[తెలుగు సాహిత్యం పట్ల కొన్ని తరాలలో ఆసక్తి రగిలించి, ఆధునిక తరానికి వ్యక్తిత్వ వికాస పాఠాలు చెప్తూ, యువతకు ఉత్తమ సాహిత్యం ద్వారా ఉత్తమ వ్యక్తిత్వాన్నివ్వాలని నిరంతరం తపించే యువభారతి సంస్థ స్థాపించి వచ్చే దసరాకు 60 సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలుగు సాహిత్యానికి, సమాజానికి యువభారతి చేసిన సేవను తెలుగు పాఠకులకు పరిచయం చేసే ఉద్దేశంతో ప్రతి ఆదివారం సంచికలో యువభారతి ప్రచురించిన పుస్తకాల పరిచయం వుంటుంది. ఈ శీర్షిక వచ్చే విజయదశమి వరకూ సాగుతుంది.]
నారాయణరెడ్డి సాహితీమూర్తి
[dropcap]ని[/dropcap]న్నటి రోజు (29.07.2023) జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, పద్మశ్రీ డాక్టర్ సి.నారాయణరెడ్డి గారి జయంతి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, యువభారతి ప్రచురించిన, శ్రీ తిరుమల శ్రీనివాసాచార్యులు గారు రచించిన ‘నారాయణరెడ్డి సాహితీమూర్తి’ ప్రచురణ గురించి చిరు సమీక్ష.
దేశ స్వాతంత్ర్యం వచ్చిన తరువాత తెలుగు సాహిత్యంలో విశిష్ట కవితా స్రష్టలుగా, ప్రయోగశీలురుగా, సాహిత్యోద్యమ నిర్వాహకులుగా, పరిశోధకులుగా ప్రసిద్ధికెక్కినవారిలో ఆచార్య నారాయణరెడ్డి గారు ఒకరు.
డా. సి.నారాయణరెడ్డి గారు కరీంనగర్ జిల్లా, వేములవాడ మండలం, హనుమాజిపేట గ్రామంలో కర్షక కుటుంబంలో గురుపూర్ణిమనాడు, 29.7.1931 నాడు జన్మించారు. నారాయణరెడ్డి గారిలో సహజంగా సృజనాత్మకశక్తి, లయాత్మకత, ఆశుగుణం, గానశీలం ఉండడంతో, ఏడవ తరగతిలో సీస పద్యమంటే ఏమిటో తెలియని దశలో – “ఒకనాడు ఒక నక్క ఒక అడవి లోపల పొట్టకోసర మెటో పోవుచుండె” అనే పంక్తితో ప్రారంభించి పద్యం వ్రాస్తే, అది సీసపద్యమని తెలిపి, రెడ్డి గారికి ఛందస్సుకు సంబంధించిన కొన్ని మెలకువలను తెలిపారు శ్రీ దూపాటి వేంకట రమణాచార్యులు గారు.
తొమ్మిదవ తరగతి చదువుతున్నప్పుడు వ్రాసిన – “మారుటెన్నడో విషంపు గుండెలీ జగాన మారుటెన్నడో”
అనేది నారాయణరెడ్డిగారి తొలి గేయం. వారు పదవ తరగతిలో ఉన్నప్పుడు “వెన్నవంటి మనసున్నవానికి అన్నమేమొ కరువాయె; ఉన్నవానికింతన్న వీడుదామన్న గుండె లేదాయె” వంటి పాటలు రాశారు.
హనుమాజిపేటలో ఆరోజుల్లో ప్రభుత్వ పాఠశాల లేనందువల్ల, వ్యక్తిగతంగా ఒక ఉపాధ్యాయుడు నడుపుకుంటున్న వీధి బడిలో నారాయణరెడ్డి చదువుకు శ్రీకారం చుట్టి ప్రాథమిక పాఠశాల విద్యను పూర్తి చేశారు. ఆ తరువాత సిరిసిల్లలో ఉర్దూ మాధ్యమంలో తెలుగును ఒక elective subject గా తీసుకుని, మాధ్యమిక స్థాయి విద్యను అభ్యసించారు. కరీంనగర్ లోని ప్రభుత్వోన్నత పాఠశాలలో ఉన్నత పాఠశాల విద్యను పూర్తి చేశారు 1948లో.
ఆధునికాంధ్ర సాహిత్యంలో మాత్రా ఛందస్సులలో సమగ్ర కావ్యరచనా నిర్మాణాన్ని చేపట్టి కృతకృత్యు లైనారు శ్రీ రెడ్డి గారు. శ్రవణ సుభగమైన శబ్ద ప్రయోగానికీ, రమణీయమూ, గంభీరమూ ఐన అర్ధ స్ఫూర్తికి కాణాచి కాగలిగిన కవితా రచన చేసినవారు, వెయ్యేళ్ళ తెలుగు కవితా లోకంలోనే అరుదు. శ్రీ రెడ్డిగారు కావ్యరచన తోపాటు సహృదయ విమర్శనా పధ్ధతి అలవర్చుకోవడం చేత ఆయన రచనల్లో సంయమనం, స్పష్టత చోటు చేసుకున్నాయి.
సినీ గీత రచయితగా సినీ సంగీత రంగానికి ఆయన చేసిన ఎనలేని సేవ ఒక ఎత్తు ఐతే, ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ఆచార్యులుగా, అధికార భాషా సంఘం అధ్యక్షులుగా, సార్వత్రిక విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులుగా, తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులుగా, భాషా సాంస్కృతిక సలహాదారుగా, సాంస్కృతిక మండలి అధ్యక్షులుగా, రాజ్యసభ సభ్యులుగా ఆయన చేసిన సాహితీ సేవ అనన్య సామాన్యం, అనితర సాధ్యం.
ఖండకావ్య సంకలనాలు, సమగ్ర కావ్యాలు, గేయ నాటికలు, గద్య నాటికలు, సాహిత్య వ్యాసాలు, యాత్రా చరిత్రలు, పరిశోధనాత్మకమైన వ్యాసాలు, నిబద్ధ అనిబద్ధ గేయ వ్యాసాలు, చిత్ర సాహితి ఇలా ఎన్నో ప్రక్రియలను తమ ప్రతిభా స్పర్శతో గుబాళింపజేసిన శ్రీ రెడ్డిగారి ముప్పదేండ్ల సాహిత్యసృష్టిని సమీక్షించి ఆయన సాహితీమూర్తిని సమగ్రంగా మన కన్నుల ముందు సాక్షాత్కరింప జేశారు డా.తిరుమల శ్రీనివాసాచార్యులు గారు.
డా. తిరుమల శ్రీనివాసాచార్యులు గారు యువభారతి ఉపాధ్యక్షులుగా సేవలనందించారు. ఈయన డా.సి నారాయణరెడ్డి గారి సహాధ్యాయులు, వారికి అత్యంత సన్నిహితులు. వీరి స్వగ్రామం కూడా కరీంనగర్ జిల్లా సిరిసిల్ల తాలూకా లోని నారాయణపురం గ్రామం.
డాక్టర్ సి నారాయణరెడ్డి గారి సాహితీ వ్యక్తిత్వాన్ని సమగ్రంగా తెలుసుకోవాలనుకున్న వారు, క్రింద ఇవ్వబడిన link ను క్లిక్ చేసి ఈ పుస్తకాన్ని ఉచితంగానే చదువుకోవచ్చు.
లేదా క్రింద ఇవ్వబడిన QR code ను scan చేసినా ఆ పుస్తకాన్ని ఉచితంగా చదువుకోవచ్చు.