Site icon Sanchika

నారద భక్తి సూత్రాలు-8

[శ్రీ శివానంద మహారాజ్ రచించిన వ్యాఖ్యానం, వ్యాసాశ్రమ శ్రీ మలయాళ స్వామివారి వ్యాఖ్యానం ఆధారంగా శ్రీమతి సంధ్యా యల్లాప్రగడ అందిస్తున్న ఆధ్యాత్మిక సుమమాలిక ‘నారద భక్తి సూత్రాలు’]

నారద భక్తి సూత్రాలు

38. ముఖ్యతస్తు మహత్కృపయైవ భగవత్కృపాలేశాద్వా

భగవంతుని మీద భక్తి కలగటము మహాత్ముల యొక్క కృపయో, లేక లేశమాత్రము భగవంతుని కరుణా ముఖ్యమైన కారణము.

మునపటి సూత్రాలలో నారదులవారు విషయ త్యాగము సంఘత్యాగము చెయ్యమన్నారు.

నిరంతర భజన చెయ్యమన్నారు. భజనలను కీర్తనలను నిరంతరము వినమన్నారు. ఇప్పుడు భగవంతుని కరుణను గురించి చెబుతున్నారు.

భగవంతుని కరుణ లేశ మాత్రం ఉండటం చేత మానవులకు భగవద్భక్తి కలుగుతుందట. సద్గురువులు దొరుకుతారు.

భాగవతములో చెబుతారు సత్పురుషుల సాంగత్యము దొరకటం కష్టం. అది లభించినప్పుడు దానిని పట్టుకున్నవారికి ఆత్మసాక్షాత్కారము లభిస్తుంది అని.

ఎవరికి వారు తమ వంతు సాధన చెయ్యాలి. కాని ఆ భక్తునికి సాధకునికి అర్థం అవుతుంది తన సొంతంగా సర్వం సాధించలేమని. అది కేవలము గొప్ప గురువుల వలననో, మహానుభావుల సత్సంగత్యం వల్లనో కలుగుతుందని.

మంచి గురువు దొరకాలంటే భగవంతుని లేశ మాత్రపు కరుణ ఉండాలి ఆ సాధకునిపై. భగవంతుని పొందాలంటే సద్గురువుల అనుగ్రహం కావాలి.

“యవన్నానుగ్రహః సాక్షాత్ జాయతే పరమేశ్వరాత్।

తావన్నా సద్గరుః కశ్చిత్ సచ్చాస్త్రం నో సలభ్యతే॥”

భగవంతుని అనుగ్రహం లేనిచోట సద్గురువు దొరకరు.

‘తద్విజ్ఞానార్థం స గురుమేనాభి గచ్ఛేత్సమిత్రాణి శ్శ్రోత్రియం బ్రహ్మనిష్ఠమ్’ (ముండకోపనిషత్)

బ్రహ్మమును తెలుసుకొనుటకై వేదాధ్యయన మొనర్చిన బ్రహ్మనిష్ఠుడగు సద్గురువునే సమిత్పాణియై ఆశ్రయింపవలె.

సద్గురువు దొరికి తదనంతరం గురువును సేవించటమే ముఖ్యమైన విధి.

అందరికీ ఎందుకు భగవంతుని కరుణ లభ్యం కాదని ప్రశ్న కలుగుతుంది. భగవంతుని కరుణ సూర్య కాంతిలా అంతటా ప్రసరిస్తూ ఉంటుంది. ఎవరు ఏ నీడ లేకుండా ఉంటారో వారికి సూర్యరశ్మి తగులుతుంది. అలాగే ఎవరు భగవంతుని గుర్తించి ఆర్తితో ఉంటారో వారిపై ఆయన కరుణ వర్షిస్తుంది.

అంతేకాక మానవుల కర్మల బట్టి కూడా గురువులు లభించటము, భగవంతుని కరుణ లభించటము జరుగుతుంది. ఈ కర్మలను ఛేదించే ఆయుధం వారి దగ్గరే ఉంటుంది. పరమాత్మ మీద నమ్మకముతో సాధన చెస్తే కర్మ బంధాల నుంచి బయటపడతాడు. కాని పూర్వ వాసనా బలంతో, చెడు ఆలోచనలకు లోనైనవాడు ఈ కర్మ బంధాలలో చిక్కుకుపోయి తిరుగుతూ ఉంటాడు తప్ప బయటపడలేడు.

గీతలో చెప్పినట్లుగా ఈ మాయ కడు దుర్లభం. పరమాత్మను ఆశ్రయించిన వాడు తప్ప మరొకరు ఈ మాయను దాటలేరు.

మహత్కృప ఉన్న సాధకులు సద్గురువులను కలవగలరు. ఆ సద్గురువులు వీరికి దారి చూపుతారు.

సంసారమన్న నౌకలో కొట్టుకుపోతున్న వాడికి సద్గురువు ఒక చుక్కాని వంటివాడు. ఆయన వీడికి దారి చూపి ఆత్మసాక్షాత్కారము కలిగిస్తాడు.

కబీరు, తులసీదాసు, శంకరాచార్య, గురునానక్ వంటి యోగులు సద్గురువుల గురించి చెప్పారు.

నేటి కాలంలో సద్గురువుల దొరకటం లేదని ప్రతివారు చెబుతూ ఉంటారు. గురువు కోసము వెతికే వారిని బట్టి గురువు దొరుకుతాడు.

నేటి ప్రజలు లోభానికి, మోహానికి, కీర్తికీ, డబ్బుకు బానిసలుగా మారి గురువుల గురించి మాట్లాడటం శోచనీయం.

ఎవరైతే హృదయాన్ని సమర్పించి, తమ జీవితలక్షంగా ఆత్మసాక్ష్కాత్కారాన్ని పొందాలని అలమటించి కన్నీరు పెట్టుకుంటారో వారికి మహత్ములు తప్పక దొరకుతారు. నిజమైన సాధకులకు సద్గురువులు తప్పక దొరకుతారు.

“తద్వద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా

ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్త్వదర్శినః॥”

అని గీతలో భగవానుడు చెప్పాడు. తత్త్వవేత్తలైన గురువును ఆశ్రయించి సేవించి తరువాత వారు జ్ఞానము ఉపదేశిస్తారు.

39. మహత్సంగస్తు దుర్లభోఽగమ్యోఽమోఘశ్చ

మహాత్ముల సాంగత్యం దొరకటం దుర్లభం. పొందు సామాన్యంగా లభించదు. దొరికితే అమోఘమైన ఫలితాలను కలగచేస్తుంది.

భగవానుడు గీతలో చెప్పాడు ఇలా –

“మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతిసిద్దయే।

యతాతమపి సిద్దానాం కశ్చిన్మాం వేత్తి తత్త్వతః॥”

మానవులలో వేల కొలది సంఖ ఉన్నా అందులో ఏ ఒక్కరో భగవంతుని కొరకు ప్రయత్నిస్తారు. అలా ప్రయత్నించిన వారిలో ఏ ఒక్కరో నిజంగా తెలుసుకుంటాడు.

కాబట్టి నిజగురువులు దొరకటం దుర్లభం. మన చుట్టూ నకిలీ గురువులు తిరుగుతూ ఉంటారు. ఈ నకిలీ వారిని దాటటం కష్టం.

నిజమైన జ్ఞాని పేరును కాంక్షింపడు. కాబట్టి మనము అటువంటి గురువులు కనిపించినా గుర్తుపట్టలేము.

కాబట్టి నిజమైన జ్ఞానిని పట్టుకోవటానికి చాలా కష్టపడాలి. బద్ధకము ఉన్నవారు, నిరాసక్తి ఉన్నవారికి గురువుల లభించటము బహు కష్టం.

మంచి విషయాలు దొరకటం బహు కష్టం లోకంలో.

మంచి గంధం, కస్తూరి, జ్ఞానులు అరుదు. అలాగే మహత్ములు దొరకటం కూడా కష్టం.

అందుకే శంకరులు ఇలా చెప్పారు-

“దుర్లభం త్రయమేవై తద్దేవానుగ్రహేతుకమ్।

మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయః॥”

ప్రపంచములో ఈ మూడు లభ్యం కావటం అరుదు. అవి మానవ జన్మ కడు దుర్లభం. అటు పై బంధాల నుంచి విడుదల కావాలని కోరుకోవటం ముముక్షత్వం బహు దుర్లభం. ఇవి ఉన్నా మహాత్ములతో సంపర్కం, వారి కృప దొరకటం ఎంతో కష్టసాధ్యమని శంకరులు చెబుతున్నారు.

ఈ లోకములో భోగమందు, మోహమందు ఆపేక్ష లేని వారు కనపడటం చాలా అరుదు.

కాబట్టి మహాత్ములతో సంపర్కము చాలా కష్టమని ఈ సూత్రంలో చెబుతున్నారు నారదులవారు.

40. లభ్యతేఽపి తత్కృపయైవ

మహాత్ముల సహవాసం లభించటము కేవలం భగవంతుని అనుగ్రహం వల్ల మాత్రమే కలుగుతుంది.

“ఈశ్వారానుగ్రహాచ్చాన్తి దాన్త్వాది గుణసంయుతం।

జన్మ చేల్లభ్యతే తస్మిన్ విద్యయా మోక్ష మాప్నుయాత్॥”

ఈశ్వరుని అనుగ్రహం వల్ల శాంతి దొరికితే ఆ జన్మలో మోక్షం దొరుకుతుంది.

41. తస్మిం స్తజ్జనే భేదాభావాత్

భగవంతుడు, భగవద్భక్తులు వేరు కాదు. భగవంతుడిని కొలచినట్లే భక్తులను కూడా కొలవాలని చెబుతున్నారు ఈ సూత్రంలో.

భాగవతంలో కృష్ణుడు చెబుతాడు నా భక్తుల హృదయాలలో నేను ఉంటాను. నా హృదయంలో నా భక్తులు ఉంటారు అని.

భగవంతునికి ఇష్టులు అయిష్టులని అని ఉండరు. అందరినీ సమానంగా ప్రేమించే గుణము కలవాడు పరమాత్మ.

గోపికలు బృందావనంలో కృష్ణుడి కోసము వెతుకుతూ కృష్ణుడిలా అభినయించటము మొదలుపెడతారు. కొంత తడవకు వారు తాము గోపికలమని స్పృహ కోల్పోయి కృష్ణుడే తామన్న భావనలోకి వెడతారు. భక్తులు భగవంతునిలో మమైక్యమవటం అది.

ఎప్పుడైతే తన సర్వం పరమాత్మకు సహజంగా సమర్పిస్తారో అప్పుడు భగవంతునిలో ఐక్యమవుతాడు భక్తుడు. వారు ఆత్మజ్ఞానులవుతారు.

“తేషాం జ్ఞానీ నిత్యయుక్త ఏకభక్తి ర్విశిష్యతే।

ప్రియో హి జ్ఞానినోఽత్యర్థం అహం స చ మమ ప్రియ॥”

ఆత్మవేత్త అధికుడు. ఆత్మవేత్త ప్రియుడు అని కృష్ణుడు గీతలో చెప్పాడు.

జ్ఞానినే తనకు ప్రియమైన వాడని చెప్పటానికే ఈ సూత్రం చెప్పారు.

42. తదేవ సాధ్యతాం తదేవ సాధ్యతామ్

అభేద జ్ఞానముతో కూడిన భక్తియే సాధించ తగినది. జీవేశ్వరుల ఏకత్వమగు భక్తియే సాధించ తగినది.

ఏకాంత భక్తి, అనన్య భక్తి, తన్మయ భక్తి అత్యుత్తమమైనవి. అందుకే ముందటి సూత్రంలో ‘జ్ఞాని త్వాత్మైవ మే మతమ్’ అన్నారు.

“దాసస్తేఽహం దేహదృష్ట్యాఽస్మి శంభో!

జాతస్తేంఽశో జీవదృష్ట్యాఽత్ర దృష్టే!

సర్వస్యాత్మన్నాత్మ దృష్ట్యా త్వమేవే

త్యేవం మే ధీర్నిశ్చితా సర్వశాస్త్రైః॥”

దేహదృష్టితో చూస్తే నీ దాసుడను. జీవాంశ దృష్టితో చూస్తే నీ అంశ స్వరూపుడను. ఆత్మదృష్టితో చూస్తే

నీవే నేను, నేనే నీవు..

ఇందు తదేవ సాధ్యతామ్ అని రెండు మార్లు ప్రయోగించటము దోషం కాదు. ఇది మొదటి దానిని బలపరుస్తున్నది.

43. దుస్సంగస్సర్వథైవ త్యాజ్యః

దుష్టులతో సహవాసం విడువవలెను.

దుష్టులైన వారు కొంత కాలానికి పనికి వస్తారని వారితో స్నేహం చేస్తారు. అటువంటిది ఎంత మాత్రం మంచిది కాదు. అది విషం కలిపిన పరమాన్నం వంటిది. మహా దుఃఖం కలగచేస్తుంది.

కొందరు మనతో వివాదానికి దిగుతారు, దుష్టులలో మాత్రం పరమాత్మ లేడా యని. యోగి మాత్రమే అటు వంటి తేడాలకు అతీతంగా ఉండగలడు. మాములు వారికి అలాంటిది కుదరదు.

నీరు అంతా సమానమే. అలాగని మనము మురికి నీరు త్రాగలేము కదా.

తేలుకు తోకలో విషముంటుంది. కందిరీగకు శిరస్సులో ఉంటుంది. పాముకు దంతాలలో ఉంటుంది. కాని దుష్టునికి తనువంతా విషమే అని అంటారు.

దుష్టులను దుష్టత్వాని తొలగించేందుకే పరమాత్మా లీలావిలాసాలు చేశాడు.

“మైత్రీకరుణాము దితో పేక్షాణాం సుఖదుఃఖపుణ్యాపుణ్య విషయాణాం భావనాతశ్చిత్త ప్రసాదమ్”

మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్షలను భావించటము వలన మనస్సు నిర్మలమవుతుంది.

తమతో సమానమైన వారితో స్నేహము, అధికులను చూసి ఆనందం, దీనుల యందు కరుణ, దృష్టులను ఉపేక్షించటము వలన మనసు శాంతిస్తుంది.

దుష్టులతో కూడి చెడిన వారి కథలు విన్నప్పుడు వారిని చూసి పాఠము నేర్చుకునే అవకాశము ఉంది. బిల్వమంగళుడు దుష్టులతో కూడా చెడి తుదకు పూర్వ పుణ్యం వల్ల బయటపడతాడు. బిల్వమంగళుడు ఒక విప్ర కుమారుడు.

దుష్టుల సాంగత్యములో జూదము, స్త్రీలోలత్వం త్రాగుడు మరిగి తల్లితండ్రులను మోసం చేస్తాడు. భార్య మరణించినా పట్టించుకోక వేశ్యాసాంగత్యం కోరుతాడు. ఆ వేశ్య అతనికి కనువిప్పు కలిగిస్తుంది. అతను విష్ణు భక్తిలో జీవితం పండించుకుంటాడు. టూకీగా ఇదీ కథ.

వేమన కూడా మొదట జారత్వంతో, దుష్టసాంగత్యము పాలై, వారితో కలసి తిరిగి బయటపడి ఆత్మయోగిగా మారుతాడు.

మనకు సాహిత్యంలో చరిత్రలో ఇటువంటి ఉదాహరణలు అనేకంగా కనపడుతాయి.

44. కామక్రోధ మోహస్మృతి భ్రంశ బుద్దినాశ సర్వనాశ కారణత్వాత్

దుష్ట సహవాసం ఎంతగా మానవులను చెటగొడుతుందో ఈ సూత్రం చెబుతుంది.

కామం, క్రోధం, మోహం, స్మృతినాశం, బుద్ధి నాశం, సర్వనాశము కలగచేస్తుంది.

దుస్సహవాసం కామం, క్రోధం, మోహం ఇత్యాదివి సర్వనాశనం చేస్తాయి.

కామముచే రావణుడు నాశనం చెందాడు. క్రోధంచే దుర్వాస ముని, విశ్వామిత్రుడు తపస్సును పదే పదే కోల్పోయారు. మోహంతో కీచకుడు పోయాడు. స్మృతి పోయి శిశుపాలుడు మరణించాడు.

కామక్రోధాలు అగ్ని వంటివి. అవి మహాపాప స్వరూపాలు. ఆత్మజ్ఞానానికి పరమశత్రువులవి.

కోరిక సముద్రం వంటిది. ఎంత నింపినా నిండనిది సముద్రం. అలాగే కోరికలు కూడా ఎంత తీర్చుకున్నా తీరవు.

మోహము కూడా ఇలాంటిదే. ఇవ్వన్నీ దుష్టత్వానికి కారణము. ఇవి ఆత్మజ్ఞానానికి వ్యతిరేకం. ఇందులో పడిలే మరి లేవడు. కాబట్టి దుష్టులకు దూరంగా ఉండమన్నారు.

సాధకులు భక్తులు వీటికి దూరంగా తొలగాలని చెబుతున్నారు ఈ సూత్రంలో.

45. తరజ్గాయితా అపీమే సంగాత్సముద్రాయంతి

సాధకులు పరమ జాగ్రత్తతో ఉండాలి. అలల యొక్క సమూహము ఎట్లా సముద్రమై మారుస్తుందో అలాగే కామాది దోషాలు ఆత్మ స్వరూపాన్ని మారుస్తాయి.

వర్ష బిందువులు కాలువలై తదనంతరం నదులవుతాయి. తదనంతరం అది సముద్రమై దాటటానికి రానట్లు దోషాలు జయించటానికి రానంత పెద్దవైతాయి.

మానవులుగా జన్మించిన వారు ఇటు వంటి దోషాలకు దూరంగా జరిగి దుఃఖమయమైన సంసార సాగరాన్ని దాటలి. భగవద్గీత అందుకు ఎంతో సాయం చేస్తుందని చెబుతారు. భక్తులు దుష్టులకు దూరంగా జరిగి సాధన చేసుకోవాలి.

(సశేషం)

Exit mobile version