నీలాపనిందలను తొలగించే ప్రయత్నం – నర సింహుడు

0
2

[dropcap]భా[/dropcap]రత పూర్వప్రధాని, బహుభాషావేత్త, పండితుడు రచయిత పాములపర్తి వెంకటనరసింహారావు పై వినయ్ సీతాపతి వ్రాసిన ‘Half Lion’ పుస్తకం తెలుగులో ‘నరసింహుడు’గా ఎమెస్కో ప్రచురించింది. అనువాదం జి.వల్లీశ్వర్ – టంకసాల అశోక్ – కె.బి.గోపాలంతో కలిసి అని ఉంది. ఇద్దరు కలిసి అనువదిస్తే మూడోవారు పర్యవేక్షించారో మరి ఏమిటో తెలియదు… అది అప్రస్తుతం అనుకోండి.

అయితే వినయ్ సీతాపతిది ఒక సాహసవంతమైన ప్రయత్నం. గాడి తప్పిన దేశ ఆర్థిక వ్యవస్థను సరళీకరణ, సంస్కరణలతో ఏవిధంగా ఆనాటి ప్రధాని పి.వి.నరసింహారావు గట్టెక్కించాడు, వారికో సముచిత స్థానం కల్పించలేని చరిత్రదెంత పాక్షికదృష్టి అని చెప్పాలన్న సీతాపతి గారి తపన వెనక ఎంతో పరిశోధన ఉంది, నిష్పాక్షిక దృష్టి కోణముంది. పి.వి. విజయాలను, తప్పటడుగులను, బలాలను, బలహీనతలను బేరీజు వేస్తూ, చాణక్యుని యుక్తులను, పద్దెనిమిదవ శతాబ్దానికి చెందిన ఎడ్మండ్ బర్క్ దార్శనికతను కలిగున్న రాజనీతిజ్ఞుడు పి.వి. అంటారు రచయిత.

ముఖ్యమంత్రిగా భూసంస్కరణలను అమలు చేయించటంలో విఫలమైన వ్యక్తి రెండు దశాబ్దాల తర్వాత క్లిష్టపరిస్థితులలో ఉన్న దేశఆర్థిక వ్యవస్థను సంస్కరణల దిశగా నడిపించే క్రమంలో ఏ విధంగా తనను తాను మలుచుకున్నాడో వివరిస్తారు సీతాపతి.

పి.వి. జీవితాన్ని విశ్లేషిస్తూ, ఆయన్ను ప్రభావితం చేసిన రాజకీయ గురువు రామానందతీర్థ నుంచి ఆయన ఏ విధంగా ప్రేరణ పొందారు.. తరువాతి కాలంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కోవటానికి అది ఎలా ఉపకరించిందో తెలియచేస్తూ స్నేహితుల కన్నా పుస్తకాలు ఏవిధంగా ఆయనను సేద దీర్చాయంటారు.. ఆ వైనాన్ని సన్నిహితంగా వివరిస్తారు వినయ్ సీతాపతి.. ప్రత్యర్థుల బలాబలాలను ఆయన అంచనా వేసిన తీరూ ఆశ్చర్యకరంగా ఉండేదే అంటారు..

ప్రధానిగా ఆయన రాసుకున్న డైరీలు చాలా సంఘటనలకు సాక్షీభూతంగా నిలుస్తాయంటారు రచయిత. ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితం దేన్నైనా ఎదుర్కొనేందుకు ఆయనకో సంసిద్ధతనిచ్చింది. టెక్నాలజీ తెచ్చే మార్పులను స్వాగతించారాయన. దేన్నయినా సునిశితంగా పరిశీలించే శక్తి వారికో ఎస్సెట్. విదేశాంగమంత్రిగా ఆయన చేసిన పర్యటనలు ఆయనకో ముందుచూపునిచ్చాయంటారు సీతాపతి.

ఈ పుస్తకం ప్రత్యేకత రచయిత సీతాపతి పి.వి.డైరీలను, ఆయన రాసుకున్న నోట్స్, వివిధ ఫైళ్ళ నోటింగ్‌లను అధ్యయనం చేయడమే కాకుండా ఆయన టీమ్ సభ్యులుగా పని చేసినవారిని, మిత్రులను, రాజకీయ సలహాదారులను ఇంటర్వూ చేసి తన పరిశీలనలకు ఆమోదముద్ర వేయిస్తారు.. సరళతరమైన ఆర్ధిక విధానాల రూపకల్పన, లైసెన్స్ విధానం రద్దులో అప్పటి ఆర్థికమంత్రి డా. మన్ మోహన్ సింగ్‌తో ఆయన పనిచేసిన తీరుతో పాటు ఆయన కొన్ని చోట్ల నిర్ణయం తీసుకోవటానికి ఆలోచించిన సందర్భాలను మన ముందుంచుతారు. బాబ్రీ మసీదు వివాదంలో చివరివరకూ ఆయన ప్రయత్నించిన విధమూ మనం చూస్తాం. ఇక్కడ బయట ప్రపంచానికి తెలియని రహస్య సంప్రదింపులను ప్రస్తావిస్తారు.. Error of judgement కారణమన్న సూచన కనిపిస్తుంది.. భగభగమండుతున్న పంజాబ్, కాశ్మీర్, అస్సాం రాష్ట్రాలలో శాంతి స్థాపనకు ఆయన విశేషకృషి ఏవిధంగా సత్ఫలితాలను ఇచ్చిందో చెబుతారు.. గాంధీ-నెహ్రూ కుటుంబానికి చెందనివాడుగా, ఐదేళ్ల పాటు తన మైనారిటీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం వచ్చిన ప్రతిసారీ విజేతగా నిలవటం ఆయనకే చెల్లింది.

సంస్కరణ ఫలాలను అందిపుచ్చుకున్న ఇప్పటి తరం కాలానికెదురీదిన పి.వి.నరసింహారావు అనే డెబ్బై రెండేళ్ళ యువకుడు(ఆయన ఆలోచనలు బట్టి చూస్తే)సామ్యవాదంతో కూడిన ఉదారవాదానికై ఆయన చేసిన సిన్సియర్ ప్రయత్నాలు ఒక సంక్లిష్టదశను దేశానికెలా తప్పించాయో తెలుసుకోవలసిన అవసరం తప్పకుండా ఉంది..

అనువాదం చదవటమెలా అనుకోవక్కర్లేదు. ఇంగ్లీషు మూలం ఎలాగూ అందుబాటులో ఉంది కదా..

ఈ పుస్తకాన్ని ఇంగ్లీష్ లో చదివితేనే ఆస్వాదించగలుగుతాం. మూలానికి విధేయంగా సాగిన అనువాదమే ఇది. కానీ ఎక్కడో ఏదో అసంతృప్తి కలుగుతుంది. అది ఎందుకో చెప్పలేను. సీతాపతి ఈ రచనకు సంబంధించి చాలామందికి తన కృతజ్ఞతలు తెలియచేస్తారు.ఆ వ్యాసాన్ని మాత్రం ఇంగ్లీష్ మాతృకదే ఉంచారు ప్రచురణకర్తలయిన ఎమెస్కో వారు. ఆ వాక్యాలన్నీ ఇలాంటి రచన మూల భాషలో చదివినప్పుడు కలిగే తృప్తి వేరని మన చెవిలో చెబుతాయి…

ఇది ప్రజ్ఞాశాలి పి.వి.శతజయంతి వత్సరం. ఈ పుస్తకం తప్పకుండా ఆయనపట్ల మన అవగాహనను పెంచుతుంది, అపోహలను దూరం చేస్తుంది.

***

నర సింహుడు
రచన: వినయ్ సీతాపతి,
ప్రచురణ: ఎమెస్కో బుక్స్,
పేజీలు: 448,
వెల: ₹ 200/-
ప్రతులకు: ఎమెస్కో బుక్స్,
1-2-7, భానూ కాలనీ,
గగన్ మహల్ రోడ్,
దోమలగుడా,
హైదరాబాద్ 500029
ఫోన్: 040-23264028

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here