి నిలపాలి. మరి ఇంకో విద్యతో పనిలేదు.

19. నారదస్తు తదర్పితాఖిలాచారతా తద్విస్మరణే పరమ వ్యాకులతేతి

భగవంతునికి సమస్త ఉపచారాలు చేయ్యటము భక్తుని లక్షణము. ఆ ఉపచారాలు చెయ్యకపోతే అనంతమైన దుఃఖం కలగటం పరమ భక్తుని లక్షణం.

ఈ సూత్రంలో నారదమహర్షి తన అభిప్రాయం వెల్లడి చేస్తున్నాడు. ముందరి సూత్రాలు వ్యాస, గార్గ, శాండిల్య యొక్క సూత్రాలను ఉదహరించాడు.

మనోవాక్కాయములతో భగవంతుని తలవటం భక్తుని లక్షణము. అంతే కాదు సర్వం పరమాత్మకు అర్పించటము కూడా అంతే ముఖ్యమని నారదులు చెబుతున్నారు.

శ్రీ.రామకృష్ణ పరమహంస జగజ్జనని కోసం ఎంతో దుఃఖపడితే కాని ఆమె కనపడలేదు. ఆమె క్షణం కనపడకపోయినా ఆయన విపరీతంగా రోదించేవారు.

వ్రజభూమియైన బృందావనంలో గోపికా స్త్రీలు కృష్ణుని కోసం పడిన వేదన ఇంత అంత కాదు. కృష్ణుడు కనిపించి మాయమైన తరువాత వారంతా పరమ దుఃఖమనుభవించారు.

ప్రహ్లాదుని అవస్థను చూపే ఈ పద్యం ఒక్కటి భగవద్భక్తుల స్థితిని చూపుతుంది:

~

సీ. వైకుంఠ చింత వివర్జిత చేష్టడై యొక్కడు నేడుచు నొక్కచోట,
నశ్రాంత హరి భావనారూఢ చిత్తుడై యుద్ధతుడై పాడునొక్కచోట,
విష్టుడింతయు కాని వేరొండు లేదని యొత్తిలి నగుచుండు నొక్కచోట
నలినాక్షుడను నిధానము గంటి నేనని యుబ్బిగంతులు వైచునొక్కచోట

బలుకు నొకచోట పరమేశు గేశవు
బ్రణయహర్ష జనిత బాష్పసలిల।
మిళిత పులకుడై నిమీలిత నేత్రుడై
యొక్క చోట నిలిచి యూరకుండు॥”

ఇందులో ప్రహ్లాదుని అవస్థను వివరించాడు పోతన.

భగవద్భక్తుల అవస్థ పరమాత్మ గురించి ఆయనను చూడటం, తలవటము పూజించటము మీదనే.

పరాభక్తి మాత్రమే పరమార్థజ్ఞానాన్ని ఇస్తుంది. సంసారరోగాన్ని కుదురుస్తుంది.

అట్టి భక్తి మాత్రమే ముక్తికి సోపానం అవుతుంది.

20. అస్యైవ మేవమ్

సర్వ వ్యాపారాలనూ భగవంతునిలో దర్శించి, చిత్తము సదా భగవంతుని యందు నిలిపి, మనస్సు తప్పినప్పుడు వ్యాకులపడి యుండేవారే, భక్తులని నారదమహర్షి చెబుతున్నారు.

భాగవతములో వివరించిన భాగవతోత్తముల చరిత్రలు ఈ సూత్రము చూపుతోంది. ముందు వచ్చే సూత్రములో మరింత వివరంగా వివరణ ఉంది.

21. యథా వ్రజగోపికానామ్

ఎలాగంటే (అంటే పైన 20వ సూత్రంలో చెప్పినట్లుగా) గోకులములోని గోపికా స్త్రీలు శ్రీకృష్ణుని యందు భక్తి కలిగి మైమరచి తన్మయులై ఉంటారు.

భక్తులలో పరమ భక్తులైన వ్యాసులు, శుకమహర్షి, ఉద్ధవ, వాల్మీకి వారెందరూ ఉన్నారు. వారిని నారదుల వారు ప్రస్తావించారు కూడా. వారి గురించి చెప్పినా పరమాత్మ భాగవతంలో కేవలం బృందావన గోపికల గురించి మాత్రమే చెబుతాడు.

బృందావన గోపికలకు కృష్ణుడే సర్వం.

వారు కృష్ణుని గురించి చెబుతూ ఎక్కడ చూసినా కృష్ణుడే కనపడుతున్నాడని అతని మురళి వినపడుతున్నదని చెబుతారు. “మేము చూసిన ప్రతి చోటా శ్యామా నే కనపడుతున్నాడు. నల్లని వాన మబ్బులలో నల్లనివాడు కనిపించాడు, నల్లని తమాలతీగలలో, యమున నదీ జలంలో సర్వం కృష్ణుడే” అని గోపికలు మొరపెట్టుకుంటారు.

తన పరిపూర్ణమైన భక్తితో తాము తమ సర్వం కృష్ణుడికి సమర్పించుకుంటారు గోపికలు.

వారికి కృష్ణుడు తప్ప మరోకటి కనిపించదు. వారి ప్రేమ ముందు పరమాత్మ దాసుడైనాడు.

వారు అంటే గోపికలు పూర్వ జన్మలో దండకారణ్య మునులు. వారు రాముని సాంగత్యం కోరుకున్నారు. వారికి ద్వాపర యుగంలో ఆ కోరిక తీరుతుందని రాముడు చెప్పి వెళ్ళిపోతాడు. వారు వ్రజభూమిలో గోపికలుగా జన్మిస్తారు. వారి ప్రేమకు ఎల్లలు లేవు. వారు చదువుకోని అనాగరిక గొల్ల పడతులు కాని వారి భక్తి అత్యంత్త ఉత్తమమైనది.

ఉద్ధవునితో వారికి సందేశం పంపుతూ కృష్ణుడు చెబుతాడు “ఎవరు లోకాలను లోకధర్మాలను విడిచి నా మీదనే మనస్సు పెట్టి భక్తి ప్రపత్తులతో ఉంటే, వారిని దయతో కాపాడుతాను. ఆశ్రితులను ఆదుకోవటమే నా స్వభావసిద్ధమైన గుణం” అని.

“లౌకిక మొల్లక నన్నా
లోకించు ప్రపన్నులకును లోబడి కరుణా।
లోకముల బోషింతును
నాకాశ్రితరక్షణములు నైసర్గికముల్॥” (భాగవతం)

గోపికలు తమ సర్వం కృష్ణుని పాదాలకు సమర్పించారు. కృష్ణుడి లీలలను చెప్పుకున్నారు. కృష్ణుడిలా అభినయించారు. కృష్ణున్ని తలచుకొని సంతోషించారు. ఆయన్ని గూర్చి బాధ అనుభవించారు. విరహానికి వగచారు. వారి భక్తి ముందు మరే భక్తి నిలబడదని కృష్ణుడే చెప్పాడు. పరమాత్మలో ఐక్యమై పోవటం కోసం తప్పించి ఆయనలో కరిగిపోవటమే భక్తి యని నారదుల వారు చెబుతున్నారు.

22. తత్రాపి న మహాత్మ్యజ్ఞాన విస్మృత్యపవాదః

గోపికా స్త్రీలు పామరులవలే శ్రీకృష్ణుని చేరలేదు. వారు కేవలము పరమాత్మను చేరే భావముతోనే ఉన్నవారు. అందుకే లోకాపవాదు గురించి భయపడలేదు. వారు లోకాలన్నింటికి స్తుతించటానికి అర్హులులైనారు.

గోపికల విరహం పామరుల విరహం వంటిది కాదు. అది దేహభావపు కోరిక కాదు. దేహాన్ని విడిచి ఆత్మ పరమాత్మలో ఐక్యమయ్యే విధానము. అలా కాకపోతే వారు నీచత్వం పొంది ఉండేవారు.

బ్రహ్మాది దేవతలు సైతం వారిని పూజించ తగ్గట్లుగా ఉండేవారు కారు. ద్వాపర యుగం తరువాత కూడా గోపికలు పూజ్యులైయ్యారంటే వారి భక్తి ఎటువంటిదో మనకు తెలుస్తుంది. గోపికలది నిర్వికల్ప సమాధి స్థితి.

“క్షీరం క్షీరే యథా క్షిప్తం తైలం తైలే జలం జలే।
సంయుక్తమేకతాం యాతి తథాత్మన్యత్మవిన్మునిః॥”

అని యోగ శాస్త్రంలో సమాధి లక్షణం చెబుతున్నారు. అంటే పాలలో పాలలా, నూనెలో నునెలా, నీటిలో నీటిలా కలిసిపోవటం. అప్పుడు ఐక్యమవుతారు. భిన్నత్వం నశిస్తుంది. గోపికలది ఇటు వంటి భక్తే.

మానవులకు దుఃఖ కారణం అజ్ఞానం. పరమాత్మను మరచి మాయలో మునగటం వలన మానవుడు దుఃఖపడుతున్నాడు. బహిర్ విషయాలపై అనురాగం తగ్గించుకొని, అంతర్ముకత్వం వైపుకు అడుగులు వెయ్యాలి. భగవంతుని నమ్మి, కొలవటం వలన లోలోపలి వెలుగు అర్థమవుతుంది.

23. తద్విహీనం జారాణామివ

గోపికలకు ఉన్న తన్మయస్థితి కనుక భక్తి లేని స్థితి ఉంటే జారుల స్థితి అంటారు.

గోపికలు తన్మయ స్థితిలో ఉన్నారు. వారిది శుద్ధభక్తి. వారిది ఆత్మాపరమాత్మల సంబంధం. వారికున్న భక్తి లేకపోతే అది జారత్వమని అంటారు.

చాలా మటుకు గోపికా భక్తిని అర్థం చేసుకోలేక దానికి రకరకాలుగా పేర్లు పెట్టిన వారున్నారు.

గోపికల శుద్ధభక్తి గురించి నారదుల వారు వివరిస్తున్నారు. వారు తన్మయస్థితిలో ఉన్నారు. వారు పరమాత్మ మీద భక్తి అన్న మధువు సేవించారు. అందుకే వారు బాహ్య స్పృహ కోల్పోయి పరమాత్మ కొరకు వెతికారు, ఆయన కనపడకపోతే విరహంలో వగచారు, కనిపించిన తరువాత ఆయనలో ఐక్యమైపోయారు.

వేదాంత డిండిమలో శంకరుల వారు ఇలా చెబుతారు

“సుఖమల్పం బహుక్లేశో విషయగ్రాహిణాం నృణామ్।
అనంతం బ్రహ్మ నిష్ఠానామితి వేదాంత డిండిమః॥”

విషయాసక్తులైన జనులు కల్పమైన సుఖమును అంతం లేని క్లేశమును పొందుతారు. బ్రహ్మనిష్ఠులైన మహనీయులు సుఖవంతమైనది పొందుతారు.

స్త్రీల సంగం గురించి వేదాంతములో పదునైన మంగలి కత్తికి పూసిన తెనె వలె పోల్చుతారు. మధువు త్రాగినా నాలుక తెగుతుంది కాబట్టి.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here