[శ్రీ శివానంద మహారాజ్ రచించిన వ్యాఖ్యానం, వ్యాసాశ్రమ శ్రీ మలయాళ స్వామివారి వ్యాఖ్యానం ఆధారంగా శ్రీమతి సంధ్యా యల్లాప్రగడ అందిస్తున్న ఆధ్యాత్మిక సుమమాలిక ‘నారద భక్తి సూత్రాలు’]
నారద భక్తి సూత్రాలు
46. కస్తరతి కస్తరతి మాయం యః సంగాం స్త్య జతి యో మహానుభావం సేవతే నిర్మమో భవతి
అర్థం: మాయను ఎవరు దాటగలరు? మాయను ఎవరు దాటగలరు? ఎవరు దుస్సాంగత్యమును విడుచునో, ఎవరు మహానుభావులను సేవించుదురో, మమకార వర్జితులవుతారో, వారు తరిస్తారు.
కస్తరతి కస్తరతి అని రెండు సార్లు ప్రశ్నించటంలో ఆ మాయను దాటటం ఎంత కష్టమో చెబుతున్నారు. మనుష్యులందరికి సమానంగా మాయను దాటటం పరమ కష్టమైన విషయం.
శంకరులు శివానందలహరిలో ఇలా చెబుతారు
“వటుర్వా గేహీవా యతిరపి జటీ వా తదితరో
నరోవా యః కశ్చిద్బవతు భవ కిం తేన భవతి।
యదీయం హృత్పద్మం యది భవదధీనం పశుపతీ!
తదీయస్త్వం శంభో భవసి భవభారం చ వహసి!”
బ్రహ్మచారి అయినా, గృహస్థు కాని, వానప్రస్థుడైననేమి, సన్యాసి కాని: ఈ నాలుగు ఆశ్రమాల వారు కాని, చాతుర్వర్ణాల వారు గాని ఎవరి హృదయంలో నీవుంటావో వారు నీవారు అవుతారు. వారంతా నీ సంసారం. నీవు ఆ భారం మోస్తున్నావు.
అగ్ని ఎలాగైతే సమిధలను దహిస్తుందో జ్ఞానమన్న అగ్ని అన్ని కర్మలను దహిస్తుంది.
ఎవరైతే భగవద్గీతను చదువుతారో వారికి పాతకాలు అంటవు.
మహాత్ములను సందర్శించి వారిని సేవించినా సర్వ పాపాములు దహిస్తాయి. వారి సేవ వలన ప్రపంచపు వాసనలు దహించబడుతాయి. మంట చలిని తీసివేసినట్లు, దీపము చీకటిని తీసివేసినట్లుగా సాధుసంతుకు చేసే సేవ వలన పాపాలు దహించబడుతాయి.
అహంకారాన్ని తొలగించుకోవటం వల్ల కూడా పాపాలను తీసివేసి పరమాత్మకు అంకితమవ్వవచ్చు. సత్సంగాత్యం వల్లకూడా పాపాన్ని తొలగించుకోవచ్చును.
47. యోవివిక్తస్థానం సేవతే యో లోక బన్దమున్మూ లయతి నిస్త్రై గుణ్యో భవతి యో యోఘక్షేమం త్యజతి
అర్థం: ఎవరు ఏకాంతంగా ఉంటారో, ఎవరు లోకాల బంధాలను తగ్గించుకుంటారో, ఎవరు సత్వ రజో తమో గుణాలన నుంచి విడిపడుతాడో, ఎవరు యోగక్షేమాలను విడనాడుతాడో, వాడు మాయను సులభంగా దాటకలడు.
తన హృదయం కన్నా పవిత్రమైన, ఏకాంతమైన ప్రదేశం ఉండదు. ఎక్కడికో వెళ్ళి సాధించాలనుకుంటారు కాని అది అందరి వల్ల కాదు. ప్రపంచపు ఆకర్షణలు ఎక్కడ ఉన్నా వదలవు. అవి వదలవలసినది హృదయంలో.
ఏకాంతంలో చాలా మంది బద్ధకస్తులుగా మారుతారు. మురికిగా మారుతారు. కాబట్టి ఏకాంతం అందరికీ సమంజసం కాదు.
ఈ సూత్రంలో ‘యోగక్షేమం త్యజతి’ అన్నారు. ప్రాప్తం కాని దానిని ప్రాప్తింప చేసుకోవటం. స్థిరంగా రక్షించుకోవటం. ప్రాప్తించబదినది, స్థిరంగా ఉండవలసినదానిని త్యజించ వలసిన వాటిని త్యజించటము.
మనస్సులో భగవంతునికి స్థిరంగా తలుచుకుంటే ఆయనే చూసుకుంటాడు.
త్రిగుణాలలో సత్వ గుణం పెంచుకోవటం వంటివి అభ్యాసం చెయ్యటం కూడా చెప్పబడింది.
ఏకాంత స్థలంలో కొద్ది ఆహారం తీసుకొని మనస్సును వాక్కును స్వాధీనంలో పెటుకొని భగవంతుని యందు మనస్సు పెట్టి వైరాగ్యంతో ఉండమన్నారు.
ఇట్టివి భక్తులు సాధన చెయ్యవలసినవని చెబుతున్నారు నారదుల వారు.
49. యో వేదానపి సంన్యస్యతి కేవల మవిచ్చిన్నానురాగం లభతే
అర్థం: ఎవ్వడు వేదాలను కూడా వదులుచున్నాడో, వదలని భగవదనురాగము పొందుచున్నాడో వాడు మాయను దాటును.
వేదాలు, వేదాంగాలు అని రెండు ఉన్నాయి. వేదాలు అంతఃకరణ శుద్ధి కొరకు కర్మకాండలను ఉపదేశిస్తున్నాయి. అంతఃకరణ శుద్ధి తరువాత ఆ జీవుడు శమదయాది గుణాలు కలిగి బ్రహ్మ విచారం చెయ్యాలి.
మానవులకు పూర్వభాగం ఉత్తరభాగము అని రెండు భాగాలు ఉన్నాయి. దీనినే ప్రవృత్తి మార్గం, నివృత్తి మార్గం అంటారు.
ప్రవృత్తి మార్గంలో బ్రహ్మచర్య గృహస్థ ఆశ్రమాల గురించి చెప్పబడింది. నివృత్తి మార్గం వానప్రస్థ సన్యాసాశ్రమం. గృహస్థుకు కర్మకాండలను నిర్వహించటము, నిత్య అగ్నిహోత్రం మొదలైనవి చెప్పబడింది. అవే వేదములను విడవటమంటే ఇక్కడ.
వేదాలను విడవమంటే కర్మకాండలే తప్ప వేదాలను తిరస్కరించి నాస్తికులుగా అవ్వండని కాదు.
“గ్రంథమభ్యస్య మేధావీ జ్ఞానవిజ్ఞాన తత్పరః
పలాల మిన ధాన్యార్థీ త్యజేద్రంథమశేషతః॥”
మేధా సంపత్తి గలిగి వేదాలను చదివిన పండితుడు, పైరు పండించిన కర్షకుడు ఫలసాయం తీసుకొని గడ్డి వదిలేసినట్లుగా ఉంటారు. అందుకే పూర్వాశ్రములో వేదాలను, ఉత్తారాశ్రమములో వేదాంతాము గ్రహిస్తారు.
అందుకే ఈ కర్మకాండల కావల ఉన్నది పరాభక్తిని భక్తుడు అనన్య భక్తిగా పొందుతాడు. దీని ద్వారా మోక్షం పొందుతాడు.
50. స తరతి స తరతి స లోకాంస్తారయతి
భక్తుడు ఏకాంతంగా ఉండి పరమాత్మను ధ్యానిస్తూ సత్సంగంలో ఉంటాడో, వాడు సంసార సాగరాన్ని దాటుతాడు. వాడు మాయను ఛేదిస్తాడు. వాడు సంసార సాగరం దాటుతాడు. అలా దాటిన వాడు ఇతరులకు సహాయం చేస్తాడు.
ఎవరు సంసారం దాటుతారో వారు ముక్తులు. వారు మాయను ఛేదించిన తరువాత ఇతరులకు సహాయం చేస్తారు.
లోకంలో రోగులకు సేవ చెయ్యాలంటే ముందుగా వైద్యవిద్య నేర్చి తదనంతరం రోగులకు చికిత్స చెయ్యగలడు. తాను వైద్యవిద్య సంపాదించక మునుపే రోగులను చూడలేడు కదా.
పైగా ఒక గ్రుడ్డివాడు ఇతర గ్రుడ్డివారికి మార్గం చూపలేడు.
జ్ఞానవంతుడు భక్తుడు జన్మించినప్పుడు దేవతలు సంతోషపడతారు. పితురుల వంశంలోని వారు ఆనంద పరమశులవుతారు. సంబంధించిన వారు తృప్తి చెందుతారు.
ముందు వచ్చే సూత్రాలలో దేవముని ప్రేమభక్తిని గురించి వివరిస్తాడు.
ఈ సంసారమన్నది ఒక సాగరం వంటిది.
మూడు (సత్వతమోరజో) గుణాలు అలల వంటివి. వాసనలు సొరచేపల వంటివి. ఇంద్రియాలు నదుల వంటివి.
రాగద్వేషాలు పురుగుల వంటివి. అహంకారం గుజ్జు వంటిది.
ఎవరైతే పరమాత్మ మీద మనస్సుపెట్టి అన్నింటినీ వదిలేస్తారో వారు ఈ సంసార సాగరాన్ని దాటగలరు. భగవద్గీతలో భగవానుడు చెబుతాడు “నా మీద మాత్రమే మనస్సును లగ్నం చేసిన వారిని ఈ సాగరాన్నించి దాటిస్తాను” అని.
51. అనిర్వచనీయం ప్రేమస్వరూపమ్
భగవంతుని యందు ప్రేమ స్వరూపమైన భక్తి అనిర్వచనమైనది. అంతని ఇంతని చెప్పటానికి వీలులేనిది.
నారదుల వారు, ప్రహ్లాదుడు, గోపికా స్త్రీలు, ఉద్దవుడు ఈ ప్రేమామృతాన్ని త్రాగి తన్మయులైనారు.
వారు వారి భావన పూర్తిగా చెప్పలేకపోయినారు.
పంచదార తీయగా ఉంది అనగలరు కాని ఎంత చెప్పినా ఎప్పడూ తినని వాడికి అది అర్థం కాదు.
“సరసిజనయనే సశంఖ చక్రే మురభిది మావిరమస్వ చిత్త! రన్తుమ్!
సుఖతరమ పరన్న జాతు జానే హరిచరణస్మరణామృతేన తుల్యమ్॥”
తామరల వంటి కన్నులు కలవాడు శంఖుచక్రములు కలవాడగు శ్రీకృష్ణునియందు విరహం చాలదు. శ్రీహరి పాదములను తలచుటమనేది అమృతం కన్నా సుఖమైనది. దానిని విడవకు.
“హరి చరణ స్మరణామృతేన తుల్యమ్” భగవద్భక్తి ఇక్కడ అమృతంగా వర్ణించటమైనది.
భగవంతుని చరణారవిందం జనన మరణ చక్రం నుంచి తప్పిస్తుంది.
“జిహ్వే కీర్తయ కేశవం. మురరిపుం చేతో! భజ శ్రీధరం
పాణిద్వంద్వ! సమర్చయాచ్యుత కథాశ్శ్రోత్రద్వయ త్వం. శృణు
కృష్ణం లోకయ లోచనద్వయ హరేర్గచ్చాజ్ఘ్రి యుగ్మాలయం
జిఘ్ర ఘ్రాణు ముకుంద పాద తులసీం మూర్దన్నమాధోక్షజమ్॥”
ఓ నాలుకా! కేశవుని స్త్రోత్రం చేయి.
ఓ మనసా మురారిని గురించి పాడు,
ఓ హస్తద్వయామా శ్రీధరుడ్ని పూజించు,
ఓ పాదద్వయమా హరి సన్నిధికి పొమ్మా,
ఓ నాసికా ముకుందుని పాదాల వద్ద ఉన్న తులసిని ఆఘ్రాణింపుము,
ఓ శిరసా అధోక్షజుని నమస్కరించు.
ఇలా భగవంతుని నామం సదా చెయ్యటం మోక్షానికి హేతువు.
52. మూకస్వాదనవత్
మూగవాడు రుచికరమైన వస్తులను భుజించునట్లు అని ఈ సూత్రానికి అర్థం.
మూగవాడు మంచి రుచికరమైన వస్తువులు భుజించినట్లుగా ఆనందభరితుడై ఉన్నా ఆ పదార్థం యొక్క రుచి ఎలా ఉందంటే చెప్పలేడు. అలాగే భక్తి రసాన్ని పానం చేసి మహానందపడే భక్తులను ఆ ఆనందాన్ని వివరించమంటే చెప్పలేడు.
అందుకే ప్రేమైక భక్తి గురించి అనిర్వచనీయమ్ ప్రేమస్వరూపం అని చెప్పారు.
నాలుగు వేదాలు పరమాత్మ గురించి చెప్పలేక మూగపోయాయి. వేయి పడగల ఆది శేషువు చెప్పలేకపోయాడు. మానవుల వల్ల అవుతుందా?
ఆ ఆనందాన్ని చెప్పలేక, అయినా చెప్పకుండా ఉండలేక యోగులు మధురం, మధురాతి మధు ఫలం, ఖండషెక్కర, మధువు, తేనే, పంచమిత్రము అన్నీనూ అనేశారు.
53. ప్రకాశ్యతే క్వాపి పాత్రే
ఆ భక్తి ఒకానొక శుద్ధాత్ముని యందు ప్రకాశించుచున్నది. వాని నుండి లోకానికి ప్రకాశమగుచున్నది.
ఆత్మబోధలో ఇలా చెబుతారు
“సదా సర్వగతోఽ ప్యాత్మా న సర్వత్రావభాసతే।
బుద్ధావేవభాసేత స్వచ్ఛేషు ప్రతిబింబవత్॥”
పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్నప్పటికీ అంతటా ప్రకాశించటం లేదు. నిర్మలమైన అద్దములో సూర్యబింబము ప్రతిపలించినట్లు నిర్మమైన మనస్సులలో ప్రకాశిస్తున్నాడు. పరమాత్మ కూడా ఇలాగే. మురికి అద్దంలో ప్రతిబింబము ప్రతిఫలించదు. అలాగే దృష్టమైన ఆలోచనల వారికి పరమాత్మ ఫతిఫలించటము కనిపించదు.
బాగా కాలిన యినుము మీద నీటి బిందువు పడితే నామరూపాలు లేకుండా పోతుంది. అదే తామరాకు పై పడితే ముత్యమై మెరుస్తుంది. ముత్యపు చిప్పలో పడితే ముత్యంగా ప్రకాశిస్తుంది. పడిన ప్రదేశం బట్టి దాని విలువ మారింది. అలాగే శిష్యుడు గురువు ఇచ్చిన మంత్రంతో మౌనంగా ఏకాంతంగా సాధన చేస్తాడు.
చంద్రుడుకాంతి వస్తువుల మీద సమంగా పడుతుంది. కాని చంద్రకాంత శిలలపై పడినప్పుడే అమృతం చిందుతుంది.
అందరి హృదయాలలో ఆత్మ ఒక్కటే అయినా శాంతమైన నిర్మలమైన హృదయాలలో మాత్రమే భక్తి ప్రవహిస్తుంది.
54. గుణ రహితం కామరహితం ప్రతిక్షణ వర్దమాన మవిచ్చిన్నం సూక్ష్మతరమనుభవరూపమ్
భగవంతుని మీద భక్తి కామాది దోషం లేనిది అంటే ప్రతిఫలమాశించనిది, ప్రతిక్షణం వృద్ధి చెందుతుంది, విచ్ఛేదము లేనిది మిక్కిలి సూక్ష్మమైనది.
భక్తి పెరుగుతూ ఉంటుంది ప్రతి క్షణానికీ. భగవంతున్ని కోరిక లేక నిష్కామంగా ప్రేమించే హృదయపు భక్తి సాత్విక భక్తి కన్నా ఎంతో ఉన్నతమైనది.
కోరికలతో కూడిన భక్తి అధమము. సామాన్య మానవ హృదయాలకు ఈ ప్రేమ భక్తి అర్థం కావటం కష్టం. ప్రపంచపు కోరికలకు అతీతమైనది.
ఈ ప్రేమభక్తిని వర్ణించటం కూడా సాధ్యం కాదు. పరమాత్మ యొక్క నిజతత్త్వం తెలుసుకొనే కొద్ది అంతరాంతరాలలో ఇది పెరుగుతూ ఉంటుంది.
ఏ వస్తువు స్థితిగతులైనా చెప్పవచ్చు కాని భక్తి గురించి చెప్పటం కష్టం.
అనంతమైనది ఈ ప్రేమభక్తి. ప్రాపంచిక ప్రేమలు ఈ భక్తి ప్రేమతో కొలవలేము.
మానవ సంబంధాలు తరుగుతూ పెరుగుతూ ఉంటాయి. కాని పరమాత్మ మీద ప్రేమభక్తి పెరగటం తప్ప తగ్గటమన్నది ఉండదు.
తమతర బేధాలు, జాతి మత బేధాలు లేనిది ప్రేమభక్తి.
భగవంతుని మీద ప్రేమభక్తి తైలధార వంటిది. పూర్ణమైన ప్రేమభక్తి వేదాంత జ్ఞానంలా సంసారాన్ని తరింపచేస్తుంది.
“ఉపాసనా మిదం నానావిక్షేపావృత్తి నాశనమ్।
అనేనైన మనోనాశో జీవన్ముక్తి శ్చ నేతరైః॥”
నిర్మలమైన భక్తితో చేసే ఉపాసన సంకల్ప వికల్పాలను నశింపచేస్తుంది.
నిర్మలమైన ఈ భక్తి సూక్ష్మాతి సూక్ష్మమైనది. పెరగటం తప్ప తరగదు. ఇది సూక్ష్మంగా ఉంటుంది. త్రిగుణాలకు అతీతమైనది. అంటే సత్వరజోతమస్సులకు అతీతమైనది.
55. తత్ర్పాప్య తదేవావలోక యతి తదేవ శృణోతి తదేవ చిన్తయతి
ఆ భగవద్భక్తి పొంది ఆ భక్తినే చూస్తూ, ఆ భక్తినే వింటూ, ఆ భక్తి గురించే ఆలోచిస్తూ ఉంటారు.
ఈ భక్తి పొందాక ఇక భక్తులు కేవలం పరమాత్మను చూడటం, గాథలు వినటం, దాని గురించే మాట్లాడుతూ ఉంటారు.
ఎలాగైతే నది తన ఉనికిని కోల్పోతుందో సముద్రంలో కలిశాక అలాగే భక్తుడు తన అహంకారాన్ని చిత్తాన్ని పరమాత్మకు అంకితం చేసేస్తాడు.
పరమభక్తులకు ఇక మరో ఆలోచనా పని ఉండవు. సదా పరమాత్మ పైన దృష్టితో ఉంటారు.
వారికి మిత్రులు శత్రువులంటూ ఉండరు. ప్రపంచాన్ని పూర్తిగా ప్రేమిస్తారు.
వారికి సర్వం పరమాత్మ మయమే తప్ప మరోటి కనిపించదు.
ఉదాహరణకి బృందావనంలో గోపికలకు కృష్ణుడు తప్ప మరోటి కనిపించలేదు. స్వామి మురళి తప్ప మరోటి వినిపించలేదు.
(సశేషం)