రస సృష్టి.. కథా పుష్టి:
[dropcap]ఇ[/dropcap]దొక ప్రబంధ కావ్యరచన. విష్ణుపురాణ భాగం. హరివంశ, భాగవతాల్లోనూ గోచరిస్తుంది. ప్రత్యేకించి ఇది ‘చంపూ’ సాహిత్య ప్రక్రియ. మనకు తరతరాలుగా వస్తున్న సంప్రదాయం. చంపక పుష్పం… సుగంధ భరితం. కావ్యాల్లో ఇదీ (నర్మదా పురుకుత్సీయము) అదే విధమైనదే.
చమత్కృతితో మదిని అలరించేది- అని మరో భావార్ధమూ ఉంది. చంపూ గ్రంథంలో పద్యాలతో పాటు గద్య, వచనాలు కూడా నియతంగా ఉంటాయి. వీటికి తోడు ఉన్నత స్థాయి సృజనను జోడించి, రసరమ్యంగా రూపుదిద్దారు ‘స్మితశ్రీ’ కవి. అందుకే దీనికి ఇదివరకే ‘నది’ మాసపత్రిక నుంచి ఉత్తమ పురస్కారం లభించింది. తెలుగు పద్యానికి తిరిగి పూర్వ వైభవం కలిగించాలన్న దృఢ సంకల్ప ఫలమిది.
నిబంధనలు అనుసరిస్తూనే పలు చోట్ల స్వతఃసిద్ధ ముద్ర కనబరచడం ఈ పుస్తక విశిష్టత. ఇందులో ఐదు ఆశ్వాసాలు (సాకేత పుర వర్ణన మొదలు నర్మదకు నాగజాతి వరం వరకు) ఉన్నాయి. అవతారికగా చేసిన దేవతా ప్రార్ధనలో విష్ణు స్తుతి –
శ్రీకాంతాప్రియభావుకుండు కరుణాశ్రీలన్ విరాజిల్లి , య
స్తోకాంభోధిని శేషశాయియగుచున్ శోభిల్లు శ్రీవిష్ణువా
వైకుంఠంబున నిత్యకాంతియుతుడై వర్ధిల్లి సత్ప్రేమతో
మాకుంగూర్చుత నవ్యభవ్యయశముల్ మాస్వామి సత్యంబుగన్
కథావిధానాన్ని సూచిస్తుంది. ఇంకా అనేక చోట్ల వర్ణనాదుల జోరు.. గాథలో ముందుగానే ఒదుగుతుంది.
నాయిక నర్మదా నది. చంద్రుడి కుమార్తె అయిన ఆమె, నాయకుడు పురుకుత్సుడు ప్రేమికులు. ఒక సందర్భంలో పలువురు గంధర్వులు పాతాళానికి చేరి నాగులను హింసిస్తారు. వారు విష్ణు భగవానుడిని వేడుకుంటే, తన అంశతో అవతరించిన పురుకుత్సుడే రక్షకుడంటాడు. అతడి దరికి ఎవరిని పంపాలని వారంతా యోచిస్తుంటే, నర్మదను ఆశ్రయిస్తే మంచిదన్న సూచన వస్తుంది. అప్పుడే అటువైపు వచ్చిన ఆ వనిత సమ్మతించి, భూలోకం చేరుకుని, నాయకుడిని ఒప్పించి మరీ నాగ లోకానికి తెస్తుంది. రక్షణ పని పూర్తవుతుంది. అనంతరం- నాయికా నాయకుల కల్యాణం. కృతజ్ఞతగా నాగులు నర్మదకు వరప్రదానం చేస్తూ… ఆమె పేరు తలచినంతనే సర్ప విష బాధ ఉండదంటారు. ఇదీ స్థూలంగా కథ. కావ్యపరంగా జరిపిన కొన్ని ఇతరత్రా స్వీకరణలు, సందర్భానుసారం సాగించిన అనువైన మార్పుచేర్పులు రచనకు కొత్త సొగసులద్దాయి. జాతిభక్తి, ఐక్యతా శక్తి, పోరాట పటిమ, స్నేహబంధం వంటి ఉదాత్త విలువల జోడింపులు ఇంకెంతో రక్తి కట్టించాయి.
కథానుగతంగా నాయక శాంతిప్రపూర్ణతను ఆవిష్కరిస్తూ… భావనలందు ధర్మము నుపాసనజేయును నాతడెన్నడున్; కావగజూచెడిన్ పరుల కల్మషదోషము లెంచకుండగన్…అని కవి వాక్కు.
హృదయాన్ని ద్రవింపచేసే కరుణకు ఉదాహరణ:
కుదురువీడి జనులు గూర్మి కరవగుచు
అదరినారు మిగుల బెదరినారు
ప్రాణభయముతోడ బరుగులుదీసిరి
చెట్టుకొకరు మరియు బుట్టకొకరు
హృదయోల్లాసం పెంపొందించే సరస సరాగాలకు నిదర్శన:
ఆ చంద్రానన పల్కులే యమృత దివ్యానంద భాగ్యంబులై
ఆ చాతుర్యము లందచందగతులాహ్లాదంబులన్ గూర్చెడిన్
ఆ చిత్రంపుగనుల్ తనూవిలసనం బామందహాసంబులున్
యోచింపన్ మదియంత యామెయయి దివ్యోత్సాహమందించెడిన్
ఇలా ప్రబంధ పుష్పానికి సామాజిక ప్రయోజనమనే పరిమళమద్దిన తీరు ఎంతగానో మురిపిస్తుంది. చదువరిని అలరించడమే ధ్యేయంగా అన్ని తరహాల రచనలూ చేసిన అవిశ్రాంత సాహితీవేత్త ‘స్మితశ్రీ’ సంగీత రంగంలోనూ మేటి. కరుణశ్రీగారి ‘ఉదయశ్రీ’కి ఆంగ్ల అనువాదం సహా అనేక పద్య నాటకాలు, శతకాలు, నృత్య రూపకాలు, కథలు, ‘నాదసిద్ధి’ వంటి నవలలు వెలువరించారు. జాతీయస్థాయిన ప్రభుత్వం నుంచి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కృతితో ఖ్యాతి గడించారు.ఆయనలోని ధార్మిక తత్వ చింతనకూ మరో తార్కాణం ఈ కృతి.
***
రచన: ‘స్మితశ్రీ’ చింతపల్లి నాగేశ్వరరావు
పేజీలు: 88; వెల: రు.100/-
ప్రతులకు: 6-192, సాయి నిలయం,
ఫ్లాట్ నెంబర్: 204
బిఎంపీఎస్ రోడ్డు, ప్రసాదంపాడు
విజయవాడ- 520 008
ఫోన్: 92931 34906
లేదా 0866-3200080 (నది మాసపత్రిక)