Site icon Sanchika

నారద భక్తి సూత్రాలు-6

[శ్రీ శివానంద మహారాజ్ రచించిన వ్యాఖ్యానం, వ్యాసాశ్రమ శ్రీ మలయాళ స్వామివారి వ్యాఖ్యానం ఆధారంగా శ్రీమతి సంధ్యా యల్లాప్రగడ అందిస్తున్న ఆధ్యాత్మిక సుమమాలిక ‘నారద భక్తి సూత్రాలు’]

నారద భక్తి సూత్రాలు

24. నాస్వైవ తస్మింస్తత్సుఖ సుఖిత్వమ్

భగవంతునిలో ఐక్యం చేసే తన్మయ సుఖం జార స్త్రీలు తమ ప్రియులతో పొందే సుఖం వంటిది కాదు.

కామ పరవశపు సుఖం కాదు, గోపికలు పొందినది. గోపికలు తమ సర్వస్వం పరమాత్మ అయిన కృష్ణుడికి సమర్పించారు.

అది శరీర సమర్పణ కాదు, ఆత్మ సమర్పణ. వారు కృష్ణుడికి సమర్పణ అయ్యాక వారికీ కృష్ణుడికి తేడా లేదు. ఆత్మ పరమాత్మలో కలిసిపోతుంది.

అది భగవదైక్యము, అనుసంధానముచే పరమయోగులు పొందే శాశ్వత బ్రహ్మానందం.

మానసికమైనది. ఆత్మసంధానపరిచినది. భౌతికమైన శరీరానిది కాదా ఆనందం, ఐక్యం.

ఆత్మ చైతన్యం. పరమాత్మ చైతన్యం. ఆత్మయో చైతన్యం.

దేహేంద్రియ మనస్సులు జడములు. ఆత్మ పరమాత్మలో ఐక్యము పొందటం ప్రాకృతమైన బ్రహ్మ సుఖము. శాశ్వతమైనది.

గోపికలు కృష్ణునిలో ఐక్యము చెంది బ్రహ్మానందం పొందారు. తమను తాము కృష్ణుడికి సర్వస్య శరణాగతి చేశారు. వారి ఉనికిని సంతోషంగా కోల్పోయారు. అది భక్తిలో ఉత్కృష్టమైనది.

గోపికల భక్తి అత్యంత ఉత్తమైనదని చెప్పి నారదులు వారు ఈ అధ్యాయాన్ని ముగించారు.

25. సా తు కర్మజ్ఞానయోగేభ్యో ఽ ప్యధికతరా

ఈ 25 వ సూత్రం నుంచి మొదలు 33 సూత్రం వరకూ నారదులవారు భక్తి యొక్క మహత్త్వం, పరా భక్తి గురించి చెబుతున్నారు.

ఆ తన్మయ భక్తి యజ్ఞాది కర్మల కన్ననూ, నిత్యానిత్య వస్తు వివేకం కన్ననూ, అష్టాంగ యోగం కన్ననూ అధికమైంది.

యజ్ఞాది కర్మలు, ఆత్మానాత్మ వివేక జ్ఞానం, అష్టాంగ యోగం మొదలైనవి భక్తి ఉన్నప్పుడే ఫలితమిస్తాయి. భక్తి వాన వంటింది. కర్మ, జ్ఞానం, యోగం విత్తనాల వంటివి. కాబట్టి ఇవి ఫలించాలంటే ముందు హృదయంలో భక్తి ఉండాలి.

నిజ భక్తి లేకుండా ఎవ్వరూ పరమాత్మ యొక్క నిజతత్త్వం తెలుసుకోలేరు.

ముందు కుటుంబం పట్ల తన బాధ్యత తీర్చుకున్న వారు తన కుటుంబాన్ని ప్రేమించినట్లు ప్రతివారిని, తన దేశాన్ని ప్రేమించినట్లుగా ప్రపంచాన్ని ప్రేమించటం మొదలుపెట్టాలి.

జ్ఞాన, యోగ మార్గంలో సాధకులు పడిపోయే అవకాశం ఉంది. కాని భక్తి మార్గంలో ఆ భయంలేదు.

భక్తి మార్గంలో పరమాత్మ భక్తుని అడుగడునా పడకుండా కాపాడుకుంటాడు.

భక్తుడెవరైనా కాని అతని కుల మతాల కావల పరమాత్మ వాటి కతీతంగా భక్తుని చేరదీస్తాడు.

కర్మ మార్గం అంటే రకరకాల క్రియల ద్వారా పరమాత్మను సంతృప్తి పరచటం. ధర్మశాస్త్రాలు బోధించిన కర్మలను అనుసరించటము.

ప్రతిరోజూ ఉదయం చేసే పూజ నిత్యకర్మ. వ్రతాలు అప్పడప్పుడు చేసే పూజలు నైమిత్తిక కర్మలు అంటారు.

కర్మ ప్రకారం పనిలో పరమాత్మ ఉంటాడు.

కర్మయోగులు అందరి మీద సమదృష్టి, నిదానం, కరుణ, దయ, తెలివిగా ఉండటం, దానశీలత, ఆహారవిహారాదులలో నియతి కలిగి ఉండాలి.

కర్మ యోగి తన తెలివిని, జ్ఞాన యోగి తన జ్ఞానము చూపితే భక్తుడు పరమాత్మ యందు తన ప్రేమను చూపుతాడు.

అర్జునుడు కృష్ణుడిని అడుగుతాడు, “సాకార భక్తుడా నిరాకార భక్తుడా? ఎవరు నిజభక్తులు?” అని.

దానికి పరమాత్మ సమాధానంగా “ఎవరు మనస్సును నాపై నిలిపి సేవిస్తారో వారి నిజభక్తులు” అని చెబుతాడు.

భక్తితో తప్ప నన్ను మరో దానితో కొనలేరు అని చెబుతాడు కృష్ణుడు.

అందుకే భాగవతంలో

“చిక్కడు వ్రతముల క్రతువుల

జిక్కడు మరి దానశౌచ శీల తపముల

జిక్కడు యుక్తిని క్రియను

జిక్కిన భక్తి నచ్యుతుండు సిద్ధము సుమండీ!” అన్నారు.

“సర్వేశ్వుండగు శ్యౌరి కింకరుచేయు ధనమున్నదే భక్తి ధనము కాక

సర్వోపగతుదగు చక్రి బంధింపు బలమున్నదే భక్తి బలము గాక

సర్వభోక్తు జలజా తాక్షుతనియున్ ఫలమున్నదే భక్తి ఫలము గాక

సర్వజ్ఞుడైన కేశవుని మెప్పించెడు విద్య యున్నదే భక్తి విద్యగాక

సర్వ వరదుడైన చార్మి సన్నిధి చేర్చు

పథము గలదే భక్తి పథము గాక

గాన ఈతడు భక్తి గలవారికేగాని

పరులకర్థమగునే పడతులారా” అని చెప్పుకుంటారు.

26. ఫలరూపపతివాత్

ఈ భక్తి ప్రత్యక్ష ఫలితాలను ఫలాన్ని ఇస్తుంది.

కర్మలు, యజ్ఞాలు వంటి కత్రువులు భక్తిని కలగచేస్తాయి. కేవలం భక్తి మాత్రమే ఫలితం అయిన మోక్షాన్ని ఇస్తుంది.

కొందరు యోగాను సాధన చేస్తారు. కొందరు మతపరమైన కర్మలను తు.చ. పాటిస్తారు. ఇంద్రియ నిగ్రహంతో సాధన చేస్తారు. కొందరు నిష్కామ కర్మలను పాటిస్తారు.

కొందరు సాధనా చతుష్టయాన్ని పాటిస్తారు.

జ్ఞాన సముపార్జనే విధిగా పాటించే వారు కూడా ఉన్నారు.

కొందరు రాజయోగాన్ని సాధన చేస్తారు, కైవల్యం కోసము. కాని భక్తులు కోరేది భక్తి ఒక్కటే.. భక్తులు భక్తితో మొదలెట్టి భక్తితోనే ఉంటారు. భక్తి దేని వల్లనో రాదు. కేవలం భక్తి వల్ల తప్ప.

భక్తి ఏమీ కోరదు. భక్తునికి భక్తి తప్ప మరోటి అవసరం లేదు. పరాభక్తి తప్ప మరోటి కోరరు భక్తులు.

అదే వారి తుట్టతుది కోరిక.

ఈ పరాభక్తి అన్నది సాధనలలో వారు చేసే అనేక కర్మలలో అత్యంత ఉత్తమమైనది.

భక్తి అన్నింటి కన్నా ఉత్కృష్టమైనది. ఉన్నతమైనది.

అందుకే నారదుల వారు “ఫలరూపత్వాత్” అని పేర్కొన్నారు.

27. ఈశ్వరస్యాప్యభిమానిద్వేషిత్వాద్దెన్య ప్రియత్వాచ్చ

దురభిమానాన్ని, దురహంకారులను పరమాత్మ కూడా ఇష్టపడడు.

శిష్టులను సదాచారులను రక్షించటము పరమాత్మ పని. దుష్టులను శిక్షించటము కూడా ఆయన పనే.

భక్తుడు పూర్తిగా భగవంతుని మీదనే ఆధారపడుతాడు. భక్తుడు పరమాత్మ సన్నిధిలో పరమానందంగా ఉంటాడు. మిగిలిన వారు ధనం, కీర్తి, అహంకారం వంటి వాటి వెనక పరుగెడితే భక్తుడు సదా పరమాత్మ నామంతో సంతోషంగా ఉంటాడు. తన అహంకారాన్ని పరమాత్మ పరం చేసి సంతోషపడతాడు.

భగవంతుడు సదా భక్తులను కాపాడటానికి సిద్ధంగా ఉంటాడు. అహంకరించిన వారికి వారి అహమే అడ్డు పడి ఆ సత్యం తెలియనియ్యదు.

ఏ మానవుడైతే ధనం, కీర్తి ఉన్నదని అహంకరిస్తాడో వాడు పరమాత్మ నీడను సైతం చూడలేడు.

స్వర్గంలో ధనవంతులకు, లోభులకు స్థానం లేదని చెబుతారు.

గర్వం వలన అహంకారం, అహంకారం వలన అజ్ఞానం పెరిగి మానవుడు పరమాత్మను కోల్పోతాడు.

కాబట్టి ఏ విషయానికైనా అహంకరించనక్కల్లేదు.

దుష్టత్వం వలన పరమాత్మ సన్నిధి కోల్పోతాము.

“అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రితా।

మామాత్మ పరదేహేషు ప్రద్విషన్తోఽ భ్యసూయకాః॥”

దురహంకారం, బలమును, గర్వం, దురాశ, కోపం, ఇతరులను ద్వేషించుట, వీరి కర్మలు పెరిగి వీరు తిరిగితిరిగి ఆ చట్రంలో పడుతూ ఉంటారు. దుర్మాగం పెరిగితే ఇక స్వామే కదిలి వస్తాడు.

గీతలో చెప్పాడు స్వామి

“యథాయథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత।

అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్॥”

అధర్మం వృద్ధి చెందినప్పుడు ధర్మాన్ని కాపాడటానికి వస్తానన్నాడు.

జ్ఞానయోగము వలన జ్ఞానము కలుగుతుంది. కాని భక్తి వలన భగవంతుడు లభ్యమవుతాడు.

కాబట్టి కేవలం దైవ భక్తి వల్లనే మానవులు పరమాత్మను పొందగలరు.

28. తస్యా జ్ఞానమేవ సాధనమిత్యేకే

అర్థం: భగవద్భక్తికి జ్ఞానము ఒకటి సాధనమని కొందరు ఋషులు అనుకుంటారు.

అర్థం: జీవేశ్వర జగత్తుల జ్ఞానము గలుగుటయే జ్ఞానమని యర్థం.

పేర్లు వేరుగా అన్ని విధానాలు పరమాత్మ గురించి చెబుతున్నాయి.

పరమాత్మ సర్వత్రా ఉన్నా, మానవులకు అది అందదు.

అందుకే శంకరులు అపరోక్షానుభూతి చెప్పారు.

“స్వ వర్ణాశ్రమధర్మేణ తపసా హరితోషణాత్।

సాధనం ప్రభవేత్సుంసాం వైరాగ్యాదిచతుష్టయమ్॥”

ప్రతి వారు తమ అనుష్ఠానం బట్టి, తపస్సు బట్టి, భగవదనుగ్రహం బట్టి సాధనాచతుష్టయం కలుగుతుంది.

అందుకే నేటికీ పుజాదులు చేస్తారు పీఠాధిపతులు సైతం.

భగవద్ ఉపాసన వలన భగవంతుని అనుగ్రహం కలిగి మోక్షం ప్రాప్తిస్తుంది. దీనికి జ్ఞానమని పేరు. ఆత్మసాక్షాత్కారమే జ్ఞానమంటారు.

భగవంతుని మీద భక్తి మాత్రమే తుదకు చేరుస్తుందనే భావనను ఇది ధృవీకరిస్తుంది.

శంకరుల ప్రశ్నోత్తర మణిరత్నమాలలో ఈ విషయమే చెబుతారు.

“అపార సంసార సముద్రమధ్యే సన్మజ్జతో మే శరణం కిమస్తి?

గురో! కృపాళో! కృపయా వదైత ద్వశ్వేశ పాదాంబుజ దీర్ఘనౌకా॥”

ప్రశ్న – శిష్యుడు – ‘ఓ గురువరా! కృపాళూ! అంతులేని జనన మరణాదులకు అవాసరమైన ఈ సంసార సాగరంలో లెస్సగ మునిగియున్న నాకు తరుణోపాయమేది?

గురువు- సర్వేశ్వరుని యొక్క పాదద్వంద్వమనెడి ధృడంగా ఉన్న ఓడయే శరణ్యం.

సాగరాన్ని దాటటానికి నౌక ఎలాగో, సంసారమన్న సాగరాన్ని దాటటానికి సర్వేశ్వరుని మీద భక్తి అటువంటిది.

శ్రీదత్తాత్రేయడు త్రిమూర్తి అవతారం. ఆయనను శరణువేడిన వారికి బ్రహ్మజ్ఞానమివ్వ సంతోషుడు.

దత్తుడు రచించాడని చెప్పే అవధూత గీతలో

“ఈశ్వరాను గ్రహాదేవ పుంసామ ద్వైతవాసనా

మహాభయ పరిత్రాణా ద్విత్రాణా ముపజాయతే॥”

ఈశ్వరుని అనుగ్రహం వల్లనే ఒకరు తమ గురించి తెలుసుకొని, పరమాత్మకు తమకూ అభేదం తెలుసుకుంటారు. అది ఈశ్వరుని మీద భక్తి వలననే సంభవిస్తుంది.

కాబట్టి కేవలం భక్తి వలననే తాము పరమాత్మలో ఒక తునక యని తెలుసుకుంటారు మానవులు.

29. అన్యోన్యాశ్రయత్వమిత్యన్యే

అర్థం: మరి కొందరు మునులు భక్తి లేక జ్ఞానము, జ్ఞానము లేక భక్తి లేదని చెప్పారు.

“ప్రహ్లాద నారద పరాశరా పుండరీక

వ్యాసాంబరీష శుక శౌనక భీష్మదాల్బ్యా।

రుక్మాంగదార్జున వసిష్ఠి విభీషణాదీన్

పుణ్యానిమాన్ పరమ భాగవతాన్ స్మరామి॥”

ప్రేమ లేకుండా భక్తి కలగదు. పరమాత్మ మీద ముందు ప్రేమ కలగాలి. పూర్తిగా తెలుసుకోకుండా ఒకరు దేనిని ప్రేమించలేరు. వారు ప్రేమించేదేమిటో వారికి తెలియాలి. అందుకే దాని గురించి అవగాహన ఉండాలి.

ప్రపంచములో ఎవ్వరూ ఒక్క ఉచ్ఛ్వాసతోనో, నిశ్వాసతోనో బ్రతకరు. రెండు కావాలి.

చెట్లు, జంతువులు ఒక్క ఎండతోనో, ఒక్క వాన తోనో బ్రతకవు. రెండూ కావాలి.

ప్రపంచములో మహాత్ములు చెబుతారు అందుకే భక్తి జ్ఞానము రెండూ కావాలని.

ఆ రెంటితోనే అజ్ఞానము తొలుగుతుంది.

“జలగ్నిభ్యాం యథా యంత్రః చలత్యన్యతరేణ న।

తథా విద్యాం చ యోగం చ ప్రోస్య జీవో విముచ్యతే॥”

ఎలాగైతే నీటి చేత నిప్పు చేత రెంటితో యంత్రం పని చేస్తుందో, జీవుడు కూడా ఒక్క భక్తి గాని, ఒక్క జ్ఞానము గాని కాక రెంటితో ముక్తి పొందుతాడు.

శరీరానికి రోగమైతే ఎలా ఓషదము సేవిస్తారో అలాగే భవరోగానికి ఓషదపానన చెయ్యాలి. అదే భక్తి జ్ఞానం.

(సశేషం)

Exit mobile version